ఓం నమః శివాయ నామస్మరణతో శ్రీగిరి మారుమ్రోగింది. శ్రీశైలాలయ పరిసరాల్లో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కింది.
శ్రీశైలం, న్యూస్‌లైన్: ఓం నమః శివాయ నామస్మరణతో శ్రీగిరి మారుమ్రోగింది. శ్రీశైలాలయ పరిసరాల్లో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కింది. గువారం రాత్రి శ్రీభ్రమరాంబా మల్లికార్జునుల కల్యాణోత్సవం తిలకించిన భక్తులు.. శుక్రవారం స్వామి, అమ్మవార్ల రథోత్సవంలో పాల్గొని తన్మయత్వం చెందారు. మండల దీక్ష స్వీకరించిన శివస్వాములు దేవదేవుని దర్శనంతో పులకించిపోయారు.
సాయంత్రం 5 గంటలకు వేద మంత్రోచ్ఛారణ.. మంగళ వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణం నుంచి పల్లకీలో ఊరేగింపుగా రథశాల వద్దకు చేర్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన రథంపై కల్యాణోత్సవ మూర్తులను అధిష్టింపజేయగా.. అశేష భక్తజనం జయజయధ్వానాల నడుమ రథోత్సవం కనులపండువగా ముందుకు సాగింది. అనాదిగా వస్తున్న ఆచారంలో భాగంగా భక్తులు అరటి పండ్లను రథంపైకి విసిరి కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. ఇసుకేస్తే రాలనంత జనం మధ్య సాగిన రథోత్సవంలో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
గొరవయ్యల నృత్యం.. ఢమరుక నాదాలు.. బుట్టబొమ్మలు.. నందికోలు.. బంజారాల నృత్యం ప్రత్యేకత ఆకర్షణగా నిలిచాయి. రథశాల నుంచి మొదలైన రథోత్సవం అంకాలమ్మగుడి, నంది మండపం మీదుగా తిరిగి యథాస్థానానికి చేరుకుంది. అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయ ప్రాంగణం చేర్చారు. జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్‌ఆజాద్, ట్రస్ట్‌బోర్డు సభ్యులు పత్తి వెంగన్న, చుండు ప్రశాంత్, దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ, ఈఈ రమేష్, ఆలయ ఏఈఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.