సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ మేరకు మంగళవారం మంత్రి కేటీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది. ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నాం. అంబేడ్కర్‌తత్వాన్ని టీఆర్‌ఎస్ ఆచరణలో చూపింది. అంబేడ్కర్ లక్ష్యం సమానత్వం. ఆయన భాషా ఆధిపత్యం, ప్రాంతీయ ఆధిపత్యంతోపాటు అన్నిరకాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయనలా సమగ్రంగా సమాజాన్ని అర్థం చేసుకున్నవారు ఎవరూ లేరు. తాను రాసిన రాజ్యాంగం దుర్వినియోగమైతే దాన్ని తానే ముందుగా తగలబెడతానని అంబేడ్కర్ అన్నారు. దేవుడు కోసం గుడి కడితే... దెయ్యాలు ముందే వచ్చి కూర్చుంటే గుడిని ధ్వంసం చేయక తప్పదు. అంబేడ్కర్ కొన్ని కులాలు, వర్గాలకు మాత్రమే ప్రతినిధి కాదు. ఆయన మహాత్ముడితో సరిసమాన వ్యక్తి. అంబేడ్కర్ మహిళలకు కూడా సమాన హక్కులుండాలన్నారన్నారు. ఆ బిల్లు ఆమోదం పొందకపోవడంతో రాజీనామా చేశారన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక పార్లమెంట్. దానికి ఆ పేరు పెట్టడానికి ఇంతకు మించిన వ్యక్తి లేరు. అందుకే అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’అని ఆ తీర్మానంలో కోరారు.
ఏకగ్రీవ ఆమోదం
కాంగ్రెస్ సభాపక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. ఈ దేశంలో స్వేచ్ఛ లేదని, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడితే ఐటీ, ఈడీ దాడులతో భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ దేశ సంపద కొన్ని వర్గాలకు మాత్రమే అందుతోందన్నారు. ఈ దేశంలో సోదరభావం లేకుండా పోయిందని ఆరోపించారు. పార్లమెంట్‌కు అంబేడ్కర్ పేరు పెడితే.. ఈ దేశ నిర్మాణం సరిగ్గా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది. అనంతరం పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
జనవరిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
తమ తీర్మానానికి మద్దతు తెలిపిన భట్టి, ఇతర నేతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపితే బాగుండేదన్నారు. పంజగుట్టలో విగ్రహం ఏర్పాటు అంశంపై కేటీఆర్ స్పందిస్తూ... గతంలో విగ్రహాలు పెట్టిన విషయాన్ని తానేమీ కాదనడం లేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయినా ట్యాంక్‌బండ్ సమీపంలో 125 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నామని, ప్రస్తుతం విగ్రహ నిర్మాణం సాగుతోందన్నారు. జనవరిలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: ఆనాటి తారకరాముడి డైలాగ్‌తో అదరగొట్టిన కేటీఆర్.. అసెంబ్లీలో చప్పట్ల మోత!
Comments
Please login to add a commentAdd a comment