సాక్షి, హైదరాబాద్: వందల ఏళ్ల నాటి సాంస్కృతిక మూలాలను ఆవిష్కరించిన పరిశోధన..ఆదివాసీ, గిరిజన కళాత్మకతకు సమున్నతమైన ఆవిష్కరణ..ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆద్యకళాకృతుల ప్రదర్శన. ఆదికాలం కళారూపాలను భవిష్యత్ తరాలకు అందజేసేందుకు, ఆద్యకళను కాపాడేందుకు నాలుగున్నర దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు. సుమారు 2,000 ఆద్యకళాకృతులతో జూలై నుంచి ఆగస్టు చివరి వరకు జరిగిన ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది.
ఈ ప్రదర్శన తెలంగాణ సృజనాత్మకతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటింది. అయితే ఈ కళాసంపద ఇప్పుడు ప్రమాదంలో పడింది. దానిని కాపాడి జాతీయ, అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసేందుకు ప్రభుత్వం, సమాజం ముందుకు రావాలని ఆద్యకళకు ఆయువునివ్వాలని కోరుతున్నారు జయధీర్ తిరుమలరావు. ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
అవి సామూహిక వ్యక్తీకరణలు
ప్రకృతిలోని వివిధ రకాల వస్తువుల నుంచి ఉత్పన్నమయ్యే శబ్దాన్ని ఒడిసిపట్టుకొని సంగీత పరికరాలను సృష్టించారు. మృత జంతువుల చర్మాలతో ఆదివాసీలు రూపొందించిన వాయిద్య పరికరాలు గొప్ప సంగీతాన్ని సృష్టించాయి. కోయ గిరిజనులు వేసే ‘పగిడె’పటాలు ఆది మానవుడి కాలం నాటి గుహచిత్రాలను తలపిస్తాయి. మట్టి ఫలకాలు, కుండలు, కర్రలపై చెక్కుకున్న అక్షరాలు తర్వాతర్వాత అనేక రకాలుగా పరిణామం చెందాయి.
ఓజోలు అనే గిరిజన సమూహం తయారు చేసిన డోక్రా హస్త కళావస్తువులు గొప్ప ప్రతిభకు తార్కాణం. పొనికి చెట్టు కలప నుంచి అద్భుతమైన బొమ్మలు తయారు చేశారు. ఇవన్నీ సామూహిక వ్యక్తీకరణలు. ఆద్యకళకు ప్రతిరూపాలు. 1974లో ఎం.ఎ. పూర్తైన తొలిరోజుల్లో పరిశోధన ప్రారంభించాను. క్షేత్రస్థాయిలో పర్యటించాను. ప్రజలు రూపొందించుకున్న కళల చారిత్రక, సాంస్కృతిక మూలాలను ఆవిష్కరించేందుకు ప్రయత్నించాను.
రెండువేల ఆద్యకళారూపాల సేకరణ
ఆదివాసీ, గిరిజన కళల్లో గొప్ప ప్రతిభ ఉంది. నాలుగున్నర దశాబ్దాలకు పైగా అన్ని వర్గాల జీవన సమూహాలతో కలసి పనిచేశాను. వారి కళలను, కళా నైపుణ్యాలను, కళా పరికరాలను తయారు చేసే విధానాన్ని దగ్గర నుంచి చూశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు 2,000 కళాకృతులకు, కళాఖండాలను సేకరించాను. వాటన్నింటిని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మంత్రులు, ప్రముఖులు సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు ఆ సాంస్కృతిక, కళా వారసత్వ సంపదను కాపాడుకుంటూ వచ్చాను. ఈ కళాసంపదను భవిష్యత్‌తరాలకు అందజేసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజమే చొరవ చూపాలి. మ్యూజియం ఏర్పాటు చేయాలి ఆద్యకళను కాపాడేందుకు ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం అందుకోసం ఒకభవనాన్ని ప్రత్యేకంగా కేటాయించాలి. తద్వారా తెలంగాణ ప్రజల సాంస్కృతిక, వైవిధ్యభరితమైన కళాత్మక జీవితాన్ని జాతీయ, అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుంది. అంతరించిపోతున్న ఆద్యకళలను కాపాడుకోలేకపోతే చారిత్రక తప్పిదమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment