ASP Chandana Deepti
-
తాండూరు ఏఎస్పీ చందనదీప్తికి పదోన్నతి
♦ నిజామాబాద్ అడిషినల్ ఎస్పీగా నియామకం ♦ యేడాదిన్నర పాటు పనిచేసిన ఏఎస్పీ ♦ ట్రాఫిక్ నియంత్రణ, షీ టీములతో మహిళల భద్రతకు కృషి తాండూరు: తాండూరు ఏఎస్పీ చందనదీప్తికి పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన చందనదీప్తిని నిజామాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ(ఓఎస్డీ)గా నియమితులయ్యారు. తాండూరు ఏఎస్పీగా 2015 ఫిబ్రవరిలో ఆమె బాద్యతలు చేపట్టారు. ఏడాదిన్నర కాలం పాటు ఇక్కడ పనిచేశారు. ఆ సమయంలో తాండూరు పరిధిలో షీ టీం ద్వారా మహిళలకు భద్రత కల్పించారు. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను పటిష్టం చేశారు. డివిజన్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గించేందుకు కృషి చేశారు. రెండు రోజుల్లో ఆమె నిజామాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
దురాచారాల నివారణకు కళాజాత ప్రదర్శనలు
♦ బెల్టుషాపులపై కొరడా ♦ నిర్వాహకులకు రూ.50 వేల జరిమానా ♦ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కేసులు ♦ నో పార్కింగ్ బోర్డుల ఏర్పాటుకు మున్సిపాలిటీకి లేఖ ♦ బహిరంగ ధూమపానం చేస్తే కఠినచర్యలు ♦ తాండూరు ఏఎస్పీ చందనదీప్తి గ్రామాల్లో సాంఘిక దురాచారాల నివారణకు ప్రజలను చైతన్యం చేసేందుకు కళాజాత ప్రదర్శనలు నిర్వహిస్తాం. బెల్టుషాపులపై కొరడా ఝుళిపిస్తాం. అక్రమంగా కల్లు దుకాణాలు నిర్వహిస్తే సంబంధిత ఎస్ఐలపై చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు. బహిరంగంగా ధూమపానం చేస్తే కేసులు నమోదు చేస్తాం. - చందనదీప్తి, తాండూరు ఏఎస్పీ తాండూరు: బాల్య వివాహాలు, రెండు గ్లాసుల పద్ధతి, మూఢనమ్మకాలు తదితర దురాచారాలపై నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో కళాజాత ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఏఎస్పీ చందనదీప్తి తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే ఈ కార్యక్రమాలు ఆరంభిస్తామన్నారు. సాంఘిక దురాచారాలపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో అక్రమ కల్లు దుకాణాలతోపాటు బెల్టుషాపులపై కొరడా ఝళిపించనున్నట్టు ఏఎస్పీ స్పష్టం చేశారు. సంబంధిత ఎస్ఐలు అక్రమ కల్లు దుకాణాలు, బెల్టుషాపులను అరికట్టాలని ఆదేశించినట్టు చెప్పారు. ఈ విషయంలో తనిఖీలు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తనిఖీల్లో బెల్లుషాపులు, అక్రమ కల్లు దుకాణాలు ఉన్నట్టు తేలితే సదరు ఎస్ఐలపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని చందనదీప్తి స్పష్టం చేశారు. బెల్టుషాపులు నిర్వహిస్తూ మొదటిసారి పట్టుబడితే బైండోవర్ చేస్తామని, రెండోసారి అయితే రూ.50 వేల జరిమానా విధించనున్నట్టు ఏఎస్పీ స్పష్టం చేశారు. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. పట్టణంలోని బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, హోటళ్ల వద్ద ద్విచక్రవాహనాలు, ఇతర భారీ వాహనాలు అడ్డగోలుగా పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య వస్తున్నట్టు గుర్తించామన్నారు. ఆయా సంస్థల నిర్వాహకులకు, ట్రాన్స్‌పోర్టు సంస్థలకు నోటీసులు జారీ చేయాలని అర్బన్ సీఐ, ఎస్ఐలకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఆయా సంస్థల నిర్వాహకులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. వాహనదారులకు జరిమానాలతో పాటు వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. నో పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు లేఖ రాయనున్నట్టు చెప్పారు. బహిరంగంగా ధూమపానం చేసినా, ప్రజలకు అసౌకర్యంగా వ్యవహారించినా ఐపీసీ 290 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏఎస్పీ చందనదీప్తి హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని, పునరావృతమైతే కేసులు పెడతామని స్పష్టం చేశారు. పోలీసుశాఖ చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఏఎస్పీ చందనదీప్తి కోరారు. -
ఈ గజ దొంగపై 150 కేసులు
తాండూరు(రంగారెడ్డి): కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగను తాండూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా తాండూరు అర్బన్ ఇన్చార్జి సీఐ సైదిరెడ్డితో కలిసి ఏఎస్పీ చందన దీప్తి శుక్రవారం పట్టణ పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం గోవింద్ గ్రామానికి చెందిన షేక్ బోయ సోమశేఖర్ (36) కర్ణాటక రాష్ట్రం బళ్లారి శ్రీరాంపూర్ కాలనీ సమీపంలో గల పాండురంగ గుడి వద్ద నివాసం ఉండేవాడు. కూలి పనులు చేస్తూ భార్యపిల్లలను పోషించుకుంటూ తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో బళ్లారి, అనంతపురం జిల్లాల్లో పలు చోరీలకు పాల్పడి జై లుకెళ్లివచ్చాడు. అనంతరం భార్యాపిల్లలలో కలిసి ముంబైకి మకాం మార్చాడు. తాండూరులో చోరీలు.. గత ఏడాది అక్టోబర్ 7న తాండూరు గుమాస్తానగర్‌లోని మాణిక్యం ఇంటి తాళం పగుల కొట్టి మూడు తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.3,500 నగదు, 8న అదే కాలనీలోని పెయింటర్ రమేష్ ఇంటి తాళం పగుల కొట్టి ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.25 వేలు, ఈ ఏడాది ఫిబ్రవరిలో గాంధీనగర్‌లో వడ్ల బ్రహ్మయ్య ఇంట్లోంచి సెల్‌ఫోన్‌తోపాటు రూ.3 వేల నగదును అపహరించాడు. చోరీ చేసిన నగలను తాకట్టుపెట్టి డబ్బులతో జల్సా చేశాడు. కొన్ని ఆభరణాలను భార్య వద్ద దాచేవాడు. గత శుక్రవారం మళ్లీ తాండూరుకు వచ్చిన నిందితుడు బస్టాండ్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తుండంతో పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. విచారణలో చోరీలు చేసినట్టు ఒప్పుకున్నాడు. ఇదీ నేరచరిత్ర... మూడు రాష్ట్రాలోని బళ్లారి, అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశంతోపాటు రంగారెడ్డి జిల్లా (తాండూరు)లో ఇతనిపై 150 చోరీ కేసులున్నాయి.. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల్లో సుమారు 16ఏళ్లు జైలు జీవితం గడిపాడు. నిందితుడి నుంచి 4 తులాల బంగారు ఆభరణాలతోపాటు ఒక సెల్‌ఫోన్, రూ.3 వేల నగదును రికవరీ చేశారు. -
భవానీమాత ఆలయంలో చోరీ
- పురాతన పంచలోహ విగ్రహం, ఉత్సవ ప్రతిమ అపహరణ - హుండీ పగులగొట్టి డబ్బులూ.. - డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంతో వివరాల సేకరణ - పరిశీలించిన ఏఎస్పీ చందనదీప్తి - పాత తాండూరులో ఘటన తాండూరు రూరల్: ఓ పురాతన అమ్మవారి పంచలోహ విగ్రహంతో పాటు ఉత్సవ విగ్రహం, అమ్మవారి తాళిబొట్టు, హుండీలోని డబ్బును గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయారు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున తాండూరులో చోటుచేసుకుంది. పట్టణ సీఐ వెంకట్రామయ్య, ఆలయ కమిటీ సభ్యుల కథనం ప్రకారం.. పాత తాండూరులో భవానీమాత ఆలయం ఉంది. దాదాపు 350 ఏళ్ల పురాతన పంచలోహ విగ్రహం, ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో న్యాయవాది శ్రీనివాస్ అమ్మవారి దర్శనానికి వెళ్లాడు. అప్పటికే ఆలయం ద్వారం తాళం విరిగిపోయి కనిపించింది. గుడిలో ఉన్న అమ్మవారి పంచలోహ విగ్రహం కనిపించలేదు. దీంతో న్యాయవాది ఆలయ కన్వీనర్ నారా మహిపాల్‌రెడ్డితో పాటు స్థానికులకు విషయం తెలిపాడు. పట్టణ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐలు నాగార్జున, ప్రకాష్‌గౌడ్,రవి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భవానీమాత పంచలోహ విగ్రహం, ఉత్సహ విగ్రహం, ఇత్తడి ప్రమిదలు, హారతి పళ్లెం చోరీ అయిందని గుర్తించారు. దుండగులు ఆలయంలోని హుండీని పగులగొట్టి అందులో డబ్బులు తీసుకొని దానిని ఆలయం బయట పడేసి వెళ్లిపోయారు. తాను గురువారం రాత్రి 8 గంటల వరకు ఆలయంలోనే ఉండి తాళం వేసి వెళ్లిపోయానని పూజారి కిరణ్ సీఐకి చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం వికారాబాద్ నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలను రప్పించారు. పోలీసు జాగిలం ఆలయం నుంచి స్థానికంగా ఉన్న మాణిక్‌నగర్‌లోని ఇళ్ల వద్దకు వెళ్లి ఆగింది. ఆలయం వద్ద పెద్దఎత్తున స్థానికులు గుమిగూడారు. ఉద్రిక్తత చోటుచేసుకునే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం తాండూరు ఏఎస్పీ చందనదీప్తి సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అంతర్రాష్ట్ర దొంగలముఠా అయి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. త్వరలో దుండగులను పట్టుకుంటామని, స్థానికులు కూడా సహకరించాలని ఆమె కోరారు. పోలీసులు ఆలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చోరీ ఘటనపై పట్టణవాసులు నిరసన వ్యక్తం చేశారు. ఆలయ కన్వీనర్ నారా మహిపాల్‌రెడ్డి ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.