
బాండ్ల విడుదల ద్వారా ఏపీఎండీసీ సమీకరణ
పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
విజయనగరం జిల్లా గాజులరేగలో టీడీపీ కార్యాలయానికి రెండెకరాలు
ఇకపై పదోన్నతుల ద్వారానే ఎంపీడీవో పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) పలు రకాల బాండ్ల విడుదల ద్వారా రూ.9 వేల కోట్ల అప్పు సమీకరించుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయనగరం జిల్లాలోని గాజులరేగ గ్రామంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది.
టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఎకరానికి సంవత్సరానికి రూ.వెయ్యి అద్దె ప్రాతిపదికన 33 ఏళ్లపాటు రెండు ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పర్యాటకానికి భూముల కేటాయింపు పాలసీ–2024–29కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణం కోసం 27 ఎకరాల భూమి ఏపీఐఐసీకి బదలాయించేందుకు ఆమోదం తెలిపింది.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద వ్యవసాయ, సహకార శాఖకు 10.72 ఎకరాలు కేటాయించేందుకు, రాజమండ్రిలోని గోదావరి నదిపైన ఉన్న హేవ్ లాక్ వంతెనను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వీలుగా 116.974 ఎకరాల భూమిని, కాకినాడ జిల్లా తమ్మవరం గ్రామంలో 66.12 ఎకరాల భూమిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థకు కేటాయించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఏలూరు జిల్లా వేలయిర్‌పాడులోని ఆర్‌ఎస్‌నెంబర్ 74లో 5.75 ఎకరాలను ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించేందుకు నిర్ణయించారు.
చిత్తూరు జిల్లా జంగాలపల్లి గ్రామంలోని సెయింట్ గ్యాబ్రియేల్ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా సంస్థకు కేటాయించిన 4.64 ఎకరాల్లో నిర్మాణానికి మరో 18 నెలలు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో సెంచూరియన్ స్కూల్ ఆఫ్ రూరల్ ఎంటర్ర్‌పైజ్ మేనేజ్మెంట్ ట్రస్ట్–భువనేశ్వర్‌ను సెంచూరియన్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ట్రస్టు–విశాఖపట్నంగా మార్చుతూ తదనుగుణంగా ఏపీ ప్రైవేటు యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్–2016 (యాక్ట్ 18 ఆఫ్ 2018) సవరణ బిల్లు 2025ని శాసనసభ ఆమోదం కోసం పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.
సెంట్రల్ పూల్‌కు కొత్తగా 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, ఇన్ సర్వీసులో ఉన్న పీజీ డాక్టర్లు దానికనుగుణంగా వేతనాలు పొందడానికి వీలుగా పీజీ లీన్ ఉత్తర్వులు ఇవ్వడానికి ఆమోదించింది. కుప్పం నియోజకవర్గంలో రూ.5 కోట్లతో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గీత కులాలకు కేటాయించిన 335 మద్యం దుకాణాల్లో నాలుగు దుకాణాలను సొండి కులాల వారికి కేటాయిస్తూ చేసిన సవరణను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఏపీఈడీబీ)లో 22 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి
అనుమతిచ్చింది.
ఎంపీడీవోల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ రద్దు
ఏపీపీఎస్‌సీ ద్వారా ఎంపీడీవోల నియామక ప్రక్రియకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. ఎంపీడీవో ఖాళీలను ఇకపై పదోన్నతుల ద్వారానే భర్తీ చేస్తారు. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల సర్వీసు రూల్స్‌లో సవరణ తీసుకొచ్చే పలు ప్రతిపాదనలపై శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎంపీడీవో, డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్‌పీవో) ఇక ఒకే క్యాడర్‌గా కొనసాగుతారు.
జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) స్థాయిని డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. డీపీవో, డిప్యూటీ జడ్పీ సీఈవో పోస్టులతో పాటు డీడీవో పోస్టుల్లో మూడో వంతు నేరుగా నియామకం చేపట్టే విధానం తీసుకురానున్నారు. మండల స్థాయిలో పనిచేసే ఈవోపీఆర్‌డీలకు ఇక డిప్యూటీ ఎంపీడీవో హోదా కల్పిస్తారు. జడ్పీ సీఈవో పోస్టుల్లో సగం ఐఏఎస్ అధికారులను నియమించే నిబంధనను మంత్రివర్గం ఆమోదించింది.
ఐఏఎస్ అధికారులను నియమించని పక్షంలో జడ్పీ సీఈవో ఫీడర్ క్యాటరీ సిబ్బంది లేదా ఇతర శాఖ నుంచి డిప్యూటేషన్ విధానంలో నియమిస్తారు. వేరే శాఖ సిబ్బందికి పంచాయతీరాజ్ శాఖ నియామకాల్లో బాధ్యతలు అప్పగించే పక్షంలో అలాంటి వారికి ఇక ముందస్తు శిక్షణను తప్పనిసరి చేశారు.
సీబీఐ పరిధిలో ఉన్నా జోక్యం చేసుకోవాలి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ పరిధిలో ఉన్నప్పటికీ జోక్యం చేసుకోవాలని సీఎం చంద్రబాబు పోలీస్ అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం రాజకీయ అంశాలపై ఆయన మంత్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వివేకా హత్య కేసులో సాక్షులకు రక్షణ కల్పించాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించారు. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని, ఇప్పుడు వాచ్‌మెన్ రంగన్న అలానే మృతి చెందడం సందేహాస్పదంగా ఉందని చెప్పారు.
రంగన్న మృతికి సంబంధించిన వివరాలను సీఎం, మంత్రులకు డీజీపీ వివరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్యను తొలుత గుండెపోటుగా చెప్పారని, ఇప్పుడు వాచ్‌మెన్ రంగన్నను పోలీసులే చంపారని వైఎస్సార్‌సీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయని చెప్పినట్లు తెలిసింది. అందుకే ఆ పార్టీ కుట్రల గురించి అప్రమత్తంగా ఉండాలని తాను ముందు నుంచీ చెబుతున్నానని చంద్రబాబు అన్నట్లు సమాచారం.
పరిటాల రవి హత్య కేసులో సాక్షులు కూడా ఇలానే చనిపోతూ వచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురు సాక్షులు చనిపోయారన్నారు. రంగన్నను హత్య చేసి, దానిని ప్రభుత్వానికి ఆపాదించాలనే కుట్ర ఇందులో దాగి ఉందని పలువురు మంత్రులు అన్నట్లు తెలిసింది.