సమావేశంలో మాట్లాడుతున్న కోదండరాం. చిత్రంలో ఆర్.కృష్ణయ్య తదితరులు
హైదరాబాద్: ‘అందరూ చదువుకుంటే బాగుపడతారు అనుకుంటే, ప్రస్తుతం చదువు లేకున్నా మా బిడ్డ బతికేది అనుకునే స్థాయికి పరిస్థితి వచ్చింద’ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లోని అవకతవకలు ప్రభుత్వ వైఫల్యంవల్లే జరిగాయని, ఓ పనికిమాలిన సంస్థకు కాంట్రాక్టు ఇచ్చి పిల్లల జీవితాలతో ఆడుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘విద్యార్థుల ఆత్మహత్యలు – ప్రభుత్వ హత్యలు, వ్యవస్థల విధ్వంసం’అనే అంశంపై సోమవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోదండరామ్ మాట్లాడుతూ .. ఇంటర్మీడియట్ ఫలితాల్లోని అవకతవకలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇప్పుడు ఇంటర్‌బోర్డు తమ తప్పులేదని, విద్యార్థులే సరిగ్గా చదవలేదని నెపం వారి మీదకు నెట్టేందుకు చూస్తోందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో విద్యార్థి కుటుంబ సభ్యులను తాము స్వయంగా కలిశామని, 10వ తరగతిలో 9.2 మార్కులు సాధించిన వారు ఇంటర్‌లో ఒక సబ్జెక్ట్‌లో ఎలా ఉత్తీర్ణులు కాలేరో వివరించాలన్నారు.వ్యవస్థను ప్రభుత్వం సరిగ్గా వాడుకోవడంలేదని, నిబంధనలు, మార్గదర్శకాలు, పద్ధతి అనేది లేకుండా పోయిందన్నారు.
మనం పాత రాచరిక పాలన నుంచి బయటపడ్డాము రాజ్యాంగ పరమైన పాలనలో ఉన్నామని ప్రభుత్వానికి గుర్తుచేయాల్సి వస్తోందన్నారు. గతంలో స్వపరిపాలన కోసం ఉద్యమం చేశామనీ, ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పాలనకోసం పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. గతంలో ఓ రైలు ప్రమాదం జరిగి 100 మంది మరణిస్తే నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కేంద్రమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని, ఇప్పుడు 23 మంది పిల్లల ఆత్మహత్యకు కారణమైన మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఇప్పటివరకు ఎందుకు బర్తరఫ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ విద్యావేత్త సమక్షంలో అన్ని పేపర్లను మరోమారు దిద్దించాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘ జాతీయ నేత ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ వైఫల్యంపై.. హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని అన్ని పార్టీలు కోరుతున్నా ప్రభుత్వం ఎందుకు జరిపించడంలేదో అర్థం కావడంలేదన్నారు. దోపిడీ, అణచివేతకు వ్యతి రేకంగా సామాజిక తెలంగాణ కోసం మరోమారు ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. చనిపోయిన 23 మం ది విద్యార్థులవి ప్రభుత్వ హత్యలే అని పేర్కొన్నారు.
నిర్ణయాలివీ..
ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ప్రకటించారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబీకులకు 2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి. ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపాలి, సీబీఐచే విచారణ జరిపించాలి. ‘గ్లోబరీనా’సంస్థ వెనక గల మూలాలు, సంబంధాలు, అవకతవకలపై విచారణ జరిపించాలి. కార్పొరేట్ విద్యా వ్యవస్థను అంతమొందించాలి వంటి తీర్మానాలను అఖిలపక్షం చేసినట్లు తెలిపారు.
13నుంచి చైతన్య సభలు
ఈ నెల 13 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో చైతన్య సభలు, 25న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, 27న వేలాదిమందితో ధర్నాచౌక్ వద్ద నిరసన , జూన్ మొదటివారంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కాశీనాథ్, సీపీఐ నేతలు బాల మల్లేశ్, పాండు రంగాచారి, వివిధ పార్టీల, సంఘాల నాయకులు నాగుల శ్రీనివాస్ యాదవ్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment