
చిత్రలేఖనంలో దివ్యాంగురాలి ప్రతిభ
పలు, అవార్డులు, రివార్డులతో గుర్తింపు
గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకున్న విజయలక్ష్మి
సాధించాలనే తపన, పట్టుదల ముందు ఏ వైకల్యమూ అడ్డుకారాదని.. ప్రతిభ ఉండాలే కానీ అవార్డులు.. రివార్డులు.. వాటంతట అవే వస్తాయని నిరూపించింది.. ఆ యువతి. దివ్యాంగురాలన్న భావన లేకుండా పట్టుదలతో కాన్వాస్‌పై చిత్రలేఖనం (Painting) నేర్చుకుని విమర్శకుల ప్రశంసలు పొందుతూ.. శభాష్ అనిపించుకుంటోంది.. ఆమే మేడ్చల్ జిల్లా శామీర్‌పేట (Shamirpet) మండలం తుర్కపల్లికి చెందిన విజయలక్ష్మి. చిత్రకళతో పాటు సంగీతంలోనూ రాణిస్తూ.. ప్రముఖుల ప్రశంసలు పొందుతూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
తుర్కపల్లికి చెందిన విజయలక్ష్మి మూడేళ్ల వయసులో పోలియో వచ్చి రెండు కాళ్లు, కుడి చెయ్యి పనిచేయకుండా పోయాయి. తల్లిదండ్రులు నర్సింహులు, ప్రమీళ, అన్నా వదిన అనంద్, శ్రవంతి విజయలక్ష్మికి అండగా నిలిచారు. ఆమెలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. దివ్యాంగురాలనే భావన కలుగకుండా చిత్రలేఖనంపై పట్టుసాధించేలా ప్రోత్సహించారు. మొదట్లో దినపత్రికలు, ఆదివారం ప్రచురణలలోని బొమ్మలను చూసి చిత్రలేఖనం నేర్చుకుంది. కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. పాఠశాల దశలోనే వివిధ చిత్రలేఖన పోటీల్లో బహుమతులు అందుకుంది.
అవార్డులు.. ప్రశంసలు..
విజయలక్ష్మి ప్రతిభను గుర్తించిన రాష్ట్ర వికలాంగుల సంఘం సహకారంతో రవీంద్ర భారతిలో పలుమార్లు చిత్రలేఖన ప్రదర్శనలు నిర్వహించి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును అందుకుంది. త్యాగరాయ గానసభలో ప్రతిభా పురస్కారాలను అందుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ చేపట్టిన ఆన్‌లైన్ కాంపిటేషన్‌లో వరుసగా మూడేళ్లు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్‌తో పాటు అవార్డులను గెలుచుకుంది. తెలంగాణ ఐకాన్ 2024, బుల్లితెర అవార్డు, తెలంగాణ సేవారత్న– 2025 వంటి అవార్డులనూ అందుకుంది. ఇప్పటివరకూ సుమారు వందకు పైగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుంది.
చిన్ననాటి నుండే..
చిత్రలేఖనం అంటే చిన్ననాటి నుండే ఇష్టం. మా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నా ఎన్నడూ నిరాశపడకుండా కుటుంబ సభ్యుల పోత్సాహంతో ప్రాక్టీస్ చేశా. గిన్నిస్ వరల్డ్ రికార్డు నుంచి గోల్డ్ మెడల్ (Gold Medal) సాధించడం ఆనందాన్నిచ్చింది. అనేక మంది ప్రముఖల ప్రశంసలు పొందాను.
– విజయలక్ష్మి, తుర్కపల్లి
మూడేళ్ల మోక్ష్ ప్రపంచ రికార్డు
జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్స్ ఆత్మకూరి రామారావు స్కూల్లో నర్సరీ చదువుతున్న మోక్ష్ అయాన్ సేవల (Moksh Ayaan Sevala) ప్రపంచ రికార్డు సృష్టించాడు. మూడేళ్ల ఐదు నెలల వయసున్న ఈ చిన్నారి ఇటీవల జరిగిన వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టైటిట్‌లో భాగంగా అత్యంత వేగంగా పజిల్ సాల్వింగ్‌తో పాటు కలర్ మ్యాచింగ్‌లో అందరి కంటే ముందు నిలిచాడు. 3–5 ఏళ్ల కేటగిరీలో పాల్గొన్న మోక్ష్ కేవలం 11 సెకన్లలోనే ఈ పజిల్‌ను సాల్వ్ చేసి రికార్డ్ బ్రేక్ చేశాడు.

పాఠశాలకు చెందిన ప్రీ ప్రైమరీ కో–ఆరినేటర్ విశాల్ అమిన్ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించడం అద్భుతమన్నారు. విద్యార్థి ఘనతను స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలతానాయర్ ప్రశంసించారు. ఈ ఘనత తమ స్కూలుకే గర్వకారణమని, భవిష్యత్తులో ఇలాంటి రికార్డులు మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు. బాలుడికి పాఠశాల నుంచి సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఇలాంటి విద్యార్థులు మిగతా వారికి స్ఫూర్తిగా నిలుస్తారన్నారు.
చదవండి: పక్షులపై ప్రేమతో వేల మైళ్ల ప్రయాణం
Comments
Please login to add a commentAdd a comment