బూర్గుల గేట్ వద్ద నిర్వహించిన ఆందోళనలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
షాద్‌నగర్ టౌన్, రూరల్: కేంద్ర ప్రభుత్వం రైతుల నెత్తిన నల్ల చట్టాలను రుద్ది, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కర్షకులు తమ కడుపులు మాడ్చుకొని.. ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా ఢిల్లీలో వారం రోజులుగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. ఈ మూడు రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెనక్కితీసుకునే వరకు టీఆర్‌ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
రైతన్నల బాగు కోసం.. వారికి అండగా నిలవాలనే సంకల్పంతో భారత్ బంద్ విజయ వంతానికి సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారని చెప్పారు. భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మంగళ వారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండల పరిధిలోని బూర్గుల గేట్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. ఈ చట్టాల పర్యవసానాలపై రైతులకు అవగాహన కల్పించే విధంగా టీఆర్‌ఎస్ తర ఫున గ్రామ గ్రామాన కార్యక్రమాలు చేపడతామన్నారు. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమని, రాష్ట్రాల హక్కును హరించే విధంగా కేంద్రం వ్యవసాయ చట్టా లను చేయ డం సరికాదన్నారు. కేంద్రం బ్లాక్ మెయిలింగ్ రాజకీయా లకు పాల్పడుతోందని, వీటిని మానుకొని రైతుల సంక్షేమానికి పాటు పడాలని కేటీఆర్ హితవు పలికారు.
సన్నాల మద్దతు ధరకు కేంద్రమే అడ్డు
సన్నధాన్యానికి మద్దతు ధర ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా... కేంద్ర ప్రభుత్వం అడ్డుతగులుతోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రాలు మద్దతు ధర ఇస్తే కొనుగోళ్లను నిలిపివేస్తామని కేంద్రం నియంత్రణలో పనిచేసే ఎఫ్‌సీఐ స్పష్టంగా చెబుతోందన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నా కేంద్రం నిమ్మకు నీరె త్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. దేశంలోని కోట్లాది మంది రైతుల్లో 85 శాతం చిన్న, సన్నకారు రైతులేనని... వారికి కార్పొరేట్ శక్తులతో కొట్లాడే బలం లేదన్నారు. మార్కెట్ కమిటీలు రద్దు చేస్తామని కేంద్రం చెప్పడం సరికాదన్నా రు. రైతులు ఎక్కడైనా పంటలు అమ్ముకోవచ్చని కేంద్రం చెబుతోందని.. చిన్న, సన్నకారు రైతులు తమ పంటలను మరోచోటికి తరలించి అమ్ముకోవడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment