అమ్మాయిలదే హవా
► ఇంటర్ ఫలితాల్లో నాలుగో స్థానం
► మళ్లీ విద్యార్థినులదే పై చేయి ... 79 శాతం పాస్
► ఫస్టియర్‌లో 70 శాతం, సెకండియర్‌లో 76 శాతం ఉత్తీర్ణత
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఆరేళ్లుగా బాలురను అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తున్న బాలికలు మరోసారి పై చేయి సాధించారు. మంగళవారం ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసిన ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో బాలికలు ముందంజలో నిలిచారు.జిల్లాలో ప్రథమ సంవత్సర ఫలితాల్లో 70 శాతం, ద్వితీయ సంవత్సరంలో 76 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాలు ఒకే సారి విడుదల కావడం ఇదే తొలిసారి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ విభాగాల వారీగా అధిక మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి టాప్-10లో చోటు సంపాదించారు. ఫలితాలను ఏబీసీడీ గ్రేడ్లుగా విభజించిన ఇంటర్మీడియెట్ బోర్డు మార్కుల రూపంలోనూ ప్రకటించింది.
ప్రథమ సంవత్సరంలో 70 శాతం ...
మార్చి నెలలో జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా హాజరైన 47,116 మంది విద్యార్థుల్లో 32,991 మంది ఉత్తీర్ణులయ్యారు. 70 శాతంఉత్తీర్ణత నమోదయ్యింది. వీరిలో బాలికలు 74 శాతం, బాలురు 66 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా వృత్తి విద్యాకోర్సుల నుంచి ప్రథమ సంవత్సరంలో 52 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. 1,198 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 624 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 66 శాతం ఉత్తీర్ణత నమోదై, ఐదో స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుతం 70 శాతంతో 4వ స్థానానికి జారింది.
ద్వితీయ సంవత్సరంలో 76 శాతం ...
ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరైన 41,927 మంది విద్యార్థులలో 31,864 మంది ఉత్తీర్ణులయ్యారు. 76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 79 శాతం, బాలురు 73 శాతం ఉత్తీర్ణ నమోదు చేశారు. వృత్తి విద్యాకోర్సులలో 76 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. పరీక్ష రాసిన 524 మందిలో 396 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 76 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుతం అదే ఉత్తీర్ణత శాతం నమోదైనప్పటికీ 4వ స్థానానికి దిగజారింది.
మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తప్పిన విద్యార్థులకు మే 24వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నా యి. సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలి.