వాక్ ఫర్ కాజ్
పిల్లా.. పెద్దా.. చేతులు కలిపారు. ఆకలి, పౌష్టికాహార లోపంతో చిన్నారులు పడుతున్న ఇబ్బందులపై అవగాహన కల్పించేందుకు అడుగులు కదిపారు. వరల్డ్ విజన్ ఇండియా సోమవారం నిర్వహించిన ఈ ‘24 అవర్ ఫామిన్- వాకథాన్’లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీ వద్ద ప్రారంభమైన వాకథాన్ హరిహరకళాభవన్ వద్ద ముగిసింది. బుల్లితెర ఆర్టిస్టులు లోహిత్, షాని, మధు, పవన్‌సాయి, శిరీష, గణేష్, భాస్కర్, సంగీత దర్శకుడు హేమంత్‌కుమార్.. పాఠశాల, కళాశాలల విద్యార్థులు, సాధారణ పౌరులతో కలసి నడిచారు. పౌష్టికాహార లోపం చిన్నారుల్లో ఎలాంటి దుష్ఫలితాలు చూపిస్తుందో తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
24 గంటల ఫామిన్ అంటే...
‘పేదరికంలో మగ్గుతూ, ఆకలితో చనిపోతున్న పిల్లలను గుర్తు చేసుకొంటూ... 24 గంటల పాటు ఉపవాసం ఉండటం. సోమవారం ఉదయం పది గంటల నుంచి మంగళవారం ఉదయం పది గంటల వరకు ఈ వాకథాన్‌లో పాల్గొన్నవారందరూ తిండి ముట్టరు’ అని వరల్డ్ విజన్ ఇండియా ప్రోగ్రామ్ మేనేజర్ తెలిపారు.
- సాక్షి, సిటీ ప్లస్