సమైక్య సమరం జిల్లాలో ఉవ్వెత్తున సాగుతోంది. సకల జనులు ఉద్యమబాటలో పయనిస్తున్నారు. ఆదివారం కడపలో సహకార సంఘాల ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం పూరించారు. పల్లెల నుంచి వెల్లువలా తరలివచ్చిన అన్నదాతలు, చేనేతలు, మహిళలు జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. సమైక్య పోరులో తుది వరకూ అలుపెరుగని పోరాటం చేస్తామని ప్రతిన బూనారు. రెండు నెలలు దాటినా సడలని సంకల్పంతో సమైక్యవాదులు ఉద్యమానికి కొత్త రూపు, ఊపు తెస్తున్నారు.
సాక్షి, కడప/అగ్రికల్చర్: పల్లెలన్నీ స్వచ్ఛందంగా సమైక్య ఉద్యమంలోకి తరలి వస్తున్నాయి. సమైక్య గర్జన చేస్తున్నాయి. ఆదివారం కడపలోని కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఎదుట జిల్లా నలుమూలల నుంచి అన్నదాతలు, మహిళలు, నేతన్నలు, కుల సంఘాలు, గృహ నిర్మాణ సంఘాల వారు స్వచ్ఛందంగా వేలాది మంది తరలివచ్చి సమైక్య శంఖారావం పూరించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సామూహిక దీక్షలు చేపట్టి ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు.
సమైక్య నినాదాల సెగ ఢిల్లీకి తాకేలా సింహాలై గర్జించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జోష్ నింపడంతోపాటు విభజన వల్ల కలిగే కష్టనష్టాలను కళ్లకు కట్టేలా కళాకారులు వివరించారు. సభనుద్దేశించి నేతలు చేసిన ప్రసంగాలు దీక్షాపరులు శ్రద్ధగా ఆలకించారు.
సభలో తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహానికి తొలుత పూలమాలలు వేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి డీసీసీబీ అధ్యక్షుడు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సహకార సమరాన్ని వీరు ఢంకా మోగించి ప్రారంభించారు. ఢంకా మోగిస్తున్నప్పుడు దీక్షా ప్రాంగణం జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తింది.
సహకార, డీసీసీబీ అధికారులు, జేఏసీ నేతలు వేదికపై చేతులు పట్టుకుని సమైక్యానికి సంఘీభావం తెలిపారు. సహకార స్ఫూర్తి రగిలించే ప్రార్థనా గీతంతో సభను ప్రారంభించారు. తొలుత డీసీసీబీ అధ్యక్షుడు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. డీసీసీబీ జీఎం సహదేవరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం సాగింది. అనుసంధాన కర్తగా సహకార కళాశాల ప్రిన్సిపాల్ గుర్రప్ప, నాన్ పొలిటికల్ జేఏసీ కో కన్వీనర్, డీఆర్వో ఈశ్వరయ్యలు వ్యవహరించారు. మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి సామూహిక దీక్షా శిబిరానుద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను స్తంభింపజేసినప్పుడే ఉద్యమ సెగ ఢిల్లీకి తాకుతుందని అన్నప్పుడు అందుకు తామంతా సహకరిస్తామని సభికులు నినాదాలు చేశారు. ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ కో కన్వీనర్ సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. రాష్ట్ర విభజన జరిగితే నష్టపోయేది గ్రామీణ ప్రాంత ప్రజలేనని, జల వివాదాలు, నీటి కష్టాలను వివరిస్తూ ఆయన చేసిన ప్రసంగం దీక్షా పరులను చైతన్య పరిచింది. దీక్షకు తరలివచ్చిన సహకార సంఘాల అధ్యక్షులు, రైతులు, నేతన్నలు, మహిళలు, కుల సంఘాల వారు మొక్కవోని దీక్షతో శిబిరంలో ప్రసంగాలు వింటూ, సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ కదలకుండా ఉండిపోయారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సహకార సమరం దీక్షా శిబిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కళాకారులు, చిన్నారుల నృత్యాలకు చప్పట్లతో అనూహ్య స్పందన లభించింది. ‘ఓ సోనియా ఓట్లు కావాలా, సీట్లు కావాలా?’ అని ఓ మహిళ ఆలపించిన జానపద గేయం సమైక్యవాదుల్లో ఊపు తెచ్చింది. తెలుగుజాతి మనది...నిండుగ వెలుగు జాతి మనది...అన్న గీతాలకు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ముగ్దుల్ని చేశాయి.
అంధ విద్యార్థి ఆలపించిన గీతం ఆకట్టుకుంది. దీంతోపాటు సమైక్యానికి దండు పెట్టు....సోనియాకు పిండం పెట్టు అన్నప్పుడు కచ్చితంగా పిండం పెడతామంటూ సభికులు నినదించారు. నేతల ప్రసంగాలు ఆకట్టుకోగా, దుర్యోధనుడి పాత్రలో మాచిరాజు వెంకటరమణ, జానపద కళాకారుడు గురవారెడ్డి ఆలపించిన సమైక్య గేయాలు సభికులను ఊర్రూతలూగించాయి. సత్యహర్చిశ్చంద్ర నాటకంతోపాటు సాస్కృతిక కార్యక్రమాలు జోష్‌ను నింపాయి.
గ్రామీణ ప్రాంతాల్లోకి...
ఉద్యమ స్వరూపం మారిపోయింది. గ్రామీణ ప్రాంతాల చేతుల్లోకి వెళుతోంది. జిల్లా వ్యాప్తంగా గత శుక్రవారం సర్పంచులు, వార్డు మెంబర్లతో జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఒకే వేదికపై సామూహిక దీక్షలు చేసి తీర్మానాలు చేసి ఢిల్లీకి పంపారు. ఆ సమైక్య సెగలు రగులుతున్నాయి. ఇదే స్ఫూర్తిగా సహకార సంఘాలు, డీసీసీబీ, సహకారశాఖ, మహిళా సంఘాలు, గృహ నిర్మాణ సంఘం, కుల సంఘాలు ఇలా అన్ని ఒకే వేదికపై సామూహిక దీక్షలు చేపట్టేందుకు ఊతమిచ్చాయి. అన్నదాతలు, నేతన్నలు, మహిళలు ఉద్యమంలో భాగస్వాములై కదం తొక్కుతున్నారు. ఇందులో భాగంగానే డీసీసీబీ ఎదుట సామూహిక దీక్షల ద్వారా బలమైన సమైక్య ఆకాంక్షను వెలిబుచ్చారు.
తరలి వచ్చిన నేతలు
సమైక్య సమరం సభకు జిల్లా వ్యాప్తంగా నేతలు, అధికారులు తరలి వచ్చారు. మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్‌బాష, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, డీసీసీబీ డెరైక్టర్లు, సొసైటీల అధ్యక్షులు, మహిళా, కుల, చేనేత సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలి రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ఈశ్వరయ్య, చేనేత జౌళిశాఖ ఏడీ సత్యనారాయణరావు, సహకార అధికారి గుర్రప్ప, డీసీఓ చంద్రశేఖర్, ఎన్జీఓ సంఘం కన్వీనర్ శ్రీనివాసులు, ఉపాధ్యాయ జేఏసీ నాయకుడు జమాల్‌రెడ్డి, ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మూర్తినాయుడు, సహకార రిజిస్ట్రార్ సుభాషిణి, కార్పొరేషన్ ఈడీ ప్రతిభాభారతితోపాటు పలువురు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డీసీసీబీ చైర్మన్ తిరుపాల్‌రెడ్డి, జీఎం సహదేవరెడ్దితోపాటు సహకార సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
సమర ఢంకా
Published Mon, Sep 30 2013 2:32 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
Advertisement
Advertisement