కేసీఆర్ మాటలు నమ్మొద్దు: వీహెచ్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కేసీఆర్ చెబుతున్న మాటలు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి.హన్మంతరావు అన్నారు. గతంలో కేసీఆర్ చెప్పిన మాటలను ఇప్పుడు చెబుతున్న వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక తెలంగాణ సాధన సమితి ఆధ్వర్యంలో ధూం..ధాం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. కొట్లాడి సాదించుకున్న తెలంగాణ మరొకరి చేతుల్లోకి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నేను హన్మంత రెడ్డిని అయితే ఆనాడే ముఖ్యమంత్రిని ఆయ్యేవాడినని అన్నారు. తెలంగాణ తెచ్చింది మేమైతే ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయినికి హోం మంత్రి నామ మాత్రమేనని ఒక్క కానిస్టేబుల్ కూడా ట్రాన్్సఫర్ కాడని, అందరు మంత్రులు పేరుకు మాత్రమే ఉన్నారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చేసిన పొరపాట్ల వల్లే తమ పార్టీ దెబ్బతినిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ బలహీన వర్గాలకు చెందిన వారికి మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ వారిని బలహీనులను చేసి పాలిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమ వేదిక చైర్మన్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. ఉద్యమం చేయని వారికి మంత్రి పదవులు ఇచ్చి ఉద్యమంలో పాల్గొన్న వారిని పక్కకు పెట్టారని విమర్శించారు. కేసీఆర్ బాహుబలి కావచ్చు కాని ఇక్కడ అందరు కట్టప్పలు ఉన్నారని మర్చిపోవద్దని హెచ్చరించారు. తెలంగాణ సాధన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ ప్రభంజన యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పిఎల్.విశ్వేర్‌రావు, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, చంద్రన్న, పాశం యాదగిరి, రాములు తదితరులు పాల్గొన్నారు. ఏపూరి సోమన్న, జంగ్ ప్రహ్లాద్ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.
సమావేశంలో అభివాదం చేస్తున్న వీహెచ్ తదితరులు