గ్రేటర్ హైదరాబాద్‌లో గురువారం నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. డప్పు చప్పుళ్లు, గజ్జెల చిందులతో జానపద కళాకారులు గణేషుని శోభాయాత్రలో హోరెత్తించారు.
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో గురువారం నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. డప్పు చప్పుళ్లు, గజ్జెల చిందులతో జానపద కళాకారులు గణేషుని శోభాయాత్రలో హోరెత్తించారు. టపాసులు కాలుస్తూ యువకులు సందడి చేశారు. ఆటపాటలతో చిన్నారులు ఆకట్టుకొన్నారు. మహిళలు, పెద్దలు కాషాయ రంగు జెండాలు పట్టుకొని రహదారుల వెంట నడుస్తూ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాంస్కృతిక కళాకారులతో కలిసి హోరెత్తించారు. తొమ్మిదిరోజుల పాటు వినాయకుడికి వైభవోపేతంగా పూజలు చేసి గంగమ్మ చెంతకు సాగనంపారు.
శాలిబండ, సరూర్‌నగర్, సఫిల్‌గూడ, ఉప్పల్, అంబర్‌పేట్, సికింద్రాబాద్, సైదాబాద్, పురానాపూల్, బషీర్‌బాగ్, మాల్కాజ్‌గిరి సర్కిళ్లలో భాషా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాకారుల బృందాలవారు విగ్రహాల వెంట నడిచారు. చార్మినార్ ప్రాంతంలో కళాకారులు సంప్రదాయ దుస్తులు ధరించి మహాద్భుతంగా వినాయక విగ్రహాల ముందు నృత్యాలు చేస్తూ జోరు వానలో సైతం సందడి చేశారు. సినిమాల్లోని గణేషుడి గీతాలను మార్మోగించారు. కళా రూపాల ప్రదర్శనలను సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పర్యవేక్షించారు.