నార్త్ ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారిచే అవార్డు అందుకుంటున్న వెంకటేష్
సాక్షి, కొల్లాపూర్: రంగస్థల నటనలో అభినయం, పాటలు పాడటంలో ప్రతిభ, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కొల్లాపూర్‌కు చెందిన వెంకటేష్. వృత్తిరీత్యా స్థానిక ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో ఫార్మాసిస్టుగా పనిచేస్తూనే కళలపై తనకున్న మక్కువను ప్రదర్శిస్తున్నాడు. ఆయన ప్రతిభకు పలు అవార్డులు, ప్రశంసలు దక్కాయి. కొల్లాపూర్‌లో సాంస్కృతిక ప్రదర్శనల నిర్వహణలో తప్పనిసరిగా వెంకటేష్ పాత్ర ఉంటుంది.
20 ఏళ్లుగా కళాకారుడిగా..
నటన పట్ల తనకున్న మక్కువతో వెంకటేష్ రంగస్థల నాటకాలు వేయడంలో శిక్షణ పొందాడు. వెంకటేష్ నాటకరంగంలోకి ప్రవేశించాక తన సహచరులతో కలిసి శృతిలయ కల్చరల్ అకాడమీని స్థాపించారు. అకాడమీ ద్వారా ఎంతోమందికి నాటకాలపై శిక్షణ ఇచ్చారు. చిన్నారులకు కూచిపూడి, భరతనాట్యం నేర్పించారు. పాటలు పాడటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
నియోజకవర్గంలో చాలామంది నాటకరంగ కళాకారులు శృతిలయ అకాడమీ ద్వారానే సమాజానికి పరిచయమయ్యారు. అకాడమీ ఏర్పాటు చేసి, నాటకరంగ శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలకు శృతిలయ అకాడమీనే శ్రీకారం చుట్టింది. శృతిలయ కల్చరల్ అకాడమీ పేరుతో వందలాది నాటక ప్రదర్శనలు నిర్వహించారు.
వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు
శృతిలయ అకాడమీ ద్వారా 20 సంవత్సరాలుగా నియోజకవర్గంలో నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించే సంబరాలు, కృష్ణానది పుష్కరాలు, పర్వదినాలు, జాతరల్లో నాటకాలు ప్రదర్శించారు. వెంకటేష్ ప్రతిభను గుర్తించి మహారాష్ట్రలోని కొల్హాపూర్ నాటకరంగం, వారణాసి, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నాటకరంగం వారు ఏకపాత్రాభినయ ప్రదర్శనలకు ఆహా్వనించారు. వీటితోపాటు రవీంద్రభారతి, త్యాగరాయగానసభ, సుందరయ్య విజ్ఞానకేంద్రం, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రదర్శనలు ఇచ్చారు.
బాలనాగమ్మ, సత్యహరిశ్చంద్ర, విప్రనారాయణ, శ్రీరామాంజనేయ యుద్ధం, భక్త చింతామణి, వేంకటేశ్వర మహాత్యం, మహాభారత సన్నివేశాలు ఇలా ఎన్నో రకాల నాటకాలను వెంకటేష్ నేతృత్వంలోని బృందం ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. నాటకం వేసే సమయంలో ఆయన హావాభావాలు, పద్యవచనాలు ఆహుతులను ఆకట్టుకుంటాయి. సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకంలో హరిశ్చంద్ర పాత్రను వందసార్లు, భక్త చింతామణి నాటకంలో భవానీ శంకర్ పాత్రను 60 సార్లు, శ్రీకృష్ణ రాయభారం నాటకంలో శ్రీకృష్ణుని పాత్రను 35 సార్లకుపైగా పోషించాడు.
అవార్డులు.. ప్రశంసలు
కళారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను అక్టోబర్‌లో వెంకటేష్ చెన్నైలోని గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. నవంబర్‌లో అదే యూనివర్సిటీ నుంచి భారత కళారత్న అవార్డు వరించింది. వీటితోపాటు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నుంచి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, రిటైర్డ్ హైకోర్టు జడ్జిలచే అవార్డులు స్వీకరించారు. తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్‌చే రాష్ట్రస్థాయి అవార్డు, డాక్టర్ సి.నారాయణరెడ్డి, గుమ్మడి గోపాలకృష్ణ వంటి వారితోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులచే అవార్డులు, సత్కారాలు అందుకున్నారు.
ముందు తరాలకు అందిస్తా..
ప్రస్తుత సమాజంలో సంప్రదాయ కళలకు సరైన ప్రాధాన్యం లేదు. పాశ్చాత్య పోకడల వైపు యువత వెళ్తున్నారు. సంప్రదాయ కళలైన శాస్త్రీయ సంగీతం, లలిత కళలు, నాటకరంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని ముందు తరాలకు అందించాలనే సంకల్పంతోనే శృతిలయ కల్చరల్ అకాడమీ స్థాపించి శిక్షణ ఇస్తున్నా. సంప్రదాయ కళాకారులకు ప్రభుత్వంతోపాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ తగిన సహకారం ఇవ్వాలి.
– వెంకటేష్, కళాకారుడు
Comments
Please login to add a commentAdd a comment