
బుధవారం ఐ.ఎస్.సి. ఇంటర్ ఫలితాలు వచ్చాయి. బెంగళూరులో టాపర్స్‌గా నిలిచిన ముగ్గురూ తమ కాలేజీల్లో సాంస్కృతిక కార్యకలాపాలలో చురుగ్గా ఉన్నారు. చదువు మిస్ కాలేదు. అలాగే ఉల్లాసాన్నిచ్చే కళలను కూడా! ‘మాకు కళలే చదువులో రిలాక్స్ అయ్యేలా చేశాయి’ అని వారు అన్నారు. తల్లిదండ్రులూ, విద్యార్థులూ ఈ విషయాన్ని వింటారా మరి? క్రీడలూ, కళలు చదువును చెడగొట్టవని! ఈ సెలవుల్లో అయినా వాటిని నేర్చుకుందామని!
పూర్వం స్కూళ్లల్లో పాతజోకు ఉండేది.
స్టూడెంటు ‘హోమ్‌వర్క్ చేయడం మర్చిపోయాను సార్’ అని అంటే ‘అన్నం తినడం మర్చిపోలేదు కదా. ఇదెలా మర్చిపోయావు‘ అని బెత్తంతో ఒక్కటి వేసేవాడు సారు.
స్టూడెంట్స్‌కు అన్నం తినడానికి, నిద్ర పోవడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి తప్పక సమయం ఉంటుంది. అలాగే ఇష్టమైన ఆసక్తి నెరవేర్చుకోవడానికి కూడా టైమ్ ఉంటుంది. ఇవన్నీ చేసి బ్రహ్మాండం గా చదవగలరు పిల్లలు. గతంలో అలా చదివి, ఇంకా చె΄్పాలంటే ఏ సౌకర్యాలు లేకపోయినా కరెంటు స్తంభాల వెలుతురులో చదివి గొప్ప విద్యార్థులు అయిన వారు ఉన్నారు. తల్లిదండ్రులకు అది తెలుసు.
అయితే తల్లిదండ్రులు ఆ సంగతి మర్చిపోయారు.
కొడుకులు, కూతుళ్లు నేడు అన్ని సౌకర్యాలతో ఉన్నా ఫ్యాను, లైటు, స్కూల్ బస్సు, టిఫిన్ బాక్స్, మంచి స్కూలు ఉన్నా కేవలం చదువుకు మాత్రమే అంకితమైతే తప్ప గొప్ప మార్కులు తెచ్చుకోలేరని భావిస్తున్నారు. పుస్తకం ముందేసుకుని ఉంటేనే ర్యాంకులు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో కాసేపు చదివినా మంచి మార్కులే వచ్చేవి. కాని ఇప్పటి విద్యార్థులు స్కూలు/కాలేజీ మొదలైన రోజు నుంచే చదువుతున్నారు. అంటే వారు ఎంత లేదన్నా పరీక్ష బాగా రాస్తారు. అయినా సరే వారికి ఆట వద్దు, పాట వద్దు, సినిమా వద్దు, బంధువులు వద్దు అనడం వల్ల పిల్లలను ఐసొలేట్ చేయడమా కాదా అని తల్లిదండ్రులు ఆలోచించాలి.
ఇదిగోండి ఉదాహరణ
‘ది కౌన్సిల్ ఫర్ ది స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్’ (సి.ఐ.ఎస్.సి.ఇ.) బోర్డ్ వారు ఇంటర్ విద్యార్థులకు నిర్వహించే ‘స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్’ (ఐ.ఎస్.సి) రిజల్ట్స్ బుధవారం వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ రిజల్ట్స్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులు రేయింబవళ్లు చదువుకే అంకితమైన వారు కాదు. ముఖ్యంగా బెంగళూరుకు టాపర్లు ఆటకూ పాటకూ చోటిచ్చి ఈ మార్కులు తెచ్చుకున్నారు. వీరిలో శామ్యూల్ పింటోకు 96 పర్సెంట్ వచ్చింది. బెంగళూరు కోరమండల లోని బెతాని స్కూల్‌లో ఇంటర్ చదివిన పింటో ‘నేను స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్‌కి సెక్రటరీని.
అంతేకాదు వ్యక్తిగతంగా పాము విషానికి విరుగుడు మందు విషయంలో నాదైన పరిశోధన చేస్తున్నాను. ఈ రెంటికీ సమయం ఇచ్చినా స్కూల్ చదువును టైమ్‌టేబుల్ ప్రకారం చదువుకున్నాను. నేను భవిష్యత్తులో యాంటీ వీనమ్ టెక్నాలజీలో పని చేస్తాను’ అన్నాడు. హ్యుమానిటీస్‌లో టాపర్‌గా వచ్చిన నటాలీ కూడా అదే స్కూల్‌లో చదివి 98.2 పర్సెంట్ తెచ్చుకుంది. నేను నా పదో ఏట నుంచి సింగర్‌గా, డాన్సర్‌గా, యాక్టర్‌గా కృషి చేస్తున్నాను. అవి నా చదువుకు అడ్డు కాలేదు. చదువుకు సమయం తప్పకుండా కేటాయించి చదివాను’ అంది.
ఐ.సి.ఎస్ ఎగ్జామ్స్‌లో కామర్స్‌లో టాపర్‌గా నిలిచిన సాన్నిధ్య బెంగళూరు గ్రీన్‌వుడ్ స్కూల్ విద్యార్థిని. 98.75 పర్సెంట్ తెచ్చుకుంది. ‘కథక్ నా స్ట్రెస్ బస్టర్. బాడ్‌మింటన్ ఆడతాను. ఈ రెంటికీ 3 గంటల సమయం ఇచ్చి మిగిలింది చదువుకు ఇస్తాను’ అని చెప్పింది. ఇప్పుడు చెప్పండి తల్లిదండ్రులూ... అన్ని సౌకర్యాలు ఇచ్చి పిల్లలను చదివిస్తున్న మీరు వారికి ఆట పాటలు ఆసక్తులు ఇవ్వలేరా? బడి జరుగుతున్నప్పుడు సరే. కనీసం ఈ వేసవి సెలవుల్లో అయినా. సెలవులను ఆనందాలుగా చేసి వారి దోసిళ్లలో పోయండి. – కె.
ఈ పుస్తకం చదవండి
కొందరు తమకు రెక్కలున్నాయనే గుర్తించరు. మరికొందరు రెక్కలున్నది ఇంతవరకు ఎగిరేందుకే అనుకుంటారు. కాని ప్రయత్నం చేయాలి... ఉన్నదానిని పెంచి సాధించుకోవాలి అని పట్టుపడ్డ సముద్ర పక్షి కథే ‘జోనాథన్ లివింగ్‌స్టన్ సీగల్’. జోనాథన్ అనే పేరున్న సీగల్ మన కాకిస్థాయి పక్షి. ఎక్కువ ఎత్తు ఎగరలేదు. 500 అడుగుల ఎత్తులోపే ఎగరగలదు. ఎగిరినా ఆహార అన్వేషణ కోసమే. కాని జోనాథన్‌కు ‘నాకు రెక్కలున్నాయి. గద్దలాగా మరింత ఎత్తుకు ఎందుకు ఎగరకూడదు’ అనిపిస్తుంది. అలాంటి ఆలోచనకే భయపడే సీగల్స్ మధ్య 5000 అడుగుల ఎత్తుకు ఎగిరి చరిత్ర సృష్టిస్తాడు జోనాథన్ రిచర్డ్ బాక్ రాసిన ఈ చిన్న నవలకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. పిల్లలు తప్పక చదవాలి. తాము కేవలం ర్యాంకులు తెచ్చుకోవడానికే పుట్టలేదు... వాటితో పాటు అనేక పనులు చేయగలం... సాధించగలం... అనే ఆత్మవిశ్వాసం పొందుతారు.