అవన్నీ అపోహలే | Inter board Comments On Inter Student Suicides | Sakshi
Sakshi News home page

అవన్నీ అపోహలే

Published Mon, May 6 2019 1:34 AM | Last Updated on Mon, May 6 2019 1:34 AM

Inter board Comments On Inter Student Suicides - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో తప్పులు వచ్చినందుకే 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. అలాగే ఒకరి మార్కులు ఇంకొకరికి వేశారన్న వాదనలోనూ నిజం లేదని తెలిపింది. సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ పకడ్బందీగా జరుగుతోందని, మూడు స్థాయిల్లో పరిశీలన తర్వాతే ఫలితాలను నిర్ధారిస్తామని పేర్కొంది. మూల్యాంకన ప్రక్రియలో సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు ఎలాంటి ప్రమేయం ఉండదని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటంపట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని, వారి ఆత్మహత్యలకు కారణాలేంటనే దానిపై లోతుగా విశ్లేషించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇంటర్‌ ఫలితాల వెల్లడిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు బోర్డు ఆదివారం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన సారాంశం ఇదీ... 

ప్రజలకు నిజాలు చెప్పదలిచాం... 
పరీక్షలు సరిగా రాయలేదని, ఫలితాల్లో తప్పులు వచ్చాయంటూ 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపట్ల అనేక వదంతులు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రజలకు నిజాలు చెప్పి వాటిని నిలువరించాలని భావిస్తున్నాం. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఫలితాల ప్రకటన ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు కేటాయించడం ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. హాల్‌టికెట్ల జంబ్లింగ్‌ ద్వారా పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు. పలు మాధ్యమాల్లో వస్తున్నట్లు పరీక్ష కేంద్రాలను మాన్యువల్‌గా కేటాయించామనడంలో నిజం లేదు. ఈ బా«ధ్యతలను ఓ సాఫ్ట్‌వేర్‌ ఏజెన్సీకి అప్పగించి పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్‌టికెట్ల పంపిణీ చేశాం. 

ఎగ్జామినర్ల ద్వారానే మూల్యాంకనం... 
పరీక్షల తర్వాత మూల్యాంకన ప్రక్రియ మార్చి 15 నుంచి ఏప్రిల్‌ మొదటి వారం వరకు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 12 స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాల్లో ఎగ్జామినర్ల ద్వారానే మూల్యాంకనం చేయించాం. బోధనలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండి, ప్రభుత్వ, రెసిడెన్షియల్, సంక్షేమ, ప్రైవేటు కళాశాలల అధ్యాపకులను ఎగ్జామినర్లుగా బోర్డు నియమించింది. మూల్యాంకన ప్రక్రియ అంతా బోర్డు ద్వారా జరిగింది తప్ప సాఫ్ట్‌వేర్‌ ఏజెన్సీలకు ఇందులో ఎలాంటి ప్రమేయం లేదు. సమాధాన పత్రాలకు అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన తర్వాత చీఫ్‌ ఎగ్జామినర్లు, సబ్జెక్టు నిపుణులు వాటిని ర్యాండమ్‌గా పరిశీలించారు.

అతితక్కువ, అతిఎక్కువ మార్కులు రావడంతోపాటు కొద్ది తేడాతో ఫెయిల్‌ మార్కులు వచ్చిన పేపర్లను కూడా పరిశీలించారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంపుల్లో బోర్డు నియమించిన స్క్రూటినైజర్లు కూడా అన్ని పేపర్లూ పరిశీలించారు. అంటే ఒక్కో పేపర్‌ను మూడు స్థాయిల్లో పరిశీలన జరిపించాం. అయితే 99 మార్కులు వచ్చిన విద్యార్థికి 0 మార్కులు వచ్చిన ఘటన ఈ ప్రక్రియలో జరగలేదు. ఇది కేవలం మానవ తప్పిదం మాత్రమే. మొత్తం 54 లక్షల స్క్రిప్టుల్లో తప్పు జరిగింది కేవలం ఒక్క పేపర్‌ విషయంలోనేనని అందరూ గమనించాలి. 

ఒకరి మార్కులు ఇంకొకరికి సాధ్యం కాదు... 
ఒకరికి వచ్చిన మార్కులు ఇంకొకరికి వేశారనే అపవాదు బోర్డుపై వచ్చింది. అయితే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మార్కులు బార్‌కోడ్‌కు లింక్‌ అయి ఉంటాయి. ఈ బార్‌కోడ్‌.. ఫలితాల ప్రకటన సమయంలో హాల్‌టికెట్‌ నంబర్‌కు లింక్‌ అవుతుంది. దీన్ని అనేకసార్లు పరిశీలించాం. సక్రమంగా ఉందని గుర్తించాం. ఈ ఆరోపణలో ఎలాంటి నిజం లేదు. ఫలితాల్లో గందరగోళం తర్వాత కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ బాధ్యతలను మళ్లీ అదే సాఫ్ట్‌వేర్‌ సంస్థకు ఇచ్చామనే ఆరోపణ కూడా ఉంది. కానీ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌లో భాగస్వాములయ్యేది ఎగ్జామినర్లు, చీఫ్‌ ఎగ్జామినర్లే. ఇందులో సాఫ్ట్‌వేర్‌ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే ఈ ప్రక్రియ అనంతరం ఫలితాల ప్రాసెసింగ్‌లో సాఫ్ట్‌వేర్‌ సంస్థ పాత్ర ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్‌ ఫలితాలపై నియమించిన త్రిసభ్య కమిటీ కూడా ఫలితాల ప్రాసెసింగ్‌ను ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌ సంస్థతోపాటు మరో స్వతంత్ర సంస్థతో కూడా చేయించాలని, ఈ రెండు సంస్థలు చేసిన ఫలితాలు సరిపోలాకే ఫలితాలు విడుదల చేయాలని సూచించింది. అందుకే ఇప్పుడు టెండర్‌ ద్వారా డేటాటెక్‌ మెథడెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే స్వతంత్ర సంస్థను టీఎస్‌టీఎస్‌ ఎంపిక చేసింది. 

ఈ నెల 10కల్లా ఫలితాలు... 
హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ సూచనల ప్రకారం రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ ప్రక్రియ నడుస్తోంది. ఈ ప్రక్రియను పూర్తి చేసి మే 10కల్లా ఫలితాలు ప్రకటిస్తాం. ప్రకటించిన ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థుల సమాధాన పత్రాలను 15 రోజులపాటు డౌన్‌లోడ్‌ చేసుకునే వీలు కూడా కల్పిస్తాం. ఫలితాల ప్రకటనలో పారదర్శకంగా వ్యవహరించి ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా చేస్తామని ప్రజానీకానికి బోర్డు తెలియజేస్తోంది. మీడియా, ప్రజలు, పౌరసమాజం కూడా వాస్తవాలను ప్రజలకు తెలియజేసి వదంతులకు అవకాశం లేకుండా మాకు సహకరించాలని కోరుతున్నాం.

ఆ విద్యార్థుల జవాబు పత్రాలను ప్రత్యేకంగా పరిశీలించాం... 
ఫలితాల్లో నెలకొన్న గందరగోళం వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయన్న ఆరోపణల్లో నిజం లేదు. ఫలితాలు వచ్చిన ఒక్క రోజులోపే జరిగిన పొరపాట్లన్నింటినీ సవరించాం. చనిపోయిన విద్యార్థుల సమాధాన పత్రాలను ప్రత్యేకంగా పరిశీలన జరిపించాం. సబ్జెక్టు నిపుణులతో క్షుణ్ణంగా పరిశీలన చేయించాక కూడా ఏ ఒక్క విద్యార్థికీ ఫెయిల్‌ మార్కుల నుంచి పాస్‌ అయ్యే మార్కులు రీ వెరిఫికేషన్‌లో రాలేదు. చనిపోయిన వారిలో 14 మంది ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. ఒక్క విద్యార్థి మాత్రం 85 శాతం మార్కులతో ఏ గ్రేడ్‌లో పాసైనా చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుల గురించి నిపుణుల కమిటీ చేత లోతుగా విశ్లేషణ జరిపించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాం. ఇప్పటికే చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు బాధలో ఉన్నందున వారి సమాధాన పత్రాలను బయటకు వెల్లడించట్లేదు. అయితే అకాడమిక్‌గా ఉపయోగించుకునేందుకు లేదా ఈ మరణాలపై అధ్యయనం చేసేందుకు ఎవరికైనా ఆసక్తి ఉంటే బోర్డుకు తెలియజేసి వారి సమాధాన పత్రాలను పొందొచ్చు. 

సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌లో తప్పు వల్లే...
మూల్యాంకన ప్రక్రియ తర్వాత ఓఎంఆర్‌ షీట్‌లోని పార్ట్‌–3 ద్వారా బోర్డుకు మార్కుల సమాచారం అందుతుంది. దీన్ని మాత్రమే సాఫ్ట్‌వేర్‌ రీడ్‌ చేస్తుంది. ఇక్కడి నుంచే మళ్లీ సాఫ్ట్‌వేర్‌ పాత్ర ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ ప్రతి 15 పేపర్ల బండిల్‌లో ఏవైనా తప్పులుంటే మళ్లీ గుర్తిస్తుంది. ఈ తప్పులను కూడా గుర్తించాక ఓఎంఆర్‌ షీట్లను స్కాన్‌ చేసి ఫలితాలు ప్రచురించాం. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌లో తప్పు జరిగిన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్ష రాసినా ఆబ్సెంట్‌గా వచ్చింది. పరీక్ష కేంద్రాల కేటాయింపులో జరిగిన సాఫ్ట్‌వేర్‌ తప్పిదం కారణంగా కొందరు విద్యార్థులకు వారు చదువుతున్న కళాశాలనే పరీక్ష కేం ద్రంగా కేటాయించారు. ఈ తప్పిదాన్ని ఫిబ్రవరి చివరి వారంలో గుర్తించి వారికి వేరే కళాశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించి బఫర్‌ బార్‌కోడ్‌ నంబర్‌ ఆధారంగా పరీక్షలు రాయించాం.

ఈ క్రమంలో ఆయా విద్యార్థులకు వచ్చిన మార్కుల సమాచారం బఫర్‌కోడ్‌ ఆధారంగా కొత్త పరీక్ష కేంద్రం నుంచి వచ్చింది. అలాగే పాత కేంద్రాల్లో ఆ విద్యార్థులు హాజరు కాకపోవడంతో ఆబ్సెంట్‌ అని వచ్చింది. ఈ తప్పిదాన్ని ఫలితాలు ప్రకటించిన గంటలోపే గుర్తించాం. అయితే అప్పటికే ఫలితాల సీడీలు ప్రైవేటు ఏజెన్సీ, వెబ్‌సైట్‌లకు వెళ్లిపోవడంతో సరిచేయలేకపోయాం. దీంతో గందరగోళం నెలకొంది. దీంతో ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఆ విద్యార్థులకు సంబంధించిన సరైన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement