సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల వ్యవహారంలో జరిగిన పరిణామాలు దురదృష్టకరమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధను ఒక తండ్రిగా అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆదివారం ‘ఆస్క్ కేటీఆర్’పేరిట నెటిజన్లతో ట్విట్టర్‌లో సంభాషించారు. రాజకీయాలు, వ్యక్తిగత జీవితం గురించి పలు అంశాలపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు.
ఇంటర్మీడియట్ వివాదంపై..
రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న ఇంటర్మీడియట్ ఫలితాలపై పలువురు నెటిజన్లు కేటీఆర్‌ను ప్రశ్నించారు. ‘ఇంటర్ వివాదంలో నాకేదో మోసం ఉందనిపిస్తోంది సర్. కావాలని చేసినట్లున్నారు కదా?’అని ఓ నెటిజన్ అభిప్రాయపడగా... ‘ఈ సమస్యను మరింత వివాదాస్పదం చేయొద్దు’అని కేటీఆర్ కోరారు. ‘అన్నింటికీ సమాధానాలు ఇస్తున్నారు. పిల్లల విషయంలో మాత్రం మాట దాటేస్తున్నారు. ఇంటర్ బోర్డు విషయంలో కొంచెం క్లారిటీ ఇవ్వండి. మీపై మాకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి’అని మరో నెటిజన్ కోరారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘ఏం క్లారిటీ ఇవ్వాలో మీరే చెప్పండి సర్. జరిగిన ఘటనల పట్ల నేనూ బాధపడుతున్నాను. ఇందుకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలి. నేనూ ఓ తండ్రినే. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధను నేనూ అర్థంచేసుకోగలను’అన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం అన్యాయం చేసింది
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పలు అంశాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో తెలంగాణ డిమాండ్లను సాధించుకుంటామని చెప్పారు. ‘ఎన్డీయే ప్రభుత్వం హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ నెట్‌వర్క్ విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. కనీసం రాబోయే కేంద్ర ప్రభుత్వమైనా అన్యాయాన్ని సరిదిద్దుతుందని ఆశిస్తున్నాం. కేంద్రంలో రానున్నది ఖచ్చితంగా హంగ్ పార్లమెంటే. ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపోయే మెజార్టీ రాదు. టీఆర్‌ఎస్‌కు కచ్చితంగా 16 లోక్‌సభ స్థానాలు వస్తాయి. కేంద్ర పన్నుల్లో వాటా, అధికార వికేంద్రీకరణ ఫెడరల్ ఫ్రంట్ ప్రధాన అంశాలుగా ఉంటాయి’అని కేటీఆర్ తెలిపారు. దీంతో రాష్ట్రాలు బలోపేతమవుతాయని.. తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అత్యుత్తమ ఆర్థిక విధానాలతోనే దేశంలో ఉద్యోగిత, సంపద సష్టి జరుగుతుందని చెప్పారు. ఉత్తమ ఆర్థిక విధానాలే రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో ఉండాలని అన్నారు. ‘కేంద్రంలో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం అయినా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నాం. దీని కోసం మా ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు కొనసాగిస్తాం’అని ఆయన అన్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యతలు
కాళేశ్వరం ప్రాజెక్టు పంపుల ప్రారంభంపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్.. పాలమూరు ఎత్తిపోతల పథకంతో మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలతోపాటుగా.. నల్లగొండలోని కొన్ని ప్రాంతాల్లో సాగునీరు అందుతుందన్నారు. రెండోసారి కొలువుదీరిన తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం.. వైద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరచడం, విద్యాప్రమాణాలను పెంచడం, మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలిపారు. ‘సర్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించవచ్చు కదా? ఎందుకు ఓ సాధారణ వ్యక్తి ఏదన్నా సాయం కావాలంటే ట్విట్టర్‌లో మిమ్మల్ని సంప్రదించాల్సి వస్తోంది?’అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ... ట్విటర్ మరో సదుపాయం మాత్రమేనని మౌలిక సదుపాయాల మెరుగుపై నిరంతరం పనులు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌పై ఆసక్తి లేదు
2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలన్న నెటిజన్ల ప్రశ్నకు.. 2024 చాలా దూరంలో ఉందని కేటీఆర్ చమత్కరించారు. ఏపీ సీఎంగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సరిపోతాడా అన్న ప్రశ్నకు.. ఈ విషయం లో తన అభిప్రాయం ఏ మాత్రం అవసరంలేదని, దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. ఏపీ రాజకీయాలపై తనకు పెద్దగా ఆస క్తి లేదన్నారు. తమిళనాడులో టీఆర్‌ఎస్ పార్టీని విస్తరించాలని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇప్పటికే అక్కడ చాలామంది నాయకులు ఉన్నారన్నారని కేటీఆర్ అన్నారు.
మాటలతో ఇమేజ్ చెరిగిపోదు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బ్రాండ్ హైదరాబాద్‌కు సంబంధించిన ప్రచారం జరిగిందన్న విషయానికి స్పందిస్తూ.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కేవలం మాటలతో చెరిగిపోదని తెలిపారు. హైదరాబాద్ స్టార్టప్ ఎకో సిస్టమ్ కోసం ప్రభుత్వంవైపు నుంచి అవసరమైన సహాయ సహకారాలు కొనసాగిస్తామన్నారు. ఇమేజ్ టవర్స్, యానిమేషన్ ఇండస్ట్రీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం రూ.400 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం నిధులు విడుదల కావడంలేదని బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. రవాణా అనుసంధానతకు సంబంధించిన సమస్య అన్ని నగరాలకు ఎదురయ్యేదేనని.. హైదరాబాద్‌లో దీన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఎల్బీనగర్–నాగోలు మధ్య మెట్రో రైలు అనుసంధానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హైదరాబాద్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్యాచరణ ప్రణాళిక దశలో ఉందని అన్నారు. జవహర్‌నగర్ డంపింగ్‌కు సంబంధించి ట్యాపింగ్ పనులు జరుగుతున్నాయని.. మరికొంత పని పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. కంటోన్మెంట్ భూమిపై కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే స్కైవే పనులు జరుగుతాయని చెప్పారు.
- కఠిన పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారని ఓ నెటిజన్ కేటీఆర్‌ను అడగ్గా.. ‘ప్రశాంతంగా ఉండటం. బుద్ధిబలంతో వ్యవహరించడంతో’అని సమాధానమిచ్చారు.
- మున్సిపల్ కార్యాలయాల్లో లంచగొండితనాన్ని అరికట్టడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘నూతన మున్సిపల్ చట్టాన్ని తెచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు యత్నిస్తున్నాం’అని అన్నారు.
- ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’సినిమా చూశారా? మరో నెటిజన్ కేటీఆర్‌ను అడిగారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘లేదు సర్. నాకు అవెంజర్స్ గురించి ఏమీ తెలీదు’అన్నారు.
- ఇప్పటివరకు 100 ట్వీట్లు చేసినా, కేటీఆర్ ఒక్కసారీ స్పందించలేదని, ఇప్పడైనా స్పందించకపోతే నారా లోకేశ్ మీద ఒట్టు అని ఒక నెటిజన్ పోస్టు చేయగా.. మధ్యలో ఆయన (నారా లోకేశ్) ఏం చేశాడు బ్రదర్ అని కేటీఆర్ అన్నారు.
- ‘మతాలపై ప్రసంగాలు చేసేవారిని అరికట్టండి. దీని వల్ల మతఘర్షణలు, బాంబు పేలుళ్లు తగ్గుతాయని అనిపిస్తోంది’అని ఒక నెటిజన్ కోరగా.. దాని వల్ల ఉపయోగం ఉంటుందని నేననుకోను అని సమాధానమిచ్చారు.
- టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులందరూ సోషల్ మీడియాలో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తానని కేటీఆర్ అన్నారు. పలువురు మంత్రులు ట్విట్టర్‌లో అందుబాటులో ఉన్నారని చెప్పారు.
- ప్రధాని మోదీ, నటుడు అక్షయ్‌కుమార్ ముఖాముఖి కార్యక్రమంపై అభిప్రాయం చెప్పాలని ఓ నెటిజన్ అడిగారు. ‘ఈ కార్యక్రమాన్ని నేను చూడలేదు. కానీ.. అక్షయ్ వేసుకున్న గులాబీ రంగు ప్యాంట్ నచ్చింది’అని కేటీఆర్ అన్నారు. ‘కేఏ పాల్ గురించి ఒక్క మాట చెప్పండి’అని మరో నెటిజన్ కోరగా.. ‘ఆయన ప్రచార కార్యక్రమం చాలా వినోదాత్మకంగా ఉంద’ని కేటీఆర్ చెప్పారు.
గ్లోబరీనా అంటే తెలియదు?
‘మీరిప్పుడు ఏ శాఖకూ మంత్రి కాదు. అలాంటప్పుడు ఎందుకు ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల్లో తలదూరుస్తున్నారు. కొందరు కలెక్టర్లు ఏ మంచి పని చేసినా మిమ్మల్ని ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు? గ్లోబరీనా వివాదంలోనూ మీపేరు వినిపిస్తుంది? దీనిపై మీరేం చెప్పదలచుకున్నారు’అని ఓ నెటిజన్ కేటీఆర్‌ను ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘నన్ను ప్రజలు ఎంచుకున్నారు. ప్రజలకు ఏదన్నా సమస్య వస్తే అధికారులకు సూచించే హక్కు నాకుంటుంది. దీని వల్ల ఇప్పుడు మీకొచ్చిన సమస్యేంటి? ఇక గ్లోబరీనా విషయమంటారా.. ఇంటర్ ఫలితాలు వెల్లడిలో అవకతవకలు జరిగాయని తెలిసే వరకూ నాకు అసలు గ్లోబరీనా అంటే ఏంటో కూడా తెలియదు’అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment