బడి నుంచే బతుకు విద్య | national skills qualification framework | Sakshi
Sakshi News home page

బడి నుంచే బతుకు విద్య

Published Fri, Jan 2 2015 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

బడి నుంచే బతుకు విద్య

బడి నుంచే బతుకు విద్య

* 9వ తరగతి నుంచే ప్రత్యేకంగా కోర్సులు ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయం  
* పీజీ వరకు తొమ్మిది స్థాయిల్లో ఏర్పాటు  
* రాష్ట్రంలోనూ ఆ దిశగానే అడుగులు

సాక్షి, హైదరాబాద్: చదువు పూర్తయిన వెంటనే ఉపాధి పొందేందుకు తోడ్పడేలా... పాఠశాల స్థాయి నుంచే వృత్తివిద్యా కోర్సులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యువతలో నైపుణ్యాల పెంపు, వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టేందుకు ‘నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఎస్‌క్యూఎఫ్)’ను కేంద్రం రూపొందించింది. ఇందులో భాగంగా 9వ తరగతి నుంచి ప్రారంభించి పీజీ వరకు తొమ్మిది స్థాయి (లెవల్)ల కోర్సులను బోధిస్తారు.

మొత్తం 32 రంగాల్లో 879 వృత్తి విద్యా కోర్సులను ఏర్పాటు చేస్తారు. సాధారణ విద్యతోపాటే ఈ కోర్సులను నడిపేలా చర్యలు చేపడతారు. ఇక రాష్ట్ర ప్రభుత్వమూ ఆ దిశగానే కసరత్తు చేస్తోంది. కేజీ టు పీజీ స్కూళ్లలో విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకే ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇంజనీరింగ్ కోర్సుల సిలబస్‌నూ మార్పు చేయనుంది.

కోర్సుల అనుసంధానం
ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌లో పేర్కొన్న ప్రకారం... వృత్తి విద్యా కోర్సులను ఏడాదికో, రెండేళ్లకో పరిమితం చేయకుండా అనుసంధాన వ్యవస్థను రూపొందించారు. అందులో భాగంగా ఏడు స్థాయిల్లో ఈ కోర్సులుంటాయి. ఒక్కో స్థాయిలో ఒక్కో కోర్సు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు ఇవ్వనుంది. ఏడాది కోర్సులో వృత్తి విద్యకు, సాధారణ విద్యకు వెచ్చించాల్సిన పని గంటలను కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  9వ తరగతికి సమానమైన కోర్సును సర్టిఫికెట్ లెవల్-1గా పేర్కొంటారు.

నిబంధన లివీ
ఈ వృత్తివిద్య బోధించే విద్యా, శిక్షణ సంస్థల స్థాయిలో నైపుణ్యాల సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను స్కూల్ / కాలేజీ / బోర్డు / యూనివర్సిటీలు ఇచ్చుకోవచ్చు. ప్రతి సర్టిఫికెట్ కోర్సులో ఏడాదికి వెయ్యి పని గంటలుండాలి. ఇందులో నైపుణ్యాలు, విద్యకు పని గంటలను విభజించాలి. 1, 2, 3, 4 స్థాయిల సర్టిఫికెట్ కోర్సుల్లో విద్యా సంబంధ  అంశాలు సీబీఎస్‌ఈ లేదా స్టేట్ బోర్డుకు సంబంధించినవి ఉండొచ్చు. సైన్స్, ఆర్ట్స్, కామర్స్ విభాగాల్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టవచ్చు. 5, 6, 7 స్థాయి కోర్సుల్లో ప్రవేశపెట్టబోయే సిలబస్ అన్ని యూనివర్సిటీల్లో ఒకేలా ఉండాలి.

ఉదాహరణకు డిగ్రీ స్థాయిలో ప్రవేశపెట్టే కోర్సును బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ (అగ్రికల్చర్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ తరహాలో..) అని పేర్కొంటారు. అలాగే డిప్లొమా స్థాయిలో డిప్లొమా (వొకేషనల్)గా పేర్కొంటారు. వివిధ రంగాల్లో కమ్యూనిటీ స్కిల్ డిప్లొమాను ప్రవేశపెడతారు. దీనిని కమ్యూనిటీ స్కిల్ డిప్లొమా (వొకేషనల్)గా పేర్కొన్నారు. ఇక పాఠశాల స్థాయిలో స్కూల్ లెవల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సును ప్రవేశపెడతారు. స్కూల్ బోర్డు నిర్వహించే వృత్తి విద్యా కోర్సుల ఆధారంగా ఇవి ఉంటాయి.

ఏయే రంగాల్లో ఎన్ని..?
మానవ వనరులు ఎక్కువగా అవసరమైన 32 రంగాలను గుర్తించిన ప్రభుత్వం.. వాటిల్లో 879 రకాల కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. తద్వారా ఈ కోర్సులను పూర్తి చేసే విద్యార్థులు వెంటనే ఆయా రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ప్రణాళికలు రూపొందించింది.

వ్యవసాయ రంగంలో 42 రకాల కోర్సులను.. అపెరల్ 6, ఆటోమోటివ్ 189, బ్యూటీ-వెల్‌నెస్ 3, బీఎఫ్‌ఎస్‌ఐ 6, కేపిటల్ గూడ్స్ 56, కన్‌స్ట్రక్షన్ 12, ఎలక్ట్రానిక్స్ 139, జెమ్స్-జ్యువెలరీ 87, ఆరోగ్య రంగం 28, ఐటీ-ఐటీఈఎస్ 75, లెదర్ 22, లాజిస్టిక్స్ 4, లైఫ్‌సెన్సైస్ 5, మీడియా-ఎంటర్‌టైన్‌మెంట్ 48,  మైనింగ్ 10, ప్లంబింగ్ 26, రిటైల్ 4, రబ్బర్ 70, సెక్యూరిటీ 9, టెలికం రంగంలో 33 రకాలు, టూరిజం-హాస్పిటాలిటీ రంగంలో 5 రకాల కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement