Jayadhir Tirumala Rao
-
‘ఆద్యకళ’కు ఆయువునివ్వండి
సాక్షి, హైదరాబాద్: వందల ఏళ్ల నాటి సాంస్కృతిక మూలాలను ఆవిష్కరించిన పరిశోధన..ఆదివాసీ, గిరిజన కళాత్మకతకు సమున్నతమైన ఆవిష్కరణ..ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆద్యకళాకృతుల ప్రదర్శన. ఆదికాలం కళారూపాలను భవిష్యత్ తరాలకు అందజేసేందుకు, ఆద్యకళను కాపాడేందుకు నాలుగున్నర దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు. సుమారు 2,000 ఆద్యకళాకృతులతో జూలై నుంచి ఆగస్టు చివరి వరకు జరిగిన ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది. ఈ ప్రదర్శన తెలంగాణ సృజనాత్మకతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటింది. అయితే ఈ కళాసంపద ఇప్పుడు ప్రమాదంలో పడింది. దానిని కాపాడి జాతీయ, అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసేందుకు ప్రభుత్వం, సమాజం ముందుకు రావాలని ఆద్యకళకు ఆయువునివ్వాలని కోరుతున్నారు జయధీర్ తిరుమలరావు. ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... అవి సామూహిక వ్యక్తీకరణలు ప్రకృతిలోని వివిధ రకాల వస్తువుల నుంచి ఉత్పన్నమయ్యే శబ్దాన్ని ఒడిసిపట్టుకొని సంగీత పరికరాలను సృష్టించారు. మృత జంతువుల చర్మాలతో ఆదివాసీలు రూపొందించిన వాయిద్య పరికరాలు గొప్ప సంగీతాన్ని సృష్టించాయి. కోయ గిరిజనులు వేసే ‘పగిడె’పటాలు ఆది మానవుడి కాలం నాటి గుహచిత్రాలను తలపిస్తాయి. మట్టి ఫలకాలు, కుండలు, కర్రలపై చెక్కుకున్న అక్షరాలు తర్వాతర్వాత అనేక రకాలుగా పరిణామం చెందాయి. ఓజోలు అనే గిరిజన సమూహం తయారు చేసిన డోక్రా హస్త కళావస్తువులు గొప్ప ప్రతిభకు తార్కాణం. పొనికి చెట్టు కలప నుంచి అద్భుతమైన బొమ్మలు తయారు చేశారు. ఇవన్నీ సామూహిక వ్యక్తీకరణలు. ఆద్యకళకు ప్రతిరూపాలు. 1974లో ఎం.ఎ. పూర్తైన తొలిరోజుల్లో పరిశోధన ప్రారంభించాను. క్షేత్రస్థాయిలో పర్యటించాను. ప్రజలు రూపొందించుకున్న కళల చారిత్రక, సాంస్కృతిక మూలాలను ఆవిష్కరించేందుకు ప్రయత్నించాను. రెండువేల ఆద్యకళారూపాల సేకరణ ఆదివాసీ, గిరిజన కళల్లో గొప్ప ప్రతిభ ఉంది. నాలుగున్నర దశాబ్దాలకు పైగా అన్ని వర్గాల జీవన సమూహాలతో కలసి పనిచేశాను. వారి కళలను, కళా నైపుణ్యాలను, కళా పరికరాలను తయారు చేసే విధానాన్ని దగ్గర నుంచి చూశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు 2,000 కళాకృతులకు, కళాఖండాలను సేకరించాను. వాటన్నింటిని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మంత్రులు, ప్రముఖులు సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఆ సాంస్కృతిక, కళా వారసత్వ సంపదను కాపాడుకుంటూ వచ్చాను. ఈ కళాసంపదను భవిష్యత్తరాలకు అందజేసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజమే చొరవ చూపాలి. మ్యూజియం ఏర్పాటు చేయాలి ఆద్యకళను కాపాడేందుకు ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం అందుకోసం ఒకభవనాన్ని ప్రత్యేకంగా కేటాయించాలి. తద్వారా తెలంగాణ ప్రజల సాంస్కృతిక, వైవిధ్యభరితమైన కళాత్మక జీవితాన్ని జాతీయ, అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుంది. అంతరించిపోతున్న ఆద్యకళలను కాపాడుకోలేకపోతే చారిత్రక తప్పిదమవుతుంది. -
తెలుగు భాష పరాయీకరణపై ప్రశ్నలు
భాషా శాస్త్రవేత్తలు భాష పుట్టుక, కాలమాన మార్పులు తదితర భౌతిక విషయాలను విశ్లేషించగలరేమోగాని, ఇతర భాషల ఆధిపత్యంలో ఒక భాష ఎలా చిన్నాభిన్నమవుతుందో భాషా, సమాజ ప్రేమికులు మాత్రమే పసిగట్టగలరు. ఈ నేపథ్యంలో తెలుగు భాషా పరిస్థితిని పరామర్శిస్తూ జయధీర్ తిరుమలరావు రాసిన వ్యాస పరంపర ‘భాషావరణం’. ఇందులోని 46 వ్యాసాలు ఏప్రిల్ 2008 నుండి డిసెంబర్ 2012 వరకు చూపు శీర్షికన ‘నడుస్తున్న చరిత్ర’ మాసపత్రికలో వచ్చినవి. శీర్షిక పరిమితులకు లోబడినట్లు కాకుండా రచయిత ఎత్తుకున్న అంశంపై సర్వస్వతంత్రంగా వ్యవహరించారు. అందువల్ల ఇవి పత్రికా వ్యాసాలుగా కాకుండా రచయిత భాష పట్ల సమర్పించిన ఒక పరిశోధక గ్రంథంగా కనిపిస్తాయి. జన సామాన్య భాషగా బతికిన తెలుగును ఆర్య భాష అయిన సంస్కృతంతో నింపి, దాని సహజ రూపాన్ని దూరం చేశారనీ, ఇలా వాడుక తెలుగును సామాన్యుడికి అర్థంకాని స్థాయికి తీసుకెళ్లి పండితులు తెలుగు సాహిత్యాన్ని తమ గుప్పిట్లో ఉంచేసుకున్నారనీ, జనం కళలు, భాష, సాహిత్యాన్ని న్యూనతా భావంలోకి నెట్టేశారనీ ఈ వ్యాసాలు ఆరోపిస్తాయి. ఆంగ్లం విషయ పరిజ్ఞాన సముపార్జనకు పరిమితం కాకుండా యావత్ తెలుగు జాతి జీవన రీతుల్నీ, వాటి మూలాల్నీ ధ్వంసం చేస్తున్న విధానాన్ని ప్రతిఘటించాల్సిన అవసరాన్ని ఈ వ్యాసాలు గుర్తు చేస్తాయి. భూస్వామ్య రాచరిక మత వ్యవస్థకు సంకేతమైన సంస్కృతాన్ని, సామ్రాజ్యవాద సంస్కృతిని విస్తరింపజేస్తున్న ఆంగ్ల భాషాదిపత్యాన్ని ప్రశ్నిస్తూ, తెలుగు భాష మనుగడ కోసం ప్రజలను ఆలోచించేలా చేయాలనేది తన వ్యాసాల ప్రధాన ఉద్దేశమని రచయిత పరిచయ వాక్యాల్లో పేర్కొన్నారు. పరభాషల దాడుల వల్ల తెలుగువారు స్వాభావికంగా తెలుగువానిగా లేడు. వాడు పాళీపండితుడు, వాడు నిరంతరం సంస్కృత పండితుడు. నివసిస్తున్న సమాజం సంస్కృత భూయిష్ట సమాజం. ఇంత జరిగినా భాషా శాస్త్రవేత్తలు భాషా పరిణామానికి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు దోహదపడుతాయన్న దృష్టికోణాన్ని విస్మరించారని రచయిత ‘మన నాలుకపై పరభాష పొరలా!’ అని ప్రశ్నించారు. అన్ని రకాల యాసలు, మాండలికాలు, వ్యవహార భాషలు, వృత్తుల భాషలు భాషా వ్యవస్థలో అనివార్య విభాగాలనీ వాటిని ‘అపభ్రంశాలు’గా భ్రమ పడకూడదనీ హితవు పలికారు. 1963లో తెలుగు నానుడి కూటమి వారు అచ్చేసిన ‘తెలుగా, ఆంధ్రమా?’ అనే 68 పేజీల పుస్తకం, అదే రచయిత రాసిన 340 పేజీల ‘నుడి, నానుడి’ ప్రస్తావన ఈ వ్యాసాలకు వన్నె తెచ్చింది. ఈ రెండు పుస్తకాల రచయిత ‘వాగరి’. 1992లో చనిపోయిన వాగరి అసలు పేరు బి.సత్యానందం. అది సంస్కృత పదం కాబట్టి బంగారయ్యగా పేరు మార్చుకున్నట్టు తిరుమలరావు రాశారు. బంగారయ్య తెలుగును చుట్టేసిన సంస్కృతాన్ని తూర్పార బట్టారు. ‘తెలుగు చరితాకారులు పరిసోదకులు కారు, వారు చాటింపుదారులు. వారు చేసేపని నారు ఒక చోట నుండి తీసి మరి ఒక చోట నాటడము. తెలుగును తీసి ఆంధ్రమును నాటాలి. తెలుగు నాడును ఆంధ్రప్రదేశమును మొల ఎయ్యాలి. తెలుగు జాతిని ఆంధ్ర జాతిగా మార్చాలి. ఇంతకు మించి ఏమీ చేయలేదు’. ‘తెలుగునాటిలోని బడులలో తెలుగు అనే పేరున పిల్లలకు నేర్పింపబడుతూ ఉండినది తెలుగు లిపిలోని సమస్క్రుతము’ అని పలికిన బంగారయ్య వాదన మూడు వ్యాసాల్లో వివరించబడింది. ‘భాషావరణం’ పద బంధంలోనే విస్తృత అర్థం ఉంది. భాష అనగానే అక్షరమాల, లిపి, శాస్త్రాల గిరిగీసుకోక– భాషతో సమాజానికీ జీవనానికీ ఉన్న లెంకలన్నీ ఇందులో చర్చించబడ్డాయి. సాంప్రదాయ వాదుల నుండి, కార్పొరేట్ శక్తుల నుండి, తల్లినుడి కాపాడుకోవాలని ఉద్బోధించాయి. వ్యాసాలు కొనసాగించేందుకు రచయిత భాషతో బంధం గల పత్రికారంగం, పాఠశాల వ్యవస్థ విద్యాహక్కులను కూడా తడమక తప్పలేదు. కొన్ని వ్యాసాలు పేరుకు భాషతో మొదలై సాహిత్య చర్చలోకి జారిపోయాయి. ఈ సంపుటి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్, గుంటూరు వారి ఆర్థిక సహాయంతో ప్రచురించబడింది. రూపకల్పన ఆకర్షణీయంగా ఉంది. - బి.నర్సన్ 9440128169 భాషావరణం (వ్యాసాలు); రచన: జయధీర్ తిరుమలరావు; పేజీలు: 310; వెల: 200; ప్రచురణ: సాహితీ సర్కిల్, 402, ఘరోండా అపార్ట్మెంట్స్, ఓ.యూ. మెయిన్ గేట్ దగ్గర, లేన్ –1, డీడీ కాలనీ, హైదరాబాద్–7. ఫోన్: 9951942242 -
బొజ్జా తారకం.. సామాజిక విప్లవకారుడు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: బొజ్జా తారకం గొప్ప సామాజిక విప్లవకారుడని, ఆయన కులాన్ని, వర్గాన్ని సమాన దృష్టితో చూశాడని ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో బొజ్జా తారకం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జయధీర్ తిరుమల రావు మాట్లాడుతూ మానవ, పౌర హక్కులను రెండు కళ్లుగా చూసిన పోరాట యోధుడని కొనియాడారు. పివోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ బొజ్జా తారకం చుండూరు, కారంచేడు సంఘటనలను చాలెంజ్‌గా తీసుకొని బాధితుల తరఫున పోరాడారన్నారు. చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ కారంచేడు, నీరుడుకొండ, చుండూరు, వేంపెంట, లక్షి్మపేట బాధితులకు న్యాయం జరగడమంటే దోషులకు శిక్షలు పడటమేనని చాటారన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు జైన్ మల్లయ్య గుప్త మాట్లాడుతూ తారకం ఆశయ సాధన కోసం పని చేసినప్పడే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఈ సందర్భంగా బొజ్జా తారకం రాసిన పీడిత ప్రజల గొంతుక, వివేక్ రచించిన ఈతరం మార్గదర్శి, సృతి నవల, వివేకా కవితా సంపుటి పుస్తకాలను ఆవిష్కరించారు. -
పచ్చదనమివ్వని చెట్టు రాష్ట్ర చిహ్నమా?
జన జీవితాలలో టేకు చెట్ట్టు ప్రసక్తి ఎక్కడా ఉండదు. వైద్యానికి ఇది చాలా దూరం. ప్రజల సంస్కృతిలో ఇది భాగం కాదు. ఏ రకంగా చూసినా ఇది తెలంగాణ ప్రజల ప్రాతినిధ్యపు వృక్షం కాలేదు. టేకు చెట్టుని రాష్ట్ర చిహ్నంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం చూడటం సరికాదు. జాతీయ, రాష్ట్రీయ చిహ్నాలు తప్పక ఆ నేలతో సంబంధం కలిగి ఉండాలి. అక్కడ నివసించే ప్రజలకు చిరపరిచితాలై ఉండాలి. ప్రజల సంస్కృతిలో భాగం కావాలి. పైగా గౌరవనీయత, పవిత్రత ఉండాలి. 90 శాతం ప్రజలు వాటిని తమవిగా భావించగలగాలి. అలా కాని పక్షం లో ఆ చిహ్నాలకు విలువ ఉండదు. ప్రజలు గౌరవిం చని చిహ్నాలు కాగితాలలో చిహ్నాలుగానే మిగిలిపో తాయి. తెలంగాణ రాష్ట్ర పుష్పంగా మోదుగ పువ్వు ను, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర జంతువుగా అడవి దున్నను ఎంపిక చేయడం ముదావహం. కాని రాష్ట్ర వృక్షంగా టేకు చెట్టుని ఎంపిక చేయడాన్ని పునఃపరిశీలించవలసి ఉంది. ఒక దేశం లేదా రాష్ట్రం ఎంచుకునే చిహ్నాలకు ప్రజలతో సాంస్కృతికపరమైన అనుబంధం ఉండాలి. వాటికి గౌరవప్రదమైన సామాజిక విలువ ఉండాలి. ఆదివాసులు ఉండే ప్రాంతాలలో పెరిగే ఖరీదైన చెట్లను వారు ఏ రకంగానూ గుర్తించరు. వారిది వ్యాపార దృక్పథం కాదు. కేవలం కలప కోసం మాత్రమే పనికి వచ్చే చెట్లకు వారి సమాజాల్లో ఎలాంటి విలువా లేదు. అందుకే గిరిజన జానపద విజ్ఞానం దృక్పథం లోంచి చిహ్నాలను చూడవలసి ఉంటుంది. చారిత్రకంగా అవి మన నేలతో సంబంధం కలిగి ఉండాలి. ప్రజల జీవితాలలో భాగం కావాలి. వారి భావనలలో మంచి విలువలు కలిగి ఉం డాలి. అప్పుడే అది ప్రజలు మెచ్చే చిహ్నం కాగలదు. రాష్ట్ర పక్షిగా పాలపిట్టని రాష్ట్ర జంతువుగా అడవి దున్నను ఎంపిక చేయడాన్ని అన్ని రకాలుగా స్వాగతించవచ్చు. తెలం గాణలో దసరా ఉత్సవంలో భాగంగా ఊరి బయట జమ్మి చెట్టుకి నమస్కరించి పాలపిట్టను చూడటం సంప్రదాయం. అది శుభసూచకం. ఒక పిట్టను వేలాది మంది ఏకకాలంలో చూడటం ఒక గొప్ప సంస్కృతి. చిన్న పెద్ద, స్త్రీ పురుష, ధనిక పేద అనే తేడాలు లేకుండా ఆ పక్షిని చూడటం అనేది తరతరాలుగా వస్తున్న సంప్ర దాయం. పాలపిట్టని కాదని బలంగా ఉందని గద్దను గుర్తించలేం కదా. అలాగే టేకు చెట్టుని కూడా ప్రజలు రాష్ర్ట వృక్షంగా స్వీకరించలేరు. అందుకు కారణాలు అనేకం. టేకుకి తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయా నికీ, విశ్వాసాలకి ఎలాంటి సంబంధం లేదు. ఆ చెట్టుకు ప్రజల జీవితాలతో ఎలాంటి అనుబంధం లేదు. టేకుని కేవలం వ్యాపార వృక్షంగానే గుర్తి స్తారు. వలస పాలనలో ఇబ్బడి ముబ్బడిగా పరాధీనమైన భూములను ఖాళీగా ఉంచకుండా, వాటిలో టేకు చెట్లు నాటి డబ్బు చేసుకోవడానికి రియల్టర్లు నగరాలకి తెచ్చారు. నిజానికి ఆనాడు ఆంగ్లేయులు భారతదేశాన్ని నాలుగు వృక్ష విభాగా లుగా చేసి చెట్లు పెంచారు. సెంట్రల్ ఇండియాలో బర్మా తదితర ప్రాంతాల నుంచి తెచ్చిన టేకు చెట్లను ఇక్కడి అడవు లలో విస్తారంగా విత్తారు. దీని కలప పడవలు, ఓడలు తయారు చేయడానికి బాగా పనికివస్తుంది. అందుకే టేకు చెట్ల పెంపకాన్ని ఆంగ్లే యులు విశృంఖలంగా పెంచారు. టేకు కలపలో ఒక రకమైన తైల గుణం ఉంటుంది. అందు వల్ల అది గట్టిగా, దృఢంగా ఉంటుంది. అయితే టేకు పెరిగిన చోట ఇతర వృక్షాలు పెరగవు. ఆ ప్రాంతం అంతా చెదలు పడు తుంది. టేకు చెట్టు మీద పక్షులు వాలవు. టేకు ఆకులు తిన డానికి పశువులు సైతం నిరాకరిస్తాయి. పైగా టేకు విత్తనాలు మొలకెత్తాలంటే అవి కాలి టప్మని పగలాలి. అందుకే వర్షా కాలానికి ముందు అడవిని కాలుస్తారు. అంటే చిన్న చిన్న మొల కలు, గడ్డి అంతా సర్వనాశనం అవుతుంది. పచ్చదనం స్థానే ఒక రకమైన శ్మశాన దృశ్యం కానవస్తుంది. టేకు నీడన జీవజా లం, జంతువులు కూడా సౌకర్యంగా బతకలేవు. పక్షులు గూడు కట్టడానికి కూడా టేకు చెట్టు దరిదాపులకి రావు. కేవలం కలప కోసమే తప్ప టేకు చెట్టు అన్ని రకాలుగా నష్టం. తెలంగాణలో అడవుల విధ్వంసానికి, పర్యావరణ నష్టానికి టేకు ఒక కారణం. టేకు వృక్షం ఈ నేలలో స్వతసిద్ధంగా పెరగలేదు. పరాయి ప్రాంతం నుండి వలస వచ్చి ఇక్కడి దేశీయ వృక్షాలకు నిలువ నీడ లేకుండా చేసిన చెట్టది. దాని పంచన తలదాచుకుందా మన్నా నీడను ఇవ్వలేని రూపం దానిది. అడవుల్లో ఆదివాసీలు టేకు చెట్టుని ముట్టుకుంటే శిక్షిస్తారు. జైల్లో పెడతారు. టేకు ఎవ రబ్బ చెట్టని ప్రభుత్వాధికారులు, అటవీ శాఖాధికారులు భావి స్తారో తెలియదు. ఇవ్వాల్టికీ టేకుని అనుమతి లేకుండా పెంచితే నేరం. ఇవాళ టేకుని రియల్టర్లు పెంచుతున్నారు. వ్యాపార స్థులకి మాత్రమే ఉపయోగపడే టేకు ప్రజలను భయభ్రాంతు లకు గురిచేస్తుంది. అనాదిగా ప్రజలు మన దేశీయ వృక్షాలను ఆరాధించి వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఏనాడు కూడా వ్యాపార సంబంధమైన చెట్లను వారి జీవితాలలో భాగం చేయలేదు. మేడి చెట్టుని తండ్రిగా, అందుగ చెట్టుని తల్లిగా, మారేడు, నేరేడు చెట్లని పూజనీయంగా భావించారు. ఇప్ప చెట్టుని, వేప చెట్టుని ఆది తల్లిగా భావించారు. ప్రతి పెళ్లి రోజున ఒక చెట్టుని పెంచే అనాది ఆచారం ఉన్నా తెలంగాణలో డబ్బులు ఇచ్చి ఇంట్లో టేకుని పెంచమన్నా నిరాకరిస్తారు. ప్రజలకు తెలుసు పక్షి కూడా వాలని చెట్టు ప్రకృతికి శ్రతువు అని. ఇప్పుడు కాలుష్యం వెదజల్లని, ప్రకృతి పర్యావరణానికి పెద్ద పీట వేయాలని భావించే ప్రభుత్వం టేకుని రాష్ట్ర చిహ్నంగా ఉంచితే అది బంగారు తెలంగాణ భావనకి విరుద్ధమే. నవ తెలంగాణలో చెట్టుని కూడా వ్యాపారం చేసే ఆలోచన ఉంటే, పర్యావరణాన్ని సైతం లెక్క పెట్టనితనం ఉంటే బేషర తుగా ప్రకటించుకోవచ్చు. కాని ప్రజలు మాత్రం హర్షించరు. కోట్లాది చెట్లు పెంచాలనే ఆలోచన ఉన్నప్పుడు, పెంచిన టేకు చెట్లని అమ్ముకోవడానికి నిరంతరం నరకడం తప్పదు. నరు క్కునే చెట్లు చిహ్నాలా? తల్లి లాంటి ఇప్ప చెట్టు, నీడనిచ్చే వేపలు చిహ్నాలు కావా? ఒక్క కాగితం తయారీ కోసం వలస పాలకులు కాగజ్ నగర్నీ, భద్రాచలం ఐటీసీని ఏర్పరిచి వెదురుని ఆసాంతం కుళ్లబెరికారు. ఇప్పుడు వాటి అవసరాలకు అడవులను నరికి వేసి నీలగిరి చెట్లు పెంచుతున్నారు. సహజమైన అడవుల స్థానే కృత్రిమ అవసరాలను తీర్చే సంస్కృతి తెలంగాణ పర్యావర ణానికి శత్రువు. నరకడం కోసమే చెట్లను పెంచడం బాధాకరం. మనిషి కోసం చెట్టుని పెంచడం మానవత్వం. అలాంటి చెట్టే ఆదర్శం కావాలి. తెలంగాణలోని చెట్లని కాల్చి బొగ్గు చేసి ఇతర ప్రాంతాల విద్యుత్ ప్రాజెక్టులకు పంపడం ఆపాలి. పచ్చదనం ఇవ్వని చెట్టు తెలంగాణకు చిహ్నం కారాదు. ఆ సంస్కృతి ప్రజావ్యతిరేకమే. (వ్యాసకర్త జానపద సాహిత్య వేత్త) జయధీర్ తిరుమలరావు -
కాళోజీ ఇజానికి నమస్కారం
సాహిత్య రంగం, సామాజిక రంగం, రాజకీయ రంగం దేనినీ తన కవిత్వంలో విడిచిపెట్టలేదు. ప్రజాస్వామ్యానికి అవమానం జరిగినప్పుడల్లా అతని కలం, గళం ఊర్కోలేదు. ‘డెమోక్రసీ పట్టాలు తప్పింది’ అని హెచ్చరించాడు. నిజానికి కాళోజీ వ్యక్తిత్వం ఎంతో విలక్షణమైంది. పాండిత్య ప్రధాన సాహిత్యాన్ని మార్గ సాహిత్యం అంటాం. చదువ నేర్వని ప్రజల కోసం రాసే నోటి, రాత సాహిత్యాన్ని దేశీ సాహిత్యం అంటాం. ప్రపంచంలో చాలా మంది కవులను ఈ రెండు విభాగాలలో వింగడించవచ్చు. కాళోజీ నారాయణరావు (9.9.1914- 13.11.2002) మాత్రం ఈ రెండు ధోరణుల కన్నా విలక్షణమైన, విభిన్నమైన కవి. ఎందుకంటే, కాళోజీ ఉర్దూ, ఆంగ్లం, తెలుగుభాషలలో దిట్ట. 1940ల లోనే ఉర్దూ, ఆంగ్లంలలో కవితలు రచించాడు. అణా గ్రంథమాల కె.సి. గుప్త కాళోజీతో కథలు రాయించి ‘కాళోజీ కథలు’ (1946) అచ్చు వేశాడు. వచన రచన, కవిత్వం అతని రెండు కళ్లు, కాని అతను త్రినేత్రుడు. సాహి త్యాన్ని మనోచక్షువుల ద్వారా గ్రహించి, సంభాషణా ప్రక్రియ ద్వారా ఎందరినో సాహిత్య పిపాసులను చేశాడు. కాళోజీ అన్నగారు కాళోజీ రామేశ్వరరావు (1908-1996) ఉర్దూలో జానేమానే షాయర్. వీరిద్దరూ ఎల్ఎల్బీ చేసి వకీలు వృత్తిలో ఉన్నారు. ఆ తరువాత కాళోజీ రాజకీయ సామాజిక సాహిత్య కార్యకర్తగా మారాడు. కాళోజీ చక్కని సంభాషణాప్రియుడు. ఆయనతో కూర్చో వడం అంటే సాహిత్య పండిత సభలో ఉన్నట్టే. సాహిత్యం గురించి అనేక సంగతులు అలవోకగా వివరించేవాడు. సంగీత విషయాలు సదాశివ ముచ్చట్లలో చెప్పినట్టు కాళోజీ ముచ్చ ట్లలో సాహిత్యం జలపాతమయ్యేది. కాళోజీ జ్ఞాపకశక్తి గొప్పది. ఆయా కవులను కలసిన తేదీలతోపాటు, వారి కవిత్వ చరణా లను కూడా చెప్పేవాడు. ఎన్నో ప్రాంతాల నుంచి ఎందరో కవులు కాళోజీని కలవడానికి వరంగల్లు వచ్చేవారు. ఐతే ఆయన ఎన్నడూ తన కవిత్వం గురించీ, పోరాటం గురించీ చెప్పుకోలేదు. కప్పి చెప్పడం కన్నా, విప్పి చెప్పడం ఆయన గుణం. అందుకే కవిత్వ శైలిని, భాషని, విధానాన్ని పక్కన పడేసి తనదైన సాదాసీదా తత్వాన్ని అక్షరాలకు అద్దాడు. వేలాది మంది సాహిత్యేతర పాఠకులు అతడు రాసిన కవిత్వం చదివారు. నిజానికి ‘నా గొడవ’ సంపుటాలు సాహిత్య పరులకన్నా, మామూలు పాఠకులకే ఎక్కువగా అందాయి. సాహిత్య వ్యవస్థని ఇంతగా ధిక్కరించిన కవి కాళోజీ ఒక్కడే. సాహిత్య వ్యవస్థ వెలుపల ఉండి ఆయన కవిత్వం రాశాడు. అందుకే కాళోజీని గొప్పగా ప్రేమించే సాహిత్యకారులు చాలామంది కవిగా ఆయనను ఆమోదించేవారు కాదు. కవిత్వ భావన సామాన్యుడి కళ్లు తెరిపించాలి. ఒక కొత్త ఆలోచన కలిగించి కార్యోన్ముఖ దిశగా కదిలించాలి. ఆ విధంగా వేమన లాగా కాళోజీ అన్ని చట్రాలను, విలువలను, ఆధిపత్యాలను నిరసించాడు. ముఖ్యంగా భాష విషయంలో. వేమన కవిత్వాన్ని ఉచితంగా అందించినట్టే, ‘నా గొడవ’ సంపుటాలు ఉచితంగా పంచిపెట్టాడు. ఎలాంటి క్లిష్టత లేని సరళ భాషలో రాశాడు. భాష పెత్తనాన్ని ప్రశ్నించాడు. వలసవాదానికీ, భాషకూ గల సంబంధాన్ని విప్పి చెప్పాడు. నిజానికి గిడుగు, శ్రీపాదలు ఊహించని కొత్త సరళ భాషను హత్తుకున్నాడు. మాండలికాలే భాషకు ప్రాణవాయువని చెప్పాడు. ప్రతి సమస్యను ప్రజా దృక్పథం నుంచి చూసే నేర్పు కాళోజీ సహజాతం. నిజాంని ‘రాణి వాసములోన రంజిల్లు రాజా’ అని సంబోధిస్తూ ‘ప్రజలను హింసించు ప్రభువు మాకేల’ అని అన్నాడు. దాదాపు ప్రతి ముఖ్యమంత్రి చేసిన తప్పులను ఎత్తి చూపుతూ కవిత్వం రాశాడు. జలగం వెంగళరావుపై పోటీ చేసి చెక్ పెట్టాడు. ఎమర్జెన్సీని వ్యతిరేకించాడు. పౌర హక్కులకు చిరునామా అయ్యాడు. ప్రత్యేక తెలంగాణ కోసం కాళోజీ ఒక పుట్టు రెబెల్. ఎనభై ఏళ్లు తనని పెంచి పెద్ద చేసిన అన్నను కూడా ఎదిరించాడు. 1946-47లో నిజాం ప్రభుత్వం వరంగల్, గుల్బర్గా జైళ్లలో ఉంచింది. మూడు నెలలు జన్మస్థలం అయిన వరంగల్ నుండి బహిష్కరించింది. చెరసాలను చూసి ఏనాడూ వెరవలేదు. ఎంత పెద్ద నాయకుడినైనా లెక్క చేయలేదు. 1958 నుంచి 60 వరకు శాసన మండలి సభ్యుడిగా ఉండి కూడా రాజకీయాలకు దూరమయ్యాడు. స్వాతంత్య్ర సమరయోధునిగా, గౌరవ డాక్టరేట్ పుచ్చుకున్న వాడిగా, పద్మవిభూషణ్‌గా ఎన్ని పురస్కా రాలు పొందినా తన స్వభావానికి వ్యతిరేకంగా జీవించలేదు. మనసు ఎంత సున్నితమో ఆయన వ్యక్తిత్వం అంత సుదృఢం. చిన్నా పెద్దలను ఒకేలా పలకరించేవాడు. అందరితో హాయిగా ఉండే కాళోజీ ‘పెద్దల’ విషయంలో మాత్రం అతి కటువు. ఆనాడు ఎన్నికలను బహిష్కరించాలని పీపుల్స్‌వార్ చేసిన ప్రకటనని ధైర్యంగా ఖండించాడు. సాహిత్య రంగం, సామాజిక రంగం, రాజకీయ రంగం దేనినీ తన కవిత్వంలో విడిచిపెట్టలేదు. ప్రజాస్వామ్యానికి అవమానం జరిగినప్పుడల్లా అతని కలం, గళం ఊర్కోలేదు. ‘డెమోక్రసీ డీ రేలైంది’ అని హెచ్చరించాడు. నిజానికి కాళోజీ వ్యక్తిత్వం ఎంతో విలక్షణమైంది. అటువంటి ‘మనిషి’ అరుదు. సాహిత్య లోకంలో మరీ అరుదు. కాళోజీ తనను తాను విముక్తం చేసుకున్న ఆలోచనా పరుడు. అతడిని క్రాంతదర్శి అనవచ్చు. కులం మతం పట్ల పట్టింపులేదు. సాహిత్యంలో అతనిది పాల్కురికి సోమన మార్గం. ఆ మార్గంకన్నా సులభీకరణ చేసిన దారిలో నడిచింది అతని రచనా వ్యాసాంగం. రూపం వచన కవిత్వమే. కాని గేయలక్షణం ఎక్కువ. అప్పుడప్పుడు విషయ ప్రధానమైన ప్రకటనలా కనిపిస్తుంది. కాళోజీ మొత్తం 500 పేజీల కవిత్వాన్ని ఒక దగ్గరగా చూసినప్పుడు ఆ కవిత్వం మనల్ని వెంటాడటం మొదలవుతుంది. దిగంబరుల కన్నా ఎంతో ముందే తిరుగు బాటు కవిగా కాళోజీని పేర్కొనవచ్చును. తెలంగాణలో తిరుగుబాటు తత్వం పాలక హింసాకృత్యాల వల్లే హెచ్చింది. 70 ఏళ్లుగా అలాంటి హింసని అక్షరీకరించిన కాళోజీ ఒక తిరుగుబాటు సాహిత్య చరిత్రకారుడు. కాళోజీ జీవితం నేర్పిన పాఠం ధిక్కారం. ప్రశ్న. కాళోజీని గుర్తు చేసుకోవడం అంటే నోరులేని ప్రజల తరఫున ప్రశ్నించడమే. రాజ్యాన్నే కాదు. ప్రతి నిర్మాణాన్ని ప్రశ్నించి, హెచ్చరించి ప్రజాస్వామ్యీకరించాలి. విముక్త మేధావి మాత్రమే ఇవాళ సమగ్ర సమాజ అధ్యయనశీలి. అతడే కొత్త పోరాట బీజం. 1950ల లో ‘నా ఇజం’ కవితలో ‘‘నాది నిత్య నూత్న వికసిత విజ్ఞానం’’ అంటాడు. వ్యవస్థలోని ప్రాచీన, ఆధునిక వ్యవస్థలలో ప్రజలను, బలహీనులను అణచివేయడాన్ని ఇష్టపడలేదు. అదే కాళోజీ తత్వం. ఇవాళ ఈ ఆలోచన సమాజంలో ఇంకిపోవాలి. దీనిని ఎదిరించగలిగే సత్తా ప్రజలకు అందించిన నాడు అన్ని రకాల పెత్తనాలు సమసిపోతాయి. దీని వల్ల ప్రజల సత్తా పెరుగుతుంది. అందుకోసమే కాళోజీ కలలు గన్నాడు. (వ్యాసకర్త జానపద సాహిత్య పరిశోధకుడు) - డా॥జయధీర్ తిరుమలరావు -
పోలవరం చట్ట విరుద్ధం
గిరిజన ప్రపంచం గుండెపై పోలవరం ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఆదివాసీలను నీట ముంచుతున్న పోలవరం ప్రాజెక్టు చట్ట విరుద్ధమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ ఆదివాసీల హక్కులను పట్టించుకోవటం లేదని, అడవులపై వారికి పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శిం చారు. సభలో ప్రొఫెసర్ భంగ్య భూక్యా, డాక్టర్ వీఎన్వీకే శాస్త్రి, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాంనాయక్ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలి హిమాయత్‌నగర్ : ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గిరిజనులు కనుమరుగయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు అన్నారు. శనివారం హిమాయత్‌నగర్ చంద్రం బిల్డింగ్‌లో తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టీఆర్సీ) ఆధ్వర్యంలో ‘పోలవరం ప్రాజెక్టు-ఆదివాసుల హక్కులు-చట్టాలు’ అన్న అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో జయధీర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు గిరిజనుల గుండెపై కుంపటి లాంటిదన్నారు. తమ భాషకు లిపి కావాలని ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అసలు జాతులనే నాశనం చేయనున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేయాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో చెంచులోకం ప్రతినిధి తోకల గురవయ్య, ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అప్కా నాగేశ్వరరావు, ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ, పీపుల్స్అగెనెస్ట్ పోలవరం ప్రాజెక్టు సోడె మురళి, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ (ఓయూ) అధ్యక్షులు తొడసం పుల్లారావు, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ (కేయూ) అధ్యక్షులు వాసం ఆనంద్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పోచన్న ఆధ్వర్యంలో పలువురు గిరిజన కళాకారులు కళారూపాలు ప్రదర్శించారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజనుల భారీ ర్యాలీ ముషీరాబాద్/సుందరయ్యవిజ్ఞాన కేంద్రం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చట్టానికి, రాజ్యాంగానికి, గిరిజనుల ప్రయోజనాలకు విరుద్ధమైనదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం పేర్కొన్నారు. శనివారం పీపుల్స్ ఎగెనెస్ట్ పోలవరం ప్రాజెక్టు ఆధ్వర్యంలో సుందరయ్యవిజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ, అనంతరం ఇందిరాపార్కులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో విరసం నాయకులు వరవరరావు, న్యూడెమోక్రసీ కె.గోవర్దన్, జార్ఖండ్ ఆదివాసి నాయకులు జితేన్ మరాండి, సోదెం మురళితో కలిసి ఆయన సభలో పాల్గొని ప్రసంగించారు. దాదాపు మూడు లక్షల మంది అమాయక గిరిజనుల పొట్టకొట్టే, నిలువునా ముంచేసే పోలవరం ప్రాజెక్టు అనవరమైనదని చెప్పారు. ఆ ప్రాంత గిరిజనుల ప్రజలంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నా బలవంతంగా నిర్మిస్తామని ముందుకు రావడం మోడీ ప్రభుత్వ నిరంకుశ, పాసిస్ట్ చర్యగా ఆయన అభివర్ణించారు. గిరిజనులు తమ మనుగడ కోసం విల్లంబులతో యుద్ధానికి దిగితే దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఇంకా ఈ సభలో శాతావాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, రిటైర్డ్ ఇంజినీర్ భీమయ్య, ఆదివాసి మహిళా సంఘం అధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టును నిలిపివేయాలి ఆదివాసీలను జలసమాధి చేసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పీపుల్ అగెనెస్ట్ పోలవరం ప్రాజెక్టు(పీఏపీపీ) ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని, ఆదివాసుల హక్కులను కాపాడాలని పెద్ద ఎత్తున నినాదం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి, ప్రజా కళామండలి కళాకారులచే నిర్వహించిన సాంసృ్కతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఆదివాసీలు తమ సంస్కృతిని చాటి చెప్పే విధంగా అలంకరించుకొని చేసిన నృత్యాలు ఆకర్షించాయి. తమ చేతిలో విల్లులను పట్టుకొని చేసిన ప్రదర్శన, దింస నృత్యం ఆక ట్టుకుంది. ఈ ర్యాలీలో పీఏపీపీ జాతీయ నాయకులు జంజర్ల రమేష్ బాబు, జాతీయ కార్యదర్శి సున్నం వెంకటరమణ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్ష, కార్యదర్శులు మద్దెలేటి, నలమాస కృష్ణ, విరసం నేత వరవరరావు, సోడె మురళి, టీఎన్జీఓ అధ్యక్షులు దేవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.