
7న ‘అంతరం’ నృత్యరూపకం
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో ప్రాచుర్యం పొందిన భరతనాట్యం, కూచిపూడి, మోహినీ ఆట్టం, తమిళనాట బహుళ ప్రాచుర్యం పొందిన కన్నగి ఇతివృత్తాలతో అంతరం పేరుతో బ్రహ్మాండమైన నృత్యరూపక కార్యక్రమం జరగనుంది.
తమిళసినిమా: తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో ప్రాచుర్యం పొందిన భరతనాట్యం, కూచిపూడి, మోహినీ ఆట్టం, తమిళనాట బహుళ ప్రాచుర్యం పొందిన కన్నగి ఇతివృత్తాలతో అంతరం పేరుతో బ్రహ్మాండమైన నృత్యరూపక కార్యక్రమం జరగనుంది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన ప్రముఖ వాణిజ్య సంస్థ ప్రిన్స్ జ్యువెలరీ ఆధ్వర్యంలో ఈ నెల 7న స్థానిక రాయపేటలో గల మ్యూజిక్ అకాడమీలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి సుహాసిని, నృత్య కళాకారిణులు గోపిక వర్మ, యామినిరెడ్డి, కృతిక సుబ్రమణియన్ నర్తించనున్నారు.
నాలుగు భాషల్లో నిర్వహించనున్న ఈ నృత్య రూపకానికి నటి సుహాసిని నేపథ్య సంభాషణలను ఆయా భాషలతోపాటు ఆంగ్లాన్ని కలిసి అందించనున్నట్లు ఆమె మంగళవారం సాయంత్రం స్థానిక రాయపేటలోని ప్రిన్స్ జ్యువెలరీ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడిం చారు. ఆమె మాట్లాడుతూ ఒకసారి ప్రముఖ నృత్య కళాకారిణి గోపికా వర్మ కలిసినప్పుడు నాట్య కళారంగం మరుగున పడిపోతోందని, దాన్ని బతికించుకోవడానికి కృషి చేయాలన్న ఆలోచనకు రూపకల్పన ఈ అంతరం నృత్యరూపకమే అని పేర్కొన్నారు.
మొత్తం 1.45 గంటల పాటు సాగే ఈ నృత్య రూపకంతో యామిని రెడ్డి, కృతిక సుబ్రమణియన్, గోపిక వర్మ నృత్యం 20 నిమిషాలు తాను నటించి నర్తించే ఓ కన్నగి ఇతివృత్తం సాగుతుందని తెలిపారు. తన నృత్యానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించడం విశేషంగా పేర్కొన్నారు. ఇంతకుముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన ప్రిన్స్ జ్యువెలరీ సంస్థ ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తోందని సుహాసిని చెప్పారు. ఈ సమావేశంలో యామినిరెడ్డి, కృతిక సుబ్రమణియన్, గోపిక వర్మ తదితరులు పాల్గొన్నారు.