బాల దిగ్గజాలు
పట్టుమని పదేళ్లు కూడా నిండని పిల్లలు.. రంగస్థలంపై రసరమ్యంగా నటించారు. ఏదో చిన్నాచితకా వేశాలు కాదండోయ్.. ఏకంగా రాయల వైభవాన్ని కళ్లకు కట్టారు. ప్రబంధకాలం నాటి అష్టదిగ్గజాలుగా ఒదిగిపోయిన బాల దిగ్గజాలు తమ నటనతో ఔరా! అనిపించుకున్నారు. కృష్ణరాయల కీర్తి, మహామంత్రి తిమ్మరుసు ధీయుక్తిని.. వికటకవి తెనాలి రామలింగడి చాతుర్యాన్ని ప్రదర్శించి నటనలో తమకు తామే సాటని నిరూపించుకున్నారు ఆ బాలలు.
ముద్దు ముద్దు మాటలు.. అనుకరణ తొంగిచూడని అభినయం.. ఈ చిన్నారుల సొంతం. అందుకే మహామహులకైనా తికమకపెట్టే పాత్రలు ఈ బుడతల దగ్గరకు వచ్చేసరికి నవరసాల్లో నాట్యమాడాయి. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య భువనవిజయాన్ని మరోసారి చూసి తరించాయి. ‘గ్లోబల్ ఎడ్జ్ స్కూల్’ కలైడోస్కోప్ 2014-15 వార్షిక ఉత్సవాలను ‘ఎక్స్‌ప్రెషన్స్’ పేరుతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను రవీంద్రభారతిలో శుక్రవారం నిర్వహించింది. శ్రీకృష్ణదేవరాయలు పాలనలోని కొన్ని ఘట్టాల ఆధారంగా చిన్నారులు ప్రదర్శించిన నాటకం అందరి మన్ననలు అందుకుంది.
భువన విజయం..
అష్ట దిగ్గజాలు కొలువుదీరిన రాయల ఆస్థానం భువనవిజయంగా చారిత్రక ప్రశక్తి పొందింది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో భువనవిజయం కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. తెలుగు, సంస్కృత భాషా పండితులు అష్టదిగ్గజాల పాత్రల్లో అలరిస్తారు. అలాంటి ఇతివృత్తాన్ని ఎంచుకున్న ఒకటో తరగతి విద్యార్థులు చారిత్రక పాత్రల్లో జీవించారు. రాయలుగా కార్తీక్, తిమ్మరుసుగా సాయిధ్రువ్, తెనాలి రామకృష్ణుడుగా గీతేష్‌రెడ్డి, మిగిలిన కవులుగా మౌర్య, వరుణ్‌తేజ, సూర్యతేజ, సాయి శ్రీహిత్, వీణహంసిని, జయదేవ్‌లు, ఇతర పాత్రల్లో అల్లా రన్వీ శ్రీ, శశాంక్ నటించారు. రాయలు, రామకృష్ణ కవి మధ్య జరిగిన సరదా సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అవకాశం ఇస్తే మహా నటులకు తామేం తీసిపోమని నిరూపించారు.
తెర వెనుక..
ఒకప్పుడు స్కూల్స్‌లో కల్చరల్ ఈవెంట్స్ అంటే.. ఒకట్రెండు రోజులు ప్రాక్టీస్ చేసి తమ ప్రతిభను ప్రదర్శించేవారు. అయితే పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా సరికొత్త ఈవెంట్లు డిజైన్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. పౌరాణిక, చారిత్రక నాటకాలను వారితో వేయించి.. చరిత్ర మూలాలను పిల్లలకు అర్థమయ్యేలా చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ‘పౌరాణిక, చారిత్రక నాటకాలు కనుమరుగవుతున్నాయి. చరిత్ర, సాహిత్యం పరిస్థితి ఇలాగే ఉంది. అందుకే ఈ నాటకం పిల్లలతో వేయించాను. నెల రోజులు ప్రాక్టీస్ చేయించాను. ఈ పిల్లలు ఇంత అద్భుతంగా నటిస్తారని అనుకోలేదు’ అని పిల్లలతో దగ్గరుండి నాటకం వేయించిన తెలుగు ఉపాధ్యాయురాలు గాయత్రీ శ్రీరామ్ తెలిపారు.
పసి మనసుల్లో..
తమ అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న చిన్నారులు.. పెద్దలు చూపిన దారిలో ముందుకెళ్తామని చెబుతున్నారు. పాలనతో మేధావులకు పెద్ద పీఠ వేస్తానని రాయల పాత్ర పోషించిన కార్తీక్ చెబుతున్నాడు. తెనాలి రామకృష్ణుడిలా తానూ జీనియస్ అని నిరూపించుకుంటానని తెలిపాడు గీతేష్ రెడ్డి. అంతే కాదు మరిన్ని పౌరాణిక నాటకాలు వేస్తామని చెబుతున్న చిన్నారులకు జేజేలు చెబుదాం.
..:: కోన సుధాకర్‌రెడ్డి