స్నేహ శిల్పం | Sakshi special Story about Dr. Snehalata Prasad Paintings | Sakshi
Sakshi News home page

స్నేహ శిల్పం

Published Thu, Mar 27 2025 4:33 AM | Last Updated on Thu, Mar 27 2025 4:33 AM

Sakshi special Story about Dr. Snehalata Prasad Paintings

ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌

వరల్డ్‌ ఆర్ట్‌ మార్కెట్‌లో మన ఆర్ట్‌ వాటా 0.5 శాతమే!   అసలు విలువ రెండువేల కోట్లకు పైమాటే అని  చెబుతున్నారు నిపుణులు! మరెందుకు అంత తక్కువంటే.. 
‘మనకు ఆర్ట్‌ను మార్కెట్‌ చేసుకోవడం తెలీక’ అంటారు ఆర్ట్‌లో  పీహెచ్‌డీ, ఆర్ట్‌ ట్రేడ్‌లో అపార అనుభవం గడించిన హైదరాబాద్‌  కళాకారిణి, శిల్పి డాక్టర్‌ స్నేహలతా ప్రసాద్‌. ఆమె పరిచయం.. .

డాక్టర్‌ స్నేహలతా ప్రసాద్‌ సొంతూరు జోద్‌పూర్‌. తండ్రి దివాన్‌సింగ్‌ నరూకా డిఫెన్స్‌లో పనిచేసేవారు. అమ్మ.. లీలా దివాన్‌ హోమ్‌ మేకర్‌. ఆడపిల్లల మీద ఆంక్షలుండే రాజపుత్ర కుటుంబమైనా తల్లిదండ్రులిద్దరూ చదువుకున్నవారవడంతో స్నేహలతకు స్వేచ్ఛనిచ్చారు. ఆమె డాక్టర్‌ అవ్వాలని తండ్రి ఆశపడ్డాడు. 

కానీ స్నేహకు చిన్నప్పటి నుంచీ డ్రాయింగ్‌ అంటే ఆసక్తి. చక్కగా బొమ్మలు వేసేది. ఆర్మేచర్, క్లే ఆర్ట్‌ మీద వ్యాక్స్‌తో అలంకరించేది. అది గమనించే లీలా దివాన్‌ కూతురు ఆర్టిస్ట్‌ అవ్వాలని కోరుకుంది. ఆమె అనుకున్నట్టే స్నేహ ఆర్టిస్ట్‌ అయింది. పీహెచ్‌డీ చేసింది. తన ఆర్ట్‌ని మార్కెట్‌ చేసుకునే ఆర్టూ తెలిసుండాలని ఫారిన్‌ ట్రేడ్‌ కోర్స్‌ కూడా చేసింది. సొంతంగా గ్యాలరీ పెట్టుకుంది. ఆర్ట్‌ + 2ఎగ్జిబిషన్స్‌ లో ఆమె పెయింటింగ్స్‌ ఎమ్మెఫ్‌ హుస్సేన్‌ పెయింటింగ్స్‌తో సమంగా సేల్‌ అయ్యేవి! అలా రాజస్థాన్‌లో టాప్‌ టెన్‌ యంగ్‌ ఆర్టిస్ట్స్‌లో ఒకరుగా నిలిచింది.

పెళ్లితో...
సంప్రదాయ రాజపుత్ర కుటుంబాల నుంచి వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ పెళ్లయ్యాక స్నేహ గృహిణిగా ఉండాలనే షరతుతో వచ్చినవే! దాంతో వాటిని తిరస్కరించారు స్నేహ తల్లిదండ్రులు. అప్పుడే స్నేహా వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఒక సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి డాక్టర్‌. నాన్‌మెడికల్‌ ప్రొఫెషన్‌ అమ్మాయి కోసం వెదుకుతున్నాడతను. అందరికీ నచ్చడంతో 2004లో పెళ్లి అయింది. అతని పేరు డాక్టర్‌ ప్రసాద్‌ పత్రి. తెలుగు వ్యక్తి. అయితే అది రాజ్‌పుత్‌ సంబంధం కాదని ఆ పెళ్లికి స్నేహా వాళ్ల దగ్గరి బంధువులెవరూ రాలేదు. కొత్తదంపతులు హైదరాబాద్‌ వచ్చేశారు. పెళ్లయిన వెంటనే పిల్లలు పుట్టడంతో మాతృత్వాన్ని ఆస్వాదించాలనుకుంది స్నేహ. దాంతో పెయింటింగ్‌కి బ్రేక్‌ పడింది.

సెకండ్‌ ఇన్నింగ్స్‌...
పదేళ్ల తర్వాత మళ్లీ కాన్వాస్‌ ఫ్రేమ్‌ చేసుకుంది స్నేహ. అయితే అదంత ఈజీ కాలేదు. పెళ్లికిముందు ఆర్టిస్ట్‌గానే కాదు మంచి ఆంట్రప్రెన్యూర్‌గానూ స్పేస్‌ సంపాదించుకున్న ఆమెకు ఈ పదేళ్లలో చాలా మారిపోయినట్టనిపించింది. దాంతో జీరో నుంచి స్టార్ట్‌ చేయాల్సి వచ్చింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఫస్ట్‌ షో కోసం ఢిల్లీ లలిత కళా అకాడమీని బుక్‌ చేసుకుంది. నెల రోజుల్లో ప్రదర్శన. బ్రేక్‌ తీసుకున్న పదేళ్ల కాలాన్నే పద్నాలుగు పెయింటింగ్స్‌ తో వ్యక్తపరచింది. మరోటి ‘గోల్డెన్‌ ఎరా ఆఫ్‌ ఇండియన్‌ పెయింటింగ్‌’. తనను ఇన్‌స్పైర్‌ అండ్‌ ఇన్‌ఫ్లుయెన్స్‌ చేసిన ఆర్ట్‌ఫామ్స్‌ని ట్రాన్స్‌పరెంట్‌ ఫామ్‌లో వేసిన 32 అడుగుల తన తొలి పెద్ద పెయింటింగ్‌. దాని కోసం చాలా  కష్టపడింది. ఆ శ్రమ వృథా కాలేదు. కాంప్లిమెంట్స్‌తోబాటు కాసులూ వచ్చాయి. లలిత కళా అకాడమీలో ఆమెకు లభించిన ఆదరణ చూసి భర్త ప్రసాద్‌ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆమె కెరీర్‌కి సపోర్ట్‌గా నిలిచారు.

శిల్పం...
2013లో లలిత కళా అకాడమీ వాళ్లదే సిమ్లాలో ఆర్ట్‌ క్యాంప్‌ ఉంటే వెళ్లింది స్నేహ. అందులో పెయింటింగ్, స్కల్‌ప్చర్‌ రెండూ ఉన్నాయి. అక్కడ వుడ్‌ స్కల్‌ప్టింగ్‌ చూసేసరికి ఒక్కసారిగా తన చిన్నప్పటి స్కల్‌ప్టింగ్‌ ఆశ రెక్కలు తొడుక్కుంది. స్కల్‌ప్టింగ్‌కి ప్రయత్నించింది. తొలుత క్లే మోడలింగ్‌తో స్కల్‌ప్టింగ్‌ జర్నీ స్టార్ట్‌ చేసింది. తర్వాత స్టోన్‌ వర్క్‌ మొదలుపెట్టింది. ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ మినిస్ట్రీ జూనియర్‌ ఫెలోషిప్‌ కూడా పొందింది. ఎన్నో ఆర్ట్‌ క్యాంప్స్, నేషనల్, ఇంటర్నేషనల్‌ సింపోజియమ్స్‌ను నిర్వహించింది. ఈ మధ్యనే  25వ సోలో షో చేసింది. ఇంటర్నేషనల్‌ ఆర్ట్‌ షోస్‌నూ క్యురేట్‌ చేస్తోంది. ఆర్ట్‌ లెక్చర్స్‌ ఇస్తుంది. లాంగెస్ట్‌ పెయింటింగ్‌ ఆఫ్‌ ఇండియాలో పేరు సంపాదించింది. హైదరాబాద్‌లో ‘స్నేహా డి ఆర్ట్స్‌’ పేరుతో గ్యాలరీప్రారంభించింది. పెయింటింగ్, స్కల్‌ప్చర్‌లో శిక్షణ ఇస్తోంది. సంప్రదాయానికి విరుద్ధంగా తనను చదివించినందుకు, కళారంగంలో ప్రోత్సహించినందుకు ఎవరైతే స్నేహ కుటుంబాన్ని విమర్శించారో వాళ్లంతా స్నేహను చూసి మొత్తం ఖాన్‌దాన్‌కే ఖ్యాతినార్జించి పెట్టిందని గర్వపడే స్థాయికి ఎదిగింది. 
– సరస్వతి రమ

స్నేహలతా ఆర్ట్‌ క్రెడిట్స్‌
రాజస్థాన్, ఢిల్లీ, హరియాణా హైవై, పుణె, హైదరాబాద్, కొత్తగూడెంలలో స్కల్‌ప్టింగ్‌ చేసింది. దేశంలోని పలుప్రాంతాల్లో పదిహేను ఎన్వైర్‌మెంట్‌ ఫ్రెండ్లీ పార్క్స్‌ను డిజైన్‌ చేసింది. సికంద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోనూ స్కల్‌ప్టింగ్‌ చేసింది. వందల ఏళ్ల నాటి శిల్పాలను రెస్టొరేట్‌ చేసింది. ఏఐ ఇంటిరీయర్‌ డిజైన్‌ చేస్తోంది. బికనీర్‌ ఆర్మీ కోసమూ పనిచేస్తోంది.

‘కళతోపాటు మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకునే స్కిల్‌ కూడా ఉండాలి. ఎమ్మెఫ్‌ హుస్సేన్‌ సాబ్‌ గనుక తన మార్కెట్‌ను డెవలప్‌ చేసుకోకపోయి ఉంటే ఈరోజు ఆయన ఎవరికీ తెలిసుండేవారు కాదు. ఆర్ట్‌కి మార్కెట్‌ అంత ఇంపార్టెంట్‌. ఆర్ట్‌ అకడమిక్స్‌లోనూ మార్కెటింగ్‌ని చేర్చాలి. విమెన్‌ ఆర్టిస్ట్‌లు  తమ పరిధిని విస్తృతం చేసుకోవాలి. బడ్డింగ్‌ ఆర్టిస్ట్‌లకు చెప్పేదొకటే.. ఓన్‌ స్టయిల్‌ను తద్వారా ఓన్‌ మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకోవాలి.’
– డాక్టర్‌ స్నేహలతా ప్రసాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement