కన్నవాళ్ల ముందే ప్రాణాలొదిలాడు | Inter Student killed himself by gunshot | Sakshi
Sakshi News home page

కన్నవాళ్ల ముందే ప్రాణాలొదిలాడు

Published Wed, May 1 2019 2:19 AM | Last Updated on Wed, May 1 2019 2:19 AM

Inter Student killed himself by gunshot - Sakshi

కొడుకు మృతితో రోదిస్తు్తన్న తల్లిదండ్రులు, సోహెల్‌(ఫైల్‌)

హైదరాబాద్‌: ఐఐటీ చదవాలని ఆ యువకుడు కలలు కన్నాడు. ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలనుకున్నాడు. దీని కోసం కష్టపడి చదివి జేఈఈ మెయిన్స్‌ ప్రవేశ పరీక్ష రాశాడు. సోమవారం విడుదలైన జేఈఈ ఫలితాల్లో అర్హత సాధించలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఏం చెప్పాలని తనలో తానే మదనపడ్డాడు. ఇక ఇంటర్‌ (సీబీఎస్‌ఈ)లో గత ఏడాది మిగిలిపోయిన రెండు సబెక్టుల్లోనైనా పాసవుతానో? లేదో? అన్న ఆందోళన అతన్ని మానసికంగా మరింత వేదనకు గురిచేసింది. దీంతో తల్లిదండ్రులు నిద్రపోయిన తరువాత అర్ధరాత్రి డబుల్‌ బారెల్‌ గన్‌తో నుదుటిపై కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు సోహెల్‌ (19). కొన్ని గంటల ముందు తమతోనే ఉన్న కొడుకు కళ్ల ముందే విగతజీవిగా మారడం చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు.

నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలోని బాలాజీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 1.30 గంటలకు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సీఐ నర్సింహ్మస్వామి వివరాలను మీడియాకు వెల్లడించారు. హరియాణాకు చెందిన మహరుద్దీన్‌ ఆర్మీలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. బాలాజీ కాలనీలో భార్య సరోజ్‌బాల, చిన్న కొడుకు సోహెల్‌తో కలసి ఉంటున్నారు. మరో ఇద్దరు కొడుకుల్లో.. ఆసిఫ్‌ పోచారంలోని ప్రైవేట్‌ బ్యాంకులో, సమీర్‌ ఒడిశాలో ఉద్యోగం చేస్తున్నారు. సోహెల్‌ తిరుమలగిరిలోని కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్‌ (సీబీఎస్‌ఈ) చదివాడు. గత ఏడాది తప్పిన రెండు సబ్జెక్టుల్లో పాసు కావడానికి ప్రైవేట్‌గా ఈసారి పరీక్షలు రాశాడు. ఆ ఫలితాలు వచ్చే నెల విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సోహెల్‌ ఐఐటీ చదవడానికి ప్రణాళికలు వేసుకున్నాడు. దీని కోసం కోచింగ్‌ తీసుకుని జేఈ ఈ మెయిన్స్‌ ప్రవేశ పరీక్షకు హాజరయ్యాడు. సోమవారం వచ్చిన జేఈఈ ఫలితాల్లో తాను అర్హత సాధించలేదని గుర్తించాడు. ఇక రానున్న ఇంటర్‌ ఫలితాలపై బెంగ పెట్టుకున్నాడు. 

రాత్రి 1.30కి పెద్ద శబ్దం... 
సుమారు రాత్రి 1.30 గంటలకు పెద్దగా తుపాకీ పేలిన శబ్దం. సోహెల్‌ తన నుదుటిపై పాయింట్‌ బ్లాక్‌లో డబుల్‌బారెల్‌ గన్‌తో కాల్చుకున్నాడు. ఈ శబ్దంతో గదిలో నిద్రపోతున్న మహరుద్దీన్, సరోజ్‌బాల ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు కూడా మేల్కొన్నారు. మహరుద్దీన్, సరోజ్‌బాల వెంటనే కొడుకు గదిలోకి వెళ్లి చూడగా సోహెల్‌ రక్తపు మడుగులో గిలగిలకొట్టుకోవడం కనిపించింది. కొడుకును ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. కొడుకును కాపాడాలని తల్లిదండ్రులు కొద్దిసేపు తల్లడిల్లినా ప్రయోజనం లేకపోయింది. ఇంట్లోంచి కేకలు వినపడటంతో స్థానికులు లోపలికి వెళ్లారు. కళ్ల ముందు కొడుకు గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలు వీడటం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. 100 డయల్‌ చేసి సమాచారం ఇవ్వడంతో సీఐ నర్సింహ్మస్వామి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. 

క్లూస్‌ టీం ఆధారాల సేకరణ... 
క్లూస్‌ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. గన్‌పై వేలిముద్రలను సేకరించి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహ్మస్వామి తెలిపారు.

రాత్రి జరిగిందిది...
సోమవారం రాత్రి 10 గంటలకు భోజనం చేయడానికి తల్లిదండ్రులు పిలిస్తే రాలేదు. ఏం జరిగిందని తల్లిదండ్రులు అతనితో మాట్లాడారు. బాగా చదివినా పాస్‌ అవుతానో లేదోనన్న ఆందోళనగా ఉందని సోహెల్‌ వారికి బాధను వ్యక్తం చేశాడు. అతని పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు ఓదార్చారు. ఫలితాల గురించి ఆలోచించి బాధపడొద్దని ధైర్యం చెప్పి.. 10.30 గంటలకు అతనితో భోజనం చేయించారు. అనంతరం తల్లిదండ్రులు తమ గదిలో నిద్రపోయారు. సోహెల్‌ తన గదిలోకి వెళ్లాడు.

‘‘ చిన్నవాడు కావడంతో సోహెల్‌పై మాకు ›ప్రేమ ఎక్కువ. ఇద్దరు అన్నల్లాగా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతాడనుకున్నాం. కానీ ప్రాణాలు తీసుకొని మాకు కడుపుకోత మిగుల్చుతాడని అనుకోలేదు.
    – మహరుద్దీన్, సరోజ్‌బాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement