IOT
-
త్వరలో ప్రతి రైలులో ‘పాతాళ గంగ’.. అడక్కుండానే వాడుక నీరు!
మనం రైలులో ప్రయాణించినప్పుడు ఏదో ఒక సందర్భంలో రైలు టాయిలెట్లో లేదా బయట వాష్ బేసిన్ వద్ద నీరు లేకపోవడాన్ని గమనించే ఉంటాం. లేదా ఎవరో ఒకరు ఇటువంటి ఫిర్యాదు చేయడాన్ని మనం వినేవుంటాం. వేలాది మంది ప్రయాణికులతో రైలు రాకపోకలు సాగిస్తుంటుంది. అందువల్ల ప్రయాణికులందరికీ అందుబాటులో సరైన సౌకర్యాలు కల్పించడం రైల్వేశాఖకు పెద్ద సవాలే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు రైలు ప్రయాణం మధ్యలో నీటి కొరత లాంటి సందర్భాలు తలెత్తుతాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురుకాదు. ఇకపై రైలులోని టాయిలెట్, వెలుపలి వాష్‌బేసిన్ దగ్గర నీరు అయిపోవడమన్నదే ఉండదు. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వేశాఖ కొత్త సాంకేతికతను ఉపయోగించనుంది. భారతీయ రైల్వే ఇందుకోసం ఐఓటీ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఉపయోగించనుంది. ఐఓటీ అంటే అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సమస్య పరిష్కారంలో ఇంటర్నెట్ ఉపయోగించినప్పుడు, దానిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటారు. ఇకపై రైలు ట్యాంక్‌లోని నీటిని పర్యవేక్షించడానికి ఐఓటీని ఉపయోగించనున్నారు. ఇది ప్రతి బోగీకీ వర్తింపజేయనున్నారు. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో తెలియజేశారు. ఈ సాంకేతికత ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఇప్పటి వరకు 3 రైళ్లలోని 11 కోచ్‌లలో దీనిని పరీక్షించారు. ఈ టెక్నిక్ విజయవంతమైంది. త్వరలో మిగతా రైళ్లలో కూడా అమలు చేయనున్నారు. ప్రయాణం సాగిస్తున్న రైలులో వాటర్ ట్యాంక్‌లోని నీరు 40 శాతం కన్నా తగ్గినప్పుడు ఈ సమాచారం రైల్వే సిబ్బందికి అందుతుంది. దీంతో తదుపరి స్టేషన్లో ఆ రైలు ట్యాంక్‌లో నీరు నింపుతారు. ఈ విధంగా రైళ్లలో నీటి కొరతకు పరిష్కారం లభించనుంది. ఇది కూడా చదవండి: నింగిలో ‘నీలి సూరీడు’.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? -
మైక్రోసాఫ్ట్‌లో మూడో రౌండ్ తీసివేతలు, ఈసారి ఎవరంటే?
న్యూఢిల్లీ: టెక్దిగ్గజాల్లో వరుసగా ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మెటా మరో దఫా జాబ్ కట్స్‌ను ప్రకటించగా తాజాగా మైక్రోసాఫ్ట్ మూడవ రౌండ్ ఉద్యోగ కోతలను నిర్వహించింది.ముఖ్యంగా. సరఫరా గొలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)కి సంబంధించిన ఉద్యోగులను తొలగించింది. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ ప్రకటించిన 10వేల ఉద్యోగాల కోతలలో భాగంగానే వీరిని తొలగించిందని సీఆర్ఆన్ నివేదించింది. 689 మంది ఉద్యోగులను శాశ్వతంగా తొలగించినట్లు టెక్ దిగ్గజం సోమవారం తన సొంత రాష్ట్రానికి నివేదించింది. వివిధ స్థాయిలు, విధులు, టీమ్స్, భౌగోళికాల్లో ఉద్యోగాల కోతలు ఉన్నాయని కంపెనీని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.రికార్డుల ప్రకారం వాషింగ్టన్ రాష్ట్రంలో టెక్ దిగ్గజం ఇటీవల 689 మందిని ఫిబ్రవరిలో, 617 మంది ఉద్యోగులను తొలగించింది, ఇదే నెలలో, 108 మందిని, జనవరిలో, మైక్రోసాఫ్ట్ 878 మందిపై వేటు వేసింది. దీంతో వాషింగ్టన్ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,184కి చేరుకుంది. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌కు బై..బై చెప్పి ప్రత్యర్థి కంపెనీకి సీఎండీగా బాధ్యతలు కాగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగి లింక్డ్ఇన్ పోస్ట్ ప్రకారం, కంపెనీ తన ఏఐ ఆధారిత ఆటోమేషన ప్రాజెక్ట్ బోన్సాయ్‌ను మూసివేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం టీంను కూడా తొలగించింది. ప్రస్తుతం కంపెనీలో సుమారు 220,000కు పైగా ఉద్యోగులు ఉండగా, వీరిలో 5 శాతం మందిని లేఆఫ్స్ ప్రభావితం చేసింది. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం చివరి నాటికి మొత్తం పదివేల ఉద్యోగాలు తగ్గించే ప్లాన్లను గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కొత్త కేంద్రం ఏర్పాటులో అంతర్జాతీయ ఐవోటీ సంస్థ హోగర్ కంట్రోల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో అసెంబ్లింగ్ యూనిట్, ఆర్అండ్డీ కేంద్రాలున్న అంతర్జాతీయ ఐవోటీ సంస్థ హోగర్ కంట్రోల్స్ తాజాగా కొత్త కేంద్రం ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. దీనితో ప్రత్యక్షంగా 50 పైగా ఉద్యోగాల కల్పన జరగగలదని సంస్థ సీఈవో విష్ణు రెడ్డి తెలిపారు. హోమ్ ఆటోమేషన్ సంబంధ స్మార్ట్ డివైజ్‌ల తయారీ తదితర కార్యకలాపాలకు ఇది ఉపయోగపడనుందని వివరించారు. ప్రస్తుతం ఉప్పల్‌లోని తమ కేంద్రంలో .. 100 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. దీని వార్షిక తయారీ సామర్థ్యం 6 లక్షల యూనిట్లని పేర్కొన్నారు. 2019లో హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పట్నుంచి సుమారు రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు విష్ణు రెడ్డి వివరించారు. ప్రస్తుతం టర్నోవరు 2.5 మిలియన్ డాలర్లుగా ఉండగా దీన్ని రెట్టింపు స్థాయికి 5 మిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు చెప్పారు. హోమ్ ఆటోమేషన్ సంబంధ ప్రైమాప్లస్ స్మార్ట్ టచ్ ప్యానెల్ ఉత్పత్తుల శ్రేణిని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. సాధారణ లైట్లు, ఫ్యాన్లు మొదలైన వాటిని కూడా స్మార్ట్ ఉపకరణాలుగా మార్చేందుకు ఇది ఉపయోగపడగలదని విష్ణు రెడ్డి పేర్కొన్నారు. -
కొత్త టెక్నాలజీ గురూ..! కిలో మీటర్ దూరంలో ఉన్నా వైఫైని వినియోగించుకోవచ్చు..!
టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్ది మానవుని జీవన విధానం మరింత సులభతరం అయ్యింది. ఇప్పటికే డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్' వంటి టెక్నాలజీలు వర్క్ కల్చర్‌ను పూర్తిగా మార్చేయగా..ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) అదే దారిలో పయనిస్తుంది. తాజాగా ఐఓటీ టెక్నాలజీతో మీరు కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే డివైజ్‌లను వినియోగించుకునేందుకు ఈ 'వైఫై హాలో'(wifi halow) ఉపయోగపడనుంది. 'వైఫై హాలో' అంటే? 'వైఫై హాలో' అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంట్లో ఉండే ఐఓటీ ప్రొడక్ట్‌లు స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ ఎయిర్ కండీషనర్స్ తో పాటు స్మార్ట్ హోం సెక్యూరిటీ సిస్టం, వేరబుల్ హెల్త్ మానిటర్స్, బయో మెట్రిక్ సైబర్ సెక్యూరిటీ స్కానర్స్'ను కిలోమీటర్ దూరంలో ఉన్నా వైఫై ద్వారా ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు ఉపయోగపడుతుందని ప్రపంచ వ్యాప్తంగా వైఫై నెట్ వర్క్‌లను అందించే 'వైఫై అలయన్స్' సంస్థ తెలిపింది. పరిమిత సంఖ్యలో వైఫై కొత్త టెక్నాలజీ అందుబాటులో ఉన్న స్మార్ట్ డివైజెస్‌లో పనిచేస్తుందని చెప్పింది. వైఫై టెక్నాలజీ కోసం కొత్త ఎక్విప్మెంట్ అవసరం లేదని,ప్రస్తుతం మన రోజూ వారి జీవితంలో భాగమైన వైఫై సెటప్‌తోనే ఈ వైఫై హాలో పనిచేస్తుందని వెల్లడించింది. ఏ అప్లికేషన్లలో వైఫై హాలోని వినియోగించుకోవచ్చు? వైఫై హాలో'ని ఇళ్లు, సంస్థల్లో ఉండే స్మార్ట్ పరికరాలను కనెక్ట్ చేయడంతో పాటు వివిధ రకాలైన అప్లికేషన్లలో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ మానిటర్లు, వ్యవసాయ క్షేత్రాల్లో (స్మార్ట్ అగ్రికల్చర్)సెన్సార్లను కనెక్ట్ చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. తద్వారా టెక్నాలజీ పరంగా మరింత అప్ డేట్ కావొచ్చని నిపుణులు చెబుతుండగా.. తక్కువ సమయంలో పెద్దమొత్తంలో ఉన్న డేటాను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఉపయోగడపడే వైఫై నెట్ వర్క్‌కు ప్రత్యామ్నాయం కాదని అంటున్నారు. 'వైఫై హాలో'ఎలా పని చేస్తుంది? వైఫై హాలో టెక్నాలజీ ఇళ్లులో, లేదంటే రైల్వే స్టేషన్లలో వినియోగించే వైఫై కంటే ఫాస్ట్‌గా పనిచేస్తుంది. సాధారణ వైఫై నెట్‌వర్క్‌లు వినియోగించడం వల్ల ఖర్చయ్యే కరెంట్ కంటే..తక్కువ స్థాయిలో కరెంట్ వినియోగంతో దూరంలో ఉన్నా సరే ఎక్కువ మంది ఉపయోగించుకునేందుకు సాయపడుతుంది. బ్యాండ్ విడ్త్ పరంగా వైఫై హాలో సాధారణ వైఫై బ్యాండ్ విడ్త్ 2.4జీహెచ్‌జెడ్ నుండి 5జీహెచ్‌జెడ్'ల కంటే తక్కువ స్థాయిలో అంటే కేవలం 1జిహెచ్‌జెడ్ తో పనిచేసేలా డెవలప్ చేస్తున్నట్లు వైఫై అలయన్స్ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. చదవండి: నాసా మరో సంచలనం..! చంద్రుడిపై వైఫై నెట్ వర్క్ నేరుగా భూమిపైకే...! -
అదిరిపోయే టీవీ, ఇంట్లో ఉన్న అన్నీ డివైజ్‌లకు కనెక్ట్ చేయొచ్చు
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హయర్ తాజాగా ఎస్8 ఆండ్రాయిడ్ టీవీల శ్రేణిలో కొత్తగా మరో రెండు టీవీలను ఆవిష్కరించింది. వీటిలో 55 అంగుళాల టీవీ రేటు రూ. 1,10,990గాను, 65 అంగుళాల టీవీ ధర రూ. 1,39,990గాను ఉంటుంది. 4కే హెచ్డీఆర్ పిక్చర్ నాణ్యత, ఆల్–స్క్రీన్ డిస్ప్లే, ఫ్రంట్ స్పీకర్ డిజైన్ తదితర ఫీచర్లు వీటిలో ఉంటాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 9.0 వెర్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన ప్రత్యేకతలతో ఇది ఇంట్లోని అన్ని స్మార్ట్ డివైజ్‌లకు ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) హబ్‌గా కూడా ఉపయోగపడుతుందని హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. -
పార్క్ హయత్‌లో ఐవోటీ ఆధారిత వాటర్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ హాస్పిటాలిటీ కంపెనీ హయత్ హోటల్స్ కార్పొరేషన్ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారిత వాటర్ ప్యూరిఫికేషన్, బాట్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ‘వాటర్‌హెల్త్ ఇండియా’తో ఒప్పందం చేసుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించడం, నీటిని ఆదా చేయడం ఈ యూనిట్ ప్రత్యేకతని పార్క్ హయత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ థామస్ అబ్రహం మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. ప్రస్తుతం హయత్‌కు దేశంలో 30 హోటల్స్ ఉన్నాయి. వాటర్‌హెల్త్ సీఓఓ వికాస్ షా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఏటా 50 లక్షల టన్నుల ప్లాస్టిక్ విడుదలవుతోందని, ఇది భూమిలో లేదా సముద్రాల్లో కలిసిపోతోందని చెప్పారు. ‘‘2040 నాటికి దేశంలో నీటి సంక్షోభం ఏర్పడే అవకాశముంది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో మన వాటా 17 శాతం. కానీ నీటి వనరుల్లో మన వాటా 4 శాతమే’’ అని వివరించారు. -
ఐటీ సేవలే కాదు.. అంతకుమించి
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ.. ఐటీ రంగంలో వస్తున్న నూతన సాంకేతికతల పరిశోధన, అభివృద్ధి రంగాలకు కూడా చిరునామాగా మారుతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్ వంటి కొత్త సాంకేతికతలపై జరిగే పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఐటీ కంపెనీలు రాష్ట్రానికి తరలివస్తున్నాయి. మరోవైపు ఐటీ అనుబంధ రంగాలతో పాటు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావి స్తోంది. ఐటీ రంగంలో ఆఫీసు వసతి, ఉద్యోగాల కల్పన విషయంలో వచ్చే ఐదేళ్లలో బెంగళూరుపై పైచేయి సాధిస్తామని ఐటీ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఐటీ రంగంతో పాటు అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో ఎలక్ట్రానిక్స్ పరిశోధన, అభివృద్ధి, తయారీ వాతావరణాన్ని హైదరాబాద్‌లో కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో గత ఐదేళ్లలో 30 వేల ఉద్యోగాలు సృష్టించగా, వచ్చే నాలుగేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఈ రంగంలో సాధించాలని భావి స్తోంది. ఇటీవల చైనాకు చెందిన స్కైవర్త్ కంపెనీ 50 ఎకరాల్లో రూ.700 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పార్కు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ రంగంలో పరిశోధన, అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వాతావరణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏఐ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీలు కృత్రిమ మేధస్సుకు సంబంధించి జాతీయ స్థాయిలో పరిశోధన, అభివృద్ధి కోసం దేశంలో 5 సెంటర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్సలెన్స్ (కోర్), 20 ఇంటర్నేషనల్ సెంటర్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఇక్టయ్) ఏర్పాటుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించే బాధ్యతను కేంద్రం తెలంగాణకు అప్పగించింది. మరోవైపు వ్యవసాయం, పట్టణీకరణ, రవాణా, ఆరోగ్య రంగాల్లో కీలక సవాళ్ల పరిష్కారానికి ఏఐ సాంకేతికత అమలును రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020ను ’ఇయర్ ఆఫ్ ఏఐ’ (కృత్రిమ మేధో సంవత్సరం)గా ప్రకటించింది. రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల నివారణకు ’బ్లాక్‌చెయిన్’ ఐటీ సాంకేతికతను పరిష్కారమని భావిస్తూ ఎస్సెస్సీ బోర్డు, బాసర ట్రిపుల్ ఐటీలో ఈ టెక్నాలజీని ఐటీ శాఖ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. త్వరలో జేఎన్టీయూ ద్వారా జారీ అయ్యే సర్టిఫికెట్ల వివరాలు కూడా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో అనుసంధానించనున్నారు. గేమింగ్, వినోద రంగాలకూ గేమింగ్, టెక్నాలజీ, వినోద రంగాల్లో దక్షిణాసియాకు తెలంగాణను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని 150కి పైగా వీఎఫ్ఎక్స్ స్టూడియోలు, 2డీ, త్రీడీ యానిమేషన్, గేమింగ్ కంపెనీలు సుమారు 30 వేల మందికి ప్రత్యక్ష, 90 వేల మందికి పరోక్ష ఉపాధి ఉపాధి కల్పిస్తున్నాయి. 2020–25 నాటికి గేమిగ్ రంగం 300 బిలియన్ డాలర్ల పరిశ్రమగా వృద్ధి చెందే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్ రంగాల్లో లక్షలకొద్ది ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని అంచనా వేస్తోంది. అత్యాధునిక స్టూడియోలు, సదుపాయాలతో కూడిన ఇమేజ్ టవర్స్ 2022 నాటికి అందుబాటులోకి రానుంది. డిజైనర్స్, ఎంట్రప్రెన్యూర్స్, స్టార్టప్‌లకు ఉపయోగపడేలా ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ ప్రొటోటైపింగ్, మెకానికల్ డిజైనింగ్ రంగంలో భారత్‌లోనే తొలి ప్రోటోటైప్ సౌకర్యం కలిగిన ’టీ వర్క్స్’ మూడు నాలుగు నెలల్లో అందుబాటులో రానుంది. నైపుణ్య శిక్షణ, నూతన ఆవిష్కరణలకు సంబంధించి టీహబ్, వీహబ్‌లు ఐఐటీ, ట్రిపుల్ ఐటీతో పాటు పలు ప్రైవేటు ఐటీ సంస్థలు భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఐటీ ఘనత.. 2018–19లో ఐటీ ఎగుమతులు రూ.1.09 లక్షల కోట్లు 2017–18తో పోలిస్తే ఐటీ ఎగుమతుల్లో 9 శాతం వృద్ధి రేటు నమోదు కాగా, తెలంగాణ 17 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. 2017–18లో ఐటీ రంగంంలో 4.85 లక్షల ఉద్యోగాలు ఉండగా, 2018–19లో 5.5 లక్షలకు చేరింది. వచ్చే నాలుగేళ్లలో ఈ సంఖ్య 10 లక్షలకు చేరుతుందని అంచనా. ఏఐ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్, డేటా ఎనలిటిక్స్ రంగంలో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా. 2019 తొలి అర్ధభాగం నాటికి 38.5 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ అందుబాటులో ఉండగా, వచ్చే ఐదేళ్లలో 50 లక్షల చదరపు అడుగులకు చేరుతుందని అంచనా. -
ఇంజనీరింగ్‌లో ఆ కోర్సులకు సెలవు
ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండే కొత్త సంప్రదాయక ఇంజినీరింగ్ కోర్సులకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వబోదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ లోక్‌సభకు తెలిపారు. కొత్తగా భారీ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సాంకేతికతలైన కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్‌చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్సెస్, సైబర్ భద్రత, 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్ తదితర కోర్సులను మాత్రమే ఇంజినీరింగ్ విద్యలో అనుమతిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలకు, ఇంజినీరింగ్ కళాశాలల్లో బోధిస్తున్న పాఠ్యాంశాలకు మధ్య చాలా తేడా ఉందనీ, ఈ వ్యత్యాసాలను పూడ్చితే యువతకు ఉపాధి కోసం పకోడీలు అమ్ముకోమని సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. -
ఇక ఆ టెక్నాలజీయే కింగ్...
మరో నాలుగేళ్లలో అంటే 2022 సంవత్సరానికల్లా దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ ) రంగంలో మూడింట ఒకవంతు అంటే దాదాపు ఏడు లక్షల ‘తక్కువ నైపుణ్యం’ కలిగిన ఉద్యోగాలు కనుమరుగు కానున్నాయి. భారత్‌తో పాటు అమెరికా, ఇంగ్లండ్‌లలో కూడా ఐటీ పరిశ్రమలో 7.5 శాతం వరకు ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్త సాంకేతిక మార్పులకు అనుగుణంగా భారత్ ఐటీ రంగంలోనూ ఎలక్ట్రానిక్ యంత్రాల వాడకం (ఆటోమేషన్) పెరగడం వల్ల ఈ పరిస్థితి ఎదురుకానుంది. ఈ యాంత్రీకరణలో భాగంగా రొబొటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లను విస్తృతంగా ప్రవేశపెడుతున్నారు. మొత్తం ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం నిర్దే«శిత ఉద్యోగాలు పొందాలంటే మారుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవాల్సిందేనని అమెరికా పరిశోధనా సంస్ధ హెచ్ఎఫ్ఎస్ హెచ్చరిస్తోంది. అయితే ఈ యాంత్రీకరణతో ఐటీ రంగంలో ‘మధ్యంతర’, ‘ఉన్నతస్థాయి’ల్లో నైపుణ్యాలు కలిగిన వారికి లక్ష నుంచి రెండు లక్షల వరకు కొత్తగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. తమ ఉద్యోగులు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కునేందుకు వీలుగా పెద్ద ఐటీ కంపెనీలు కొత్త నైపుణ్యాల్లో శిక్షణను అందిస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)కు పెద్దపీట..! ఐటీలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు వీలుగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)టెక్నాలజీకి యువత పెద్దపీట వేస్తున్నారు. 2017 అక్టోబర్–2018 మార్చి మధ్యకాలంలో ఐఓటీ సాంకేతికతకు సంబంధించిన కోర్సుల్లో 200 శాతం నమోదు పెరిగింది. రిమోట్ మానిటరింగ్‌కు వీలుగా యంత్రాలకు సెన్సర్లు అదనంగా జతచేయడం వంటివి ఈ టెక్నాలజీలో భాగంగా ఉన్నాయి. ఇంటర్నెట్కు లేదా ఏదైనా పరికరానికి మరే పరికరంతో అనుసంథానించడమే ఐఓటీ ప్రధాన ఉద్ధేశ్యం. దీనిలో భాగంగా స్మార్ట్ఫోన్లు మొదలుకుని హెడ్ఫోన్లు, ఫిట్‌నెట్ బాండ్లు ఇంకా టీవీ, కాఫీమేకర్, వాషింగ్ మెషిన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కనెక్ట్ అవుతాయి. జెట్ విమానం ఇంజన్‌తో, చమురు వెలికితీసే యంత్రాల రిగ్‌లతో సహా వివిధ యంత్రాల భాగాలతోనూ ఈ పరికరాలు అనుసంథానించవచ్చు. గార్ట్నర్ అనే విశ్లేషణ సంస్థ అంచనా ప్రకారం 2020 సంవత్సరానికల్లా 2,600 కోట్లకు పైగా ఇలాంటి అనుసంథానించే పరికరాలు (కనెక్టెడ్ డివైసెస్) ఉంటాయి. ఐఓటీ తర్వాత కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), రోబొటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, బ్లాక్‌చెయిన్, డేటా సైన్స్, బిగ్ డేటా ఫ్రేం వర్క్స్, క్లౌడ్ అండ్ డెవ్ ఓప్స్ వంటి కోర్సుల ద్వారా ఎక్కువ మంది తమ నైపుణ్యాలు పెంచుకుంటున్నారు. ఐఓటీ ద్వారా ఈ రంగాల్లోకి... ఐఓటీ ద్వారా నైపుణ్యాలు మెరుగుపరుచుకున్న వారికి హెల్త్‌కేర్, రిటైల్, ఉత్పత్తి, రవాణా, టెలీ కమ్యూనికేషన్ల రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది.. ఐఓటీ సేవల ఔట్‌సోర్సింగ్‌లోనూ భారత టెకీలకు మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఐఓటీ టెక్నాలజీ సర్వీసెస్ ఔట్సోర్సింగ్ మార్కెట్ విలువ 350 కోట్ల డాలర్ల మేర ఉంది. అందులో దాదాపు సగం అంటే 152 కోట్ల డాలర్ల మార్కెట్‌ను భారత్ చేజిక్కించుకుంది.ఇందులో పశ్చిమ ఐరోపాకు 94 కోట్ల డాలర్లు, అమెరికాకు 81 కోట్ల డాలర్లు, తూర్పు ఐరోపాకు 15 కోట్ల డాలర్లు, మిగతా ప్రపంచదేశాలకు కేవలం 4.6 కోట్ల డాలర్ల మార్కెట్ లభించింది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
హైదరాబాద్‌లో ఆర్బ్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
⇒ ఆర్బ్కామ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ⇒ ఈవీపీ క్రెయిగ్ మెలోన్ హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సొల్యూషన్స్ అంది స్తున్న ఆర్బ్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. సంస్థకు ఇది అతి పెద్ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్. ప్రస్తుతం 100 మంది దాకా పనిచేస్తున్నారు. వెబ్, మొబైల్ అప్లికేషన్ డెవలపర్లు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు ఈ కేంద్రం నుంచి పనిచేస్తారని ఆర్బ్కామ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఈవీపీ క్రెయిగ్ మెలోన్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశంలో లాజిస్టిక్స్ కంపెనీలకు సేవలను విస్తరిస్తామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ట్రాకింగ్ ఉపకరణాలను జర్మనీ, మెక్సికోలో తయారు చేస్తున్నట్టు వివరిం చారు. ప్రపంచ వ్యాప్తంగా ట్రక్కులు, నౌకలు, వాహనాలు, ఇతర పరిశ్రమల్లో 17.2 లక్షల ఐవోటీ ఉపకరణాలు బిగించామని తెలిపారు. వీటన్నిటినీ అనుసంధానిస్తూ కస్టమర్ కేర్ సేవలు అందిస్తున్న ఉత్తర అమెరికా టీమ్‌కు హైదరాబాద్ బృందం తోడ్పాటు అందిస్తుందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి పంజా వెల్లడించారు. ఐవోటీ కంపెనీలు తయారీ కేంద్రాలను నెలకొల్పితే ఐటీ సంస్థలకు ఇచ్చే ప్రయోజనాలను కల్పిస్తామని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. -
ఐవోటీ సేవల్లోకి ‘అడాగ్’
సిస్కోతో జట్టు కట్టిన అనిల్ అంబానీ గ్రూపు ముంబై: సిస్కో జాస్పర్ భాగస్వామ్యంతో అనిల్ అంబానీ గ్రూపు (అడాగ్) ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స (ఐవోటీ/ఇంటర్నెట్ ఆధారిత పరికరాల) సేవలను ‘అన్‌లిమిట్’ పేరుతో మంగళవారం ముంబైలో ప్రారంభించింది. ఈ వెంచర్ కింద దేశవ్యాప్తంగా కంపెనీలకు ఐవోటీ సేవలు అందించనుంది. ఇందు కోసం సిస్కో జాస్పర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశంలో ఐవోటీ సేవలకు అవకాశాలు అపరిమితమని అడాగ్ ఎండీ అమితాబ్ జున్‌జున్‌వాలా ఈ సందర్భంగా అన్నారు. ఇంటర్నెట్కు అనుసంధానమైన పరికరాలు 20 కోట్ల నుంచి 2020 నాటికి 300 కోట్లకు, మార్కెట్ రూ.37 వేల కోట్ల స్థారుు రూ.లక్ష కోట్లకు వృద్ధి చెందే అవకాశాలున్నాయని చెప్పారు. అన్‌లిమిట్ దేశంలో స్మార్ట్ సిటీ కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తుందని అడాగ్ గ్రూప్ పేర్కొంది. భారత వృద్ధిలో ఐవోటీ కీలకమని ‘అన్‌లిమిట్’ సీఈవో జుర్గెన్హేస్ పేర్కొన్నారు. సిస్కో జాస్పర్‌కు ప్రపంచ వ్యాప్తంగా 120 మొబైల్ నెట్‌వర్క్‌లతో భాగస్వామ్యం ఉన్నందున దేశీయ కంపెనీలు తమ సేవలను ఇతర దేశాలకు విస్తరించుకునే అవకాశం కలుగుతుందన్నారు. కాగా, ఇజ్రాయెల్‌లో ఐవోటీ ఇంక్యుబేటర్ ఏర్పాటుకు టాటా గ్రూపు జీఈ, మైక్రోసాఫ్ట్‌తో జట్టుకట్టడం తెలిసిందే. -
జోరుగా భారత ఐఓటీ మార్కెట్
2020 కల్లా 1,500 కోట్ల డాలర్లకు నాస్కామ్-డెలాయిట్ నివేదిక న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్(ఐఓటీ) మార్కెట్ భారత్‌లో జోరుగా పెరగనున్నదని నాస్కామ్ అంచనా వేస్తోంది. తయారీ, వాహన, రవాణా, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో ఐఓటీ అనువర్తనం కారణంగా భారత్‌లో ఐఓటీ మంచి వృద్ధిని సాధిస్తుందని డెలాయిట్‌తో నాస్కామ్ రూపొందించిన నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న పరికరాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్న నెట్‌వర్క్‌ను ఐఓటీ అంటారు. ఉదాహరణకు, రోడ్ల మీద ఎలాంటి ట్రాఫిక్ లేకపోతే వీధిలైట్లు వాటంతట అవే ఆఫ్ అయిపోతాయి. ఫలితంగా విద్యుత్తు ఆదా అవుతుంది. వినియోగదారుల, పారిశ్రామిక రంగాల్లో ఐఓటీ వినియోగం ప్రారంభమైందని ఐఓటీని ఆవిష్కరించిన కెవిన్ ఆష్టన్ పేర్కొన్నారు. ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు..., ప్రస్తుతం 560 కోట్ల డాలర్లుగా ఉన్న ఐఓటీ మార్కెట్ 2020 కల్లా 1,500 కోట్ల డాలర్లకు పెరుగుతుంది. వివిధ రంగాలకు చెందిన 120కు పైగా సంస్థలు ఐఓటీ ఈకో సిస్టమ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది 20 కోట్ల యూనిట్లతో అనుసంధానమై ఉన్న భారత ఐఓటీ మార్కెట్ 2020 కల్లా 270 కోట్ల యూనిట్లకు పెరుగుతుంది. ఇదే తరహా వృద్ధి ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని అంచనా. ఐఓటీ వృద్ధికి వినియోగదారుల, పారిశ్రామిక రంగాలు చోదక శక్తిగా పనిచేస్తాయి. -
సీ-డాక్ తో ఈసీఐఎల్ ఒప్పందం..
హైదరాబాద్: నిత్యజీవితంలో వాడే అనేక పరికరాలకు ఇంటర్నెట్ అనుసంధానం చేయడానికి సీ-డాక్ సంస్థ రూపొందించిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) సాంకేతిక పరిజ్ఞాణాన్ని వృద్ది చేసే బాద్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేటషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సంస్థకు అప్పగించారు. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ సంచాలకులు అరుణాశర్మ సమక్షంలో సీ-డాక్ డెరైక్టర్ రజత్మూనా చేతుల మీదుగా ఈసీఐఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ పి. సుదాకర్ ఒప్పంద పత్రాలు అందుకున్నారు. సీ-డాక్ రూపొందించిన సాంకేతిక పరిజ్ఞాణంతో ఐఓటీ అవసరాలతో పాటుగా పరిశ్రమలను అభివృద్ది చేసేందుకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. -
హైదరాబాద్‌లో ఫ్లెక్స్ఐ ఇంకుబేటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న యూకే కంపెనీ ఫ్లెక్స్ఐ హైపర్క్యాట్ ఇంకుబేషన్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), స్మార్ట్ సిటీస్ రంగంలో నిమగ్నమైన స్టార్టప్‌లను తదుపరి స్థాయికి తీసుకెళ్లడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్ధేశం. 40 స్టార్టప్‌లకు ఇక్కడ స్థలం ఉంది. వినూత్న వ్యాపార ఆలోచన తో వచ్చిన స్టార్టప్‌లకు నిధులను కూడా సమకూరుస్తామని ఫ్లెక్స్ఐ ఇండియా ఎండీ శ్రీని చిలుకూరి తెలిపారు. ఇంకుబేషన్ కేంద్రంలో కార్యకలాపాలు సాగించే స్టార్టప్‌లకు అన్ని సౌకర్యాలు ఉచితమని ఫ్లెక్స్ఐ, హైపర్క్యాట్ చైర్మన్ జస్టిన్ ఆండర్సన్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీకి పెద్ద పీట వేస్తోందని, టీ-హబ్ ఏర్పాటైన నేపథ్యంలో సరైన సమయంలో ఈ ఇంకుబేషన్ కేంద్రం వచ్చిందని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెక్ ఆలిస్టర్ అన్నారు. యూకే ప్రభుత్వం మద్ధతు ఇస్తున్న స్వచ్చంద సంస్థ హైపర్క్యాట్కు ఫ్లెక్స్ఐ నేతృత్వంలో బ్రిటిష్ టెలికం, కేపీఎంజీ, సిమాంటెక్, సిస్కో వంటి 700 కంపెనీలు నిధులు సమకూరుస్తున్నాయి. -
ఐఓటీ నెట్వర్క్స్ హ్యాకింగ్‌పై సైబర్ క్రిమినల్స్ గురి!
సైబర్ సెక్యూరిటీ సంస్థ వెబ్సెన్స్ హెచ్చరిక న్యూఢిల్లీ: ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ (ఐఓటీ) నెట్వర్క్స్ హ్యాకింగ్‌కు సైబర్ క్రిమినల్స్ రెడీగా ఉన్నారని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెబ్సెన్స్ హెచ్చరించింది. దీని కోసం వారు పలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని తెలిపింది. మానవుల ప్రమేయం లేకుండా కేవలం ఐపీ అనుసంధానంతో తమలో తాము మాట్లాడగలిగే (సమాచార మార్పిడి) పరికరాల సాంకేతిక వ్యవస్థనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) అని పిలుస్తారు. ఈ వ్యవస్థలో ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, నెట్వ ర్క్ పరికరాలు, కనెక్టివిటీ సేవలు, డాటా సమగ్రత వంటివి కూడా ఉంటాయి. ‘ఐఓ టీ వృద్ధి చెందుతున్న మార్కెట్. ఇది కంపెనీలకు ఒక భారీ వ్యాపార అవకాశం. అలాగే దీనికి సైబర్ క్రిమినల్స్ నుంచి చాలా ప్రమాదం పొంచి ఉంది’ అని వెబ్సెన్స్ రీజినల్ డెరైక్టర్ (ఇండియా, సార్క్) సురేంద్ర సింగ్ అన్నారు. ఐటీ వినియోగంలో భారత్ బ్యాక్: డబ్ల్యూఈఎఫ్ జెనీవా: అధునాతన ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీలను (ఐసీటీ) సామాజిక, ఆర్థిక ప్రయోజనాల కోసం సమర్ధంగా ఉపయోగించుకోవడంలో భారత్ అంతకంతకూ విఫలమవుతోంది. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 143 దేశాలతో రూపొందించిన అంతర్జాతీయ నెట్వర్క్డ్ రెడీనెస్ ఇండెక్స్ (ఎన్ఆర్ఐ)లో ఆరు స్థానాలు దిగజారి 89వ స్థానానికి పడిపోయింది. 2013లో 68వ స్థానంలో ఉన్న భారత్, గతేడాది 83వ ర్యాంకుకు దిగజారింది.