బొజ్జా తారకం.. సామాజిక విప్లవకారుడు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: బొజ్జా తారకం గొప్ప సామాజిక విప్లవకారుడని, ఆయన కులాన్ని, వర్గాన్ని సమాన దృష్టితో చూశాడని ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో బొజ్జా తారకం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జయధీర్ తిరుమల రావు మాట్లాడుతూ మానవ, పౌర హక్కులను రెండు కళ్లుగా చూసిన పోరాట యోధుడని కొనియాడారు.
పివోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ బొజ్జా తారకం చుండూరు, కారంచేడు సంఘటనలను చాలెంజ్‌గా తీసుకొని బాధితుల తరఫున పోరాడారన్నారు. చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ కారంచేడు, నీరుడుకొండ, చుండూరు, వేంపెంట, లక్షి్మపేట బాధితులకు న్యాయం జరగడమంటే దోషులకు శిక్షలు పడటమేనని చాటారన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు జైన్ మల్లయ్య గుప్త మాట్లాడుతూ తారకం ఆశయ సాధన కోసం పని చేసినప్పడే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఈ సందర్భంగా బొజ్జా తారకం రాసిన పీడిత ప్రజల గొంతుక, వివేక్ రచించిన ఈతరం మార్గదర్శి, సృతి నవల, వివేకా కవితా సంపుటి పుస్తకాలను ఆవిష్కరించారు.