Sundarayya Knowledge Center
-
తెలంగాణ వస్తే అభివృద్ధి సాధ్యమనుకున్నాం
హైదరాబాద్: తెలంగాణ వస్తే ఆదర్శవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని భావించామని.. కానీ ఆశలు అడియాసలు అయ్యాయని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక మూడవ రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ‘తెలంగాణ అభివృద్ధి–సామాజిక, ఆర్థిక సవాళ్లు, సానుకూలతలు’ అనే అంశంపై ఆదివారం సదస్సు జరిగింది. సదస్సులో హరగోపాల్ మాట్లాడుతూ.. నీటిపారుదల రంగంలో కాంట్రాక్టర్ల ఆధిపత్యం కొనసాగుతోందని విమర్శించారు. తెలంగాణకు హైదరాబాద్ నుంచి అద్వితీయమైన ఆదాయం వచ్చిందని తెలిపారు. రూ.లక్షా 70 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రజారంజకమైన పథకాలకు ఖర్చు పెడితే కొంత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. భూపంపిణీ చేయనిదే అట్టడుగువర్గాల జీవితాల్లో మార్పు రాదన్నారు. కేరళ మాదిరిగా బడ్జెట్లో 37 శాతాన్ని విద్యారంగానికి కేటాయిస్తే మానవ వనరులు సృష్టించబడతాయని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక విలువలు నిర్దాక్షిణ్యంగా అణచివేయబడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో నిధులతోపాటు చైతన్యవంతమైన ప్రజలు అందుబాటులో ఉన్నారని, కానీ ఈ రెండింటినీ ఉపయోగించి అభివృద్ధి చేయకపోగా ప్రజల పాత్రను నిరాకరిస్తున్నారని విమర్శించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. దేశంలో న్యాయవ్యవస్థ, మీడియా ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో అద్వితీయమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు. కానీ ఈ రెండింటినీ లొంగదీసుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మీడియా సంస్థల అధిపతులు, ఇతర పారిశ్రామిక యాజమాన్యాల మీద ఐటీ దాడులు జరగాల్సినప్పుడు జరగకుండా అవసరానికి ఉపయోగపడనప్పుడు జరుగుతున్నాయని విమర్శించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆరోపించారు. న్యాయవ్యవస్థ కూడా పౌర హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తుందని అన్నారు. అనంతరం జన విజ్ఞాన వేదిక వెబ్‌సైట్‌ను కె.రామచంద్రమూర్తి ప్రారంభించారు. జేవీవీ రాష్ట్ర నాయకుడు డా.అందె సత్యం అ«ధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ ఎం.ఆదినారాయణ, టి.శ్రీనాథ్, డా.రమాదేవి, రాజామాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
బొజ్జా తారకం.. సామాజిక విప్లవకారుడు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: బొజ్జా తారకం గొప్ప సామాజిక విప్లవకారుడని, ఆయన కులాన్ని, వర్గాన్ని సమాన దృష్టితో చూశాడని ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో బొజ్జా తారకం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జయధీర్ తిరుమల రావు మాట్లాడుతూ మానవ, పౌర హక్కులను రెండు కళ్లుగా చూసిన పోరాట యోధుడని కొనియాడారు. పివోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ బొజ్జా తారకం చుండూరు, కారంచేడు సంఘటనలను చాలెంజ్‌గా తీసుకొని బాధితుల తరఫున పోరాడారన్నారు. చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ కారంచేడు, నీరుడుకొండ, చుండూరు, వేంపెంట, లక్షి్మపేట బాధితులకు న్యాయం జరగడమంటే దోషులకు శిక్షలు పడటమేనని చాటారన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు జైన్ మల్లయ్య గుప్త మాట్లాడుతూ తారకం ఆశయ సాధన కోసం పని చేసినప్పడే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఈ సందర్భంగా బొజ్జా తారకం రాసిన పీడిత ప్రజల గొంతుక, వివేక్ రచించిన ఈతరం మార్గదర్శి, సృతి నవల, వివేకా కవితా సంపుటి పుస్తకాలను ఆవిష్కరించారు. -
సబ్ ప్లాన్‌తోనే బీసీల అభివద్ధి: తమ్మినేని
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: సమాజంలో 52 శాతం ఉన్న వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాజన పాదయాత్రను పురస్కరించుకుని బీసీల సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీసీ సబ్‌ప్లాన్ చట్టం వస్తేనే వారు అభివృద్ధి చెందుతారని, దీని కోసం రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 92 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధే తెలంగాణ అభివృద్ది అన్నారు. వెనకబడిన కులాల ప్రజల అభివృద్ది కోసం ప్రత్యేక చట్టాలు రావాలన్నారు. రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు వీజీఆర్ నారగోని మాట్లాడుతూ... ప్రజల్లో చైతన్యం తీసుకురావల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందన్నారు. బలహీన వర్గాల అభివృద్ధిపై ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు. ఉన్నత వర్గాల వారే అధికారంలోకి రావడం వల్ల బడుగుల జీవితం అరణ్య రోదనగా మారిందన్నారు. రాజ్యాధికారం బడుగుల చేతుల్లోకి రావాలంటే మన ఓట్లను మనమే వేసుకోవాల న్నారు. బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ కన్వీనర్ కిల్లె గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు జి. రాములు, పి. ఆశయ్య, ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్. ఎంవీ రమణ, ఆర్. శ్రీరాంనాయక్, లెల్లెల బాలకృష్ణ, పి. రామకృష్ణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో దొరల పాలన: తమ్మినేని
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణలో దొరల పాలనను అంతమొందించేందుకు,ప్రజల తెలంగాణ, సామాజిక తెలంగాణ సాధనకు ప్రజా సంఘాలు సంఘటితం కావాలని సీపీఎం రాష్ట్ర కారదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో మహాజన పాదయాత్రకు సంఘీభావంగా దళితుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం ఎజెండాగా మహాజన పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సామాజిక న్యాయం ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. రాములు మాట్లాడుతూ అక్టోబర్ 17 ఇబ్రహీంపట్నంలో ప్రారంభమయ్యే యాత్ర మార్చి 17 వరకు కొనసాగుతుందన్నారు. యాత్రను అంబేద్కర్ మనువడు ప్రకాష్ అంబేద్కర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. మోదీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. నాగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్కైలాబ్‌బాబు, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, ఓగోటి కిరణ్, మాస్టార్జీ, డాక్టర్ కాలువ మల్లయ్య, రమేష్, జి.నరేష్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ మాటలు నమ్మొద్దు: వీహెచ్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కేసీఆర్ చెబుతున్న మాటలు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి.హన్మంతరావు అన్నారు. గతంలో కేసీఆర్ చెప్పిన మాటలను ఇప్పుడు చెబుతున్న వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక తెలంగాణ సాధన సమితి ఆధ్వర్యంలో ధూం..ధాం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. కొట్లాడి సాదించుకున్న తెలంగాణ మరొకరి చేతుల్లోకి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను హన్మంత రెడ్డిని అయితే ఆనాడే ముఖ్యమంత్రిని ఆయ్యేవాడినని అన్నారు. తెలంగాణ తెచ్చింది మేమైతే ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయినికి హోం మంత్రి నామ మాత్రమేనని ఒక్క కానిస్టేబుల్ కూడా ట్రాన్్సఫర్ కాడని, అందరు మంత్రులు పేరుకు మాత్రమే ఉన్నారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చేసిన పొరపాట్ల వల్లే తమ పార్టీ దెబ్బతినిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ బలహీన వర్గాలకు చెందిన వారికి మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ వారిని బలహీనులను చేసి పాలిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ వేదిక చైర్మన్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. ఉద్యమం చేయని వారికి మంత్రి పదవులు ఇచ్చి ఉద్యమంలో పాల్గొన్న వారిని పక్కకు పెట్టారని విమర్శించారు. కేసీఆర్ బాహుబలి కావచ్చు కాని ఇక్కడ అందరు కట్టప్పలు ఉన్నారని మర్చిపోవద్దని హెచ్చరించారు. తెలంగాణ సాధన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ ప్రభంజన యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పిఎల్.విశ్వేర్‌రావు, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, చంద్రన్న, పాశం యాదగిరి, రాములు తదితరులు పాల్గొన్నారు. ఏపూరి సోమన్న, జంగ్ ప్రహ్లాద్ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. సమావేశంలో అభివాదం చేస్తున్న వీహెచ్ తదితరులు -
నేనూ రేషన్‌బియ్యం తింటా:సీవీ ఆనంద్
సుందరయ్య విజ్ఞానకేంద్రం: ‘రేషన్ బియ్యంతో చేసిన అన్నం రుచికరంగా ఉంది.. అనవసరంగా బ్లేమ్ (ఆరోపణ) చేయడం తగదు.. రేపటినుంచీ నేనూ తింటా’ అని పేర్కొన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్. శనివారం ఆయన బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌లోని పౌర సరఫరాల శాఖకు చెందిన గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హమాలీలు ఎంత మంది ఉన్నారు.. వారికి ఎంత మొత్తం వస్తోందని అడిగి తెలుసుకున్నారు. తరువాత బియ్యం ఎలా ఉన్నాయి, ఎలా ఉడుకుతున్నాయో రుచి తెలుసుకోవటానికి అరకిలో బియ్యాన్ని ఉడకబెట్టమని సిబ్బందిని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తాను బాధ్యత తీసుకున్న తర్వాత మొదటి సారిగా ఫీల్డ్ విజిట్ చేస్తున్నానన్నారు.ఈ పాస్ మిషన్లు ఎలా పని చేస్తున్నాయో, సరుకులు ఎలా సప్లయ్ అవుతున్నాయో తెలుసుకుంటానన్నారు. పోలీస్ శాఖలో చేసిన అనుభవంతో అక్రమాలను అదుపు చేస్తానని చెప్పారు. సరుకుల అ క్రమ రవాణా వల్ల వేల కోట్ల నష్టం జరుగుతోందని, దీంతో నిజమైన లబ్దిదారులకు నష్టం జరుగుతుందని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటే అవినీతిని అరికట్టవచ్చన్నారు. -
ఆ కులాల కోసం ప్రత్యేక కమిషన్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: గుర్తింపు లేని కులాల గుర్తింపుకోసం కమిషన్ వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో విముక్తి జాతుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పేద పిల్లల చదువుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, ఇందులో భాగంగానే 250 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి 2 లక్షల మంది విద్యార్ధులకు విద్యనందిస్తున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఏడు పదుల స్వాతంత్య్రంలో సంచార జాతులకు ఏడుపే మిగిలిందని, రాష్ట్రంలో అనేక కులాలకు ఇప్పటికీ గుర్తింపు లేకుండా పోయిందన్నారు. బీజేపీ శాసన సభాపక్ష నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా సంచార జాతుల బతుకులు మారలే దని, సంచార జాతులను గుర్తించేందుకు కమిషన్‌ను వేయాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ తిరుమలి, సంఘం నేతలు నరేందర్, వెంకటనారాయణ, కాటేపల్లి వీరస్వామి, మందుల గోపాల్, ఫకీర్ హుస్సేన్, రాజేశ్వర్ రావు, చవ్వ ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. -
ఆ పార్టీలకు పొత్తుల ఆలోచనలు వద్దు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కమ్యూనిస్టులు ఏ పార్టీతోనూ పొత్తుల కోసం ఆలోచించవద్దని.. దీని వల్ల పార్టీ క్యాడర్ దెబ్బ తింటుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయం–వామపక్షాల ఐక్య కార్యాచరణ, కమ్యూనిస్టుల ఐక్యత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఆర్థిక పోరాటాలను రాజకీయ పోరాటాలుగా మార్చాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ తనది కమ్యూనిస్టు కులమని, తాను ఎప్పుడూ ప్యూడల్ విధానాన్ని ప్రోత్సహించలేదని అన్నారు. ఇవాల్టిదాకా కేసీఆర్‌ను కలవలేదని చెప్పారు. సీపీఐ శాసన సభాపక్ష మాజీ నేత గుండా మల్లేష్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఎంసీపీఐ(యు) జాతీయ కార్యదర్శి ఎం.డి గౌస్, ఐఎస్యూసీఐ(సి) రాష్ట్ర నాయకులు మురహరి, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గాధగోని రవి, రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, మాస్టార్జీ, నాయకులు కాలువ మల్లయ్య, ప్రొఫెసర్ విజయలక్ష్మి, సీపీఎం నాయకులు జి. రాములు తదితరులు పాల్గొన్నారు. -
దాడులు తిప్పికొట్టాలి
రచయితల పిలుపు హైదరాబాద్: కవులు, రచయితలపై జరుగుతున్న దాడులు, హత్యలను ముక్తకంఠంతో ఖండించాలని, అందుకు ఐక్యంగా పోరాడాలని పలువురు రచయితలు పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో ‘వర్తమాన సామాజిక సంఘర్షణలు, రచయితల బాధ్యత’ అంశంపై సమావేశం జరిగింది. ఇందులో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ కార్యదర్శి కాత్యాయని విద్మహే, ప్రముఖ రచయితలు నందిని సిధారెడ్డి, కె.శివా రెడ్డి, తెలకపల్లి రవి, వరవరరావు, యాకుబ్, పసునూరి రవీందర్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు ప్రసంగించారు. కాత్యాయని మాట్లాడుతూ.. సమాజంలో రచయితలు వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. రెండేళ్లుగా స్త్రీలు, రచయితలపై దాడులు పెరిగాయన్నారు. మతం పేరుతో కొనసాగుతున్న దాడులను రచయితలు తిప్పికొట్టాలన్నారు. కలచివేస్తున్న ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడానికి రచయితలు సంఘటితం కావాలని నందిని సిధారెడ్డి పిలుపునిచ్చారు. లౌకికవాద అభిప్రాయాలున్న వారంతా ఒక్కటై ఇలాంటి సంఘటనలు తిప్పికొట్టాలని కె.శివారెడ్డి అన్నారు. భిన్నమైన విశ్వాసాలు, ఆచారాలు, భావప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను ముక్తకంఠంతో ఖండించాలని తెలకపల్లి రవి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే కొందరు తుపాకులు పడుతున్నారని వరవరరావు చెప్పారు. హిందుత్వ, బ్రాహ్మణీయ శక్తులు చేస్తున్న దాడులను రచయితలు ఖండించాలని రవీందర్ అభిప్రాయపడ్డారు. దాడులకు నిరసనగా రచయితలు తమ అవార్డులను వెనక్కు ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమని కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ దాడులను ఐక్యంగా ఎదుర్కోవాలని, రచయితలకు అండగా సమాజం ఉందని తెలియజేయాలని హరగోపాల్ అన్నారు. వేదిక జాతీయ కన్వీనర్ కె.మల్లీశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు శాంతిప్రభావతి, పి.రాజ్యలక్ష్మీ, బండారు విజయ, ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, విమలక్క, వాసురెడ్డి నవీన్, శిలాలోలిత, వినోదిని, కొండవీటి సత్యవతి, సామాజిక వేత్త దేవి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి
తమ్మినేని వీరభద్రం డిమాండ్ హైదరాబాద్: కొత్త జనాభా ప్రకారం గిరిజ నులకు 10 శాతం రిజ ర్వేషన్ అమలు చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గిరిజనుల రిజర్వేషన్‌పై మాక్ అసెంబ్లీ’ కార్యక్రమంలో తమ్మినేని మాట్లాడారు. గిరిజనుల సమస్యలతో పాటు అనేక సమస్యలు ఆందోళన కల్గిస్తున్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పోరేట్ శక్తులకే మేలు చేస్తోందన్నారు. విద్య, దళితులకు 3 ఎకరాల భూమి, పేదలకు 2 బెడ్ రూం ఇళ్లు హామీలు ఏమయ్యాయని వీరభద్రం ప్రశ్నించారు.రైతులు ఆత్మ హత్యలు పెరుతున్నా ప్రభుత్వం స్పందిం చటం లేదని ఆరోపించారు. -
నిరుపేద యువతకు ఉపాధి కల్పించాలి
అది సర్కార్ బాధ్యత రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఉద్ఘాటన సుందరయ్య విజ్ఞాన కేంద్రం: పట్టణ ప్రాంతంలోని నిరుపేద యువతకు ఉపాధి కల్పించాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో ‘పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజల అవసరాలు-రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ జయరాజు, రిటైర్డ్ సీఎస్ కాకి మాధవరావు, ప్రొఫెసర్ వైబీ సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. కాకి మాధవరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చి ఎలాంటి ఉపాధి లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారన్నారు. పట్టణ ప్రాంత పేదలకు గృహవసతి, మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. ప్రొఫెసర్ వైబీ సత్యనారాయణ మాట్లాడుతూ మురికివాడలను ఎంపిక చేసి ఎంతమంది నైపుణ్యం గల వారున్నారనే విషయమై సర్వే నిర్వహించి ఉపాధి కల్పించాలని సూచించారు. ఉపాధి కల్పిస్తాం.. దళితులకు ప్రవేశపెట్టిన మూడు ఎకరాల భూమి పథకాన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎస్సీ కార్పొరేషన్ ఎండీ జయరాజు అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దళిత యువతకు వారి అర్హత ఆధారంగా ఉపాధి క ల్పిస్తామన్నారు. అయితే ప్రభుత్వమే 75 శాతం సబ్సిడీ ఇచ్చి, మిగితా 25 శాతం బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలంటే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. సమావేశంలో సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, మల్లేపల్లి లక్ష్మయ్య, కేవీపీఎస్ నాయకులు జాన్ వెస్లీ, సీపీఐ నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్, బీడీఎఫ్ ప్రధాన కార్యదర్శి శంకర్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు ఆశాలత, ప్రొఫెసర్లు మల్లేశ్, లింబాద్రి, అమన్ వేదిక నాయకురాలు నిర్మల, సీడీఎస్ నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
బర్రెను జాతీయ జంతువుగా ప్రకటించాలి
ప్రొఫెసర్ కంచ ఐలయ్య హైదరాబాద్: దేశంలో బర్రెలే అత్యధికంగా పాలు ఇస్తున్నందున బర్రెనే జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య పేర్కొన్నారు. దళితులు సైతం జాతీయ జంతువుగా పూజించాలన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయటంతో పాటు ప్రతి గ్రామంలో కిండర్ గార్డెన్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని, గర్భస్థ శిశువు నుంచి ప్రభుత్వమే పోషకాహారం అందించాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,సీనియర్ జర్నలిస్టు సతీష్ చంద్ర, సామాజికవేత్త సాంబశివరావు, రచయిత జయరాజు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.