అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
Published Tue, Aug 16 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
హన్మకొండ అర్బన్ : హన్మకొండ పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంపై కస్తూర్బా విద్యార్థులు చేసిన ‘లేవండోయ్... రారండోయ్... ఊరూవాడ కదలండి’ అంటూ చేసిన బృంద నృత్యం ఆకట్టుకుంది. మల్లికాంబ మనోవికాస కేంద్రం విద్యార్థుల సుజలాం... సుఫలాం నృత్యం, భీమారం ఎస్‌ఆర్‌హెచ్ విద్యార్థుల ప్రదర్శన, కాజీపేట ఫాతిమా స్కూల్ విద్యార్థుల లండన్‌దేఖో.. ప్రదర్శన దేశభక్తిని ప్రేరేపించేలా ఉన్నాయి.
ఛాయా చిత్రం.. ప్రగతికి ప్రతిరూపం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్రదర్శన వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిభింబించాయి. జిల్లాలో వివిధ సందర్భాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ మధుసుదనాచారి, కలెక్టర్ వాకాటి కరుణ పాల్గొన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల చాయా చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డీపీఆర్వో శ్రీనివాస్, ప్రచార సహాయకులు విధుమౌళి పాల్గొన్నారు.
శకటాలు అదుర్స్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా పరేడ్‌గ్రౌండ్‌లో వివిధ ప్రభుత్వ శాఖలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన శకాటాల ప్రదర్శనను ఆహుతులు ఆసక్తిగా తిలకించారు. వ్యవసాయ, పర్యాటక, గృహనిర్మాణం, డీఆర్‌డీఏ, వైద్యారోగ్యశాఖ, డ్వామా, ఐటీడీఏ, సర్వశిక్షాభియాన్, ఐసీడీఎస్, అటవీ, పశుసంవర్థక శాఖ, మిషన్ భగీరథ శకటాలు ప్రదర్శించారు. వీటిలో గుప్పెడు బియ్యం, గుడుంబా నిర్మూలనపై ఏర్పాటు చేసిన డీఆర్‌డీఏ శకటానికి ప్రథమ బహుమతి, ఆర్‌డబ్ల్యూస్ శకటానికి ద్వితీయ బహుమతి, వైద్యారోగ్య శాఖ శకటానికి తృతీయ బహుమతి లభించాయి.
తొలిసారి స్టాల్స్ ఏర్పాటు
పరేడ్ గ్రౌండ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్‌ను తొలిసారి ఏర్పాటుచేశారు. ఇందులో వివిధ శాఖల ద్వారా ప్రదర్శించిన సైకిళ్లు, ఇతర పరికరాలను కార్యక్రమం అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లబ్ధిదారులకు అందజేశారు.
Advertisement