ఐటీ సేవలే కాదు.. అంతకుమించి | Special Story On Research And Development Of New Technologies Emerging In IT sector | Sakshi
Sakshi News home page

ఐటీ సేవలే కాదు.. అంతకుమించి

Published Thu, Dec 5 2019 1:34 AM | Last Updated on Thu, Dec 5 2019 4:35 AM

Special Story On Research And Development Of New Technologies Emerging In IT sector - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సేవల రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ.. ఐటీ రంగంలో వస్తున్న నూతన సాంకేతికతల పరిశోధన, అభివృద్ధి రంగాలకు కూడా చిరునామాగా మారుతోంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్‌ వంటి కొత్త సాంకేతికతలపై జరిగే పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఐటీ కంపెనీలు రాష్ట్రానికి తరలివస్తున్నాయి.

మరోవైపు ఐటీ అనుబంధ రంగాలతో పాటు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావి స్తోంది. ఐటీ రంగంలో ఆఫీసు వసతి, ఉద్యోగాల కల్పన విషయంలో వచ్చే ఐదేళ్లలో బెంగళూరుపై పైచేయి సాధిస్తామని ఐటీ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఐటీ రంగంతో పాటు అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ తరహాలో ఎలక్ట్రానిక్స్‌ పరిశోధన, అభివృద్ధి, తయారీ వాతావరణాన్ని హైదరాబాద్‌లో కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఎలక్ట్రానిక్స్‌ రంగంలో గత ఐదేళ్లలో 30 వేల ఉద్యోగాలు సృష్టించగా, వచ్చే నాలుగేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఈ రంగంలో సాధించాలని భావి స్తోంది. ఇటీవల చైనాకు చెందిన స్కైవర్త్‌ కంపెనీ 50 ఎకరాల్లో రూ.700 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ పార్కు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్‌ తయారీ రంగంలో పరిశోధన, అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వాతావరణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏఐ, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీలు
కృత్రిమ మేధస్సుకు సంబంధించి జాతీయ స్థాయిలో పరిశోధన, అభివృద్ధి కోసం దేశంలో 5 సెంటర్స్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఎక్సలెన్స్‌ (కోర్‌), 20 ఇంటర్నేషనల్‌ సెంటర్స్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్మేషనల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఇక్టయ్‌) ఏర్పాటుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించే బాధ్యతను కేంద్రం తెలంగాణకు అప్పగించింది. మరోవైపు వ్యవసాయం, పట్టణీకరణ, రవాణా, ఆరోగ్య రంగాల్లో కీలక సవాళ్ల పరిష్కారానికి ఏఐ సాంకేతికత అమలును రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారంగా భావిస్తోంది.

ఈ నేపథ్యంలో సంబంధిత రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020ను ’ఇయర్‌ ఆఫ్‌ ఏఐ’ (కృత్రిమ మేధో సంవత్సరం)గా ప్రకటించింది. రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల నివారణకు ’బ్లాక్‌చెయిన్‌’ ఐటీ సాంకేతికతను పరిష్కారమని భావిస్తూ ఎస్సెస్సీ బోర్డు, బాసర ట్రిపుల్‌ ఐటీలో ఈ టెక్నాలజీని ఐటీ శాఖ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. త్వరలో జేఎన్టీయూ ద్వారా జారీ అయ్యే సర్టిఫికెట్ల వివరాలు కూడా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీతో అనుసంధానించనున్నారు.

గేమింగ్, వినోద రంగాలకూ
గేమింగ్, టెక్నాలజీ, వినోద రంగాల్లో దక్షిణాసియాకు తెలంగాణను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని 150కి పైగా వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోలు, 2డీ, త్రీడీ యానిమేషన్, గేమింగ్‌ కంపెనీలు సుమారు 30 వేల మందికి ప్రత్యక్ష, 90 వేల మందికి పరోక్ష ఉపాధి ఉపాధి కల్పిస్తున్నాయి. 2020–25 నాటికి గేమిగ్‌ రంగం 300 బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా వృద్ధి చెందే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, యానిమేషన్‌ రంగాల్లో లక్షలకొద్ది ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని అంచనా వేస్తోంది.

అత్యాధునిక స్టూడియోలు, సదుపాయాలతో కూడిన ఇమేజ్‌ టవర్స్‌ 2022 నాటికి అందుబాటులోకి రానుంది. డిజైనర్స్, ఎంట్రప్రెన్యూర్స్, స్టార్టప్‌లకు ఉపయోగపడేలా ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్‌ ప్రొటోటైపింగ్, మెకానికల్‌ డిజైనింగ్‌ రంగంలో భారత్‌లోనే తొలి ప్రోటోటైప్‌ సౌకర్యం కలిగిన ’టీ వర్క్స్‌’ మూడు నాలుగు నెలల్లో అందుబాటులో రానుంది. నైపుణ్య శిక్షణ, నూతన ఆవిష్కరణలకు సంబంధించి టీహబ్, వీహబ్‌లు ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీతో పాటు పలు ప్రైవేటు ఐటీ సంస్థలు భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి.

రాష్ట్రంలో ఐటీ ఘనత..

  • 2018–19లో ఐటీ ఎగుమతులు రూ.1.09 లక్షల కోట్లు
  • 2017–18తో పోలిస్తే ఐటీ ఎగుమతుల్లో 9 శాతం వృద్ధి రేటు నమోదు కాగా, తెలంగాణ 17 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది.
  • 2017–18లో ఐటీ రంగంంలో 4.85 లక్షల ఉద్యోగాలు ఉండగా, 2018–19లో 5.5 లక్షలకు చేరింది. వచ్చే నాలుగేళ్లలో ఈ సంఖ్య 10 లక్షలకు చేరుతుందని అంచనా. 
  • ఏఐ, మెషీన్‌ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్, డేటా ఎనలిటిక్స్‌ రంగంలో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా. 
  • 2019 తొలి అర్ధభాగం నాటికి 38.5 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్‌ అందుబాటులో ఉండగా, వచ్చే ఐదేళ్లలో 50 లక్షల చదరపు అడుగులకు చేరుతుందని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement