inter student suicides
-
ఇంటర్ ఫెయిలైన వారికి ‘ఆన్ డిమాండ్ పరీక్ష’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ‘ప్రత్యేక ఆన్ డిమాండ్ పరీక్ష’ను నిర్వహించనున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్ బోర్డు నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అదనంగా ఈ పరీక్షలను రాసే వీలును విద్యార్థులకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన వారిలో 3 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, అందులో 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో లక్షల మంది విద్యార్థులు భవిష్యత్ దృష్ట్యా తాము మొదటిసారి తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని ఎన్ఐవోఎస్ ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. ఈ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఇందులో విద్యార్థులు తాము ఉత్తీర్ణులైన 2 సబ్జెక్టుల మార్కులను బదిలీ చేసుకొని (ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్), 3 సబ్జెక్టుల పరీక్షలు రాయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ పరీక్షల ఫలితాలను నెల రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొంది. విద్యార్థులు పరీక్షలు రాసిన 3 సబ్జెక్టులు పాస్ అయ్యాక మొత్తం 5 సబ్జెక్టుల మార్కులతో మార్కుల షీట్ ఇస్తామని వివరించింది. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తమ www.nios.ac.in, https://sdmis.nios.ac.in వెబ్సైట్లలో సందర్శించాలని తెలిపింది. రిజిస్ట్రేషన్‌లో విద్యార్థులు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయం 040–24752859, 24750712 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వివరించింది. -
గ్లోబరీనా వల్లే సమస్యలు
సాక్షి, హైదరాబాద్: గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వల్లే ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో పొరపాట్లు చోటు చేసుకున్నాయని, ఆ సంస్థ వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీంతో ఆ సంస్థను కూడా తమ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చా లని అభ్యర్థిస్తూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు బుధవారం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2.15కు ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాది దామోదర్‌రెడ్డి హైకోర్టును కోరారు. అది సాధ్యం కాదని స్పష్టం చేసిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం, విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఇదే వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలతో కలిపి ఇంప్లీడ్ పిటిషన్‌పై ఆ రోజున విచారణ జరుపుతామంది. ఇంటర్ పత్రాల మూల్యాంకనం సక్రమంగా జరగకపోవడం వల్లే విద్యా ర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించడంతోపాటు, బాధ్యులైన అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అచ్యుతరావు ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమ ముందుంచాలం టూ విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఇందులో భాగంగా బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అచ్యుతరావు తరఫు న్యాయవాది గ్లోబరీనా సంస్థను ప్రతివాదిగా చేరుస్తూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలుకు అనుమతి కోరారు. అనుమతినిచ్చిన ధర్మాసనం అత్యవసర విచారణకు నిరాకరించింది. ప్రభుత్వ కమిటీ అదే తేల్చింది.. గ్లోబరీనా నిర్లక్ష్యం వల్లే ఇంటర్ పత్రాల మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చిందని అచ్యుతరావు తన ఇంప్లీడ్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇంటర్ పత్రాల మూల్యాంకన కాంట్రాక్ట్‌ను గ్లోబరీనా రూ.4.35 కోట్లకు దక్కించుకుందన్నారు. అయితే ఈ ఒప్పందంపై ఏ సంతకాలు లేవని ప్రభుత్వ కమిటీ తేల్చిందని వివరించారు. పెరిగిన అవసరా లకు అనుగుణంగా తగిన సాంకేతిక, మానవ వనరులు గ్లోబరీనా వద్ద లేవన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో కూడా లోపాలున్నాయని, దీనిపై అనేక మంది ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. అంతిమంగా అటు బోర్డు, ఇటు గ్లోబరీనా సంస్థల నిర్వాకం వల్ల 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశించాలని కోరారు. -
ప్రాణాలు తీస్తున్న ఒత్తిడి, పోలిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మార్కుల భూతం మరో విద్యార్థిని బలితీసుకుంది. 20 రోజుల కిందట ఇంటర్లో తనకు వచ్చిన మార్కులు చూసుకొని కలత చెంది పురుగుల మందు తాగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మానస (17) అనే టీనేజర్ మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఇప్పటివరకూ చనిపోయిన ఇంటర్ విద్యార్థుల సంఖ్య 24 వరకు చేరిందని సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ ఏడాదిలోనూ ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడలేదు. ఐదేళ్లలో ఒకసారి కూడా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు రెండంకెలు దాటిన దాఖలాలూ లేవు. కానీ ఈసారి ఏకంగా 24 మంది విద్యార్థులు కేవలం ఇంటర్లో ఫెయిలయ్యామన్న కారణంతో ప్రాణాలు తీసుకోవడం వారి తల్లిదండ్రులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఒత్తిడి, పోలికే ప్రధాన కారణాలు.. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో ఇంటర్, ఆ తర్వాత ఇంజనీరింగ్ మాత్రమే చదవాలన్న ధోరణి అధికం. ఎంసెట్, జేఈఈ, నీట్ అంటూ రకరకాల ఎంట్రన్స్‌లు రాస్తూ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలని అనుకుంటారు. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా తల్లిదండ్రులు, సమాజం వారిని ఇంజనీరింగ్ వైపు నడిపిస్తున్నారు. ర్యాంకుల కోసం బలవంతంగా రోజుకు 18 గంటలపాటు చదివించే అనుమతి లేని కార్పొరేట్ హాస్టళ్లలో ఉంచుతున్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవు తున్నారు. పోటీ ప్రపంచంలో కొట్టుకుపోతూ 90% మార్కులు సాధించినా రోజుల తరబడి విలపించేంతగా మానసికంగా కుంగిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం పక్కవారితో తమను తాము పోల్చుకోవడం, తల్లిదండ్రులు కూడా ఇతర విద్యార్థులతో పోల్చి వారిని కించపరచడం. ఇవి చాలవన్నట్లు కుటుంబంలో, కాలేజీల్లో ఉన్న ఒత్తిడితో పిల్లలు ఫెయిలవడాన్ని తీవ్ర అవమానంగా భావిస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. రైతులు, మహిళల తరువాత విద్యార్థులే.. దేశంలో జరిగే ఆత్మహత్యల్లో రైతులు, మహిళలు తొలి రెండు స్థానాల్లో ఉండగా మూడోస్థానం విద్యార్థులదేనని గణాంకాలు చెబుతున్నాయి. 2016లో నేషనల్ క్రైమ్‌బ్యూరో రికార్డ్స్ (ఎన్సీఆర్బీ) ప్రకారం దేశంలో 1,34,000 మందికిపైగా భారతీయులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 15 నుంచి 39 ఏళ్లలోపు వారే అధికం. వారిలో రైతులు, మహిళల తరువాత విద్యార్థులే నిలవడం గమనార్హం. ఏటేటా పెరుగుతున్న ఆత్మహత్యలు... పోలీసుల గణాంకాల ప్రకారం తెలంగాణలో ఇప్పటివరకు 42 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో 18 మంది బాలురు కాగా, 24 మంది బాలికలు కావడం గమనార్హం. ఏటేటా ఈ సంఖ్య పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్క ఈ ఏడాదిలోనే ఏప్రిల్ 24 వరకు 15 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ సంఖ్య 24 దాటిందని సమాచారం. గత ఐదేళ్లలో 50 మందికిపైగా ఇంటర్ విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలించారు. కాలేజీల్లో కౌన్సెలర్లు ఎక్కడ? ప్రతి ఇంటర్ కాలేజీలోనూ విద్యార్థుల మానసిక పరిస్థితిని గమనించేందుకు కౌన్సెలర్ ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఎక్కడా ఈ నిబంధనను పట్టించుకున్న దాఖలాలు లేవు. తక్కువ మార్కులు వచ్చిన లేదా ఇంటి బెంగ, ఇష్టంలేని కోర్సు చదువుతున్న విద్యార్థులను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల మానసిక పరిస్థితిపై తల్లిదండ్రులకు వివరించాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటి నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఒత్తిడి సరికాదు ఏ విద్యార్థినీ ఇతరులతో పోల్చడం సరికాదు. ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ దాగి ఉంటుంది. గానం, సంగీతం, క్రీడలు ఇవన్నీ ప్రతి భారంగాలే కదా! వాటిని వదిలి అందరినీ ఇంజనీర్లు, డాక్టర్లు కావాలంటూ ఒత్తిడి చేయడం సబబుకాదు. పిల్లలపై ఇలా ఒత్తిడి తీసుకురావడంతో తీవ్ర అవమాన భారంతో కుంగిపోతున్నారు. అలాంటి వారికి తల్లిదండ్రులు బాసటగా నిలిచి ధైర్యం చెప్పాలి. వారు అభిరుచి ఉన్న రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. – స్వాతి లక్రా, ఐజీ, విమెన్స్ ప్రొటెక్షన్ వింగ్ -
ప్రభుత్వ వైఫల్యంవల్లే అవకతవకలు
హైదరాబాద్: ‘అందరూ చదువుకుంటే బాగుపడతారు అనుకుంటే, ప్రస్తుతం చదువు లేకున్నా మా బిడ్డ బతికేది అనుకునే స్థాయికి పరిస్థితి వచ్చింద’ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లోని అవకతవకలు ప్రభుత్వ వైఫల్యంవల్లే జరిగాయని, ఓ పనికిమాలిన సంస్థకు కాంట్రాక్టు ఇచ్చి పిల్లల జీవితాలతో ఆడుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘విద్యార్థుల ఆత్మహత్యలు – ప్రభుత్వ హత్యలు, వ్యవస్థల విధ్వంసం’అనే అంశంపై సోమవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోదండరామ్ మాట్లాడుతూ .. ఇంటర్మీడియట్ ఫలితాల్లోని అవకతవకలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇప్పుడు ఇంటర్‌బోర్డు తమ తప్పులేదని, విద్యార్థులే సరిగ్గా చదవలేదని నెపం వారి మీదకు నెట్టేందుకు చూస్తోందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో విద్యార్థి కుటుంబ సభ్యులను తాము స్వయంగా కలిశామని, 10వ తరగతిలో 9.2 మార్కులు సాధించిన వారు ఇంటర్లో ఒక సబ్జెక్ట్‌లో ఎలా ఉత్తీర్ణులు కాలేరో వివరించాలన్నారు.వ్యవస్థను ప్రభుత్వం సరిగ్గా వాడుకోవడంలేదని, నిబంధనలు, మార్గదర్శకాలు, పద్ధతి అనేది లేకుండా పోయిందన్నారు. మనం పాత రాచరిక పాలన నుంచి బయటపడ్డాము రాజ్యాంగ పరమైన పాలనలో ఉన్నామని ప్రభుత్వానికి గుర్తుచేయాల్సి వస్తోందన్నారు. గతంలో స్వపరిపాలన కోసం ఉద్యమం చేశామనీ, ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పాలనకోసం పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. గతంలో ఓ రైలు ప్రమాదం జరిగి 100 మంది మరణిస్తే నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కేంద్రమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని, ఇప్పుడు 23 మంది పిల్లల ఆత్మహత్యకు కారణమైన మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఇప్పటివరకు ఎందుకు బర్తరఫ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ విద్యావేత్త సమక్షంలో అన్ని పేపర్లను మరోమారు దిద్దించాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘ జాతీయ నేత ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ వైఫల్యంపై.. హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని అన్ని పార్టీలు కోరుతున్నా ప్రభుత్వం ఎందుకు జరిపించడంలేదో అర్థం కావడంలేదన్నారు. దోపిడీ, అణచివేతకు వ్యతి రేకంగా సామాజిక తెలంగాణ కోసం మరోమారు ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. చనిపోయిన 23 మం ది విద్యార్థులవి ప్రభుత్వ హత్యలే అని పేర్కొన్నారు. నిర్ణయాలివీ.. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ప్రకటించారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబీకులకు 2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి. ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపాలి, సీబీఐచే విచారణ జరిపించాలి. ‘గ్లోబరీనా’సంస్థ వెనక గల మూలాలు, సంబంధాలు, అవకతవకలపై విచారణ జరిపించాలి. కార్పొరేట్ విద్యా వ్యవస్థను అంతమొందించాలి వంటి తీర్మానాలను అఖిలపక్షం చేసినట్లు తెలిపారు. 13నుంచి చైతన్య సభలు ఈ నెల 13 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో చైతన్య సభలు, 25న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, 27న వేలాదిమందితో ధర్నాచౌక్ వద్ద నిరసన , జూన్ మొదటివారంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కాశీనాథ్, సీపీఐ నేతలు బాల మల్లేశ్, పాండు రంగాచారి, వివిధ పార్టీల, సంఘాల నాయకులు నాగుల శ్రీనివాస్ యాదవ్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. -
11వ తేదీన నిరసన దీక్ష
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల గందరగోళానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష నిర్వహిస్తున్నట్టు అఖిలపక్ష నేతలు ప్రకటించారు. ఇంటర్ ఫలితాల వెల్లడిలో అనేక అవకతవకలు బయటపడి 18 రోజులు గడిచినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదని, వీటిని ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ఆదివారం మఖ్దూంభవన్‌లో జరిగిన సమావేశంలో ఇంటర్ పరీక్షల వ్యవహారంపై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించిన అనంతరం చాడ వెంకటరెడ్డి (సీపీఐ), ఎం.కోదండరాం (టీజేఎస్), రావుల చంద్రశేఖరరెడ్డి (టీడీపీ), ఎం.ఆర్.జి.వినోద్‌రెడ్డి (కాంగ్రెస్) విలేకరులతో మాట్లాడారు. అన్ని జవాబు పత్రాలను సమీక్షించి, అవసరమైతే పునఃమూల్యాంకనం చేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, తప్పిదాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ప్రధానమైన ఐదు డిమాండ్లపై 11న దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అఖిలపక్ష నేతలని అరెస్ట్‌లు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. బాధిత విద్యార్థుల కుటుంబాలతో కలిసి 11న చేపడుతున్న నిరసన దీక్షలో అందరూ పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని, బోర్డు తప్పిదాలకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్‌లో ఏమాత్రం చలనం లేదని రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. గతంలో రూ.74 లక్షలకే టెండరిచ్చి ఈ ఏడాది మాత్రం దానిని రూ.4.34 కోట్లకు పెంచి గ్లోబరీనాకు ఎవరు అప్పగించారనే దానిపై విచారణ జరిపించాలని వినోద్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాము చేయని తప్పులకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. -
అవన్నీ అపోహలే
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తప్పులు వచ్చినందుకే 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అలాగే ఒకరి మార్కులు ఇంకొకరికి వేశారన్న వాదనలోనూ నిజం లేదని తెలిపింది. సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ పకడ్బందీగా జరుగుతోందని, మూడు స్థాయిల్లో పరిశీలన తర్వాతే ఫలితాలను నిర్ధారిస్తామని పేర్కొంది. మూల్యాంకన ప్రక్రియలో సాఫ్ట్వేర్ సంస్థలకు ఎలాంటి ప్రమేయం ఉండదని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటంపట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని, వారి ఆత్మహత్యలకు కారణాలేంటనే దానిపై లోతుగా విశ్లేషించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇంటర్ ఫలితాల వెల్లడిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు బోర్డు ఆదివారం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన సారాంశం ఇదీ... ప్రజలకు నిజాలు చెప్పదలిచాం... పరీక్షలు సరిగా రాయలేదని, ఫలితాల్లో తప్పులు వచ్చాయంటూ 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపట్ల అనేక వదంతులు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రజలకు నిజాలు చెప్పి వాటిని నిలువరించాలని భావిస్తున్నాం. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఫలితాల ప్రకటన ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు కేటాయించడం ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. హాల్‌టికెట్ల జంబ్లింగ్ ద్వారా పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు. పలు మాధ్యమాల్లో వస్తున్నట్లు పరీక్ష కేంద్రాలను మాన్యువల్‌గా కేటాయించామనడంలో నిజం లేదు. ఈ బా«ధ్యతలను ఓ సాఫ్ట్వేర్ ఏజెన్సీకి అప్పగించి పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్‌టికెట్ల పంపిణీ చేశాం. ఎగ్జామినర్ల ద్వారానే మూల్యాంకనం... పరీక్షల తర్వాత మూల్యాంకన ప్రక్రియ మార్చి 15 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 12 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో ఎగ్జామినర్ల ద్వారానే మూల్యాంకనం చేయించాం. బోధనలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండి, ప్రభుత్వ, రెసిడెన్షియల్, సంక్షేమ, ప్రైవేటు కళాశాలల అధ్యాపకులను ఎగ్జామినర్లుగా బోర్డు నియమించింది. మూల్యాంకన ప్రక్రియ అంతా బోర్డు ద్వారా జరిగింది తప్ప సాఫ్ట్వేర్ ఏజెన్సీలకు ఇందులో ఎలాంటి ప్రమేయం లేదు. సమాధాన పత్రాలకు అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన తర్వాత చీఫ్ ఎగ్జామినర్లు, సబ్జెక్టు నిపుణులు వాటిని ర్యాండమ్‌గా పరిశీలించారు. అతితక్కువ, అతిఎక్కువ మార్కులు రావడంతోపాటు కొద్ది తేడాతో ఫెయిల్ మార్కులు వచ్చిన పేపర్లను కూడా పరిశీలించారు. స్పాట్ వాల్యుయేషన్ క్యాంపుల్లో బోర్డు నియమించిన స్క్రూటినైజర్లు కూడా అన్ని పేపర్లూ పరిశీలించారు. అంటే ఒక్కో పేపర్‌ను మూడు స్థాయిల్లో పరిశీలన జరిపించాం. అయితే 99 మార్కులు వచ్చిన విద్యార్థికి 0 మార్కులు వచ్చిన ఘటన ఈ ప్రక్రియలో జరగలేదు. ఇది కేవలం మానవ తప్పిదం మాత్రమే. మొత్తం 54 లక్షల స్క్రిప్టుల్లో తప్పు జరిగింది కేవలం ఒక్క పేపర్ విషయంలోనేనని అందరూ గమనించాలి. ఒకరి మార్కులు ఇంకొకరికి సాధ్యం కాదు... ఒకరికి వచ్చిన మార్కులు ఇంకొకరికి వేశారనే అపవాదు బోర్డుపై వచ్చింది. అయితే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మార్కులు బార్‌కోడ్‌కు లింక్ అయి ఉంటాయి. ఈ బార్కోడ్.. ఫలితాల ప్రకటన సమయంలో హాల్‌టికెట్ నంబర్‌కు లింక్ అవుతుంది. దీన్ని అనేకసార్లు పరిశీలించాం. సక్రమంగా ఉందని గుర్తించాం. ఈ ఆరోపణలో ఎలాంటి నిజం లేదు. ఫలితాల్లో గందరగోళం తర్వాత కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ బాధ్యతలను మళ్లీ అదే సాఫ్ట్వేర్ సంస్థకు ఇచ్చామనే ఆరోపణ కూడా ఉంది. కానీ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌లో భాగస్వాములయ్యేది ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లే. ఇందులో సాఫ్ట్వేర్ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే ఈ ప్రక్రియ అనంతరం ఫలితాల ప్రాసెసింగ్‌లో సాఫ్ట్వేర్ సంస్థ పాత్ర ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాలపై నియమించిన త్రిసభ్య కమిటీ కూడా ఫలితాల ప్రాసెసింగ్‌ను ప్రస్తుత సాఫ్ట్వేర్ సంస్థతోపాటు మరో స్వతంత్ర సంస్థతో కూడా చేయించాలని, ఈ రెండు సంస్థలు చేసిన ఫలితాలు సరిపోలాకే ఫలితాలు విడుదల చేయాలని సూచించింది. అందుకే ఇప్పుడు టెండర్ ద్వారా డేటాటెక్ మెథడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్వతంత్ర సంస్థను టీఎస్టీఎస్ ఎంపిక చేసింది. ఈ నెల 10కల్లా ఫలితాలు... హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ సూచనల ప్రకారం రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఈ ప్రక్రియను పూర్తి చేసి మే 10కల్లా ఫలితాలు ప్రకటిస్తాం. ప్రకటించిన ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థుల సమాధాన పత్రాలను 15 రోజులపాటు డౌన్లోడ్ చేసుకునే వీలు కూడా కల్పిస్తాం. ఫలితాల ప్రకటనలో పారదర్శకంగా వ్యవహరించి ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా చేస్తామని ప్రజానీకానికి బోర్డు తెలియజేస్తోంది. మీడియా, ప్రజలు, పౌరసమాజం కూడా వాస్తవాలను ప్రజలకు తెలియజేసి వదంతులకు అవకాశం లేకుండా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఆ విద్యార్థుల జవాబు పత్రాలను ప్రత్యేకంగా పరిశీలించాం... ఫలితాల్లో నెలకొన్న గందరగోళం వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయన్న ఆరోపణల్లో నిజం లేదు. ఫలితాలు వచ్చిన ఒక్క రోజులోపే జరిగిన పొరపాట్లన్నింటినీ సవరించాం. చనిపోయిన విద్యార్థుల సమాధాన పత్రాలను ప్రత్యేకంగా పరిశీలన జరిపించాం. సబ్జెక్టు నిపుణులతో క్షుణ్ణంగా పరిశీలన చేయించాక కూడా ఏ ఒక్క విద్యార్థికీ ఫెయిల్ మార్కుల నుంచి పాస్ అయ్యే మార్కులు రీ వెరిఫికేషన్‌లో రాలేదు. చనిపోయిన వారిలో 14 మంది ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. ఒక్క విద్యార్థి మాత్రం 85 శాతం మార్కులతో ఏ గ్రేడ్‌లో పాసైనా చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుల గురించి నిపుణుల కమిటీ చేత లోతుగా విశ్లేషణ జరిపించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాం. ఇప్పటికే చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు బాధలో ఉన్నందున వారి సమాధాన పత్రాలను బయటకు వెల్లడించట్లేదు. అయితే అకాడమిక్‌గా ఉపయోగించుకునేందుకు లేదా ఈ మరణాలపై అధ్యయనం చేసేందుకు ఎవరికైనా ఆసక్తి ఉంటే బోర్డుకు తెలియజేసి వారి సమాధాన పత్రాలను పొందొచ్చు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్‌లో తప్పు వల్లే... మూల్యాంకన ప్రక్రియ తర్వాత ఓఎంఆర్ షీట్‌లోని పార్ట్–3 ద్వారా బోర్డుకు మార్కుల సమాచారం అందుతుంది. దీన్ని మాత్రమే సాఫ్ట్వేర్ రీడ్ చేస్తుంది. ఇక్కడి నుంచే మళ్లీ సాఫ్ట్వేర్ పాత్ర ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ప్రతి 15 పేపర్ల బండిల్లో ఏవైనా తప్పులుంటే మళ్లీ గుర్తిస్తుంది. ఈ తప్పులను కూడా గుర్తించాక ఓఎంఆర్ షీట్లను స్కాన్ చేసి ఫలితాలు ప్రచురించాం. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్‌లో తప్పు జరిగిన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్ష రాసినా ఆబ్సెంట్గా వచ్చింది. పరీక్ష కేంద్రాల కేటాయింపులో జరిగిన సాఫ్ట్వేర్ తప్పిదం కారణంగా కొందరు విద్యార్థులకు వారు చదువుతున్న కళాశాలనే పరీక్ష కేం ద్రంగా కేటాయించారు. ఈ తప్పిదాన్ని ఫిబ్రవరి చివరి వారంలో గుర్తించి వారికి వేరే కళాశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించి బఫర్ బార్కోడ్ నంబర్ ఆధారంగా పరీక్షలు రాయించాం. ఈ క్రమంలో ఆయా విద్యార్థులకు వచ్చిన మార్కుల సమాచారం బఫర్కోడ్ ఆధారంగా కొత్త పరీక్ష కేంద్రం నుంచి వచ్చింది. అలాగే పాత కేంద్రాల్లో ఆ విద్యార్థులు హాజరు కాకపోవడంతో ఆబ్సెంట్ అని వచ్చింది. ఈ తప్పిదాన్ని ఫలితాలు ప్రకటించిన గంటలోపే గుర్తించాం. అయితే అప్పటికే ఫలితాల సీడీలు ప్రైవేటు ఏజెన్సీ, వెబ్సైట్లకు వెళ్లిపోవడంతో సరిచేయలేకపోయాం. దీంతో గందరగోళం నెలకొంది. దీంతో ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో ఆ విద్యార్థులకు సంబంధించిన సరైన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చాం. -
కన్నవాళ్ల ముందే ప్రాణాలొదిలాడు
హైదరాబాద్: ఐఐటీ చదవాలని ఆ యువకుడు కలలు కన్నాడు. ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలనుకున్నాడు. దీని కోసం కష్టపడి చదివి జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష రాశాడు. సోమవారం విడుదలైన జేఈఈ ఫలితాల్లో అర్హత సాధించలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఏం చెప్పాలని తనలో తానే మదనపడ్డాడు. ఇక ఇంటర్ (సీబీఎస్ఈ)లో గత ఏడాది మిగిలిపోయిన రెండు సబెక్టుల్లోనైనా పాసవుతానో? లేదో? అన్న ఆందోళన అతన్ని మానసికంగా మరింత వేదనకు గురిచేసింది. దీంతో తల్లిదండ్రులు నిద్రపోయిన తరువాత అర్ధరాత్రి డబుల్ బారెల్ గన్‌తో నుదుటిపై కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు సోహెల్ (19). కొన్ని గంటల ముందు తమతోనే ఉన్న కొడుకు కళ్ల ముందే విగతజీవిగా మారడం చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. నేరేడ్మెట్ ఠాణా పరిధిలోని బాలాజీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 1.30 గంటలకు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సీఐ నర్సింహ్మస్వామి వివరాలను మీడియాకు వెల్లడించారు. హరియాణాకు చెందిన మహరుద్దీన్ ఆర్మీలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. బాలాజీ కాలనీలో భార్య సరోజ్బాల, చిన్న కొడుకు సోహెల్‌తో కలసి ఉంటున్నారు. మరో ఇద్దరు కొడుకుల్లో.. ఆసిఫ్ పోచారంలోని ప్రైవేట్ బ్యాంకులో, సమీర్ ఒడిశాలో ఉద్యోగం చేస్తున్నారు. సోహెల్ తిరుమలగిరిలోని కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ (సీబీఎస్ఈ) చదివాడు. గత ఏడాది తప్పిన రెండు సబ్జెక్టుల్లో పాసు కావడానికి ప్రైవేట్‌గా ఈసారి పరీక్షలు రాశాడు. ఆ ఫలితాలు వచ్చే నెల విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సోహెల్ ఐఐటీ చదవడానికి ప్రణాళికలు వేసుకున్నాడు. దీని కోసం కోచింగ్ తీసుకుని జేఈ ఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యాడు. సోమవారం వచ్చిన జేఈఈ ఫలితాల్లో తాను అర్హత సాధించలేదని గుర్తించాడు. ఇక రానున్న ఇంటర్ ఫలితాలపై బెంగ పెట్టుకున్నాడు. రాత్రి 1.30కి పెద్ద శబ్దం... సుమారు రాత్రి 1.30 గంటలకు పెద్దగా తుపాకీ పేలిన శబ్దం. సోహెల్ తన నుదుటిపై పాయింట్ బ్లాక్‌లో డబుల్‌బారెల్ గన్‌తో కాల్చుకున్నాడు. ఈ శబ్దంతో గదిలో నిద్రపోతున్న మహరుద్దీన్, సరోజ్బాల ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు కూడా మేల్కొన్నారు. మహరుద్దీన్, సరోజ్బాల వెంటనే కొడుకు గదిలోకి వెళ్లి చూడగా సోహెల్ రక్తపు మడుగులో గిలగిలకొట్టుకోవడం కనిపించింది. కొడుకును ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. కొడుకును కాపాడాలని తల్లిదండ్రులు కొద్దిసేపు తల్లడిల్లినా ప్రయోజనం లేకపోయింది. ఇంట్లోంచి కేకలు వినపడటంతో స్థానికులు లోపలికి వెళ్లారు. కళ్ల ముందు కొడుకు గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలు వీడటం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. 100 డయల్ చేసి సమాచారం ఇవ్వడంతో సీఐ నర్సింహ్మస్వామి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీం ఆధారాల సేకరణ... క్లూస్ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. గన్‌పై వేలిముద్రలను సేకరించి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహ్మస్వామి తెలిపారు. రాత్రి జరిగిందిది... సోమవారం రాత్రి 10 గంటలకు భోజనం చేయడానికి తల్లిదండ్రులు పిలిస్తే రాలేదు. ఏం జరిగిందని తల్లిదండ్రులు అతనితో మాట్లాడారు. బాగా చదివినా పాస్ అవుతానో లేదోనన్న ఆందోళనగా ఉందని సోహెల్ వారికి బాధను వ్యక్తం చేశాడు. అతని పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు ఓదార్చారు. ఫలితాల గురించి ఆలోచించి బాధపడొద్దని ధైర్యం చెప్పి.. 10.30 గంటలకు అతనితో భోజనం చేయించారు. అనంతరం తల్లిదండ్రులు తమ గదిలో నిద్రపోయారు. సోహెల్ తన గదిలోకి వెళ్లాడు. ‘‘ చిన్నవాడు కావడంతో సోహెల్‌పై మాకు ›ప్రేమ ఎక్కువ. ఇద్దరు అన్నల్లాగా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతాడనుకున్నాం. కానీ ప్రాణాలు తీసుకొని మాకు కడుపుకోత మిగుల్చుతాడని అనుకోలేదు. – మహరుద్దీన్, సరోజ్బాల -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఉరవకొండ : ఇంటర్లో ఫెయిలైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మైలారం పల్లి గ్రామానికి చెందిన రైతుకూలీ శ్రీనివాసులు కుమార్తె జయశ్రీ(17) పామిడిలోని తన అవ్వ వద్ద ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ హెచ్ఈసీ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె ఫెయిల్ అయ్యింది. మనస్థాపానికి గురైన జయశ్రీ సోమవారం మైలారంపల్లిలోని తన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఊరేసుకుంది. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.