Intermediate exam results
-
ఇంటర్ రెండేళ్ల ఫలితాల్లోనూ అమ్మాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాల్లో మరోసారి బాలికలు సత్తా చాటారు. మొదటి, రెండో సంవత్సరం రెండింటిలోనూ బాలురను మించి ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. ఫస్టియర్‌లో బాలురు 54.66 శాతం పాసయితే, బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం పాస్ కావడం గమనార్హం. మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ రెండేళ్ల పరీక్షలు కలిపి మొత్తంగా 9,48,153 మంది హాజరయ్యారని తెలిపారు. ఫస్టియర్‌లో 61.68 శాతం, సెకండియర్‌లో 63.49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు వెల్లడించారు. ఫస్టియర్‌లో 1,75,505 మంది, సెకండియర్‌లో 1,91,698 మంది ఏ గ్రేడ్ (75శాతంపైన మార్కులతో)లో ఉత్తీర్ణులైనట్టు వివరించారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ (75% పాస్) మొదటి స్థానంలో, రంగారెడ్డి (73% పాస్) ద్వితీయ స్థానంలో నిలిచా యని మంత్రి తెలిపారు. సెకండియర్‌లో ములుగు (85% పాస్) మొదటి స్థానంలో, కొమురం భీం (81 శాతం పాస్) రెండో స్థానంలో నిలిచినట్టు స్పష్టం చేశారు. ఫెయిలైతే ఆందోళన పడొద్దు ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసి పాసవ్వాలని మంత్రి సూచించారు. ఎంసెట్‌లో ఈ ఏడాది ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదని, అందువల్ల ఇంటర్ మార్కులు తక్కువ వచ్చినా ఆందోళన పడొద్దని చెప్పారు. నేటి నుంచి రీవెరిఫికేషన్.. ఇంటర్ జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్ ప్రక్రియను ఈ నెల 10 నుంచి 16 వరకు చేపడుతున్నామని.. విద్యార్థులు సంబంధిత కాలేజీల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. రీవెరిఫికేషన్‌కు రూ.100, రీవ్యాల్యూయేషన్‌కు రూ.600 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులతోపాటు పాసైనా ఇంప్రూవ్మెంట్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 16 లోగా ఫీజు చెల్లించాలని సూచించారు. మార్కుల మెమోలు, కలర్ ప్రింట్లను ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. మానసిక ఆందోళనకు గురైన విద్యార్థులు 14416 టోల్ ఫ్రీనంబర్‌కు కాల్ చేసి నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ పొందవచ్చని తెలిపారు. వీలైనంత త్వరగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఇంటర్ బోర్డ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా.. ఏ కాలేజీలోనూ అడ్మిషన్లు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎంపీసీలో అత్యధిక ఉత్తీర్ణత.. రెండో స్థానంలో బైపీసీ – హెచ్ఈసీ, సీఈసీ కోర్సుల్లో 50 శాతంలోపే పాస్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ గ్రూపుల్లోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెండింటిలోనూ ఎంపీసీ (మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూపులో ఎక్కువ మంది పాసయ్యారు. తర్వాత స్థానంలో బైపీసీ ఉండగా.. సీఈసీ, హెచ్ఈసీ వంటి సంప్రదాయ గ్రూపుల్లో తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. తగ్గిన ఉత్తీర్ణత శాతం – వంద శాతం సిలబస్ కారణమంటున్న నిపుణులు – కోవిడ్‌కు ముందుతో పోలిస్తే ఉత్తీర్ణత ఎక్కువే ఇంటర్లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెండింటి ఫలితాలూ ఇలాగే ఉన్నాయి. కోవిడ్ కారణంగా 2021లో పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేశారు. తర్వాత 2022లోనూ 75శాతం సిలబస్‌తో పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది వంద శాతం సిలబస్‌తో పరీక్షలు పెట్టారు. పూర్తి సిలబస్ నేపథ్యంలోనే ఇంటర్ జనరల్ విభాగంలో ఉత్తీర్ణత స్వల్పంగా తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. అయితే 2019తో పోలిస్తే మాత్రం పాస్ పర్సంటేజీ ఎక్కువగానే ఉంది. కొన్నేళ్లుగా ఇంటర్ ఉత్తీర్ణత శాతం (శాతాల్లో) ఏడాది ఫస్టియర్ సెకండియర్ 2018–19 60.60 64.94 2019–20 61.07 69.61 2020–21 100 100 2021–22 64.85 68.68 2022–23 62.85 67.27 -
‘అల్ఫోర్స్’ సంచలనం
కొత్తపల్లి (కరీంనగర్): ఇంటర్మీడియట్–2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో రాష్ట్రస్థాయిలో నెం.1గా నిలిచారని ఆ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నవ్యశ్రీ 994/1000 మార్కులతో, బైపీసీ విభాగంలో అర్చన 993/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచారని పేర్కొన్నారు. సీనియర్ ఎంఈసీలో శ్రీచక్రిత 986/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం పొందినట్లు వెల్లడించారు. ఇంటర్ ప్రథమ సంవత్సర ఎంపీసీ విభాగంలో పలు వురు 467/470 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారని తెలిపారు. బైపీసీ విభాగం లో 437/440 మార్కులు సాధించారన్నారు. ఎంఈసీ విభాగంలో శివాని 493 మార్కులతో రాష్ట్రస్థాయిలో నెం.1గా నిలిచినట్లు తెలిపారు -
ఇంటర్ పరీక్షా ఫలితాల రగడ..
-
వారంలోగా ఇంటర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలను వారంలోగా వెల్లడించేందుకు వీలుగా ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి కోవిడ్–19 నేపథ్యంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను క్లౌడ్ సర్వీస్ ద్వారా విడుదల చేయనున్నామని బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాల డేటా కావలసిన వెబ్సైట్లు, ఇతరులు తమ సమాచారాన్ని ముందుగా బోర్డుకు అందించాలన్నారు. వెబ్సైట్ల నిర్వాహకులు వెబ్సైట్ పేరు, యూఆర్ఎల్ వివరాలు అందించాలి. ఇతరులు తమ పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ అందించాలి. ఈ వివరాలను probieap@gmail.comకు పంపించాలి. ఇలా ఉండగా, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు సంబంధించిన దాదాపు 60 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తిచేసి తదనంతర ప్రక్రియలపై బోర్డు నిమగ్నమైంది. ఇవి వారంలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. అవి పూర్తయ్యాక అన్నీ సజావుగా ఉన్నాయని తేలాకనే ఫలితాల తేదీ ప్రకటిస్తారు. -
అవన్నీ అపోహలే
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తప్పులు వచ్చినందుకే 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అలాగే ఒకరి మార్కులు ఇంకొకరికి వేశారన్న వాదనలోనూ నిజం లేదని తెలిపింది. సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ పకడ్బందీగా జరుగుతోందని, మూడు స్థాయిల్లో పరిశీలన తర్వాతే ఫలితాలను నిర్ధారిస్తామని పేర్కొంది. మూల్యాంకన ప్రక్రియలో సాఫ్ట్వేర్ సంస్థలకు ఎలాంటి ప్రమేయం ఉండదని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటంపట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని, వారి ఆత్మహత్యలకు కారణాలేంటనే దానిపై లోతుగా విశ్లేషించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇంటర్ ఫలితాల వెల్లడిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు బోర్డు ఆదివారం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన సారాంశం ఇదీ... ప్రజలకు నిజాలు చెప్పదలిచాం... పరీక్షలు సరిగా రాయలేదని, ఫలితాల్లో తప్పులు వచ్చాయంటూ 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపట్ల అనేక వదంతులు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రజలకు నిజాలు చెప్పి వాటిని నిలువరించాలని భావిస్తున్నాం. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఫలితాల ప్రకటన ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు కేటాయించడం ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. హాల్‌టికెట్ల జంబ్లింగ్ ద్వారా పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు. పలు మాధ్యమాల్లో వస్తున్నట్లు పరీక్ష కేంద్రాలను మాన్యువల్‌గా కేటాయించామనడంలో నిజం లేదు. ఈ బా«ధ్యతలను ఓ సాఫ్ట్వేర్ ఏజెన్సీకి అప్పగించి పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్‌టికెట్ల పంపిణీ చేశాం. ఎగ్జామినర్ల ద్వారానే మూల్యాంకనం... పరీక్షల తర్వాత మూల్యాంకన ప్రక్రియ మార్చి 15 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 12 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో ఎగ్జామినర్ల ద్వారానే మూల్యాంకనం చేయించాం. బోధనలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండి, ప్రభుత్వ, రెసిడెన్షియల్, సంక్షేమ, ప్రైవేటు కళాశాలల అధ్యాపకులను ఎగ్జామినర్లుగా బోర్డు నియమించింది. మూల్యాంకన ప్రక్రియ అంతా బోర్డు ద్వారా జరిగింది తప్ప సాఫ్ట్వేర్ ఏజెన్సీలకు ఇందులో ఎలాంటి ప్రమేయం లేదు. సమాధాన పత్రాలకు అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన తర్వాత చీఫ్ ఎగ్జామినర్లు, సబ్జెక్టు నిపుణులు వాటిని ర్యాండమ్‌గా పరిశీలించారు. అతితక్కువ, అతిఎక్కువ మార్కులు రావడంతోపాటు కొద్ది తేడాతో ఫెయిల్ మార్కులు వచ్చిన పేపర్లను కూడా పరిశీలించారు. స్పాట్ వాల్యుయేషన్ క్యాంపుల్లో బోర్డు నియమించిన స్క్రూటినైజర్లు కూడా అన్ని పేపర్లూ పరిశీలించారు. అంటే ఒక్కో పేపర్‌ను మూడు స్థాయిల్లో పరిశీలన జరిపించాం. అయితే 99 మార్కులు వచ్చిన విద్యార్థికి 0 మార్కులు వచ్చిన ఘటన ఈ ప్రక్రియలో జరగలేదు. ఇది కేవలం మానవ తప్పిదం మాత్రమే. మొత్తం 54 లక్షల స్క్రిప్టుల్లో తప్పు జరిగింది కేవలం ఒక్క పేపర్ విషయంలోనేనని అందరూ గమనించాలి. ఒకరి మార్కులు ఇంకొకరికి సాధ్యం కాదు... ఒకరికి వచ్చిన మార్కులు ఇంకొకరికి వేశారనే అపవాదు బోర్డుపై వచ్చింది. అయితే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మార్కులు బార్‌కోడ్‌కు లింక్ అయి ఉంటాయి. ఈ బార్కోడ్.. ఫలితాల ప్రకటన సమయంలో హాల్‌టికెట్ నంబర్‌కు లింక్ అవుతుంది. దీన్ని అనేకసార్లు పరిశీలించాం. సక్రమంగా ఉందని గుర్తించాం. ఈ ఆరోపణలో ఎలాంటి నిజం లేదు. ఫలితాల్లో గందరగోళం తర్వాత కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ బాధ్యతలను మళ్లీ అదే సాఫ్ట్వేర్ సంస్థకు ఇచ్చామనే ఆరోపణ కూడా ఉంది. కానీ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌లో భాగస్వాములయ్యేది ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లే. ఇందులో సాఫ్ట్వేర్ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే ఈ ప్రక్రియ అనంతరం ఫలితాల ప్రాసెసింగ్‌లో సాఫ్ట్వేర్ సంస్థ పాత్ర ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాలపై నియమించిన త్రిసభ్య కమిటీ కూడా ఫలితాల ప్రాసెసింగ్‌ను ప్రస్తుత సాఫ్ట్వేర్ సంస్థతోపాటు మరో స్వతంత్ర సంస్థతో కూడా చేయించాలని, ఈ రెండు సంస్థలు చేసిన ఫలితాలు సరిపోలాకే ఫలితాలు విడుదల చేయాలని సూచించింది. అందుకే ఇప్పుడు టెండర్ ద్వారా డేటాటెక్ మెథడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్వతంత్ర సంస్థను టీఎస్టీఎస్ ఎంపిక చేసింది. ఈ నెల 10కల్లా ఫలితాలు... హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ సూచనల ప్రకారం రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఈ ప్రక్రియను పూర్తి చేసి మే 10కల్లా ఫలితాలు ప్రకటిస్తాం. ప్రకటించిన ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థుల సమాధాన పత్రాలను 15 రోజులపాటు డౌన్లోడ్ చేసుకునే వీలు కూడా కల్పిస్తాం. ఫలితాల ప్రకటనలో పారదర్శకంగా వ్యవహరించి ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా చేస్తామని ప్రజానీకానికి బోర్డు తెలియజేస్తోంది. మీడియా, ప్రజలు, పౌరసమాజం కూడా వాస్తవాలను ప్రజలకు తెలియజేసి వదంతులకు అవకాశం లేకుండా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఆ విద్యార్థుల జవాబు పత్రాలను ప్రత్యేకంగా పరిశీలించాం... ఫలితాల్లో నెలకొన్న గందరగోళం వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయన్న ఆరోపణల్లో నిజం లేదు. ఫలితాలు వచ్చిన ఒక్క రోజులోపే జరిగిన పొరపాట్లన్నింటినీ సవరించాం. చనిపోయిన విద్యార్థుల సమాధాన పత్రాలను ప్రత్యేకంగా పరిశీలన జరిపించాం. సబ్జెక్టు నిపుణులతో క్షుణ్ణంగా పరిశీలన చేయించాక కూడా ఏ ఒక్క విద్యార్థికీ ఫెయిల్ మార్కుల నుంచి పాస్ అయ్యే మార్కులు రీ వెరిఫికేషన్‌లో రాలేదు. చనిపోయిన వారిలో 14 మంది ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. ఒక్క విద్యార్థి మాత్రం 85 శాతం మార్కులతో ఏ గ్రేడ్‌లో పాసైనా చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుల గురించి నిపుణుల కమిటీ చేత లోతుగా విశ్లేషణ జరిపించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాం. ఇప్పటికే చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు బాధలో ఉన్నందున వారి సమాధాన పత్రాలను బయటకు వెల్లడించట్లేదు. అయితే అకాడమిక్‌గా ఉపయోగించుకునేందుకు లేదా ఈ మరణాలపై అధ్యయనం చేసేందుకు ఎవరికైనా ఆసక్తి ఉంటే బోర్డుకు తెలియజేసి వారి సమాధాన పత్రాలను పొందొచ్చు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్‌లో తప్పు వల్లే... మూల్యాంకన ప్రక్రియ తర్వాత ఓఎంఆర్ షీట్‌లోని పార్ట్–3 ద్వారా బోర్డుకు మార్కుల సమాచారం అందుతుంది. దీన్ని మాత్రమే సాఫ్ట్వేర్ రీడ్ చేస్తుంది. ఇక్కడి నుంచే మళ్లీ సాఫ్ట్వేర్ పాత్ర ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ప్రతి 15 పేపర్ల బండిల్లో ఏవైనా తప్పులుంటే మళ్లీ గుర్తిస్తుంది. ఈ తప్పులను కూడా గుర్తించాక ఓఎంఆర్ షీట్లను స్కాన్ చేసి ఫలితాలు ప్రచురించాం. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్‌లో తప్పు జరిగిన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్ష రాసినా ఆబ్సెంట్గా వచ్చింది. పరీక్ష కేంద్రాల కేటాయింపులో జరిగిన సాఫ్ట్వేర్ తప్పిదం కారణంగా కొందరు విద్యార్థులకు వారు చదువుతున్న కళాశాలనే పరీక్ష కేం ద్రంగా కేటాయించారు. ఈ తప్పిదాన్ని ఫిబ్రవరి చివరి వారంలో గుర్తించి వారికి వేరే కళాశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించి బఫర్ బార్కోడ్ నంబర్ ఆధారంగా పరీక్షలు రాయించాం. ఈ క్రమంలో ఆయా విద్యార్థులకు వచ్చిన మార్కుల సమాచారం బఫర్కోడ్ ఆధారంగా కొత్త పరీక్ష కేంద్రం నుంచి వచ్చింది. అలాగే పాత కేంద్రాల్లో ఆ విద్యార్థులు హాజరు కాకపోవడంతో ఆబ్సెంట్ అని వచ్చింది. ఈ తప్పిదాన్ని ఫలితాలు ప్రకటించిన గంటలోపే గుర్తించాం. అయితే అప్పటికే ఫలితాల సీడీలు ప్రైవేటు ఏజెన్సీ, వెబ్సైట్లకు వెళ్లిపోవడంతో సరిచేయలేకపోయాం. దీంతో గందరగోళం నెలకొంది. దీంతో ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో ఆ విద్యార్థులకు సంబంధించిన సరైన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చాం. -
నేటి నుంచి 48 గంటల దీక్ష
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జరిగిన అవకతవకలను సరిచేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. అందులో భాగంగా గాంధీభవన్ వేదికగా ఎన్ఎస్యూఐ, యూత్‌కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో గురువారం నుంచి 48 గంటల దీక్ష నిర్వహించనుంది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్‌లు ఈ దీక్షలో పాల్గొననున్నారు. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులందరి సమాధానపత్రాలను ఆన్లైన్లో పెట్టడం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ను తప్పించడం, విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి బర్తరఫ్, గ్లోబరీనా సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టడం వంటి డిమాండ్లతో ఈ దీక్షకు దిగుతున్నామని, ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్ హెచ్చరించారు. -
ఓ తండ్రిగా వారి బాధను అర్థం చేసుకోగలను!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల వ్యవహారంలో జరిగిన పరిణామాలు దురదృష్టకరమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధను ఒక తండ్రిగా అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆదివారం ‘ఆస్క్ కేటీఆర్’పేరిట నెటిజన్లతో ట్విట్టర్లో సంభాషించారు. రాజకీయాలు, వ్యక్తిగత జీవితం గురించి పలు అంశాలపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ఇంటర్మీడియట్ వివాదంపై.. రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న ఇంటర్మీడియట్ ఫలితాలపై పలువురు నెటిజన్లు కేటీఆర్‌ను ప్రశ్నించారు. ‘ఇంటర్ వివాదంలో నాకేదో మోసం ఉందనిపిస్తోంది సర్. కావాలని చేసినట్లున్నారు కదా?’అని ఓ నెటిజన్ అభిప్రాయపడగా... ‘ఈ సమస్యను మరింత వివాదాస్పదం చేయొద్దు’అని కేటీఆర్ కోరారు. ‘అన్నింటికీ సమాధానాలు ఇస్తున్నారు. పిల్లల విషయంలో మాత్రం మాట దాటేస్తున్నారు. ఇంటర్ బోర్డు విషయంలో కొంచెం క్లారిటీ ఇవ్వండి. మీపై మాకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి’అని మరో నెటిజన్ కోరారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘ఏం క్లారిటీ ఇవ్వాలో మీరే చెప్పండి సర్. జరిగిన ఘటనల పట్ల నేనూ బాధపడుతున్నాను. ఇందుకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలి. నేనూ ఓ తండ్రినే. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధను నేనూ అర్థంచేసుకోగలను’అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అన్యాయం చేసింది నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పలు అంశాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో తెలంగాణ డిమాండ్లను సాధించుకుంటామని చెప్పారు. ‘ఎన్డీయే ప్రభుత్వం హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ నెట్వర్క్ విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. కనీసం రాబోయే కేంద్ర ప్రభుత్వమైనా అన్యాయాన్ని సరిదిద్దుతుందని ఆశిస్తున్నాం. కేంద్రంలో రానున్నది ఖచ్చితంగా హంగ్ పార్లమెంటే. ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపోయే మెజార్టీ రాదు. టీఆర్ఎస్కు కచ్చితంగా 16 లోక్‌సభ స్థానాలు వస్తాయి. కేంద్ర పన్నుల్లో వాటా, అధికార వికేంద్రీకరణ ఫెడరల్ ఫ్రంట్ ప్రధాన అంశాలుగా ఉంటాయి’అని కేటీఆర్ తెలిపారు. దీంతో రాష్ట్రాలు బలోపేతమవుతాయని.. తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అత్యుత్తమ ఆర్థిక విధానాలతోనే దేశంలో ఉద్యోగిత, సంపద సష్టి జరుగుతుందని చెప్పారు. ఉత్తమ ఆర్థిక విధానాలే రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో ఉండాలని అన్నారు. ‘కేంద్రంలో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం అయినా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నాం. దీని కోసం మా ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు కొనసాగిస్తాం’అని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు కాళేశ్వరం ప్రాజెక్టు పంపుల ప్రారంభంపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్.. పాలమూరు ఎత్తిపోతల పథకంతో మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలతోపాటుగా.. నల్లగొండలోని కొన్ని ప్రాంతాల్లో సాగునీరు అందుతుందన్నారు. రెండోసారి కొలువుదీరిన తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం.. వైద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరచడం, విద్యాప్రమాణాలను పెంచడం, మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలిపారు. ‘సర్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించవచ్చు కదా? ఎందుకు ఓ సాధారణ వ్యక్తి ఏదన్నా సాయం కావాలంటే ట్విట్టర్లో మిమ్మల్ని సంప్రదించాల్సి వస్తోంది?’అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ... ట్విటర్ మరో సదుపాయం మాత్రమేనని మౌలిక సదుపాయాల మెరుగుపై నిరంతరం పనులు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌పై ఆసక్తి లేదు 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయాలన్న నెటిజన్ల ప్రశ్నకు.. 2024 చాలా దూరంలో ఉందని కేటీఆర్ చమత్కరించారు. ఏపీ సీఎంగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సరిపోతాడా అన్న ప్రశ్నకు.. ఈ విషయం లో తన అభిప్రాయం ఏ మాత్రం అవసరంలేదని, దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. ఏపీ రాజకీయాలపై తనకు పెద్దగా ఆస క్తి లేదన్నారు. తమిళనాడులో టీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇప్పటికే అక్కడ చాలామంది నాయకులు ఉన్నారన్నారని కేటీఆర్ అన్నారు. మాటలతో ఇమేజ్ చెరిగిపోదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బ్రాండ్ హైదరాబాద్‌కు సంబంధించిన ప్రచారం జరిగిందన్న విషయానికి స్పందిస్తూ.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కేవలం మాటలతో చెరిగిపోదని తెలిపారు. హైదరాబాద్ స్టార్టప్ ఎకో సిస్టమ్ కోసం ప్రభుత్వంవైపు నుంచి అవసరమైన సహాయ సహకారాలు కొనసాగిస్తామన్నారు. ఇమేజ్ టవర్స్, యానిమేషన్ ఇండస్ట్రీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం రూ.400 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం నిధులు విడుదల కావడంలేదని బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. రవాణా అనుసంధానతకు సంబంధించిన సమస్య అన్ని నగరాలకు ఎదురయ్యేదేనని.. హైదరాబాద్‌లో దీన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఎల్బీనగర్–నాగోలు మధ్య మెట్రో రైలు అనుసంధానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హైదరాబాద్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్యాచరణ ప్రణాళిక దశలో ఉందని అన్నారు. జవహర్‌నగర్ డంపింగ్‌కు సంబంధించి ట్యాపింగ్ పనులు జరుగుతున్నాయని.. మరికొంత పని పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. కంటోన్మెంట్ భూమిపై కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే స్కైవే పనులు జరుగుతాయని చెప్పారు. - కఠిన పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారని ఓ నెటిజన్ కేటీఆర్‌ను అడగ్గా.. ‘ప్రశాంతంగా ఉండటం. బుద్ధిబలంతో వ్యవహరించడంతో’అని సమాధానమిచ్చారు. - మున్సిపల్ కార్యాలయాల్లో లంచగొండితనాన్ని అరికట్టడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘నూతన మున్సిపల్ చట్టాన్ని తెచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు యత్నిస్తున్నాం’అని అన్నారు. - ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’సినిమా చూశారా? మరో నెటిజన్ కేటీఆర్‌ను అడిగారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘లేదు సర్. నాకు అవెంజర్స్ గురించి ఏమీ తెలీదు’అన్నారు. - ఇప్పటివరకు 100 ట్వీట్లు చేసినా, కేటీఆర్ ఒక్కసారీ స్పందించలేదని, ఇప్పడైనా స్పందించకపోతే నారా లోకేశ్ మీద ఒట్టు అని ఒక నెటిజన్ పోస్టు చేయగా.. మధ్యలో ఆయన (నారా లోకేశ్) ఏం చేశాడు బ్రదర్ అని కేటీఆర్ అన్నారు. - ‘మతాలపై ప్రసంగాలు చేసేవారిని అరికట్టండి. దీని వల్ల మతఘర్షణలు, బాంబు పేలుళ్లు తగ్గుతాయని అనిపిస్తోంది’అని ఒక నెటిజన్ కోరగా.. దాని వల్ల ఉపయోగం ఉంటుందని నేననుకోను అని సమాధానమిచ్చారు. - టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ సోషల్ మీడియాలో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తానని కేటీఆర్ అన్నారు. పలువురు మంత్రులు ట్విట్టర్లో అందుబాటులో ఉన్నారని చెప్పారు. - ప్రధాని మోదీ, నటుడు అక్షయ్‌కుమార్ ముఖాముఖి కార్యక్రమంపై అభిప్రాయం చెప్పాలని ఓ నెటిజన్ అడిగారు. ‘ఈ కార్యక్రమాన్ని నేను చూడలేదు. కానీ.. అక్షయ్ వేసుకున్న గులాబీ రంగు ప్యాంట్ నచ్చింది’అని కేటీఆర్ అన్నారు. ‘కేఏ పాల్ గురించి ఒక్క మాట చెప్పండి’అని మరో నెటిజన్ కోరగా.. ‘ఆయన ప్రచార కార్యక్రమం చాలా వినోదాత్మకంగా ఉంద’ని కేటీఆర్ చెప్పారు. గ్లోబరీనా అంటే తెలియదు? ‘మీరిప్పుడు ఏ శాఖకూ మంత్రి కాదు. అలాంటప్పుడు ఎందుకు ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల్లో తలదూరుస్తున్నారు. కొందరు కలెక్టర్లు ఏ మంచి పని చేసినా మిమ్మల్ని ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు? గ్లోబరీనా వివాదంలోనూ మీపేరు వినిపిస్తుంది? దీనిపై మీరేం చెప్పదలచుకున్నారు’అని ఓ నెటిజన్ కేటీఆర్‌ను ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘నన్ను ప్రజలు ఎంచుకున్నారు. ప్రజలకు ఏదన్నా సమస్య వస్తే అధికారులకు సూచించే హక్కు నాకుంటుంది. దీని వల్ల ఇప్పుడు మీకొచ్చిన సమస్యేంటి? ఇక గ్లోబరీనా విషయమంటారా.. ఇంటర్ ఫలితాలు వెల్లడిలో అవకతవకలు జరిగాయని తెలిసే వరకూ నాకు అసలు గ్లోబరీనా అంటే ఏంటో కూడా తెలియదు’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
అమ్మాయిలదే హవా
► ఇంటర్ ఫలితాల్లో నాలుగో స్థానం ► మళ్లీ విద్యార్థినులదే పై చేయి ... 79 శాతం పాస్ ► ఫస్టియర్‌లో 70 శాతం, సెకండియర్‌లో 76 శాతం ఉత్తీర్ణత గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఆరేళ్లుగా బాలురను అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తున్న బాలికలు మరోసారి పై చేయి సాధించారు. మంగళవారం ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసిన ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో బాలికలు ముందంజలో నిలిచారు.జిల్లాలో ప్రథమ సంవత్సర ఫలితాల్లో 70 శాతం, ద్వితీయ సంవత్సరంలో 76 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాలు ఒకే సారి విడుదల కావడం ఇదే తొలిసారి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ విభాగాల వారీగా అధిక మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి టాప్-10లో చోటు సంపాదించారు. ఫలితాలను ఏబీసీడీ గ్రేడ్లుగా విభజించిన ఇంటర్మీడియెట్ బోర్డు మార్కుల రూపంలోనూ ప్రకటించింది. ప్రథమ సంవత్సరంలో 70 శాతం ... మార్చి నెలలో జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా హాజరైన 47,116 మంది విద్యార్థుల్లో 32,991 మంది ఉత్తీర్ణులయ్యారు. 70 శాతంఉత్తీర్ణత నమోదయ్యింది. వీరిలో బాలికలు 74 శాతం, బాలురు 66 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా వృత్తి విద్యాకోర్సుల నుంచి ప్రథమ సంవత్సరంలో 52 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. 1,198 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 624 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 66 శాతం ఉత్తీర్ణత నమోదై, ఐదో స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుతం 70 శాతంతో 4వ స్థానానికి జారింది. ద్వితీయ సంవత్సరంలో 76 శాతం ... ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరైన 41,927 మంది విద్యార్థులలో 31,864 మంది ఉత్తీర్ణులయ్యారు. 76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 79 శాతం, బాలురు 73 శాతం ఉత్తీర్ణ నమోదు చేశారు. వృత్తి విద్యాకోర్సులలో 76 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. పరీక్ష రాసిన 524 మందిలో 396 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 76 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుతం అదే ఉత్తీర్ణత శాతం నమోదైనప్పటికీ 4వ స్థానానికి దిగజారింది. మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తప్పిన విద్యార్థులకు మే 24వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నా యి. సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలి.