Cultural Activities
-
గుంటూరులో అంగరంగ వైభవంగా నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాలు
'భాషే రమ్యం.. సేవే గమ్యం' అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా గుంటూరు నగరంలో జానపద, సాంస్కృతిక సంబరాలను ఘనంగా నిర్వహించింది. నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాల్లో వందల మంది జానపద కళాకారులు, కవులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నగరంలో జానపద కళాకారుల ప్రదర్శనలతో ర్యాలీ నిర్వహించారు. డప్పు కళాకారుల నృత్యం, ఉత్తరాంధ్ర తప్పెటగుళ్లు, మహిళల కోలాటం కోలాహలం మధ్య పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ఈ ర్యాలీ సాగింది. ఆ తర్వాత విజ్ఞాన మందిరంలో కళాకారుల ప్రదర్శనలు అద్భుతంగా జరిగాయి. గాయకుల పాటలు, డప్పు కళకారుల ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెలుగు భాష గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలు సాగాయి. తెలంగాణ ప్రజా గాయకుడు చింతల యాదగిరి పాడిన పాట ఈ చిట్టి చేతులు పాట అందరిని విశేషంగా ఆకట్టుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, గుంటూరు, కృష్ణాజిల్లాల నుండి జానపద, గిరిజన కళాకారులు సాంప్రదాయ వేషధారణలతో ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, కళారూపాలు బుర్రకథలు, ఆహుతులను మైమరిపించాయి. కిక్కిరిసిన జనసందోహంతో విజ్ఞాన మందిరం నిండిపోయింది. కళాకారుల ప్రదర్శనకు ప్రేక్షకుల హర్షధ్వానాలతో విజ్ఞాన మందిరం మారుమ్రోగింది. షేక్ బాబుజి, ప్రజా నాట్యమండలి పీవీ రమణ, రంగం రాజేష్ లు తమ బృందంతో ఆలపించిన సామాజిక చైతన్య గీతాలు అలరించాయి.తెలుగు భాష పరిరక్షణ కోసమే మా కృషి: నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి మేం అమెరికాలో ఉంటున్నా మా మనస్సంతా ఇక్కడ ఉంటుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి అన్నారు. మన తెలుగు భాష పరిరక్షణ కోసం నాట్స్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. దానిలో భాగంగానే నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తుందని తెలిపారు. తెలుగు కళలను, కవులను ప్రోత్సాహించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అమెరికాలో నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ఏర్పాటు చేసి ఇక్కడ కవులు, కళకారులను అక్కడ తెలుగువారికి కూడా పరిచయం చేస్తున్నామని.. వారి గొప్పదనాన్ని వివరిస్తున్నామని బాపు నూతి తెలిపారు. తెలుగు భాష తరతరాలకు తరగని వెలుగులా ఉండాలనేదే తమ ఆశయమని తెలిపారు. తెలుగు కళాకారులు మన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని బాపు అన్నారు. కళకారులు చేసిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ జానపద సంబరాల నిర్వహణలో శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు కీలకపాత్ర పోషించారని తెలిపారు. గురువుకు గౌరవం దక్కిన సమాజం ఎంతో ఉన్నతంగా ఎదుగుతుందని.. అందుకే ఉత్తమ ఉపాధ్యాయులను ఈ సంబరాల్లో గౌరవిస్తూ వారికి పురస్కారాలు అందించామని బాపు నూతి అన్నారు. నాట్స్ అటు అమెరికాలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వందలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించిందని తెలిపారు. విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. బడుల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయడం.... మహిళా సాధికారత కోసం ఉచితంగా మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించడం.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేసిందని వివరించారు. నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన మహిళలు స్వశక్తితో నిలబడేలా వారికి కావాల్సిన చేయూత నాట్స్ అందించిందన్నారు. నాట్స్ అంటే సేవ.. సేవ అంటే నాట్స్ అనే రీతిలో తమ కార్యక్రమాలు ఉంటాయని బాపు నూతి అన్నారు. అమెరికాలో తెలుగువారికి అండ నాట్స్: సత్య శ్రీరామినేనితెలుగువారికి అమెరికాలో ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా నిలుస్తుందని డల్లాస్ నాట్స్ నాయకుడు సత్య శ్రీరామినేని అన్నారు. విద్యార్ధులు అమెరికాకు వచ్చేటప్పుడు యూనివర్సీటీల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే రావాలన్నారు. అమెరికాలో బోగస్ యూనివర్సీటీల వల్ల నష్టపోయిన తెలుగు విద్యార్ధులకు తాము అండగా నిలిచిన విషయాన్ని శ్రీరామినేని గుర్తు చేశారు. అందుకే నాట్స్ విద్యార్ధులకు అమెరికాలో చదువుల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతుందన్నారు. నాట్స్ సేవా కార్యక్రమాలు అమోఘం: ఎమ్మెల్సీ లక్ష్మణరావునాట్స్ సేవా కార్యక్రమాలు అమోఘమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న పేదలకు ఏ సాయం చేయాలన్నా నాట్స్ ముందుంటుందనే విషయం నాట్స్ సేవా కార్యక్రమాలనే నిరూపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి సేవా కార్యక్రమాల్లో చూపిస్తున్న చొరవ మాలాంటి వారికి కూడా స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో నిలబడేలా వారికి ఆర్థిక సహకారం, నల్లమల అడవుల్లో గిరిజన మహిళల సాధికారత కోసం నాట్స్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. విద్యార్ధులకు ఉపకారవేతనాలు, ఉపాధ్యాయులకు ప్రోత్సాహించేలా పురస్కారాలు అందిస్తున్న నాట్స్ కు లక్ష్మణరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయులకు, కళకారులకు సన్మానంజానపద, సాంస్కృతిక సంబరాల్లో భాగంగా కవులకు, కళకారులకు నాట్స్ పురస్కారాలు అందించింది. వారిని సన్మానించింది. అలాగే పలు జిల్లాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరున్న వారిని ఆహ్వానించి వారిని సంబరాల వేదికపై సత్కరించింది. ఇంకా ఈ సంబరాల్లో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, కన్నా మాస్టారు, పాటిబండ్ల విష్ణు, కృష్ట్నేశ్వరరావు, కార్యక్రమం సమన్వయ కర్త కాకుమాను నాగేశ్వరరావు, సుబ్బారాయుడు, దాసరి రమేష్, దాసరి సుబ్బారావు, సరిమల్ల చౌదరి, షేక్ బాషా, భగవాన్ దాస్, లక్ష్మణరావు, కిరణ్, గుర్రం వీర రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. (చదవండి: శ్రీశైలంలో మహిళలకు నాట్స్ ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ) -
ఉత్సాహ తరంగం.. రాక్ అండ్ రోల్ అంటూ చిందేస్తూ (ఫొటోలు)
-
‘ఆద్యకళ’కు ఆయువునివ్వండి
సాక్షి, హైదరాబాద్: వందల ఏళ్ల నాటి సాంస్కృతిక మూలాలను ఆవిష్కరించిన పరిశోధన..ఆదివాసీ, గిరిజన కళాత్మకతకు సమున్నతమైన ఆవిష్కరణ..ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆద్యకళాకృతుల ప్రదర్శన. ఆదికాలం కళారూపాలను భవిష్యత్ తరాలకు అందజేసేందుకు, ఆద్యకళను కాపాడేందుకు నాలుగున్నర దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు. సుమారు 2,000 ఆద్యకళాకృతులతో జూలై నుంచి ఆగస్టు చివరి వరకు జరిగిన ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది. ఈ ప్రదర్శన తెలంగాణ సృజనాత్మకతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటింది. అయితే ఈ కళాసంపద ఇప్పుడు ప్రమాదంలో పడింది. దానిని కాపాడి జాతీయ, అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసేందుకు ప్రభుత్వం, సమాజం ముందుకు రావాలని ఆద్యకళకు ఆయువునివ్వాలని కోరుతున్నారు జయధీర్ తిరుమలరావు. ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... అవి సామూహిక వ్యక్తీకరణలు ప్రకృతిలోని వివిధ రకాల వస్తువుల నుంచి ఉత్పన్నమయ్యే శబ్దాన్ని ఒడిసిపట్టుకొని సంగీత పరికరాలను సృష్టించారు. మృత జంతువుల చర్మాలతో ఆదివాసీలు రూపొందించిన వాయిద్య పరికరాలు గొప్ప సంగీతాన్ని సృష్టించాయి. కోయ గిరిజనులు వేసే ‘పగిడె’పటాలు ఆది మానవుడి కాలం నాటి గుహచిత్రాలను తలపిస్తాయి. మట్టి ఫలకాలు, కుండలు, కర్రలపై చెక్కుకున్న అక్షరాలు తర్వాతర్వాత అనేక రకాలుగా పరిణామం చెందాయి. ఓజోలు అనే గిరిజన సమూహం తయారు చేసిన డోక్రా హస్త కళావస్తువులు గొప్ప ప్రతిభకు తార్కాణం. పొనికి చెట్టు కలప నుంచి అద్భుతమైన బొమ్మలు తయారు చేశారు. ఇవన్నీ సామూహిక వ్యక్తీకరణలు. ఆద్యకళకు ప్రతిరూపాలు. 1974లో ఎం.ఎ. పూర్తైన తొలిరోజుల్లో పరిశోధన ప్రారంభించాను. క్షేత్రస్థాయిలో పర్యటించాను. ప్రజలు రూపొందించుకున్న కళల చారిత్రక, సాంస్కృతిక మూలాలను ఆవిష్కరించేందుకు ప్రయత్నించాను. రెండువేల ఆద్యకళారూపాల సేకరణ ఆదివాసీ, గిరిజన కళల్లో గొప్ప ప్రతిభ ఉంది. నాలుగున్నర దశాబ్దాలకు పైగా అన్ని వర్గాల జీవన సమూహాలతో కలసి పనిచేశాను. వారి కళలను, కళా నైపుణ్యాలను, కళా పరికరాలను తయారు చేసే విధానాన్ని దగ్గర నుంచి చూశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు 2,000 కళాకృతులకు, కళాఖండాలను సేకరించాను. వాటన్నింటిని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మంత్రులు, ప్రముఖులు సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఆ సాంస్కృతిక, కళా వారసత్వ సంపదను కాపాడుకుంటూ వచ్చాను. ఈ కళాసంపదను భవిష్యత్తరాలకు అందజేసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజమే చొరవ చూపాలి. మ్యూజియం ఏర్పాటు చేయాలి ఆద్యకళను కాపాడేందుకు ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం అందుకోసం ఒకభవనాన్ని ప్రత్యేకంగా కేటాయించాలి. తద్వారా తెలంగాణ ప్రజల సాంస్కృతిక, వైవిధ్యభరితమైన కళాత్మక జీవితాన్ని జాతీయ, అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుంది. అంతరించిపోతున్న ఆద్యకళలను కాపాడుకోలేకపోతే చారిత్రక తప్పిదమవుతుంది. -
ఆషాఢ ఎడబాటు వెనుక.. ఆచారం.. ఆంతర్యం ఇవే..
సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్): ఆషాఢాన్ని శూన్య మాసంగా భావిస్తారు. శుభకార్యాలు చేయకూడదని పెద్దలు విశ్వసిస్తారు. నిజానికి పెద్ద పండుగల రాకను ఈ మాసం తెలుపుతుంది. కొత్త దంపతులకు ఆషాఢం విరహ మాసం. ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన అనివార్యమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన తరుణం. చూసుకోవడానికి కూడా వీల్లేకుండా కఠిన నిబంధనలు.. కలుసుకుంటే కలిగే దుష్పరిణామాల గురించి ఎన్నో అనుమానాలు. మారిపోయిన ప్రస్తుత కాలంలో నెల రోజుల ఎడబాటు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త దంపతుల ఎడబాటు అనివార్యం అనే సంప్రదాయం సడలింపు దిశగా సాగిపోతోంది. ఫార్మాలిటీ కోసం ఓ 5 రోజులపాటు పుట్టింటికి వెళ్లి వస్తే చాలు అనే భావన కొందరు వెలిబుచ్చుతున్నారు. పెద్దల నియమం కూడా మంచికే అనుకునే వాళ్లూ ఉన్నారు. అయితే ఎడబాటు కూడా మంచికే అన్నది పెద్దల నిశ్చితాభిప్రాయం. ఆచారం.. ఆంతర్యం ఇవే.. ఆషాఢ మాసం నవ దంపతులను దూరంగా ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల ప్రారంభం నుంచి కొత్త కోడలు అత్తగారి ముఖం చూడకూడదు. అలాగే కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదు అనే ఆచారం తరతరాలుగా వస్తోంది. కోడలు, అత్త ఒకరినొకరు చూసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమీ లేవు. మృగశిర నుంచి మొదలయ్యే చినుకుల ఆగమనం.. క్రమంగా ఆషాఢ మాసం ప్రవేశించే సరికి సమృద్ధిగా వర్షాకాలం అవుతుంది. సాగు ప్రధాన వృత్తిగా ఉన్న మెజార్టీ కుటుంబాల్లో ఇంటిల్లిపాది అదే పనుల్లో తలమునకలవుతారు. దీంతో కొత్త అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చేయలేకపోతారు. పని ఆధారిత ప్రాంతాల్లో చేసే వృత్తిని కాదని మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇవ్వరు. అందుకే ఈ నెలలో కొత్త అల్లుడు ఇంటికి రాకుండా ఉంటే సాగు పనులు నిరాటంకంగా సాగిపోతాయనే ఉద్దేశంతో ఈ నియమం విధించారు. వ్యవసాయాధారిత కుటుంబాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని అనుసరిస్తున్నారు. సంప్రదాయం వెనక శాస్త్రీయత నవ దంపతులు ఆషాఢ మాసంలో విడిగా ఉండాలనే నియమం పూర్వం నుంచి కొనసాగుతూ వస్తోంది. కొత్తగా పెళ్లయిన దంపతులు ఆరు నెలలపాటు అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. శ్రమించే సమయంలో అత్తగారింట్లో కూర్చుని ఉంటే జరగాల్సిన పనులు నిలిచిపోతాయి. నవ దంపతులు ఒకే గూటిలో ఉండటం అంత మంచిది కాదంటారు. ఈ సమయంలో గర్భధారణ జరగడం తల్లీబిడ్డలకు అంత క్షేమం కాదు. ఆషా«ఢ మాసంలో కురిసే వర్షాలు, వరదల కారణంగా జలాశయాలు, పరిసరాల్లోని నీళ్లు కలుషితం అవుతాయి. ఈ నీటి వినియోగం అనారోగ్యాలకు కారణమవుతుంది. చలిజ్వరాలు, విరేచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. చీడపీడలు జనించే సమయంలో అనారోగ్య రోజులు, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్ర వచనం. ప్రత్యామ్నాయాలు బోలెడు ఎడబాటు కొత్త జంటకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలు ఆ భావనను దూరం చేస్తున్నాయి. సెల్‌ఫోన్ వచ్చాక మనుషుల మధ్య మానసికంగా దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఎస్ఎంఎస్లు, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పర సందేశాల ఎలాగూ మార్చుకునే సౌకర్యం ఉండనే ఉంది. దూరంగా ఉండటమే శ్రేయస్కరం ఆషాఢ మాసంలో విడిగా ఉండటం శ్రేయస్కరమే. ఈ సమయంలో గర్భధారణ జరిగితే ప్రసవం వచ్చే ఎండాకాలంలో అవుతుంది. అధిక ఉష్ణోగ్రతల సమయంలో శిశువు జన్మిస్తే బాహ్య పరిసరాలను భరించడం కష్టమవుతుంది. ఆషాఢ మాసంతోపాటు పూజలు, నోముల పేరుతో శ్రావణంలో ఎడబాటు కొనసాగిస్తే సంతానోత్పత్తి› సమయాన్ని జూలై, ఆగస్టు వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. సుఖ ప్రసవానికి అనువుగా ఉంటుంది. – డాక్టర్ గీతావాణి, గైనకాలజిస్టు వివాహ బంధం బలోపేతం ఆషాఢ మాసం కొత్త దంపతుల మధ్య అనురాగాన్ని చిగురింపజేస్తుంది. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు, ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ చూసి నిర్ధారించిన వివాహాల్లో ఈ నియమం చాలా బాగా పని చేస్తుంది. ఆషాఢ మాసంతో పరస్పర అభిప్రాయాలను పంచుకునే వీలు కలుగుతుంది. తద్వారా వివాహ బంధం బలోపేతం అవుతుంది. – బోయిని గౌతమ్, హారిక సంప్రదాయాన్ని పాటిస్తున్నాం పెద్దవాళ్లు ఏ నియమం పెట్టినా అది పిల్లల మంచి కోసమే. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటించడం వల్ల సమస్యేమీ లేదు. పైగా ఇప్పుడు సెల్‌ఫోన్ లాంటి సాంకేతిక పరికరాలు మనుషులను కలిపే ఉంచుతున్నాయి. పెద్దవాళ్లు వి«ధించిన నియమ నిబంధనలు శాస్త్రీయ కోణంలోనే చూడకుండా, ఆరోగ్యం దృష్ట్యా పాటిస్తే మేలు కలుగుతుంది. అందుకే మేము ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. – గూడెల్లి సురేశ్, వాసవి, సాఫ్ట్వేర్ దంపతులు 5 రోజులు తీసుకెళ్లారు పిల్లలు బాగుండాలనే పెద్దలు అనేక నియమాలను వి«ధించారు. టైమ్‌తో సంబంధం లేకుండా ఉద్యోగాలు చేసుకునే కాలంలో ఇలాంటి ఇవి కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి సంప్రదాయం కోసం ఐదు రోజులు పుట్టింటికి తీసుకెళ్లారు. ఎడబాటుతో అన్యోన్యత కూడా పెరుగుతుంది కాబట్టి ఆషాఢ నియమం మంచిదే. – గోవిందు భరత్‌కుమార్ (ప్రైవేట్ ఉద్యోగి), పద్మజ -
కళాపిపాసి..విభిన్న రంగాల్లో రాణిస్తున్న వెంకటేష్
సాక్షి, కొల్లాపూర్: రంగస్థల నటనలో అభినయం, పాటలు పాడటంలో ప్రతిభ, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కొల్లాపూర్‌కు చెందిన వెంకటేష్. వృత్తిరీత్యా స్థానిక ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో ఫార్మాసిస్టుగా పనిచేస్తూనే కళలపై తనకున్న మక్కువను ప్రదర్శిస్తున్నాడు. ఆయన ప్రతిభకు పలు అవార్డులు, ప్రశంసలు దక్కాయి. కొల్లాపూర్‌లో సాంస్కృతిక ప్రదర్శనల నిర్వహణలో తప్పనిసరిగా వెంకటేష్ పాత్ర ఉంటుంది. 20 ఏళ్లుగా కళాకారుడిగా.. నటన పట్ల తనకున్న మక్కువతో వెంకటేష్ రంగస్థల నాటకాలు వేయడంలో శిక్షణ పొందాడు. వెంకటేష్ నాటకరంగంలోకి ప్రవేశించాక తన సహచరులతో కలిసి శృతిలయ కల్చరల్ అకాడమీని స్థాపించారు. అకాడమీ ద్వారా ఎంతోమందికి నాటకాలపై శిక్షణ ఇచ్చారు. చిన్నారులకు కూచిపూడి, భరతనాట్యం నేర్పించారు. పాటలు పాడటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నియోజకవర్గంలో చాలామంది నాటకరంగ కళాకారులు శృతిలయ అకాడమీ ద్వారానే సమాజానికి పరిచయమయ్యారు. అకాడమీ ఏర్పాటు చేసి, నాటకరంగ శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలకు శృతిలయ అకాడమీనే శ్రీకారం చుట్టింది. శృతిలయ కల్చరల్ అకాడమీ పేరుతో వందలాది నాటక ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు శృతిలయ అకాడమీ ద్వారా 20 సంవత్సరాలుగా నియోజకవర్గంలో నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించే సంబరాలు, కృష్ణానది పుష్కరాలు, పర్వదినాలు, జాతరల్లో నాటకాలు ప్రదర్శించారు. వెంకటేష్ ప్రతిభను గుర్తించి మహారాష్ట్రలోని కొల్హాపూర్ నాటకరంగం, వారణాసి, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నాటకరంగం వారు ఏకపాత్రాభినయ ప్రదర్శనలకు ఆహా్వనించారు. వీటితోపాటు రవీంద్రభారతి, త్యాగరాయగానసభ, సుందరయ్య విజ్ఞానకేంద్రం, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రదర్శనలు ఇచ్చారు. బాలనాగమ్మ, సత్యహరిశ్చంద్ర, విప్రనారాయణ, శ్రీరామాంజనేయ యుద్ధం, భక్త చింతామణి, వేంకటేశ్వర మహాత్యం, మహాభారత సన్నివేశాలు ఇలా ఎన్నో రకాల నాటకాలను వెంకటేష్ నేతృత్వంలోని బృందం ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. నాటకం వేసే సమయంలో ఆయన హావాభావాలు, పద్యవచనాలు ఆహుతులను ఆకట్టుకుంటాయి. సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకంలో హరిశ్చంద్ర పాత్రను వందసార్లు, భక్త చింతామణి నాటకంలో భవానీ శంకర్ పాత్రను 60 సార్లు, శ్రీకృష్ణ రాయభారం నాటకంలో శ్రీకృష్ణుని పాత్రను 35 సార్లకుపైగా పోషించాడు. అవార్డులు.. ప్రశంసలు కళారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను అక్టోబర్‌లో వెంకటేష్ చెన్నైలోని గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. నవంబర్‌లో అదే యూనివర్సిటీ నుంచి భారత కళారత్న అవార్డు వరించింది. వీటితోపాటు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నుంచి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, రిటైర్డ్ హైకోర్టు జడ్జిలచే అవార్డులు స్వీకరించారు. తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్‌చే రాష్ట్రస్థాయి అవార్డు, డాక్టర్ సి.నారాయణరెడ్డి, గుమ్మడి గోపాలకృష్ణ వంటి వారితోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులచే అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. ముందు తరాలకు అందిస్తా.. ప్రస్తుత సమాజంలో సంప్రదాయ కళలకు సరైన ప్రాధాన్యం లేదు. పాశ్చాత్య పోకడల వైపు యువత వెళ్తున్నారు. సంప్రదాయ కళలైన శాస్త్రీయ సంగీతం, లలిత కళలు, నాటకరంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని ముందు తరాలకు అందించాలనే సంకల్పంతోనే శృతిలయ కల్చరల్ అకాడమీ స్థాపించి శిక్షణ ఇస్తున్నా. సంప్రదాయ కళాకారులకు ప్రభుత్వంతోపాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ తగిన సహకారం ఇవ్వాలి. – వెంకటేష్, కళాకారుడు -
సదర్ కింగ్..సర్తాజ్
మహానగరానికే ప్రత్యేకమైన సదర్ ఉత్సవానికి రంగం సిద్ధమైంది. దీపావళి అనంతరం యాదవుల సాంస్కృతిక వేడుకగా పేరొందిన సదర్‌ను నగరంలోని పలుచోట్ల నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో దున్నల ప్రదర్శన హైలెట్. ఇందుకోసం ప్రత్యేక దున్నలను ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తారు. ఈ నెల 29న జరగనున్న సదర్‌లో ‘సర్తాజ్’అనే దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హరియాణాకు చెందిన ప్రముఖ రైతు వీరేంద్రసింగ్‌కు చెందిన ‘సర్తాజ్’ప్రపంచంలోనే ఎంతో డిమాండ్ ఉన్న ముర్రా జాతికి చెందిన దున్న. రూ.27 కోట్ల ఖరీదైన ఈ దున్నను నగరంలో సదర్ వేడుకల సందర్భంగా ప్రదర్శించేందుకు అఖిలభారత యాదవ మహాసభ ఏర్పాట్లు చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్ -
రాష్ట్రాన్ని కళలకు కేంద్రంగా మారుస్తాం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నమ్మకంతో తనకు సంగీత నాటక అకాడమీ చైర్మన్ ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నూతన తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బి.శివకుమార్ పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలోని కళాభవన్‌లో భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయం పైఅంతస్తులో ఏర్పాటుచేసిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ కార్యాలయాన్ని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. శివకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ నాటక, సంగీత కళలకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేందుకు అహోరాత్రులు శ్రమిస్తానని తెలిపారు. గ్రామాల్లో చాలా మంది కళాకారులు ఉన్నారని.. వారికి రవీంద్రభారతి లాంటి వేదికపై ప్రదర్శనలు ఇచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పారు. తెలంగాణను కళలకు కేంద్రంగా మారుస్తామని హామీఇచ్చారు. జీవితాంతం కళలకు సేవ చేస్తానని.. తెలంగాణ సంగీత నాటక అకాడమీకి పేరు తెస్తానని తెలిపారు. పేద కళాకారులకు నాటక అభినయం ఉన్నవారికి చేయూత ఇస్తామని చెప్పారు. కళాకారులకు ఆర్థిక సాయం, పల్లె కళాకారులకు రవీంద్రభారతిలో ప్రదర్శనలు ఇవ్వడానికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. -
స్వేచ్ఛా భారత్ దిశగా కదలండి
సాక్షి, హైదరాబాద్: స్వేచ్ఛా భారత్ దిశగా సాహితీవేత్తలు, కవులు, రచయితలు ముందడుగు వేయాలని ప్రముఖ కన్నడ రచయిత్రి, సీనియర్ జర్నలిస్టు ప్రతిభానందకుమార్ పిలుపునిచ్చారు. భిన్న ఆలోచనలను, విభిన్న సాహిత్యాలను సమాజం ప్రతిబింబించాలని, భిన్నాభిప్రాయాలను వ్యక్తీకరించే భావప్రకటనా స్వేచ్ఛను ఎప్పటికీ కోల్పోవద్దని ఆమె సూచించారు. శుక్రవారం బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘కన్నడ సాహిత్యం అప్పుడు–ఇప్పుడు’అనే అంశంపై ప్రతిభా నందకుమార్ కీలక ఉపన్యాసం చేశారు. సామాజిక పరిణామాలకు, మార్పులకు అనుగుణంగా కన్నడ సాహిత్యం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉందని, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవడంలో కన్నడ సాహితీవేత్తలు మొదటి నుంచి ముందంజలో ఉన్నారని ఆమె చెప్పారు. ఇప్పుడు సమాజాన్ని ప్రతిబింబిస్తోన్న సోషల్ మీడియా కంటే బలమైన సాహిత్యాన్ని తాము దశాబ్దాల క్రితమే రాసినట్లు పేర్కొన్నారు. కుచించుకుపోతున్న ప్రజాస్వామిక వాతావరణం పద్మావత్ వంటి సినిమాను వ్యతిరేకించడం, అందులోని కథాంశాన్ని జీర్ణించుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ఇలాంటి అసహనం తాము ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక వాతావరణం రోజురోజుకూ కుచించుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలు, వివక్ష కొనసాగుతున్న రోజుల్లోనే తాము స్వేచ్ఛగా సాహితీ సృజన చేశామని, 35 ఏళ్ల క్రితమే తాను ఎరోటిక్ పొయెట్రీ రాసినట్లు ఆమె గుర్తుచేశారు. కొంతమంది జ్యోతిష్య పండితులు మహిళల పట్ల చాలా చులకనగా మాట్లాడుతున్నారని, ఫలానా రాశి మహిళలు అత్యాచారాలకు గురయ్యే అవకాశం ఉందంటూ చేస్తోన్న ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, దీనిపై తాను ‘ఆగ్రహం’అనే కవిత రాసినట్లు గుర్తు చేశారు. సృజనాత్మక రచనలకు సోషల్‌మీడియా సరికొత్త వేదికగా మారుతోందని, స్వేచ్ఛాయుత వాతావరణం కోసం, వివక్ష, పురుషాధిపత్యం లేని సమాజం కోసం నేటితరం రచయితలు కృషి చేయాలని కోరారు. భిన్న సంస్కృతులకు నిలయం.. లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతులకు, కళలకు హైదరాబాద్ నిలయమని అన్నారు. మగ్ధూం మొహియుద్దీన్, సరోజినీనాయుడు, డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటి ఎందరో మహానుభావులు హైదరాబాద్ నుంచి తమ కలాన్ని, గళాన్ని ప్రపంచానికి వినిపించారని చెప్పారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ అంతర్జాతీయ సాహిత్యంతో పాటు, తెలంగాణ సాహిత్య సంస్కృతులకు వేదిక కావాలని ఆకాంక్షించారు. కొత్తతరం రచయితలు, కవులు, సాహితీవేత్తలు ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. స్పెయిన్ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ ఎడ్యురో సాంచెజ్ మొరాకో మాట్లాడుతూ.. స్పానిష్ భాషకు తెలుగు భాషకు పోలికలున్నాయని, తెలుగులో ఉన్నట్లుగానే స్పానిష్లోనూ మాండలికాలు ఉన్నాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల రెండు ప్రాంతాల మధ్య ఒక చక్కటి సాంస్కృతిక వాతావరణం నెలకొంటుందని చెప్పారు. ప్రఖ్యాత నర్తకి సోనాల్‌మాన్‌సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో మరెక్కడా లేని వైవిధ్యభరిత సంస్కృతి, అత్యున్నత సంప్రదాయాలు, విలువలు ఒక్క భారత్‌లోనే ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం గొప్పదనమని చెప్పారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంభోత్సవ సభలో కన్నడంలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. చర్చాగోష్టులు.. సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం స్పెయిన్ మహిళా రచయిత్రుల సాహిత్యంపైనా, పలువురు రచయితలు రాసిన పుస్తకాలపైనా చర్చాగోష్టులు నిర్వహించారు. కర్ణాటకకు చెందిన దళిత సామాజిక కార్యకర్త సరస్వతి వంట చేస్తూ చెప్పిన రామాయణం, దక్కనీ ఉర్దూలో సాగిన మిజాహియా ముషాయిరా తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 70 మంది కళాకారులు నిర్వహించిన కోలాటం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్, సినీ దర్శకుడు డాక్టర్ కిన్నెరమూర్తి తదితరులు పాల్గొన్నారు. లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎస్పీ సింగ్. చిత్రంలో బుర్రా వెంకటేశం -
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మార్కాపురం:డాక్టర్ శామ్యూల్ జార్జి ఇంజినీరింగ్ కళాశాల స్థాపించి 20 ఏళ్లు అయిన సందర్భంగా ఆదివారం రాత్రి కళాశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి. ప్రముఖ గాయకులు సమీరా భరద్వాజ్, సత్యాయామిని, మనీషా, దినకర్ బృందం పాడిన పాటలు అలరించాయి. జబర్దస్త్ టీమ్‌లో రాకెట్ రాఘవ బృందం చేసిన హాస్య సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి. కళాశాలలో వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులకు ఐఆర్ఎస్ అధికారి కిశోర్‌బాబు, కళాశాల సాంకేతిక సలహాదారులు ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే సురేష్, కళాశాల కార్యదర్శి డాక్టర్ సతీష్, డైరెక్టర్ విశాల్‌లు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఇన్‌కమ్‌టాక్స్ కమిషనర్ విజయలక్ష్మి సురేష్, వీహెచ్‌ఆర్ విద్యా సంస్థల అధినేత వెన్నా హనుమారెడ్డి, ఏ–వన్ గ్లోబల్ కళాశాల చైర్మన్ షంషీర్ అలీబేగ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆటపాటలతో అలరించిన విద్యార్థులు
నరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లి రోడ్డు స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలలో భాగంగా శనివారం రాత్రి క్యాంప్ ఫైర్ నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఆటపాటలతో సందడి చేశారు. ఆర్డీవో జె.రవీందర్ విద్యార్థులతో కలిసి నృత్యం చేసి ఉత్సాహ పరిచారు. స్టేడియం కన్వీనర్ మందాడి రవి, ఆకుల సత్యనారాయణ, డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కళాకారులకు పుట్టినిల్లు సింహపురి
నెల్లూరు(బారకాసు): కళాకారులకు పుట్టినిల్లు సింహపురి అని 25 కళాసంఘాల గౌరవ అధ్యక్షుడు, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యాక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. డాన్సర్స్, డాన్స్ మాస్టర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 25వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి నగరంలోని ఇందిరాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ జానపద నృత్య కళాకారుడు, డాన్స్ మాస్టర్ నారాయణమూర్తిని ఈ సందర్భంగా సత్కరించారు. అలాగే 8 మంది పేద వృద్ధ కళాకారులకు నగదు పురస్కారం అందజేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన డాన్స్ ఇనిస్టిట్యూట్లకు సంబంధించిన నృత్య కళాకారులు ప్రదర్శించిన జానపద, శాస్త్రీయ, వెస్ట్రన్, సినీ నృత్యాలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బట్టేపాటి నరేంద్రరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈదూరు భాస్కరయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త పెళ్లకూరు నందకిషోర్‌రెడ్డి, రోటరీ క్లబ్ కొణిదల మునిగిరీష్, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ సూరిశెట్టి నరేంద్ర, శ్రీధర్‌రెడ్డి, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, డాన్స్‌మాస్టర్ చిట్టిబాబు, బాబు, పలువురు డ్యాన్స్ మాస్టర్లు నృత్య కళాకారులు తదితరులు పాల్గొన్నారు. -
శోభాయాత్రలో సాంస్కృతిక వైభవం
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో గురువారం నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. డప్పు చప్పుళ్లు, గజ్జెల చిందులతో జానపద కళాకారులు గణేషుని శోభాయాత్రలో హోరెత్తించారు. టపాసులు కాలుస్తూ యువకులు సందడి చేశారు. ఆటపాటలతో చిన్నారులు ఆకట్టుకొన్నారు. మహిళలు, పెద్దలు కాషాయ రంగు జెండాలు పట్టుకొని రహదారుల వెంట నడుస్తూ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాంస్కృతిక కళాకారులతో కలిసి హోరెత్తించారు. తొమ్మిదిరోజుల పాటు వినాయకుడికి వైభవోపేతంగా పూజలు చేసి గంగమ్మ చెంతకు సాగనంపారు. శాలిబండ, సరూర్‌నగర్, సఫిల్‌గూడ, ఉప్పల్, అంబర్పేట్, సికింద్రాబాద్, సైదాబాద్, పురానాపూల్, బషీర్‌బాగ్, మాల్కాజ్‌గిరి సర్కిళ్లలో భాషా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాకారుల బృందాలవారు విగ్రహాల వెంట నడిచారు. చార్మినార్ ప్రాంతంలో కళాకారులు సంప్రదాయ దుస్తులు ధరించి మహాద్భుతంగా వినాయక విగ్రహాల ముందు నృత్యాలు చేస్తూ జోరు వానలో సైతం సందడి చేశారు. సినిమాల్లోని గణేషుడి గీతాలను మార్మోగించారు. కళా రూపాల ప్రదర్శనలను సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పర్యవేక్షించారు. -
టంగుటూరి ప్రకాశం.. ఆదర్శం
కర్నూలు(అగ్రికల్చర్): టంగూటూరి ప్రకాశం పంతులు నిస్వార్థ జీవితాన్ని, ఆయన పట్టుదల, అకుంటిత దీక్షను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు పేర్కొన్నారు. మంగళవారం టంగుటూరి 145వ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ప్రభుత్వం తరుపున కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టుంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో అనంతరం కర్నూలు బాలభవన్, నంద్యాల గురురాజ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ సందర్బంగా డీఆర్ఓ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు ఒంగోలు జిల్లాకు చెందిన వారయిన వెనుకబడిన కర్నూలును ఆంధ్రరాష్ట్రానికి రాజధానిని చేయడంలో ఆయన పాత్ర కీలకమైందన్నారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కర్నూలు అభివద్ధికి పునాది వేశారన్నారు. జమిందారి వ్యవస్థను రద్దు చేసి పలు శాశ్వత పనులు చేసిన ఘనత ఆయనదేనన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా పోరాడిన మహామనిషిగా కొనియాడారు. ప్రకాశం పంతులు జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి స్పూర్తి దాయకమని పేర్కొన్నారు. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రకాశం పంతులు జీవితం విద్యార్థులకు విజ్ఞానాన్ని ఇస్తుందన్నారు. కర్నూలులో టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహాన్ని నెలకొల్పడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఏఓ తహేరా సుల్తానా, తెలుగు బాష వికాశ ఉద్యమ రాష్ట్ర కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ. కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంటు డాక్టర్ వీరస్వామి, ప్రముఖ రచయిత ఎలమర్తి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, కళాకారుడు ఇనయతుల్ల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
నేత్రపర్వంగా కూచిపూడి నృత్యాలు
విజయవాడ కల్చరల్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగాయి. కార్యక్రమ ప్రారంభంలో ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు అన్నవరపు రామస్వామి వయోలిన్ కచేరీ నిర్వహించారు. గురువందనంతో ప్రారంభించి వాగ్గేయకార కీర్తనలు ఆలపించారు. మరో సంగీత విద్వాంసురాలు విశాఖకు చెందిన మండా సుధారాణి నిర్వహిచిన గాత్ర సంగీత సభ ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా కె.వీ.సత్యనారాయణ బృందం, టి.శ్రావణి, శివసుధీర్‌కుమార్(భక్తిరంజని) న్యూఢిల్లీకి చెందిన సంగీతశర్మ ప్యూజన్ డాన్స్‌తో అలరించారు. మహాబృందనాట్య వేదిక మార్పు ప్రభుత్వం మహా బృంద నాట్యం వేదిక ఇందిరాగాంధీ స్టేడియంగా ప్రకటించింది. కళాకారులకు అలానే సమాచారం అందించారు. ప్రేక్షకుల సంఖ్య పలుచగా ఉండడంతో దానిని సంగమ ప్రాంతానికి మార్చారు. సమాచారం లేక కళాకారులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలావుంటే కళాకారులు పుష్కర కృష్ణ గీతానికి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చని రెండురోజుల కిందట ప్రకటించారు. చివరి నిమిషంలో స్టేడియంలో ప్రభుత్వం మరో కార్యక్రమం నిర్వహించటంతో వేదికను మరోచోటుకు మార్చారు. కళాకారులు వ్యయప్రయాసల కోర్చి సంగమం ప్రాంతానికి చేరుకోవాల్సి వచ్చింది. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
హన్మకొండ అర్బన్ : హన్మకొండ పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంపై కస్తూర్బా విద్యార్థులు చేసిన ‘లేవండోయ్... రారండోయ్... ఊరూవాడ కదలండి’ అంటూ చేసిన బృంద నృత్యం ఆకట్టుకుంది. మల్లికాంబ మనోవికాస కేంద్రం విద్యార్థుల సుజలాం... సుఫలాం నృత్యం, భీమారం ఎస్ఆర్హెచ్ విద్యార్థుల ప్రదర్శన, కాజీపేట ఫాతిమా స్కూల్ విద్యార్థుల లండన్దేఖో.. ప్రదర్శన దేశభక్తిని ప్రేరేపించేలా ఉన్నాయి. ఛాయా చిత్రం.. ప్రగతికి ప్రతిరూపం స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్రదర్శన వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిభింబించాయి. జిల్లాలో వివిధ సందర్భాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ మధుసుదనాచారి, కలెక్టర్ వాకాటి కరుణ పాల్గొన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల చాయా చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డీపీఆర్వో శ్రీనివాస్, ప్రచార సహాయకులు విధుమౌళి పాల్గొన్నారు. శకటాలు అదుర్స్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా పరేడ్‌గ్రౌండ్‌లో వివిధ ప్రభుత్వ శాఖలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన శకాటాల ప్రదర్శనను ఆహుతులు ఆసక్తిగా తిలకించారు. వ్యవసాయ, పర్యాటక, గృహనిర్మాణం, డీఆర్డీఏ, వైద్యారోగ్యశాఖ, డ్వామా, ఐటీడీఏ, సర్వశిక్షాభియాన్, ఐసీడీఎస్, అటవీ, పశుసంవర్థక శాఖ, మిషన్ భగీరథ శకటాలు ప్రదర్శించారు. వీటిలో గుప్పెడు బియ్యం, గుడుంబా నిర్మూలనపై ఏర్పాటు చేసిన డీఆర్డీఏ శకటానికి ప్రథమ బహుమతి, ఆర్‌డబ్ల్యూస్ శకటానికి ద్వితీయ బహుమతి, వైద్యారోగ్య శాఖ శకటానికి తృతీయ బహుమతి లభించాయి. తొలిసారి స్టాల్స్ ఏర్పాటు పరేడ్ గ్రౌండ్లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్‌ను తొలిసారి ఏర్పాటుచేశారు. ఇందులో వివిధ శాఖల ద్వారా ప్రదర్శించిన సైకిళ్లు, ఇతర పరికరాలను కార్యక్రమం అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లబ్ధిదారులకు అందజేశారు. -
లైంగిక దాడులు ఎదుర్కొవడంపై అవగాహన
చేవెళ్ల : మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక దాడులను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అంశంపై శుక్రవారం కళాజాత బృందంచే పోలీసులు చేవెళ్ల బస్‌స్టేషన్‌లో ఆట, పాటలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శృతకీర్తి మాట్లాడుతూ.. మహిళలపై, విద్యార్థినులపై పోకిరీల వేధింపులు, దాడులను పసిగట్టడానికి, అరికట్టడానికి ఏర్పాటు చేసిన షీటీంలను వినియోగించుకోవాలన్నారు. ఎవరైనా వేధించినా, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినా షీటీంకుగాని, నేరుగా పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు. బస్స్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో షీటీంలు అనునిత్యం గమనిస్తుంటాయని తెలిపారు. దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలని మహిళలకు సూచించారు. కార్యక్రమంలో సీఐ ఉపేందర్, ఎస్ఐలు భీంకుమార్, విజయభాస్కర్, వరప్రసాద్‌లు పాల్గొన్నారు. -
సంస్కతీ, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట
ఖానాపూర్ : అనాదిగా వస్తున్న సంస ్కతీ సంప్రదాయాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, ప్రతి ఒక్కరూ వారి వారి సంస్కతిని ఆచరించాలని ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్ అన్నారు. మండలంలోని బంజారా గిరిజన తండాల్లో శీతల్ పండుగను మంగళవారం ఘనంగా జరుపుతున్నారు. బంజార సంస్కతీ సంప్రదాయాల్లో భాగంగా ప్రతీ ఏటా ఖరీఫ్‌లో ఆయా గ్రామాల బంజారాలు సీతళాయాడి పూజలను నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోన్న ఆచారం. ప్రజలు, పశుసంపద ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ గ్రామశివారులోని వేపచెట్టు క్రింద పంట దాన్యాలు, నైవేద్యంగా బోనాన్ని సమర్పిస్తారు. ఏడు దేవుళ్లను అక్కడ ఏర్పరచి ఈ పూజలు చేశారు. పూజ నిర్వహించిన ప్రాంతం నుంచి గొడ్డు, గొద, పశుసంపదను తీసుకెళ్లడంతో పాటు రోజంతా మహిళల పాటల మధ్య వేడుకలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గోన్న ఎమ్మెల్యే మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన పెంబితాండ, ఇటిక్యాల తండా, లోతొర్యెతండా, తాటిగూడ తదితర చోట్ల జరిగిన కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేయడంతో పాటు సంప్రదాయ నత్యం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు వి.లలిత, విక్రమ్‌నాయక్, చంద్రబాను, విలాస్, పరుశురాం, అంకం రాజేందర్, పాకల రాంచందర్, రాజగంగన్న, అష్వక్, ఆరె. రాజేందర్, జన్నారపు శంకర్, గొర్రె గంగాధర్, అబినయ్, షకిల్, స్వామి, కిషన్, ఎంఈవో గుగ్లావత్ రాంచందర్ పాల్గొన్నారు. -
దురాచారాల నివారణకు కళాజాత ప్రదర్శనలు
♦ బెల్టుషాపులపై కొరడా ♦ నిర్వాహకులకు రూ.50 వేల జరిమానా ♦ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కేసులు ♦ నో పార్కింగ్ బోర్డుల ఏర్పాటుకు మున్సిపాలిటీకి లేఖ ♦ బహిరంగ ధూమపానం చేస్తే కఠినచర్యలు ♦ తాండూరు ఏఎస్పీ చందనదీప్తి గ్రామాల్లో సాంఘిక దురాచారాల నివారణకు ప్రజలను చైతన్యం చేసేందుకు కళాజాత ప్రదర్శనలు నిర్వహిస్తాం. బెల్టుషాపులపై కొరడా ఝుళిపిస్తాం. అక్రమంగా కల్లు దుకాణాలు నిర్వహిస్తే సంబంధిత ఎస్ఐలపై చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు. బహిరంగంగా ధూమపానం చేస్తే కేసులు నమోదు చేస్తాం. - చందనదీప్తి, తాండూరు ఏఎస్పీ తాండూరు: బాల్య వివాహాలు, రెండు గ్లాసుల పద్ధతి, మూఢనమ్మకాలు తదితర దురాచారాలపై నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో కళాజాత ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఏఎస్పీ చందనదీప్తి తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే ఈ కార్యక్రమాలు ఆరంభిస్తామన్నారు. సాంఘిక దురాచారాలపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో అక్రమ కల్లు దుకాణాలతోపాటు బెల్టుషాపులపై కొరడా ఝళిపించనున్నట్టు ఏఎస్పీ స్పష్టం చేశారు. సంబంధిత ఎస్ఐలు అక్రమ కల్లు దుకాణాలు, బెల్టుషాపులను అరికట్టాలని ఆదేశించినట్టు చెప్పారు. ఈ విషయంలో తనిఖీలు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తనిఖీల్లో బెల్లుషాపులు, అక్రమ కల్లు దుకాణాలు ఉన్నట్టు తేలితే సదరు ఎస్ఐలపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని చందనదీప్తి స్పష్టం చేశారు. బెల్టుషాపులు నిర్వహిస్తూ మొదటిసారి పట్టుబడితే బైండోవర్ చేస్తామని, రెండోసారి అయితే రూ.50 వేల జరిమానా విధించనున్నట్టు ఏఎస్పీ స్పష్టం చేశారు. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. పట్టణంలోని బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, హోటళ్ల వద్ద ద్విచక్రవాహనాలు, ఇతర భారీ వాహనాలు అడ్డగోలుగా పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య వస్తున్నట్టు గుర్తించామన్నారు. ఆయా సంస్థల నిర్వాహకులకు, ట్రాన్స్‌పోర్టు సంస్థలకు నోటీసులు జారీ చేయాలని అర్బన్ సీఐ, ఎస్ఐలకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఆయా సంస్థల నిర్వాహకులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. వాహనదారులకు జరిమానాలతో పాటు వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. నో పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు లేఖ రాయనున్నట్టు చెప్పారు. బహిరంగంగా ధూమపానం చేసినా, ప్రజలకు అసౌకర్యంగా వ్యవహారించినా ఐపీసీ 290 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏఎస్పీ చందనదీప్తి హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని, పునరావృతమైతే కేసులు పెడతామని స్పష్టం చేశారు. పోలీసుశాఖ చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఏఎస్పీ చందనదీప్తి కోరారు. -
కీర్తి పతాక...సంబురం
జనసాగరం.. కన్నుల పండువగా తెలంగాణ ఆవిర్భావోత్సవం నగరం నలుదిశలా మువ్వన్నెల రెపరెపలు హోరెత్తిన తెలంగాణ నినాదాలు ఆట, పాటలు..సాంస్కృతిక కార్యక్రమాలు నోరూరించిన తెలంగాణ రుచులు సిటీబ్యూరో: తెలంగాణ ఆవిర్భావ ఉత్సవం అంబరాన్నంటింది. మువ్వన్నెల జెండా ఎగిసింది. మహానగరం మురిసింది. జై తెలంగాణ నినాదం హోరెత్తింది. మదినిండా అమరుల జ్ఞాపకాలను నింపుకొని, సాధించుకొన్న కలల తెలంగాణను స్మరించుకొని జనం ఘనంగా వేడుకలు చేసుకున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో తెలంగాణ అవతరణ ద్వితీయ వేడుకలు గురువారం కన్నుల పండువగా జరిగాయి. వందలాదిగా తరలి వచ్చిన తెలంగాణ జానపద, గిరిజన కళాకారులు, వివిధ రకాల కళాప్రదర్శనలు బతుకమ్మలతో సాగిన భారీ ఊరేగింపుతో ట్యాంక్‌బండ్ తెలంగాణ కల్చరల్ కార్నివాల్‌కు వేదికైంది. ఒకవైపు అద్భుతంగా సాగిన కళా,సాంస్కృతిక ప్రదర్శనలు, మరోవైపు ఆకాశంలో హరివిల్లులను ఆవిష్కరిస్తూ వెలుగులు విరజిమ్మిన తారాజువ్వలు, తరలి వచ్చిన అతిరథమహారధులు, నింగినంటిన ఆనందోత్సాహాలతో హుస్సేన్‌సాగర్ పోటెత్తింది. రంగురంగుల విద్యుద్దీపాలతో మహానగరం సరికొత్త అందాలను సంతరించుకొంది. నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్, రవీంద్రభారతి, హరిహరకళాభవన్, సచివాలయం,అసెంబ్లీభవనం, నింగినంటే జాతీయ జెండాకు వేదికైన సంజీవయ్యపార్కు, ఎన్టీఆర్, లుంబినీ, ఇందిరాపార్కు, శిల్పారామం తదితర ఉద్యానవ నాలు, కళల లోగిళ్లు, సాంస్కృతిక కేంద్రాలలో సంబురాలు అంబరాన్నంటాయి. గన్‌పార్కు వద్ద, సికింద్రాబాద్ క్లాక్‌టవర్ వద్ద అమరుల స్థూపాలకు నివాళులర్పించారు. పలుచోట్ల ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఆట, పాటలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. పీపుల్స్‌ప్లాజా తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నోరూరించే వివిధ రకాల తెలంగాణ ప్రత్యేక వంటకాలు ప్రతి ఒక్కరిని కట్టిపడేశాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ రాష్ర్ట అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీలో జరిగిన వేడుకల్లో నగర మేయర్ బొంతు రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఖైరతాబాద్ రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సంయుక్త రవాణా కమిషనర్లు వెంకటేశ్వర్లు, రఘునాథ్, ఆర్టీఓ జీపీఎన్ ప్రసాద్, సామ్యూల్‌పాల్ తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించి వాహనదారులకు, సిబ్బందికి మిఠాయిలు పంచారు. 100 మందికి పైగా అనాథ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎండీ దానకిషోర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఘనంగా అవతరణ వేడుకలు జరిగాయి.హైదరాబాద్ మెట్రో రైల్ కార్యాలయంలో ఎండీ ఎన్వీఎస్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్భవన్లోనూ, జూబ్లీ, మహాత్మాగాంధీ బస్స్టేషన్లలోనూ ఘనంగా వేడుకలు జరిగాయి. ఆర్టీసీ జేఎండీ రమణ రావు, ఈడీలు పురుషోత్తమ్, నాగరాజు, అధికారులు, సిబ్బంది, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టరేట్, హెచ్ఎండీఏ, విద్యుత్తు తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, నగరంలోని ప్రధాన కూడళ్లలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు చేసుకున్నారు. సాంస్కృతికోత్సాహం.... తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్‌గార్డెన్స్ లలితకళాతోరణంలో ఏర్పాటు చేసిన డప్పు, డోళ్ల దరువు ప్రదర్శన, 200 మందికి పైగా కళాకారులతో సాగిన పేరిణి నృత్య మహా ప్రదర్శన అద్భుతంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని సమున్నతంగా ఆవిష్కరించాయి. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన తెలంగాణ గీత రచయితల ప్రత్యేక సంగీత విభావరి, అర్ధనారీశ్వరం నృత్య ప్రదర్శన, ‘నా తెలంగాణ -కోటి రతనాల వీణ’ నృత్యరూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నృత్య రూపక ప్రదర్శనలో ఇందిరాపరాశరం బృందం తమ కళా నైపుణ్యాన్ని ఎంతో అద్భుతంగా చాటారు. అలాగే ఎస్.శరత్ బృందం ప్రదర్శించిన ‘అమరవీరులకు జై బోలో’ ప్రదర్శన సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రసమయి బాలకిషన్ నేతృత్వంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పబ్లిక్‌గార్డెన్, తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో 45 మంది కవులు తమ కవితా గానం చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యంపై కవులు తమ కవిత్వాన్ని వినిపించారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో సిక్కు సోదరుల కళా ప్రదర్శనలు, క్రైస్తవ సోదరుల సాంస్కృతిక కార్యక్రమాలు, బషీర్‌బాగ్ ఎల్బీస్టేడియంలో ప్రముఖ గజల్ గాయకుడు తలత్ అజీజ్ గానం చేసిన ‘షామ్-ఎ.గజల్’ అందరినీ ఆకట్టుకున్నాయి. ఉర్దూ, మోతీగల్లీ ఖిల్వత్లో గుల్బర్గా బృందం ఖవ్వాలీ ప్రదర్శన విశే షంగా ఆకట్టుకుంది. కులీఖుతుబ్షా స్టేడియంలో నిర్వహించిన ఆల్ ఇండియా ముషాయిరాలో (ఉర్దూ కవి సమ్మేళనంలో) వివిధ ప్రాంతాలకు చెందిన కవులు పాల్గొన్నారు. సిండికేట్ బ్యాంకు కార్యాలయంలో... మాసబ్‌ట్యాంక్ : నగరంలోని సిండికేట్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. సిండికేట్ బ్యాంక్ అన్ని శాఖల్లో ఉద్యోగులు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిండికేట్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఎప్పీ శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ది వైపు పరుగులు తీస్తుందన్నారు. అన్ని రకాల వనరులు, సౌకర్యాలు ఉన్న తెలంగాణ బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిండికేట్ రీజనల్ ఆఫీస్ (రూరల్) రీజనల్ మేనేజర్ శీలం గిరితో పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అవతరణ సంబురం
► రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి ► నేడు పల్లె పల్లెన ‘ప్రత్యేక’ సంబరాల నిర్వహణ ► ప్రారంభించనున్న మంత్రి ఈటల తెలంగాణ అవతరణ వేడుకలకు జిల్లా ముస్తాబైంది. రాష్ర్ట ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేం దుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, తెలంగాణ తల్లి విగ్రహాలు, అమరవీరుల స్థూపా లను విద్యుద్దీపాలతో అలంకరిం చారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ర్ట ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనం తరం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. - కరీంనగర్ కల్చరల్ ముకరంపుర: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రెండేళ్లు పూర్తయ్యాయి. అధికారిక ప్రకటన వెలువడిన ఉద్విగ్న క్షణాలు.. హర్షాతిరేకాలు.. రెండేళ్ల పాలన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అట్టహాసంగా తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలో ఉత్సవాలు మరింత హోరెత్తించనున్నాయి. అందుకు పరేడ్ గ్రౌండ్ వేదిక కానుంది. కలెక్టర్, ఎస్పీ ఆహ్వానితులుగా వ్యవహరించనుండగా.. వేడుకలను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించనున్నారు. జిల్లాలో ఎటు చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మహిళా సంఘాలతో అమరవీరుల సంస్మరణార్థం బుధవారం కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన కూడళ్లను దీపాలంకరణ, స్వాగత తోరణాలతో మిరుమిట్లుగొలిపేలా తీర్చిదిద్దారు. అమరవీరుల స్థూపాలన్నింటికీ మరమ్మతుతో ముస్తాబు చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని పరేడ్‌గ్రౌండ్‌లో మంత్రి ఈటల రాజేందర్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. అంతకుముందు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్నారు. పోలీసుల వందనస్వీకారం అనంతరం మంత్రి సందేశమిస్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, కవులు, కళాకారులు, కవులు, రచయితలు, అధికారులు, జర్నలిస్టులతో పాటు అన్ని రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందిస్తున్న వారిని జిల్లా స్థాయిలో 25 మందిని సత్కరించనున్నారు. వీరికి రూ. 51 వేల నగదుతో పాటు శాలువాతో మంత్రి ఈటల రాజేందర్ సన్మానించనున్నారు. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆస్తుల పంపిణీ కార్యక్రమాలుంటాయి. రక్తదానాలు, అనాథలు, వృద్ధులకు బట్టలు, పండ్ల పంపిణీ, సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు, వృద్ధాశ్రమాల్లో మాంసాహార భోజనం, సాయంత్రం కవి సమ్మేళనం, ముషాయిరా, సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. -
చెవిరెడ్డి మునిరెడ్డి ఆదర్శప్రాయులు
తుమ్మలగుంట(తిరుపతి రూరల్): చెవిరెడ్డి మునిరెడ్డి ఆదర్శప్రాయుడని ప్రముఖులు కొనియాడారు. వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తాత మునిరెడ్డి కర్మక్రియలు బుధవారం తుమ్మలగుంటలో నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు మునిరెడ్డికి నివాళులర్పించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎమ్మెల్యే స్థాయికి ఎదగడంలో మునిరెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నివాళులర్పించిన ప్రముఖులు.. చెవిరెడ్డి మునిరెడ్డికి నివాళులర్పించిన వారిలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు నారాయణస్వామి (జీడీ నెల్లూరు), దేశాయ్ తిప్పారెడ్డి(మదనపల్లి), రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి(కావలి), సుగుణమ్మ(తిరుపతి), కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వే కోడూరు), ఐజయ్య(నందికొట్కూరు), ఎమ్మెల్సీ నరేష్కుమార్, నాయకులు కశంకర్రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, కోలా ఆనంద్, మిద్దెల హరి, డాక్టర్ సుధారాణి, నవీన్‌కుమార్‌రెడ్డి, దామినేటి కేశవులు, పార్టీ రాష్ట్ర నాయకులు మునీశ్వర్‌రెడ్డి, విక్రంరెడ్డి, లోకనాథరెడ్డి, బాబురెడ్డి పాల్గొన్నారు. -
మళ్లీ..చిందులు!
► పాట కచ్చేరీల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు ► యువతుల బతుకులను చిదిమేస్తున్న ‘మహిళ ’ ► పాత రోజులను జ్ఞప్తికి తెస్తున్న చిలకలూరిపేట చిలకలూరిపేట టౌన్: సమసి పోయిందనుకున్న దురాచారం అధికారదర్పంతో బుసలు కొడుతోంది. నైతికత కలిగిన నాయకులు, నిబద్ధత కలిగిన కొందరు పోలీసు అధికారులు ఎన్నో ఏళ్ల కృషి ఫలితంగా సీసాలో బందీ అయిన వ్యభిచార భూతం ఇప్పుడు బంధనాలు తెంచుకుంటోంది. పాటకచ్చేరీలు, సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో యువతుల జీవితాలను విటుల పాదాల కింద నలిపేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి ఓ మహిళ కేంద్రబిందువుగా మారడం బాధాకరం. చీకటి దందా... ఒకప్పుడు చిలకలూరిపేట పట్టణంలోని రెండు వీధుల్లో వ్యభిచారం కొనసాగేదన్నది బహిరంగ రహస్యం. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇక్కడి వారు తమ ఊరు పేరు చెప్పుకొనేందుకు కొంత సంకోచించేవారు. ఈ సామాజిక రుగ్మతను రూపుమాపేందుకు ఎందరో చేసిన కృషి ఫలితంగా క్రమంగా అనాచారం అంతరించి పోయింది. ఇటీవల కాలంలో పట్టణంలోని వడ్డెర పాలెం ప్రాంతంలో ఓ మహిళ తిరునాళ్ల వంటి వేడుకలకు పాటకచ్చేరీలు, సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో డాన్సర్లను ఇక్కడ నుంచి పంపే వ్యాపారానికి తెరతీసింది. పనిలో పనిగా ఖాళీగా ఉన్న సమయాలలో వాళ్లతో వ్యభిచారం చేయిస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతోంది. ఈ వ్యభిచార కూపంలో మగ్గేది మొత్తం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన యువతులు కావటం విశేషం. గుట్టుచప్పుడు కాకుండా... అనైతికంగా సాగే ఈ చీకటి వ్యాపారం రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుంటుంది. నృత్యాలకు వెళ్లే యువతులను వడ్డెరపాలెం ప్రారంభం నుంచి ఓగేరు వాగు వడ్డువరకు ఉన్న తమ వారికి చెందిన గృహాలలో అక్కడక్కడ ఇద్దరి నుంచి నలుగురు చొప్పున ఉంచుతారు. రాత్రి వే ళల్లో సంబంధిత ప్రదేశాలలో వీధి దీపాలు వెలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అదే సమయాలలో కొంతమంది వ్యక్తులు పోలీసు దాడులు జరగకుండా వీధి ఆరంభంలోనే కాపలా ఉంటారు. అటుగా పోలీసు వాహనాలు వస్తే వెంటనే సెల్ ఫోన్లద్వారా సమాచారం చేరిపోతుంది. రాత్రివేళ తమ ఇళ్ల ముందు ఎవరో గుర్తుతెలియని వ్యక్తుల వాహనాలు, కార్లు వచ్చి ఆగటం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తే వారిపై మూకుమ్మడిగా గొడవకు దిగుతారు. అంగబలం, అర్ధబలం ఉన్న వీరిని ఎదిరించేందుకు ధైర్యం లేక, గొడవలు పడలేక చీకటి కార్యకలాపాలకు మూగసాక్షులుగా మిగలడం స్థానికుల వంతైంది. అంతరించి పోయిందనుకున్న విష సంస్కృతి కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం కొత్త రూపు దాల్చటం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పోలీస్ అధికారులు ఈ మొత్తం వ్యవహారంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం.. పట్టణంలో చీకటి దందా గురించి అర్బన్ సీఐ బి. సురేష్‌బాబును వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు. వ్యభిచారం జరుగుతున్నట్లు ఎవరైనా స్థానికులు ఫిర్యాదు చేస్తే నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యపై దృష్టి సారిస్తామన్నారు. -
ఘనంగా ఉగాది వేడుకలు
► ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుకలు ► హాజరైన తీన్మార్ సత్తి, ప్రముఖ జానపద గాయకులు ► అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉగాది పచ్చడి పంపిణీ నిర్మల్ టౌన్ : తీన్మార్ సత్తి పంచ్‌లు... చిన్నారుల సాం స్కృతిక కార్యక్రమాలతో ఉగాది ఉత్సవ స మితి ఆధ్వర్యంలో దుర్ముఖినామ సంవత్సరానికి ఆ హ్వానం పలికారు. పట్టణంలో ఉగాది వేడుకలు శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. స్థాని క పాత బస్టాండ్ వద్ద వేదిక ఏర్పాటు చేసి ప్ర త్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమా న్ని తిలకించడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఉగాది పచ్చడిని చింతకుంట వాడ నుం చి ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు మంగళహారతులతో శోభాయాత్రలో పాల్గొన్నారు. తీన్మార్ ఫేం సత్తి ప్రేక్షకులను అలరించారు. తన మాటలతో చేష్టలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. సత్తి చేష్టలను చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఆస్వాదిం చారు. అనంతరం ఉత్సవసమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ చేశారు. ప్రముఖ జానపద కళాకారులు ఆలపించిన గేయాలు అలరించాయి. గోండ్ల సంప్రదాయ నృత్యాన్ని కళాకారులు చేసిన తీరు ప్రేక్షకులను అబ్బురపరిచిం ది. ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది పండుగను ప్రతి ఏటా ఇదే ప్రాంతంలో నిర్వహిస్తారు. వేడుకలకు పెద్దసంఖ్యలో ప్రజలు హాజరవుతుండడంతో ఉత్సవసమితి ఆధ్వర్యంలో ప్ర త్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని వివిధ పా ఠశాలల విద్యార్థులే కాక, ఇతర ప్రాంతాల నుం చి కూడా విద్యార్థులు వచ్చి సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఉత్సవసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన పలువురికి అవార్డులను అం దజేశారు. అనంతరం యోగానంద సరస్వతీ స్వామి ప్రవచనాలు, ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రముఖ పారిశ్రామికవేత్త మురళీధర్‌రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్, ఉ గాది ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్, ఉత్సవసమితి అధ్యక్షుడు కొరిపెల్లి దేవేంధర్‌రెడ్డి, డాక్టర్ కృష్ణంరాజు, నాయకులు రామకృష్ణగౌడ్, గురుదీప్‌సింగ్ భాటియా, నవయుగమూర్తి, అన్నపూర్ణ, వేణుగోపాలకృష్ణ, పొడెల్లి చిన్నయ్య, గందె సుదీర్, రాంరమేశ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని గండిరామన్న సాయిబాబా ఆలయంలో సాయి దీక్షా సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో డీఎస్పీ మనోహర్‌రెడ్డి పంచాంగం ఆవిష్కరించారు. అనంతరం ఆచార్య కళ్యాణ్ పంచాంగ శ్రవణం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఇందులో బీజేపీ స్వచ్ఛ భారత్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు రావుల రాంనాథ్, సబ్ రిజిస్ట్రార్ జ్యోతి, సాయి దీక్షా సేవా సమితి సభ్యులు దేవిదాస్, శ్రీయ, గోవర్ధన్, పడిగెల లింగయ్య, దేవన్న, రేణుకాదాస్, హరీష్, శివ తదితరులు పాల్గొన్నారు. -
మహా జన సంరంభం
ప్రవహించినంతమేరా పచ్చటి ప్రకృతిని మాత్రమే కాదు... జనపదాలనూ, సంస్కృతీ సంప్రదాయాలనూ పెంపొందింపజేసే నదులకు మనిషి జీవితంలో విశిష్ట స్థానం ఉంది. అవి మనిషి దాహార్తినీ, క్షుదార్తినీ తీర్చడంతోనే ఆగిపోలేదు. సంస్కారాన్నిచ్చాయి. సహజీవనాన్ని నేర్పాయి. విజ్ఞానతృష్ణను రగిల్చి ఉన్నత స్థానానికి చేర్చాయి. నదులను అమ్మలా సంభావించుకుని ప్రణమిల్లడం, పూజాదికాల్లో నదులరీత్యా ఉనికిని చెప్పుకోవడం అందుకే. ప్రాణికోటి మనుగడకు ఆధారమైన పంచభూతాల్లో నీటికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ‘పరోపకారాయ ఫలంతి వృక్షాః/ పరోపకారాయ వహంతి నద్యాః’ అనే సూక్తి నదులకుండే ప్రవాహ గుణంలోని పరోపకారత ను పట్టిచూపుతుంది. మనిషికీ, నదీమతల్లికీ గల అనుబంధాన్ని గుర్తుచేసుకోవడానికి ఒక సందర్భమయ్యే గోదావరి పుష్కరాలు మంగళవారం ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మొదలవుతున్నాయి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించే క్షణాలను గణనలోకి తీసుకుని తెలంగాణలో ఉదయం 6.21 గంటలకూ...ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 6.26కూ ఈ పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. పన్నెండేళ్లకొకసారి వచ్చే ఈ పుష్కరాలు జన, జల రాశుల మహా సంగమం. మహా సంరంభం. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో 5 కోట్లమంది, తెలంగాణలో 3 కోట్లమంది పుష్కరాల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈసారి జరిగేవి 144 ఏళ్లకొకసారి వచ్చే మహా పుష్కరాలని కొందరు పండితులు చెబుతున్నారు. అందుకే వీటి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ పుష్కర సమయంలో గోదావరీ తీరాన త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలూ, సప్త రుషులూ, పితృ దేవతలూ నడయాడతారని ప్రతీతి. అందుకే ఈ పన్నెండు రోజులూ గోదావరి నది ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. పితృకర్మలు సాగుతాయి. దక్షిణాన అతి పెద్ద నదిగా...దేశంలో గంగానది తర్వాత రెండో పెద్ద నదిగా ప్రఖ్యాతి చెందిన గోదావరి... మహారాష్ట్రలోని నాసిక్ సమీపాన సహ్యాద్రి కొండల్లో పుట్టి మొత్తంగా 1,465 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అంతకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 927 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఒకచోట పర్వత శిఖరాలనుంచి దుమికినా, మరోచోట కొండల్ని ఒరుసుకుంటూ, సుడులు తిరుగుతూ అన్నిటినీ చుట్టబెడుతూ, మహావృక్షాలను సైతం కూకటివేళ్లతో పెకిలిస్తూ ప్రళయ భీకర రూపం చూపినా...వేరొకచోట ప్రశాంత గంభీర వదనంతో ప్రవహించినా, చివరిగా సముద్రంలో సంగమించేందుకు ఉత్తుంగ తరంగాలతో ఉరకలెత్తుతూ వెళ్లినా గోదావరి తీరే వేరు. అది మానవ జీవితంలోని సకల పార్శ్వాలనూ గుర్తుకు తెస్తుంది. ఈ పుష్కరాల పనుల కోసం రెండు రాష్ట్రాలూ భారీగానే ఖర్చు చేశాయి. పుష్కరాలకొచ్చే భక్తులకు స్నాన ఘట్టాలు మొదలుకొని వసతి సౌకర్యాలవరకూ వివిధ ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రోజుకు దాదాపు 25 లక్షలమంది పుష్కర స్నానం చేస్తారన్న అంచనాలతో ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 264 స్నానఘట్టాలను ఏర్పాటుచేశారు. ఇంత భారీయెత్తున ఏర్పాట్లు చేసి కోట్లాది రూపాయలు వ్యయం చేసిన రెండు ప్రభుత్వాలూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికొచ్చేసరికి ముఖం చాటేశాయి. మరికొన్ని గంటల్లో పుష్కరాలు ప్రారంభం కాబోతున్నా పట్టనట్టు కూర్చున్నాయి. ఫలితంగా పారిశుద్ధ్యం పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అన్నిచోట్లా చెత్తాచెదారం పేరుకుపోయి, డ్రైనేజిలన్నీ పొంగిపొర్లి దుర్గంధం నిండింది. చినుకు పడిందే తడవుగా భయంకరమైన అంటు వ్యాధులు ప్రబలే స్థితి నెలకొంది. తెలంగాణలో సమ్మె మొదలై 8 రోజులు గడుస్తుంటే...ఏపీలో మూడు రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు. కార్మికులు కోరుతున్నవి గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. చాలీచాలని వేతనాలను సరిదిద్దాలంటున్నారు. తమ బతుకుల్ని కాస్తయినా బాగుచేయమంటున్నారు. మిగిలినవారంతా సమీపానికి రావడానికి కూడా హడలెత్తే చెత్తలో నిత్యం మునిగితేలుతూ వీధులను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో కార్మికులు చేస్తున్న కృషి నిజానికి వెలకట్టలేనిది. అలాంటివారి జీవితాలను కాంట్రాక్టు ఉద్యోగాల్లో పాతేసి, అభద్రతలోకి నెట్టడం అన్యాయమని, అమానుషమని పాలకులు ఎందుకు అనిపించడంలేదో ఆశ్చర్యం కలుగుతుంది. ఈఎస్ఐ సొమ్మును కాంట్రాక్టర్లు, అధికారుల పాలై వైద్య సేవలు లభించని స్థితి ఏర్పడినా కార్మికుల గోడు పట్టించుకునే నాథుడు లేడు. చట్టసభలకు ఒకసారి ఎన్నికైతేనే పెన్షన్తోసహా అనేక సౌకర్యాలు పొందేవారు... పౌరులందరికీ ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించడంలో రాత్రింబగళ్లు శ్రమించేవారిని చిన్నచూపు చూడటం వింతగొలుపుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైతే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఇప్పటికే పొరుగునున్న తమిళనాడునుంచి పారిశుద్ధ్య కార్మికులను రప్పించింది. తెలంగాణ సర్కారు సైతం ఆ తోవనే పోదల్చుకున్నట్టు కనబడుతోంది. అస్మదీయులకు కాంట్రాక్టులు అప్పగించి వారికి చేతినిండా పని కల్పించవచ్చు గనుక... కోట్లాది రూపాయలు వెనకేసుకోవచ్చు గనుక పుష్కర పనులంటూ హడావుడి చేస్తారు. వాస్తవానికి స్నాన ఘట్టాలవంటివి శాశ్వత ప్రాతిపదికన ఉండాల్సినవి. అందుకోసం పటిష్టంగా నిర్మాణం చేయాల్సినవి. కానీ పనులు నాసిరకంగా ఉండటంవల్ల వచ్చే పుష్కరాల వరకూ ఉండటం మాట అటుంచి కొన్ని నెలలకే నామరూపాల్లేకుండా పోతున్నాయి. కనుకనే ప్రతిసారీ వాటి కోసం కోట్లు ఖర్చుచేయాల్సివస్తున్నది. రోడ్ల సంగతి చెప్పనవసరమే లేదు. ఖర్చుచేశామన్న సొమ్ముతో పోల్చిచూస్తే జరిగిన పనులు సరిగా లేవన్నది అర్థమవుతుంది. భక్తినీ, చిత్తశుద్ధినీ, సత్సంకల్పాన్నీ పెంపొందింపజేసే ఈ పుష్కరాలు పాలకులకు సద్బుద్ధిని కలిగిస్తే మున్సిపల్ కార్మికులకూ, పౌరులకూ మేలు కలుగుతుంది. -
అంబరాన్నంటిన సంబరాలు
వైజాగ్ ఫెస్ట్‌కు అపూర్వ ఆదరణ.. వారాంతం కావడంతో శనివారం స్టాళ్లన్నీ కిటకిటలాడాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జనం పోటెత్తారు. పిల్లలు, పెద్దలు, యువత, వృద్ధులు అన్న తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫెస్ట్ ఆవరణంలో అడుగు పెట్టగానే అన్ని హంగులు, కావాల్సిన కార్యక్రమాలు, ఆహ్లాదపరిచే సాహితీ వేదికలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విజ్ఞానాన్ని పెంచే విషయాలు అందరినీ అలరిస్తున్నాయి. ఫెస్ట్ ముగింపుకు రావడంతో రద్దీ మరింత పెరిగింది. విశాఖ-కల్చరల్ : ఆలోచింపజేసే గీతాలు... హృదయాలను హత్తుకునే నృత్యాలు... జనాన్ని కదిలించే జనపదాలు అలరించాయి. గోరటి వెంకన్న గొంతెత్తి పాట పాడితే ప్రేక్షక లోకం ఒక్కసారిగా స్తంభించింది. కళాభిమానులు చెవులు రిక్కించి ఆయన పాటలను ఆలకించారు. వైజాగ్ ఫెస్ట్-సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఘంటసాల కళావేదిక శనివారం రాత్రి ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు అందించింది. జానపదం నుంచి కొత్తరూపం దాల్చిన ‘జనం కోసం రూపకం’ ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. ఖమ్మం జిల్లా కూనవరం రాజయ్య బృందం ప్రదర్శించిన డోలుకొయ్యలు అలరించాయి. ‘గల్లీ చిన్నది.. గరీబోడికన్నా పెద్దదీ..’ అంటూ గోరటి వెంకన్న పాడిన పాట కదిలించింది. ఉత్తరాంధ్రపై ‘నాగవళీ, వంశధార, శారదా, తాండవ నదులు పొంగేటి గంగాయమ్మ తల్లీ...’ అంటూ సాగిన గీతం హర్షధ్వానాలు అందుకుంది. ఘంటశాల స్పోర్ట్సు అండ్ కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శి చెన్నా తిరుమలరావు బృందం, అరుణోదయ, సుస్వరమాధురి, ప్రియరాగ వంటి ఆర్కెస్ట్రాలు ఆలపించిన సుమధుర సంగీత విభావరి సంగీత ప్రియులను మరోలోకంలో విహరింపచేసింది. అరుణోదయ నిర్మల్ బృందం ఆలపించిన జానపద గీతాలు ఉర్రూతలూగించాయి. పౌరాణిక కళాకారుడికి ఘన సత్కారం ప్రముఖ పౌరాణిక కళాకారుడు, నంది అవార్డు గ్రహీత డి.అచ్చియ్యనాయుడును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కేంద్రకమిటీ సభ్యురాలు ఎస్.పుణ్యవతి, దడాల సుబ్బారావు, సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి వ్యవస్థాపక సభ్యురాలు, ప్రముఖ రచయిత్రి కొండపల్లి కోటేశ్వరమ్మ మాట్లాడుతూ సాహిత్య, సంగీత, కళారంగానికి ఉత్తరాంధ్ర పుట్టినిల్లని కొనియాడారు. తాను గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం తొలి ప్రదర్శనలో పాల్గొన్నట్టు చెప్పారు. తొలుత సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఘంటసాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.