దాడులు తిప్పికొట్టాలి
రచయితల పిలుపు
హైదరాబాద్: కవులు, రచయితలపై జరుగుతున్న దాడులు, హత్యలను ముక్తకంఠంతో ఖండించాలని, అందుకు ఐక్యంగా పోరాడాలని పలువురు రచయితలు పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో ‘వర్తమాన సామాజిక సంఘర్షణలు, రచయితల బాధ్యత’ అంశంపై సమావేశం జరిగింది. ఇందులో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ కార్యదర్శి కాత్యాయని విద్మహే, ప్రముఖ రచయితలు నందిని సిధారెడ్డి, కె.శివా రెడ్డి, తెలకపల్లి రవి, వరవరరావు, యాకుబ్, పసునూరి రవీందర్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు ప్రసంగించారు. కాత్యాయని మాట్లాడుతూ.. సమాజంలో రచయితలు వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. రెండేళ్లుగా స్త్రీలు, రచయితలపై దాడులు పెరిగాయన్నారు.
మతం పేరుతో కొనసాగుతున్న దాడులను రచయితలు తిప్పికొట్టాలన్నారు. కలచివేస్తున్న ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడానికి రచయితలు సంఘటితం కావాలని నందిని సిధారెడ్డి పిలుపునిచ్చారు. లౌకికవాద అభిప్రాయాలున్న వారంతా ఒక్కటై ఇలాంటి సంఘటనలు తిప్పికొట్టాలని కె.శివారెడ్డి అన్నారు. భిన్నమైన విశ్వాసాలు, ఆచారాలు, భావప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను ముక్తకంఠంతో ఖండించాలని తెలకపల్లి రవి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే కొందరు తుపాకులు పడుతున్నారని వరవరరావు చెప్పారు. హిందుత్వ, బ్రాహ్మణీయ శక్తులు చేస్తున్న దాడులను రచయితలు ఖండించాలని రవీందర్ అభిప్రాయపడ్డారు.
దాడులకు నిరసనగా రచయితలు తమ అవార్డులను వెనక్కు ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమని కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ దాడులను ఐక్యంగా ఎదుర్కోవాలని, రచయితలకు అండగా సమాజం ఉందని తెలియజేయాలని హరగోపాల్ అన్నారు. వేదిక జాతీయ కన్వీనర్ కె.మల్లీశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు శాంతిప్రభావతి, పి.రాజ్యలక్ష్మీ, బండారు విజయ, ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, విమలక్క, వాసురెడ్డి నవీన్, శిలాలోలిత, వినోదిని, కొండవీటి సత్యవతి, సామాజిక వేత్త దేవి తదితరులు పాల్గొన్నారు.