కొత్తగూడెం అర్బన్, న్యూస్‌లైన్: బాలల కళల సౌధం బాలోత్సవ్-2013కు కొత్తగూడెం క్లబ్ ముస్తాబైంది. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు జరుగనున్న 22వ రాష్ట్రస్థాయి అంతర్ పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 22 అంశాలను 39 విభాగాలుగా చేసి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 15 వేల ఎంట్రీలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. బాలోత్సవ్ కోసం కొత్తగూడెం క్లబ్‌లో నాలుగు వేదికలను ఏర్పాటు చేశారు. రామాయణ ఘట్టాలు, మూఢనమ్మకాల పట్ల చైతన్యం కలిగించడం, పల్లె వాతావరణం, పండుగల ప్రాముఖ్యతను తెలిపే బొమ్మలు, కార్టూన్ చానళ్లలో వచ్చే చోటాభీమ్ వంటి బొమ్మలను ఆవరణలో ఏర్పాటు చేశారు. పలు రంగులతో క్లబ్‌ను తీర్చిదిద్దారు. 20 అడుగుల మిక్కీమౌస్ బొమ్మతో స్వాగత ద్వారాన్ని రూపొందించారు.
ప్రతిరోజు పలు అంశాలు..
శుక్రవారం ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు కొన్ని అంశాల చొప్పున మూడు రోజులపాటు పోటీలు కొనసాగుతాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎంట్రీలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది సుమారు 12 వేల మంది పోటీలకు హాజరయ్యారని, ఈ ఏడాది 15 వేలకు పైగా బాలబాలికలు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఎంట్రీల కౌంటర్, భోజనం టోకెన్ల కౌంటర్, ఫలితాల కౌంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. కొత్తగూడెం క్లబ్‌తోపాటు కేసీఓఏ క్లబ్‌లో సైతం పలు అంశాలపై పోటీలు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులతోపాటు వారివెంట వచ్చే సంరక్షకులకు సైతం ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించామన్నారు. బాలోత్సవ్‌లో స్వచ్ఛందంగా సేవలందించేందుకు స్థానిక శ్రీరామచంద్ర కళాశాలకు చెందిన ఎన్‌సీసీ కేడెట్లు 40 మంది, ప్రియదర్శిని డిగ్రీ కళాశాల, ధన్వంతరి కళాశాల నుంచి 80 మంది వలంటీర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సమాచారం అందించేందుకు వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు.
పిల్లలకు ఆహ్లాదం కలిగించేందుకే: వాసిరెడ్డి రమేష్‌బాబు, బాలోత్సవ్ కన్వీనర్
పిల్లల మనసు నిష్కల్మషంగా ఉంటుంది. తరతమ భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఒకరినొకరు పరిచయం చేసుకుని మిత్రులుగా మారుతుంటారు. ఎప్పుడూ చదువుల చుట్టూ తిరిగే వారి మనసును ఆహ్లాదంగా ఉంచాలనే ఉద్దేశంతోనే బాలోత్సవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. గత 22 ఏళ్లుగా ఈ వేడుకలను కొనసాగిస్తున్నాము. దీనికి అందరి సహకారం లభిస్తోంది.
గత ఏడాది కంటే ఈ ఏడాది స్పందన ఎక్కువగా వచ్చింది. అయితే ఎక్కువగా నాటకాలకు సంబంధించిన ఎంట్రీలు రావడం, అవి ప్రదర్శించే సమయం సరిపడక కొన్నింటిని తిరస్కరించాం. బాలోత్సవ్‌తో రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో కొత్తగూడెం పేరు మార్మోగుతోంది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు సాధించడంలో అందరి సహకారం ఉంది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు స్వచ్ఛందంగా వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని స్థానికులు కొందరు ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉంది.
రారండోయ్...
Published Fri, Nov 8 2013 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
Advertisement
Advertisement