దురాచారాల నివారణకు కళాజాత ప్రదర్శనలు
♦ బెల్టుషాపులపై కొరడా
♦ నిర్వాహకులకు రూ.50 వేల జరిమానా
♦ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కేసులు
♦ నో పార్కింగ్ బోర్డుల ఏర్పాటుకు మున్సిపాలిటీకి లేఖ
♦ బహిరంగ ధూమపానం చేస్తే కఠినచర్యలు
♦ తాండూరు ఏఎస్పీ చందనదీప్తి
గ్రామాల్లో సాంఘిక దురాచారాల నివారణకు ప్రజలను చైతన్యం చేసేందుకు కళాజాత ప్రదర్శనలు నిర్వహిస్తాం. బెల్టుషాపులపై కొరడా ఝుళిపిస్తాం. అక్రమంగా కల్లు దుకాణాలు నిర్వహిస్తే సంబంధిత ఎస్‌ఐలపై చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు. బహిరంగంగా ధూమపానం చేస్తే కేసులు నమోదు చేస్తాం. - చందనదీప్తి, తాండూరు ఏఎస్పీ
తాండూరు: బాల్య వివాహాలు, రెండు గ్లాసుల పద్ధతి, మూఢనమ్మకాలు తదితర దురాచారాలపై నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో కళాజాత ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఏఎస్పీ చందనదీప్తి తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే ఈ కార్యక్రమాలు ఆరంభిస్తామన్నారు. సాంఘిక దురాచారాలపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో అక్రమ కల్లు దుకాణాలతోపాటు బెల్టుషాపులపై కొరడా ఝళిపించనున్నట్టు ఏఎస్పీ స్పష్టం చేశారు. సంబంధిత ఎస్‌ఐలు అక్రమ కల్లు దుకాణాలు, బెల్టుషాపులను అరికట్టాలని ఆదేశించినట్టు చెప్పారు. ఈ విషయంలో తనిఖీలు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తనిఖీల్లో బెల్లుషాపులు, అక్రమ కల్లు దుకాణాలు ఉన్నట్టు తేలితే సదరు ఎస్‌ఐలపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని చందనదీప్తి స్పష్టం చేశారు. బెల్టుషాపులు నిర్వహిస్తూ మొదటిసారి పట్టుబడితే బైండోవర్ చేస్తామని, రెండోసారి అయితే రూ.50 వేల జరిమానా విధించనున్నట్టు ఏఎస్పీ స్పష్టం చేశారు. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. పట్టణంలోని బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, హోటళ్ల వద్ద ద్విచక్రవాహనాలు, ఇతర భారీ వాహనాలు అడ్డగోలుగా పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య వస్తున్నట్టు గుర్తించామన్నారు. ఆయా సంస్థల నిర్వాహకులకు, ట్రాన్స్‌పోర్టు సంస్థలకు నోటీసులు జారీ చేయాలని అర్బన్ సీఐ, ఎస్‌ఐలకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఆయా సంస్థల నిర్వాహకులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. వాహనదారులకు జరిమానాలతో పాటు వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. నో పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు లేఖ రాయనున్నట్టు చెప్పారు. బహిరంగంగా ధూమపానం చేసినా, ప్రజలకు అసౌకర్యంగా వ్యవహారించినా ఐపీసీ 290 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏఎస్పీ చందనదీప్తి హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని, పునరావృతమైతే కేసులు పెడతామని స్పష్టం చేశారు. పోలీసుశాఖ చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఏఎస్పీ చందనదీప్తి కోరారు.