
నేడు ‘సేవ్ ఏపీ’ సభ
‘ప్రతి గడపకు ఒక్కరు’ అనే నినాదంతో విజయవాడలో శుక్రవారం నిర్వహించనున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ ద్వారా ఎన్జీవోలు సమైక్య సమరశంఖం పూరించనున్నారు.
సాక్షి, విజయవాడ : ‘ప్రతి గడపకు ఒక్కరు’ అనే నినాదంతో విజయవాడలో శుక్రవారం నిర్వహించనున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ ద్వారా ఎన్జీవోలు సమైక్య సమరశంఖం పూరించనున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల ఏడో తేదీన జరిగిన సభను తలదన్నేలా దీన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సీమాంధ్ర నడిబొడ్డున జరుగుతున్న సభ కావడంతో దీని ప్రకంపనలు ఢిల్లీ పీఠానికి వినిపించేలా సమైక్యవాదులు కదలివస్తారని నిర్వాహకులు ఆశిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఎన్జీవోల సమ్మెపై హైకోర్టు వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
విజయవాడలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ జరిగే సమయానికే చర్చలకు రావాలని ఎన్జీవో అసోసియేషన్‌కు ప్రభుత్వం నుంచి పిలుపువచ్చింది. అయితే విజయవాడ, విశాఖపట్నాల్లో జరిగే సభల తర్వాతే ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని ఎన్జీవో నాయకులు భావిస్తున్నారు. హైదరాబాద్ సభకు ఉద్యోగులు మాత్రమే హాజరయ్యారు. ఈ సభకు ఉద్యోగులతోపాటు కార్మికులు, విద్యార్థులు, వివిధ జేఏసీలు, రైతులు, కూలీలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వివిధ శాఖల సిబ్బంది, సాధారణ ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.
అందువల్ల ఈ సభ ప్రధాన లక్ష్యం రాష్ట్ర విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించడమేనని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు రక్షించుకోవాలి, విభజన జరిగితే ఎదురయ్యే సమస్యలు, నష్టాల గురించి వక్తలు సవివరంగా ప్రసంగిస్తారు. ఈ సభకు సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పి. అశోక్‌బాబు, మేధావుల ఫోరం నుంచి చలసాని శ్రీనివాస్, నల్లమోతు చక్రవర్తి తదితరులు మాట్లాడతారు. ఈ సభకు రాజకీయ నాయకులకు ఆహ్వానం పంపలేదు. ఒకవేళ వారు హాజరైతే సముచిత స్థానం కల్పించాలని ఎన్జీవో నేతలు భావిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు హాజరైతే సభకు వచ్చిన వారి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంపీ లగడపాటి ఢిల్లీలో మకాం వేసి ఉండగా, జిల్లామంత్రి పార్థసారథి తనకు సేవ్ ఆంధ్రప్రదేశ్ సమావేశం కన్నా కేబినేట్ భేటీ ముఖ్యమని ప్రకటించారు.
సాయంత్రం నాలుగు గంటలకు సభ
స్వరాజ్ మైదానంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సేవ్‌ఆంధ్రప్రదేశ్ సభ ప్రారంభమవుతుంది. దీని కోసం ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఉదయానికల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. వర్షం పడకపోతే లక్షమందికి తగ్గకుండా ఈ సభకు వస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇప్పటికే సభ నిర్వాహణకు 10 కమిటీలను ఏర్పాటు చేసి పనులు చురుగ్గా చేస్తున్నారు. విశాలమైన వేదికతో పాటు, బారికేడ్లు, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సభా వేదిక వద్ద బాంబుస్వ్కాడ్ తనిఖీలు నిర్వహించింది.
సభ వేదిక కు కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య పేరు, సభా ప్రాంగణానికి బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టారు. 35 వేల మంది వరకూ కూర్చునే విధంగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. సభకు హాజరైన వారికి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు నాలుగు లక్షల వాటర్ ప్యాకెట్‌లు సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీ కూడా సమ్మెలోఉన్న నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచి సభకు జనాన్ని తీసుకువచ్చేందుకు సుమారు 600 బస్సులు పెడుతున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు...
సభకు ముందు సమైక్యాంధ్ర ఉద్దేశాన్ని చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వంగపండు బృందంతో ప్రత్యేక కార్యక్రమం, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు, ఉంగుటూరు వారి డప్పువాయిద్యాలు ఏర్పాటు చేశారు.
బందరు రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు
విజయవాడ సిటీ : ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభ దృష్ట్యా బందరు రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణకు పలు చర్యలు చేపట్టినట్లు నగర పోలీసు కమిషనర్ బి. శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. సభకు వచ్చేవారి వాహనాల పార్కింగ్‌కు కొన్ని ప్రదేశాలు కేటాయించినట్లు వెల్లడించారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
బంద రు రోడ్డులో ఆర్టీసీ డిపో సెంటర్, ఆర్.జి.స్ట్రీట్, రాఘవయ్య పార్కు, ఆర్‌టీఏ కూడలి, వెటర్నరీ ఆస్పత్రి కూడలి వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తారు.
వాహనాల పార్కింగ్..
గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, ఉయ్యూరు వైపు నుంచి వచ్చే బస్సులు, నాలుగు చక్రాల మోటారు వాహనాలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిలుపుకోవాలి.
నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి మీదుగా వచ్చే, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలను పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో నిలపాలి.
ఏలూరు, గన్నవరం, రామవరప్పాడు మీదుగా వచ్చే వాహనాలు బిషప్ అజరయ్య స్కూల్ ఆవరణలో నిలపాలి.
సభకు హాజరయ్యేవారు తమ ద్విచక్ర వాహనాలను ఆర్‌టీఏ కార్యాలయం ఎదుటనున్న ఖాళీ స్థలంలో, సీఎస్‌ఐ చర్చి ఆవరణలో, ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో పార్క్ చేసుకోవాలి.