poets
-
ఆ గొంతులన్నీ మూగబోయాయి
SAS (అందోల్): రాష్ట్ర సాధన ఉద్య మంలో పాటల రూపంలో ఉత్తేజపరిచిన గొంతులన్నీ మూగబో యాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ‘బీఎస్పీ శక్తి ప్రదర్శన’ నియోజకవర్గ ఇన్చార్జ్ ముప్పారం ప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కవులు, కళాకారులందరూ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల గొంతుకల కోసం బీఎస్పీలోకి రావాలని పిలుపునిచ్చారు. విప్లవా త్మకమైన పాటలను రాసిన వారిని, పాడిన వారిని గుర్తు చేసుకుంటూ పాటలు పాడుతూ అక్కడున్న వారిని ఆయన ఉత్తేజపరిచారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ కోసమే రూ.2 వేల కోట్లతో కొండపోచమ్మ రిజర్వాయర్‌ను రెండేళ్లలో పూర్తిచేశారని, సంగమేశ్వర, బస్వవేశ్వర ఎత్తిపోథల పథకానికి రూ.4 వేల కోట్లు మంజూరు చేయకపోతే క్రాంతి కిరణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు నటరాజన్ పాల్గొన్నారు. జర్నలిస్టుపై దాడిచేస్తే స్పందించని ఎమ్మెల్యే అందోల్‌లో అధికార పార్టీ నాయకుల అహంకారానికి అల్లాదుర్గం సాక్షి దినపత్రిక జర్నలిస్టుపై దాడిచేయడమే నిదర్శనమన్నారు. జర్నలిస్టు ఎమ్మె ల్యేగా ఉన్నా క్రాంతికిరణ్ జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. ఆయ న్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. -
అవార్డులూ.. బహుమతులూను
‘అవార్డులు రావు. కష్టపడి సంపాదించుకోవాలి’ అని అబ్బూరి వరద రాజేశ్వరరావు ఒకసారి అన్నారు. సాహిత్యం, ఆ మాటకొస్తే ఏ కళైనా ప్రచారం కోరుకుంటుంది. ప్రచారం దేనికి? కీర్తి కోసం అనుకునేవారు కొందరు. కళ నిర్వర్తించాల్సిన పరమార్థం కోసం అనుకునేవారు కొందరు. ఉత్కృష్టమైన కళ మబ్బుల చాటు సూరీడు వలే ఎల్లకాలం దాగి ఉండదు. జనులకు తెలిసే తీరుతుంది. ఆదరణ పొందుతుంది. కాని బంగారు చేటకు కూడా గోడచేర్పు అవసరం అన్నట్టు కొన్నిసార్లు కళ ప్రచారం కావడానికి, ఫలానా కళాకారుడి కృషి చూడండహో అని తెలుపడానికి అవార్డులూ, బహుమతులూ ఉపయోగపడతాయి. అయితే కాలక్రమంలో ఇడ్లీ కంటే చట్నీకి విలువెక్కువైనట్టు కళ కంటే ఈ అవార్డులకు విలువ ఎక్కువై అవార్డు వచ్చినవారు ‘గొప్పవారేమో’ అనే భావన జన సామాన్యులలో ఏర్పడే పరిస్థితి వచ్చింది. ముళ్లపూడి వెంకటరమణ ‘ఎన్ని ఫ్యాన్లున్నా ఒక్క ఏసీకి సమానం కావు గందా’ అని ఏదో పాత్ర చేత అనిపిస్తారు. చచ్చు పుచ్చు పుస్తకాలు ఎన్ని రాసినా ఒక సరైన అవార్డు కొడితే తల ఎగరేస్తూ తిరగొచ్చు కదా అనుకునే స్త్రీ పురుష సాహితీకారులు నేడు ఇరు రాష్ట్రాలలో తగు మోతాదులో మేట వేశారనే వాస్తవిక అపోహ ఉంది. జోకులు చలామణీలో ఉన్నాయి. ఒక ప్రఖ్యాత కవికి సరస్వతీదేవి ప్రత్యక్షమై ‘వత్సా! కవిత్వం కావలెనా? న్యూఢిల్లీ వారి ఫలానా సాహితీ అవార్డు కావలెనా?’ అని అడిగితే ఆ కవి సెకను తొట్రుపడకుండా ‘కవిత్వమే దయచేయి తల్లీ! అవార్డును ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను’ అన్నాట్ట! మనుషులంటూ ఉన్న ప్రతిచోటా తప్పులు, పొరపాట్లు ఉన్నట్టే అవార్డు అనే మాట ఉన్న చోటల్లా తప్పులూ, పొరపాట్లూ, రాజకీయాలూ, బానిసలకు వరాలూ ఉంటాయి. సాహిత్యంలో సర్వోన్నతమైనదిగా భావించే నోబెల్ పురస్కారం టాల్‌స్టాయ్‌కి రాలేదు. ఆయనకు కాకుండా ఆ తర్వాత దాదాపు 39 మంది నవలాకారులకు నోబెల్ ఇచ్చారు. వారంతా ‘మేము టాల్‌స్టాయ్‌కి వారసులం మొర్రోయ్’ అన్నారు. గాంధీకి నోబెల్ శాంతి ఇవ్వలేదుగాని ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన మార్టిన్ లూథర్ కింగ్‌కు ఇచ్చారు. చైతన్య స్రవంతికి ఆద్యుడైన జేమ్స్ జాయిస్‌కి నోబెల్ రాలేదు. కథా చక్రవర్తయిన సోమర్సెట్ మామ్‌కు ఎందుకివ్వలేదయ్యా అనంటే ‘అతడు అక్కరకు మించిన ప్రచారం పొందాడు’ అని సాకు చెప్పారు. మన దగ్గర రవీంద్రనాథ్ టాగోర్‌కి సరే, ప్రేమ్‌చంద్, శరత్‌లు నోబెల్‌కు ఏం తక్కువ అని తూకం వేసి నిరూపిస్తే సదరు అవార్డు కమిటీ ఏం చెబుతుందో ఏమో! భారతదేశం వంటి దేశంలో రచయితలు, కవులు కేవలం తన రచనలతో బతికే పరిస్థితులు లేవు. ఎంతో గొప్ప అంకితభావం, ప్రతిభ, రచనాశక్తి, జనహిత అభిలాష కలిగిన రచయితలైనా బతుకు బాదరబందీలకు అవస్థలు పడుతూ కవిత్వమో, కథో రాయాలి. అప్పొసప్పో చేసి పుస్తకాలు వేసుకోవాలి. అవి అమ్ముడు పోకపోతే అటక మీద గుడ్డ కప్పి దాచుకోవాలి. ఇలాంటి సందర్భాలలో వీరికి తృణమో పణమో ఇచ్చి అవార్డు చేతపెట్టి గౌరవించుకుందాం అనే సదుద్దేశ సాహితీ సంస్థలు అనేకమే వచ్చాయి. ఇవి తమ తమ అభిరుచి, అభిలాషల మేర అవార్డులు ఇచ్చి ప్రోత్సహించినా, వాటిలో ప్రతిష్ఠాత్మకస్థాయి కలిగినవి బహు స్వల్పం కావడంతో ప్రభుత్వపరంగా వచ్చే రాష్ట్ర అవార్డులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులు ప్రతిష్ఠాత్మకమై కూచున్నాయి. ‘షేక్స్పియర్కు ఏ అవార్డు వచ్చిందని నేటికీ చదువుతున్నారు’, ‘వేమనకు ఎవరు అవార్డిచ్చా రని ప్రతి నాలుక మీద పలుకుతున్నాడు’ అని ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా యోగ్యులైన సాహితీ కారులకు యోగ్యమైన అవార్డు వచ్చి తీరాలి. లేకుంటే అయోగ్యులు ఆ అవార్డులు పొందుతూ అవార్డుకు అయోగ్యతను తెచ్చి పెడతారు. అసలు సాహితీకారులు తమ వల్ల అవార్డుకు గౌరవం రావాలని కోరుకోవాలేగాని అవార్డు వల్ల తమకు గౌరవం రావాలనుకుంటున్నారంటేనే వీరెంత నిరుపేదలో అర్థం చేసుకోవచ్చు. ఇందుకై ఏళ్ల తరబడి పి.ఆర్ చేయుట, పెద్దలను మచ్చిక చేసుకొనుట, పథకాలు రచించుట, దొంగ పద్ధతిలో షార్ట్‌లిస్ట్‌లో చేరుట, కుల సమీకరణలు, ప్రాంతీయ సెంటిమెంట్లు.. ఇన్ని పతన సోపానాల మీద నడిచి అవార్డు తెచ్చుకుని అల్మారాలో పెట్టుకుని పొద్దున్నే అద్దంలో ముఖం ఎలా చూసుకుంటారో వీరు! నలుగురూ తిరిగే చోట తమ పుస్తకం పెట్టి, దాని మీద డబ్బు పెడితే ఆ డబ్బు కోసమైనా ఎవరూ పుస్తకాన్ని తీసుకెళ్లని నాసిరకం రచయితలు, కవులు కూడా ఫలానా అవార్డు కోసం పైరవీ చేసేవారే! వీరికి ఊ కొట్టే దిక్కుమాలిన జ్యూరీలు! ‘అవార్డు వస్తే ఏమవుతుంది’ అనంటే ‘నోరు మూతబడుతుంది’ అనేది ఒక జవాబు. ప్రభుత్వానికి ప్రత్యర్థిగా ఉండాల్సిన కవులు, రచయితలు ప్రభుత్వపరమైన అవార్డులు తీసుకున్నాక ప్రభుత్వానికి ములాజా అవుతారు. ఈ కారణం చేత కూడా ప్రభుత్వాలు అవార్డులను సృష్టిస్తాయి, ఇచ్చి ప్రోత్సహిస్తాయి. తమిళ రచయిత జయమోహన్ తనకొచ్చిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ఈ కారణం చేతనే తిరస్కరించాడు. అయితే సరైన రచయితలు తమకు అవార్డుల వల్ల వచ్చిన అదనపు గుర్తింపును జనం కోసం ఉపయోగించడం మంచి స్ట్రాటజీనే! ప్రస్తుతం తెలుగునాట అవార్డుల దుమారం రేగి ఉంది. అవార్డు ఇస్తాం అనంటే గౌరవప్రదమైన సాహితీకారులు పరిగెత్తి పోరిపోయే స్థితి ఉంది. నాణ్యమైన రచనల పట్ల తెలుగు పాఠకలోకం ఉదాసీనత మాని, వాటిని అక్కున జేర్చుకుంటూ, ఆ రచనలకు సముచిత స్థానం కల్పిస్తూ వెళ్లడమే దీనికి విరుగుడు. పాఠకుడి అవార్డులు, బహుమతులే ఇప్పుడు తెలుగు సాహిత్యానికి శ్రీ సరస్వతీ రక్ష. -
పల్లె పరిమళాల సౌందర్యం ‘రాళ్లకుచ్చె’
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛమైన తెలంగాణ పల్లె పరిమళాలు దాసరి మోహన్ రాసిన కథా సంపుటి ‘రాళ్లకుచ్చె’లో పుష్కలంగా ఉన్నాయని తెలంగాణ సాహిత్య ఆకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. 32వ జాతీయ పుస్తక ప్రదర్శన వేదికగా ఆదివారం పలువురు తెలంగాణ కవులు రాళ్లకుచ్చె కథా సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ గ్రామీణ సౌందర్యాన్ని దాసరి మోహన్ ఈ కథా సంపుటిలో అద్భుతంగా పొందుపర్చడం అభినందనీయమని పేర్కొన్నారు. రాళ్లకుచ్చె కథా సంపుటిని రచయిత దాసరి మోహన్.. తెలంగాణ రచయితల సంఘానికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో తంగేడు పత్రిక ఎడిటర్ కాంచనపల్లి గోవర్ధన్, జంటనగరాల తెలంగాణ రచయితల సంఘం తరఫున కందుకూరి శ్రీరాములు, ప్రముఖ కవి కూర చిదంబరం తదితరులు పాల్గొన్నారు. -
ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచనలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కవులు రచనలు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. నగరంలో జరుగుతున్న 35వ జాతీయ పుస్తక ప్రదర్శనను కవిత ఆదివారం సందర్శించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి స్టాల్‌ను ప్రారంభించారు. అలిశెట్టి ప్రభాకర్ వేదికగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కవి, వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం’పుస్తకంపై జరిగిన చర్చా కార్యక్రమంలో కవిత మాట్లాడారు. ‘దేశంలో ఫాసిస్ట్ పాలన సాగుతున్న నేపథ్యంలో కవులు, కళాకారులు ప్రజలను చైతన్యం చేయాల్సిన సమయం వచ్చింది. మొదటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత సురవరం ప్రతాప్‌రెడ్డి నుంచి ఆ పరంపర కొనసాగుతోంది. అనేక మంది గొప్ప కవుల వారసత్వాన్ని తెలంగాణ పుణికిపుచ్చుకుంది. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ రచించిన ‘వల్లంకి తాళం’రచన కూడా అంతే అద్భుతంగా ఉంది’అని ఆమె చెప్పారు. పనిలోంచి పుట్టిన పదాలను ఇటలీ భాషలో ఉపయోగిస్తారని.. అదే ఒరవడితో తెలంగాణలో కూడా కష్టాలు, శ్రమలోంచి వారి రచనలు ఉంటాయని అన్నారు. ఈ రచనలే ఇక్కడి సాహిత్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయని, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్‌గా తెలుగు ఖ్యాతిపొందిందని పేర్కొన్నారు. మట్టితనాన్ని, శ్రమతత్వాన్ని అణువణువునా పొందుపరిచి కవిత్వం రాయడంగోరటి వెంకన్న ప్రత్యేకతని కొనియాడారు. చిన్న చిన్న పదాలతో అద్భుతంగా రాయడంతోపాటు అడవి గురించి తన ఆకుపచ్చ కోవెలతో పోల్చడం అద్భుతమైన అంశమన్నారు. అందుకే నల్లమలలో యురేనియం తవ్వకాలను నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. ఇలాంటి కవి పుట్టిన ఈ కాలంలో తాను పుట్టినందుకు గర్వంగా ఉందని, ఆయనతోపాటు కౌన్సిల్లో కూర్చోవడం సంతోషంగా ఉందని కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, డాక్టర్ నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. ప్రదర్శనలో వివిధ స్టాల్స్‌ను ఆసక్తిగా తిలకించిన కవిత.. సాహిత్యం, కథలు, పిల్లల పుస్తకాలను కొనుగోలు చేశారు. -
మహోజ్వల భారతి: విదేశం బహిష్కరించిన తెలుగు వీరుడు
తెలుగు వీరుడు: వి.వి.గిరిగా ప్రసిద్ధులైన వరాహగిరి వేంకటగిరి భారతదేశ నాల్గవ రాష్ట్రపతి. మన తెలుగువారు! నేడు ఆయన జయంతి. 1894 ఆగస్టు 10న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్‌లో జన్మించారు. వి.వి.గిరి తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య, తల్లి సుభద్రమ్మ. వెంకట జోగయ్య ప్రసిద్ధి చెందిన న్యాయవాది. తూర్పుగోదావరి జిల్లాలోని చింతల పూడి నుండి బరంపురానికి ఈ కుటుంబం వలస వెళ్లింది. వి.వి.గిరి 1913 ఐర్లండ్‌లోని డబ్లిన్ యూనివర్శిటీ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లారు. ఐర్లండ్‌లో ‘సీన్‌ఫెన్’ జాతీయోద్యమంలో పాల్గొని ఆ దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఆ ఉద్యమ కాలంలోనే ఆయనకు ఈమొన్ డి వలేరా, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఈయోన్ మెక్నీల్, జేమ్స్ కాన్నలీ వంటి రాజకీయ ఉద్యమనేతలతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇండియా తిరిగి వచ్చాక ఇక్కడ క్రియాశీలకంగా ఉన్న కార్మిక ఉద్యమంలో పాల్గొన్నారు. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా పని చేశారు. అనంతరం 1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యారు. 1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా బొబ్బిలి రాజా పై పోటీ చేసి గెలిచారు. 1937లో మద్రాసు ప్రావిన్స్‌లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మిక, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1942లో దేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసిన ప్పుడు, వి.వి. గిరి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్లారు. 1975లో వి.వి.గిరికి భారత ప్రభుత్వం ‘భారత రత్న’ అవార్డు ప్రదానం చేసింది. ప్రసన్న కవి ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ రచయిత. నేడు ఆయన జయంతి. 1914 ఆగష్టు 10 న తిరుపతిలో జన్మించారు. మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవారు. భుక్తి కోసం ఎన్నో పనులు చేశారు. హోటలు సర్వరుగా, రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేశారు. ‘ఆంధ్ర పత్రిక’లో ప్రూఫ్ రీడర్‌గా, పాఠశాల ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా కూడా చేశారాయన. మహాత్మా గాంధీ హత్య జరిగినపుడు ఆవేదన చెంది, ‘బలిదానం’ అనే కావ్యం రాశారు. అది ఎంతో మందిని కదిలించింది. కన్నీరు తెప్పించింది. సుందరాచారికి అమితమైన ఆత్మగౌరవం. దాని కోసం ఉద్యోగాలు కూడా వదులుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో నిర్లిప్త జీవితం గడిపారని అంటారు. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి పట్టణం తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్లో సుందరాచారి జ్ఞాపకార్థం ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. శంకరంబాడి సుందరాచారిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అని కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు. (చదవండి: స్వతంత్ర భారతి: మిస్ వరల్డ్ మానుషి) -
మా కోరిక వికేంద్రీకరణే!
1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే, 2014లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం! 1953లో కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడినాయి. శ్రీబాగ్ ఒప్పందంలోని ఒక్క అంశం, ఆ రకంగానైనా ఆనాడు ఆచరణలోకి వచ్చింది. దానిని ఇప్పుడు కొనసాగించమనేదే మా గట్టి డిమాండ్. మూడు రాజధానులు కాదు, మూడు వికేంద్రీకరణలు మాత్రమే! కర్నూలులో పరిపాలనా రాజధాని, అసెంబ్లీ, గుంటూరులో ఓ హైకోర్టు, విశాఖలో శీతకాలపు అసెంబ్లీ సమావేశాలు ఉండాలనేది మా అభిప్రాయం. విశాఖపట్టణం ఆర్థిక రాజధానిగా వెలుగొందుతుందని మా విశ్వాసం. (చదవండి: ‘ఒకే దేశం, ఒకే ఎలక్షన్’లో మర్మం?) అంతే కాకుండా... పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని లక్ష క్యూసెక్కులకు పెంచాలి. తుంగభద్ర సమాంతర కాలువ నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. నదుల అనుసంధానంలో భాగంగా కేంద్ర ప్రణాళికలోని ‘ఆల్మట్టి నుంచి బుక్కపట్నం లింక్ కెనాల్ గురించి కేంద్రంతో, కర్నాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచాలి. గాలేరు–నగరి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి. (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!) ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అడ్డుకుని, నిల్వ ఉన్న దుంగలను వేలం వేసి ఆ డబ్బును రాయలసీమ అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కడపజిల్లాలో ఉక్కు కర్మాగారం, మల్లవరంలో బీహెచ్ ఈఎల్ ఏర్పాటు, పులరిన్ ఖనిజం వెలికితీత, ఆ ఖనిజాధారిత పరిశ్రమల ఏర్పాటు తదితరాలు మా తక్షణ డిమాండ్లు. శ్రీబాగ్ ఒడంబడికను అనుసరించే నీళ్ల వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ జరగాలని మేం కోరు కుంటున్నాం. రాజీలేని మా వైఖరి, ఏ అపార్థాలకూ తోవచూపరాదని విశ్వసిస్తూ... – రాయల సీమ కవులు, రచయితలు (కేతు విశ్వనాథరెడ్డి, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణ స్వామి, భూమన్, శాంతినారాయణ, వేంపల్లె షరీఫ్, రాసాని వెంకట్రామయ్య, మధురాంతకం నరేంద్ర, తదితరులు) -
విద్వన్మణి గణపతిముని
దేశం నలుమూలలనుంచీ వచ్చిన కవులూ, పండితులతో నవద్వీప పండితసభ కోలాహలంగా ఉంది. సభలో నెగ్గినవారి పాండిత్యానికి తగ్గట్టు బిరుదులను ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ సభలో తన సత్తా నిరూపించుకోడానికి వచ్చాడో తెలుగు యువకుడు. అతడు సకల శాస్త్ర పారంగతుడు. ఆశుకవితా దురంధరుడు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆసేతు హిమాచలమంతా కీర్తించిన ఆ ప్రతిభామూర్తియే అయ్యలసోమయాజుల గణపతిముని. వినాయకుడి అనుగ్రహంతో జన్మించినందున తల్లిదండ్రులు పెట్టినపేరు గణపతి. చిన్నతనంలోనే పురాణ–ఇతిహాసాలతోబాటు జ్యోతిష్యశాస్త్రాన్ని కూడా కరతలామలకం చేసుకున్నారు. ఆనాటి పండిత లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన నవద్వీపసభలో గణపతిముని తన పాటవాలను నిరూపించుకుని‘కావ్యకంఠ‘ బిరుదును పొందారు. తత్త్వచింతనలో శంకరుడిని, కావ్యమాధుర్యంలో కాళిదాసుని తలపించే కవిత్వం గణపతిమునిదని ఆనాటి పండితులు అభిప్రాయ పడ్డారు. వారి రచనల్లో ఉమాసహస్రం, ఇంద్రాణీ సప్తశతి, ఉమాశతకం, రమణగీత, దశమహావిద్యలు వంటి గ్రంథాలు ముఖ్యమైనవి. నాయనగారు..! తీవ్రమైన తపోకాంక్షతో అరుణాచలం చేరిన వీరిని చూసి అక్కడున్న బ్రాహ్మణస్వామి తమ దీర్ఘకాలిక మౌనాన్ని వీడి ‘నాయనా‘ అని ప్రేమపూర్వకంగా పిలిచారు. ‘రమణ మహర్షులకు‘ నమస్కారం అంటూ సంబోధించిన గణపతిముని మాటతో ఆనాటి నుండి బ్రాహ్మణ స్వామి రమణ మహర్షిగా ప్రజలలో స్థిరమయ్యారు. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని వేదపండితులు -
జగమేలే పరమాత్మా! నీకిది తగునా!!
ఆర్తత్రాణ పరాయణుడివి, శరణాగత రక్షకుడివి, పిలిస్తే పరుగెత్తేకొచ్చేవాడివి, ఎంతటి కష్టాల్నయినా వహించేవాడివి, సహించేవాడివి...ఒక్కసారి వచ్చి దర్శనమిమ్మంటే రావేం తండ్రీ...అంటూ త్యాగయ్య... బహుశః నీవు రాకపోవడానికి మరో కారణం కూడా ఉండి ఉండవచ్చంటూ ఆ కీర్తనలో ఇలా అంటాడు...‘‘ఖగరాజు నీయానతి విని వేగ చన లేడో –గగనానికిలకు బహుదూరంబని నాడో...’’. గరుత్మంతుడేమయినా..‘‘అబ్బో అంతదూరం ఎక్కడ పోతాం లేండి...ఎక్కడాకాశం !!! ఎక్కడ భూమి !!! ఇంతదూరం నుంచి అక్కడికి ఏం పోతాం లేండి.’’ అన్నాడా స్వామీ... భగవంతుడితో తమ ఆర్తిని ఎంత లలితమైన పదాలతో వాగ్గేయకారులు వ్యక్తం చేసారో చూడండి. ఒకవిధంగా అది దెప్పిపొడుపు.. ఇంత మొరపెట్టుకున్నా ఆయన రానందుకు... కానీ అంతరార్థంలో...‘నిజంగా నీవు రావాలనుకుంటే, నాకు కనపడాలనుకుంటే అక్కడి నుంచి ఇక్కడకు ప్రత్యేకంగా పనికట్టుకుని రావాలా స్వామీ. నువ్వెక్కడ లేవు కనుక...‘ఇందుగలడందులేడని సందేహము వలదు...’ అని ప్రహ్లాదుడంటే అక్కడే ఉన్న స్తంభం చీల్చుకుని రాలేదా స్వామీ... అలాటిది ఇవ్వాళ నిజంగా నువ్వు రావాలనుకుంటే..‘పాపం త్యాగయ్య అంత బాధపడుతున్నాడు, ఒక్కసారి కనపడిపోదాం...అనుకుంటే నీకు గరుత్మంతుడి అవసరమేముంది కనుక.. నీవెక్కడ లేవు కనుక అని మరో అర్థం. గజేంద్రుడు ఎప్పుడు పిలిచాడు... చిట్టచివర ఓపికంతా అడుగంటిన తరువాత..‘లా ఒక్కింతయు లేదు... ధైర్యము విలోలంబయ్యె, ప్రాణంబులా ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చె...’’ అంటూ ఊపిరి ఆగిపోయేముందు పిలిచిన పిలుపు నీకు వినపడినప్పుడు ఈరోజు ఇంత ఆర్తితో ఇంత ఎలుగెత్తి నిన్ను పిలుస్తున్నా నీ చెవినపడలేదా స్వామీ... ఒకవేళ నేనే తప్పు చేసానేమో...‘జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు...’ అంటున్నారు త్యాగయ్య. నాకేదయినా కష్టం వస్తే నీకు చెప్పుకుంటాను. నాకు ఆకలేసింది, అన్నం దొరకలేదు, నాకు సంగీతంలో ఏదో సమస్య వచ్చింది, నేను అవి నీతో తప్ప మరెవరికి చెప్పుకుంటాను... కానీ ఇప్పుడు నా సమస్య నువ్వే. నేను పిలుస్తున్నా నీవు రాకపోతే నేనెవరికి చెప్పుకోను... జగాలను ఏలే వాడివి... లోకాలకన్నింటికీ ఏలికవు నువ్వు. ఇవ్వాళ నీవే కనపడకపోతే నేనెవరితో చెప్పుకోను తండ్రీ... రాముడు కనపడడం లేదు.. అని ఎవరితోనయినా చెప్పుకుంటే సిగ్గుచేటు..ఏమిటీ, నీకు రాముడు కనపడ్డం లేదా అని హేళన చేయరా స్వామీ.. నువ్వు కూడా తేలిగ్గా తీసేయవద్దు... నన్ను పగవాడిగా చూడకు. ఇంతకన్నా నాకు చేతకాదు... నా ఆర్తి విను.. చూడకుండా ఉండలేను రామా! ‘నగుమోము కనలేనీ నాదు జాలీ తెలిసీ... ఆలస్యం చేయకు... ఒక్కసారి కనపడు. వారి మనసు నొచ్చుకున్నప్పుడు సంగీతకారుల, భక్తి తాదాత్మ్యత ఎంత పరాకాష్టకు చేరుకుంటుందంటే... సాక్షాత్... వారి ఇష్టదైవాన్ని కూడా నిలదీసేస్తారు... అయితే దానిలో పారుష్యం ఉండదు, ఆర్తిమాత్రమే కనబడుతుంది.. దాశరథీ శతక కర్త.. ఒక సందర్భంలో ‘‘దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ దాసుల దాసుడా గుహుడు తావక దాస్యమొసంగినావు, నే జేసిన పాపమో వినుతి జేసిన గానవు, గావుమయ్య నీ దాసులలోన నేనొకడ దాశరథీ ! కరుణాపయోనిధీ!’’ అంటారు. అంటే ‘‘నీకేమయినా శబరి చుట్టమా, గుహుడు సేవకుడా... వారితో దాస్యం (సేవలు) చేయించుకున్నావు. నేను పనికి రాలేదా.. నీ దాసానుదాసుల్లో నేనూ ఒకడినే కదా... నన్నెందుకు కరుణించవు’’ అంటాడు..అప్పటికప్పుడు సందర్భాన్ని అనుసరించి గురువుగారు పాడమంటే రాముడి దర్శనం కోసం వెంపర్లాడిపోయిన త్యాగయ్య నోటివెంట అలవోకగా వచ్చిన అద్భుతమైన కీర్తన ఇది. ఇది ప్రప్రథమమైన ప్రయోగమే అయినా పండిపోయిన భక్తికి ప్రతి అక్షరం అద్దం పడుతుంది. ఆ తరువాత వారి నోటివెంట అజరామరమైన కీర్తనలు చాలా వచ్చాయి. -
తాను స్వయంగా రాసిన ఓ కవితను..
టీ.నగర్: మినిమం గ్యారెంటీ గాయనిగా చిత్ర సీమలోకి ఎంట్రీ అయిన బ్యూటీ శ్రుతిహాసన్. ఆ వెంటనే తండ్రి కమల్‌హాసన్ నటించిన ఉన్నైపోల్ ఒరువన్ చిత్రంలో సంగీత దర్శకురాలిగా అవతారమెత్తి సత్తా చాటుకుంది. అంతలోనే అందాల ఆరబోతకు అవకాశాలు రావడంతో నటనపై దృష్టి సారించింది. ఈ అమ్మడు తమిళం, తెలుగు, హింది భాషాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. దీంతో శ్రుతి సంగీతానికి తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ప్రస్తుతం శభాష్ నాయుడు చిత్రంలో నటిస్తున్న శ్రుతి, హిందీలో మహేష్ మంజ్రేకర్ చిత్రంలో కూడా నటిస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతి కొన్ని సూపర్‌హిట్ పాటలను ఆలపించి ఆహుతులను మైమరపించింది. ఆ సమయంలో అమ్మడు మాట్లాడుతూ తాను మళ్లీ సంగీతం వైపు చూపు మరలించనున్నట్టు తెలిపింది. ఎక్కువ పాటలను పాడడమే కాదు, పాటల రచనపై కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెపింది. అదే సమయంలో తాను స్వయంగా రాసిన ఓ కవితను కూడా వినిపించింది. తన కవితలను ఇప్పటి వరకూ ఎవరికీ చూపలేదు, ఎక్కడా చదవలేదని తెలిపింది. చాలా కవితలనే రాశానని శ్రుతి వెల్లడించింది. -
మా గొంతు ఇక్కడా వినరా!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన కవయిత్రుల ఆవేదన ఇది. కవి సమ్మేళనం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో అని నిర్వహకులు చెప్పారు. అక్కడికి వెళ్తే ‘ఇది మగవాళ్లకు మాత్రమే’నన్నారు అక్కడివారు. ‘మరి మాకు వేదిక ఎక్కడ’ అంటే రవీంద్రభారతికి వెళ్లమన్నారు. అక్కడ ‘బాల కవి సమ్మేళనం జరుగుతోంది, మరొక వేదిక మీద అష్టావధానం, మా ఏర్పాట్లలో మీకు వేదిక లేదు’ అన్నారు. ఇది తెలుగు మహాసభల మూడవ రోజు ఆదివారం నాటి పరిస్థితి. మహబూబ్‌నగర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పుష్పలత, తెలుగు ఉపాధ్యాయిని జీవనజ్యోతి, అంబుజ, మరో ముగ్గురు రచయిత్రులకు ఎదురైన చేదు అనుభవం ఇది. ‘ప్రియదర్శిని ఆడిటోరియం నుంచి రవీంద్రభారతికి వస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్లకే అవకాశమన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే నిన్నటితోనే ముగిసిందంటున్నారు. ఇక్కడ పడిగాపులు కాస్తూ నిర్వహకులను అడగ్గా అడగ్గా ‘రేపు రెండు గంటల సమయమిస్తాం, ఆ టైమ్‌లోనే ఎంతమంది రచయిత్రులు ఉంటే అందరూ మీ పద్యాలను చదువుకోవచ్చు’ అంటున్నారు. రెండు వందల మంది రచయిత్రులం ఉన్నాం. రెండు గంటల టైమంటే ఒక్కొక్కరికి ఒక్క నిమిషం కూడా ఇవ్వరా? మేము అర నిమిషంలో ముగించాలా? మగవాళ్లకైతే ఏకంగా నాలుగు రోజులు.. రోజుకు ఏడు గంటలా..! మహిళలమని ఇంత వివక్షా! అయినా పద్యానికి, పద్యం రాసిన వాళ్లను కూడా మగ, ఆడ అని వర్గీకరిస్తారా? ప్రపంచ తెలుగు మహాసభలు మగవాళ్లకేనా?’ అని ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు జీవనజ్యోతి. ఆమె మాటల్లో ఆవేశం వెనుక ఉన్న ఆవేదనలో అర్థముంది. ఆమెది ఆగ్రహం ధర్మాగ్రహమే. సభల నిర్వాహకులూ మీరేమంటారు..! -
ఆమె.. కవనం జ్వలనం
..: సంగిశెట్టి శ్రీనివాస్ దేశ స్వాతంత్య్రానికి ముందే స్వతంత్రంగా ఆలోచించి కవిత్వం చెప్పిన కవయిత్రులు మనకున్నారు. తెలుగు మహాసభల సందర్భంగా ఆ స్ఫూర్తిదాతలను తలచుకుందాం. తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక సమ్మక్క, సారలమ్మ, రాణి రుద్రమ మొదలు నేటి వరకూ తెలంగాణలో స్త్రీల శౌర్యము ఎంతగానో ఉంది. ఘనమైన పాత్ర పోషించి చరిత్రకెక్కిన మహిళల గురించి ఇవ్వాళ చర్చించుకుంటున్నాం. ఈ చర్చలు చర్యలుగా మారాయి. ఆ చర్యలు పరిశోధనగా మారి తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక వెలుగులోకి వచ్చింది. ఆమె రాసిన పద్యాల్లో ఇప్పుడైతే ఒకటే అందుబాటులో ఉంది. దాని ఆధారంగా ఆమెను తొలి తెలుగు కవయిత్రిగా నేను నిర్ధారించడం జరిగింది. ఈమె రంగనాథ రామాయణము గ్రంథకర్త గోన బుద్ధారెడ్డి కూతురు. తొలి ఉర్దూ కవయిత్రి మహలఖాబాయి చాందా తెలంగాణలో తమ కళల ద్వారా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన వారిలో తారామతి, ప్రేమావతి ఉన్నారు. వీళ్లు ప్రేమను కేంద్రంగా చేసుకొని రాశారు. హైదరాబాద్ నగరమే ప్రేమ పునాది మీద ఏర్పడింది. చంచల్‌గూడాలో ఉండే భాగమతిని ప్రేమించిన యువరాజు ఆమె కోసం మూసీనది ఉధృతంగా ప్రవహిస్తున్న కాలంలో తన గుర్రంపై సవారి అయి వచ్చేవాడు. యువరాజు సాహసం చూసి చలించిన రాజు ‘పురానా ఫూల్’ని కట్టించాడు. నిజాం రాజవంశానికి చెందిన హయత్ బ„Š బేగమ్ హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెంట్‌గా ఉన్న కిర్క్ పాట్రిక్‌ని ప్రేమించి 1800 ప్రాంతంలో వివాహమాడింది. హైదరాబాద్ ప్రేమతత్వానికి ఇట్లాంటి అనేక నిదర్శనాలున్నాయి. సాహిత్యంలో కూడా వీటి ప్రతిఫలనాలున్నాయి. వాటిలో ఉర్దూలో మహలఖాబాయి చాందా ప్రముఖురాలు. ఉర్దూలోమొదటిసారిగా కవిత్వం రాసిన మహిళ మహలఖాబాయి. ఈమెకు నిజాం ఖాందా తో ‘ప్రేమ’ పూరిత సంబంధాలున్నాయి. తొలి తెలంగాణ ఆధునిక కవయిత్రి రత్నమాంబ తెలంగాణకు తొలి ఆధునిక కవయిత్రి పెనుగోళ్ళ రత్నమాంబ దేశాయి. 1847లో పరిగి తాలూకా ఇప్పటూరులో జన్మించిన ఈమె వేంకటరమణ శతకము, శ్రీనివాస శతకము, బాలబోధ, శివరొరువంజి (యక్షగానం), దశావతార వర్ణన మొదలైన రచనలు వెలువరించారు. దశావతార వర్ణనను తన 72వ యేట రచించారు. ఈమె రచనలు హితబోధిని, నీలగిరి, తెనుగు పత్రికల్లో చోటుచేసుకున్నాయి. 1929లో మరణించిన ఈమె రచనలు ఇప్పుడు ఒకటి అరా తప్ప అందుబాటులో లేవు. 1934లో వెలువడ్డ గోలకొండ కవుల సంచికలో అత్రాఫ్ బల్దా జిల్లాకు చెందిన మొత్తం 33 మంది కవుల రచనలు చోటుచేసుకోగా అందులో ఈమె రచనలు కూడా ఉన్నాయి. ‘సంసార తరణము’ శీర్షికన ఆమె రాసిన మూడు కంద పద్యాలు ఈ సంచికలో ఉన్నాయి. గాంధీని అవతార పురు షునిగా ఆమె రాసిన కవిత్వం 1924లో అచ్చయ్యింది. 1913 డిసెంబర్ హితబోధిని సంచికలో ఆమె రాసిన పద్యాలతో ఆమెను తొలి తెలంగాణ కవయిత్రిగా చెప్పొచ్చు. అంతకు ముందే ఆమె రచనా వ్యాసంగం చేపట్టినప్పటికీ అవి అందు బాటులో లేకపోవడంతో 1913ని ప్రామాణికంగా తీసుకోవ డమైంది. ఈమెను తెలంగాణ కవితారంభానికి మాతృ మూర్తిగా ప్రతిష్టించి గౌరవించాల్సిన అవసరముంది. కందం, శార్దూలం, సీసం, తేటగీతి, ఆటవెలదుల్లో ఆమె పద్యాల్ని రాసింది. తరుణీకృత పాండిత్యము స్థిరమా యీమాట లంచు ఛేదింపకుడీ హరియాజ్ఞగాక నాకీ కరణి యుపన్యాసమొసగు జ్ఞానము గలదే అచల మత ప్రచారకర్త జాలమాంబ ఆధునిక మహిళల విషయానికి వస్తే దళితోద్యమ నేత భాగ్యరెడ్డి వర్మ మేనత్త రంగమ్మ 1880ల నాటికే క్రైస్తవ మతం పుచ్చుకుంది. భాగ్యరెడ్డి వర్మను చదువుకునేలా ప్రోత్సహించింది. దాదాపు ఇదే సమయంలో హైదరాబాద్‌లో అచల మతాన్ని ప్రచారం చేసిన తల్లావఝుల జాలమాంబ అనేక కీర్తనలు రాసింది. కొన్ని సీస పద్యాలు రాసింది. వాటిలో మచ్చుకు ఒక్కటి. కవిత్వంలో తప్పులుంటే ఎత్తి చూపాలని కోరింది. సీ. గురుపుత్రులార మద్గురుమూర్తి స్తోత్రంబు రచియింప బూను నా వచనములను వినలేడ్కగలిగిన వినరయ్య వినిపింతు తప్పులుండిన వాటి దాచబోక దిద్దవలసినది మీ దేశికేంద్రుని మీద మీకు భక్త్యున్నట్టె నాకు గలదు గాని మీవలె నేను కవిత జేయగజాల చాలనంచని విడజాలతోచి నట్లు జేయుదు మీ రందరభయమిడిన ననుచు విజ్ఞాపన మొనర్చి యాజ్ఞగొంటి భాగవత వంశ భవకృష్ణ యోగి రాజ ధీ విశారద మాకదేశి కేంద్ర నేటి స్త్రీవాదికి తీసిపోని సుందరాబాయి 1900లకు ముందే వరంగల్‌లో స్త్రీల సమాజాలు ఏర్పాటయ్యాయి. ఈ పరంపరను హైదరాబాద్‌లో రావిచెట్టు లక్ష్మీనరసమ్మ కొనసాగించింది. తన ఇంట్లోనే విద్యావసతులు ఏర్పాటు చేయడమే గాకుండా గ్రంథాలయోద్యమానికి కూడా అండగా నిలిచారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ, ఆర్థికంగానూ తోడ్పడింది. గ్రంథాలయోద్యమ ప్రభావంతో చాలా మంది పాఠకులుగా మారారు. ఇందులో స్త్రీలు కూడా ఉన్నారు. ఈ పాఠకులు తర్వాతి కాలంలో రచయిత్రులుగా మారినారు. వారిలో 1913లో ‘హితబోధిని’ పత్రికలో స్త్రీ విద్యావశ్యకత గురించి ఎస్.సుందరాబాయి వ్యాసాలు రాసింది. కవిత్వం కూడా అల్లింది. నిజా నికి ఈ పద్యం నేటి స్త్రీవాద రచనల కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. వెలుగులోకి రాని కవయిత్రులు 1928 నాటికే ఒక పద్మశాలి మహిళ ‘స్త్రీల విద్యావశ్యకత’ గురించి వ్యాసాలు రాసి ప్రజాచైతన్యానికి పాదులు వేసింది. ఆమె సికింద్రాబాద్‌కు చెందిన గిడుతూరి రామానుజమ్మ. 1934లో వెలువడిన గోలకొండ కవుల సంచికలో ఒక డజన్ కు మించి కవయిత్రులు రికార్డు కాలేదు. అయితే ఆధునిక కాలంలో తెలంగాణ సోయితో జరిగిన పరిశోధనల్లో జాలమాంబ, సుందరీబాయి వెలుగులోకి వచ్చారు. వీరితో పాటుగా 1935లో గోలకొండ పత్రికలో మాడపాటి హనుమంతరావు పాఠశాల విద్యార్థినులు ఎ.లక్ష్మీదేవి, పి.సావిత్రి, కోమలవల్లి, కె.లక్ష్మీబాయమ్మ, వై.కౌసల్యాదేవి, వై.అమృతమ్మ, నేమాని భారతీ రత్నాకరాంబ, వై.కౌసల్యాదేవి, కె.నీరజాక్షి తదితరుల కవిత్వం చోటు చేసుకుంది. ఇందులో ఎక్కువ మేరకు శ్రీకృష్ణునిపైనే ఉన్నాయి. మాతృభారతి పత్రికలో కేవలం కృష్ణుడిపైనే గాదు ఏసుక్రీస్తుపైనా 1935లోనే కవిత్వాన్ని రాశారు. ఈ గీతాల్ని రాసింది కె.ఫ్లా్లరె¯Œ ్స. బహుశా ఈమె తొలి తెలంగాణ దళిత కవయిత్రి అయివుండే అవకాశమున్నది. దళిత కాకున్నా తొలి క్రైస్తవ స్త్రీగా చెప్పవచ్చు. ఈమె రాసిన రెండు పద్యాల్లో ఒకటి. గీ. మా కొఱకు గాను నీ పుత్రు మమతజేసి పంపితివి, కాని, యాయన, బాధలు వడె దల్లి మరియమ్మ యెంతగా దల్లడిలెనొ చిన్ని కొమరుడేసు క్రీస్తు సిలువ మోయ 1933 నాటికే తెలంగాణ నుంచి ఒక స్త్రీ ప్రణయ కవిత్వం రాయడం విశేషం. ఈ కావ్యం ‘కావ్యావళి’. ఖమ్మం జిల్లాకు చెందిన ఇందుమతీదేవి రాశారు. ఈ కవితా సంపుటి 1936లో విశ్వనాథ సత్యనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహం ముందుమాటల్తో వెలువడింది. ఈ పద్యాల్లో ఒక వైపు భర్తను, మరోవైపు దేవుడిని ఇద్దరినీ కొలుస్తూ ‘శ్లేష’ వచ్చే విధంగా కవిత్వమల్లింది. పావనంబగు మీమూర్తి వదల కెపుడు చిత్తసింహాసనము నధిష్టింపజేసి ప్రణయసామ్రాజ్యపట్టభాస్వన్మహోత్స వము గావించెదను ప్రమోద మ్మెలర్ప వీళ్ళే గాకుండా తత్వాలు చెప్పిన మనుసాని వెంకట లక్ష్మమ్మ, చిగుళ్ళపల్లి సీతమ్మ, మక్థల్ సుశీలమ్మ ఇట్లా ఎందరో ఉన్నారు. 1857–1956 మధ్య శతాబ్ది కాలంలో తెలంగాణలోని స్త్రీలు రాసిన లేదా చెప్పిన కవిత్వం రికార్డయినట్లయితే ఆనాటి మహిళా ప్రతిభ, సాహిత్యం, విరహం, మోహం, సరసం, ఆధునికత, అక్షర జ్ఞానం, ఎఱుక ఎలా ఉండేదో అర్థమయితది. చిన్న వాక్యాలు రాయడమే మంచిది మాట్లాడేభాషలో ఎప్పు డూ పెద్ద పెద్ద వాక్యాలు వుండవు. ఎవరైనా మాట్లాడుతూ వున్నప్పుడు చూడండి. మామూలుగా మాట్లాడేటప్పు డైనా, కోపంగా మాట్లాడేటప్పుడైనా, ఆ మాటలన్నీ చిన్న చిన్న వాక్యాలుగానే వుంటాయి. భాష ఎప్పుడూ చిన్న చిన్న వాక్యాలుగా వుండడమే మాట్లాడే భాషలో వుండే సూత్రం. ఈ సూత్రాన్నే రాసే భాషలో కూడా పాటించాలంటే, రాసే భాష కూడా చిన్న చిన్న వాక్యాలతోనే వుండాలి. అలావుంటే అది, మాట్లాడే భాషలాగా తేలిగ్గా అర్థమవుతూ వుంటుంది. ..: రంగనాయకమ్మ ఎవరి ప్రత్యేకత వారిది కవిత్వంలో రసోన్ముఖంగా సాగే అంశాలు ముఖ్యంగా నాలుగు. అవి– అలంకారాలు, గుణాలు, రీతులు, వృత్తులు. ప్రసిద్ధ కవులు తమ కవితా శైలులలో ఈ నాలుగింటిలో ఏదో ఒక దానికి ప్రాముఖ్యాన్ని కల్పించి తమ ప్రత్యేకతలను నిలుపుకొంటూ ఉంటారు. ఈ దృష్టితో సమీక్షిస్తే కవిత్రయం వారిది గుణప్రధానశైలి. శ్రీనాథునిది రీతి ప్రధాన శైలి. ప్రబంధ కవులది అలంకార ప్రధాన శైలి. నాటకీయతను పోషించిన తిక్కనాదులలో వృత్తులకు ప్రాముఖ్యం కనపడుతుంది. ..: జి.వి.సుబ్రహ్మణ్యం అస్పృశ్యులకూ, స్త్రీలకూ అల్లంత దూరంలో ఉన్న అక్షరాన్ని అడ్డంకులను దాటుకుని, అక్షరాలను గుండెలకు అదుముకుని, హృదయాలతో హత్తుకుని సాహిత్యానికి సంపూర్ణత్వాన్ని అద్దిన స్త్రీలెం దరో తెలుగు వెలుగుని దశదిశలా ప్రసరించారు. అక్షరాన్ని కమ్మేసిన పురు షాధిపత్యపు పొరలను చీల్చుకుని తమకు తాముగా ప్రకాశించేందుకు ఎన్నో సాహసాలూ, మరెన్నో త్యాగాలనూ మూటగట్టుకున్న తెలుగు సాహితీ ప్రపంచం మొన్నటి మొల్ల నుంచి, నిన్నటి రంగనాయకమ్మ, ఓల్గా, విమల, నేటి సుభద్ర, వినోదిని లాంటి స్త్రీవాద, దళిత రచయిత్రుల వరకు పరుచుకున్న అనుభవం ఘనమైనది. మొల్ల...: తన కావ్యం అర్థంకాని భాషలో మూగ, చెవిటి ముచ్చట కాకూడదని సులభమైన జానుతెలుగు రామాయణాన్ని రచించిన మొల్ల మన తెలుగు మల్లె. లాలిత్యానికీ, సుకుమారానికీ ప్రతీకైన సిరిమల్లెకాదీమె రాయల రాజులకు తన కావ్యాన్ని అంకితమిచ్చేందుకు తిరస్కరించి, తనకి ఇష్టుడైన రాముడికే తన రామాయణాన్ని అంకితమిచ్చిన నాటి స్త్రీల ఆత్మగౌరవ ప్రతీక. ముద్దుపళని: ఇరవయ్యవ శతాబ్దారంభంలో చర్చనీ యాంశమైన ‘రాధికా స్వాం తనం’ను ఆత్మకథగా రాసిన ముద్దుపళని తంజావూరు నాయక రాజులైన ప్రతాప సింహుడి వద్ద(1739–63) రాజనర్తకి. స్వేచ్ఛా వ్యక్తిత్వానికీ, స్వతంత్ర నిర్ణయాలకూ ప్రతీక. రంగనాయకమ్మ: పెట్టుబడిదారీ విధానపు శ్రమదోపిడీ గుట్టుని రట్టుచేసిన కారల్ మార్క్స్‘పెట్టుబడి’ని అత్యంత సులువుగా సామాన్యుడికి అర్థమయ్యే భాషలో తెలుగు ప్రజలకు పరిచయం చేసిన మహా రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ తెలుగు ప్రజలను ప్రభావితం చేసిన తీరు అసాధారణమైనది. వర్గదృక్పథాన్ని అందించిన రంగనాయకమ్మ స్ఫూర్తి ప్రతి తెలుగు గుండెలోనూ ప్రతిధ్వనిస్తుంది. ‘జానకివిముక్తి’ చలం తర్వాత స్త్రీలోకాన్ని చైతన్యపరిచిన తొలిపుస్తకం. ‘రామాయణ విషవృక్షం’, మూఢనమ్మకాలపై ఆమె రాసిన విమర్శనాత్మక పుస్తకం ‘తులసీదళం కాదది గంజాయి దమ్ము, స్త్రీ, రచయిత్రి, ‘ఇదే నా న్యాయం’, ఎన్నో నవలలూ, విమర్శనాత్మక వ్యాసాలూ తెలుగు సమాజానికి శాస్త్రీయ దృక్పథాన్ని అందించాయి. ఓల్గా: ఆధునిక స్త్రీల అస్తిత్వ ఉద్యమానికి ఓల్గా రచనలే పునాది. ఓల్గా రచనల్లో తొలి ముద్రితం 1969 పైగంబర కవిత్వం. స్త్రీలను అమితంగా ప్రభావితం చేసిన నవలల్లో ‘స్వేచ్ఛ’,‘రాజకీయ కథలు’, ‘నేనూ – సావిత్రీబాయిని’, ‘యుద్ధమూ –శాంతి’, ‘లక్ష్మణరేఖ’, వసంతకన్నాభిరాన్, కల్పనకన్నాభిరాన్, ఓల్గా కలిసి రాసిన ‘మహిళావరణం’ తెలుగు సాహితీరంగాన్ని గొప్ప మలుపుతిప్పాయి. అయితే ఇప్పటి వరకూ వచ్చిన స్త్రీవాద రచనలన్నీ అగ్రవర్ణ స్త్రీలు రాసినవనీ, సతి, వితంతువివాహం దళిత స్త్రీల జీవితాల్లో లేవనీ, అగ్రవర్ణ స్త్రీల సమస్యలపై రాసింది దళిత స్త్రీల సాహిత్యం కాదని, జూపాక సుభద్ర, గోగు శ్యామల, వినోదిని వంటివారు జోగినీ వ్యవస్థ, అస్పృశ్యత, సామాజిక హింస, పాకీపని, లాంటి వెలివేతల వెతలను ప్రశ్నిస్తున్నారు. జూపాక సు¿¶ ద్ర రాసిన ‘అయ్యయ్యో దమ్మక్క, రాయక్క మాన్యం, నల్లరేగడి సాల్లు, కైతునకల దండెం ఆ కోవలోనివే. అంబేడ్కర్ జీవిత చరిత్రను తెలుగులో రాసిన డాక్టర్ విజయభారతిగారి కృషినీ మరువలేం. రేవతీదేవి, జయప్రభ, కొండేపూడి నిర్మల, ఘంటశాల నిర్మల, పాటిబండ్ల రజని, కె.గీత, మహెజాబీన్, శిలాలోలిత, మందరపు హైమావతి, పసుపులేటి గీత, షాజహానా కవిత్వం, కుప్పిలిపద్మ రచనలు తెలుగు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి. ఇటు వర్గదృక్పథం, అటు స్త్రీవాదాన్ని అంతే బలంగా వినిపించారు విమల మోర్తల. విమల రాసిన ‘వంటగది’ కవిత, ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ స్ఫూర్తినినింపాయి. తెలంగాణ బిడ్డ, మహిళోద్యమ ఆవిర్భావకురాలు డాక్టర్.కె.లలిత, ప్రొఫెసర్ సుజీతారూ కృషిని తెలుగు ప్రజలు దారులేసిన అక్షరాల్లో వెతుక్కోవచ్చు. కె.లలిత రాసిన ‘సవాలక్ష సందేహాలు’ గతంలో ఎవ్వరూ తడమని ఎంతో విలువైన గ్రంధం, కె.లలిత, వసంతాకన్నాభిరాన్, సుశీతారూ బృందం అందించిన గొప్ప పరిశోధనాత్మక గ్రంధం ‘మనకు తెలియని మన చరిత్ర’ భారతీయ సమాజంలో ఎనలేని కృషి చేసీ, మరుగునపడిన బెంగళూరు నాగరత్నమ్మ లాంటి ఎందరో స్త్రీల చరిత్రలను వెలికితీసిందిది. స్త్రీవాద చరిత్రకారిణిగా బండారు అచ్చమాంబను తెలుగు సమాజం గుర్తుచేసుకుంటుంది. బహుభాషా కోవిదురాలైన అచ్చమాంబ రాసిన ‘అబల సచ్చరిత్ర రత్నమాల’ (1901) స్త్రీల చరిత్రలను వెలికితీసింది. తెలుగు ప్రజలు సగర్వంగా చెప్పుకునే కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి. నాలుగున్నర దశాబ్దాల క్రితమే రుతుక్రమాన్ని సైతం అస్పృశ్యంగా మార్చిన వైనంపై తన ‘మూన్నాళ్ళ ముచ్చట’లో రాయడం గొప్పసంగతి. చిన్న కునుకు కోసం స్త్రీ జీవితాంతం పడే తపనని ‘సుఖాంతం’ కథ ఆవిష్కరిస్తుంది. ..: అత్తలూరి అరుణ -
అక్షరాలా పండుగే..
దేవరకద్ర రూరల్: అరవై నాలుగేళ్ల క్రితం రవాణా సౌకర్యాలు కూడా లేని పాలమూరు జిల్లా మారుమూల ప్రాంతంలో రాష్ట్రస్థాయి సాహిత్య సభలను దిగ్విజయంగా నిర్వహించారంటే ఆశ్చర్యం కలగక మానదు! ఇప్పటి జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో 1953లో ఈ సభలు జరిగాయి. ఈ సభల కోసం ఉపరాష్ట్రపతినే ఆహ్వానించడం, అలంపూర్ సభలకు వచ్చే సాహిత్య ప్రముఖుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం, 4 వేల మందికి పైగా హాజరైన అతిథులకు ఎలాంటి లోటు లేకుండా భోజన, వసతి కల్పించడం విశేషం. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన గడియారం రామకృష్ణ శర్మ రాసిన శతపత్రం పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయి. ఆ విశేషాలు ఇవీ... వంటకాల్లో లడ్డూ, పులిహోర సభలకు వచ్చే అతిథులకు చక్కని ఆతిథ్యం ఇవ్వడానికి శ్రీశైలం నుంచి 13 మంది వంట మనుషులను రప్పించారు. పూటకు 4 వేల మంది భోజనం చేస్తారని భావించగా.. 30 వేల మంది వరకు హాజరయ్యారు. అయినా ఎక్కడా లోటు లేకుండా భోజనాలు సమకూర్చారు. అది సంక్రాంతి సమయం కావడంతో ఆహూతులందరికీ లడ్డూ, పులిహోరా వడ్డించారు. ప్రత్యేక రైలుకు రూ. 5వేలు ఉపరాష్ట్రపతితో పాటు రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు సభలకు హాజరయ్యారు. ఇందుకు రూ.5 వేలు చెల్లించి ప్రత్యేకంగా రైలు బుక్ చేశారు. నిజాం నవాబు ఉపయోగించే ప్రత్యేక బోగీలో ఉపరాష్ట్రపతి సర్వేపల్లితో పాటు మంత్రిమండలి సభ్యులు హాజరయ్యారు. అలంపూర్‌కు చేరిన సర్వేపల్లికి సాహితీ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. ఈ రైల్లో వచ్చిన 700 మందిని ట్రక్కుల్లో అలంపూర్ చేర్చారు. అనంతరం సర్వేపల్లి సభలను లాంఛనంగా ప్రారంభించారు. దేవులపల్లి రామానుజరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశానికి గడియారం రామకృష్ణశర్మ స్వాగతం పలకగా సర్వేపల్లి తెలుగులో స్వాగత వచనాలు పలకడం విశేషం. నాలుగు రోజులు అంగరంగవైభవంగా 1953 జనవరి 11, 12, 13, 14వ తేదీల్లో నాలుగు రోజుల పాటు ఆంధ్రసారస్వత పరిషత్ ఏడో వార్షికోత్సవ సభలను నిర్వహించారు. అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రామానుజరావు.. ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఈ సభలకు హాజరయ్యేలా ఒప్పించారు. ముఖ్యమంత్రిగా ఉన్న బూర్గుల రామకృష్టారావు పూర్తిగా సహకరించారు. నెలరోజుల పాటు సమాచార శాఖకు సంబంధించి మినీ బస్సులు ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చారు. 200 సినిమా హాళ్ల ద్వారా ప్రచారం ఈ సభల నిర్వహణ సమాచారం తెలిసేలా ఉమ్మడి రాష్ట్రంలోని రెండు వందల సినిమా హాళ్లలో స్లైడ్ల ద్వారా ప్రచారం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గోడపత్రికలు, కరపత్రాలను పంపిణీ చేశారు. కాళోజీ ‘నా గొడవ’ ఆవిష్కరణ ఈ సభల్లోనే ప్రజాకవి కాళోజీ రాసిన ‘నా గొడవ’ కవితా సంపుటిని ప్రముఖ కవి శ్రీశ్రీ ఆవిష్కరించారు. సాహిత్య చర్చలతో పాటు ప్రముఖుల రాకతో సభా ప్రాంగణాలు కళకళలాడాయి. -
నాటి కవులు నేటి తరానికి మార్గదర్శకులు
విశాఖ సిటీ: పాతతరం కవులు రచించిన పద్యాలు నేటితరం కవులకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని ఆదివారమిక్కడ జరిగిన కొప్పరపు కవుల జయంతి సభలో మాట్లాడిన వక్తలు అభిప్రాయపడ్డారు. కొప్పరపు కవుల జయంతిని పురస్కరించుకుని 120 ఏళ్ల కొప్పరపు కవుల కవితా ప్రస్థాన సభను విశాఖలోని పౌరగ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పరపు కవుల పీఠం వ్యవస్థాపకుడు మాశర్మ సేకరించి ముద్రించిన కొప్పరపు కవుల సాహిత్య సర్వస్వం గ్రంథాన్ని ఆవిష్కరించారు. సభాధ్యక్షత వహించిన సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ఆరురోజుల వ్యవధిలో వందేళ్ల కథకు వందనాలు, కొప్పరపు కవుల సాహిత్య సర్వస్వం అనే రెండు బృహత్ గ్రంథాల విడుదలలో భాగస్వాముడినవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలుగును పాఠశాలలు, కళాశాలల్లో తప్పనిసరి చేయాలనే ఉద్యమం ప్రస్తుతం నడుస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోందని, ఏపీలోనూ తెలుగును తప్పనిసరి చేయాల్సిన అవసరముందని చెప్పారు. ప్రెస్ అకాడెమీ పూర్వ అధ్యక్షుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగువారి సొత్తయిన అవధాన విద్యను సుసంపన్నం చేసిన పథ నిర్దేశకులు కొప్పరపు కవులని కొనియాడారు. ప్రముఖ కవి, గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. పాతతరం కవులు సూర్యుడి లాంటివారని, వారు వేసిన వెలుగుల దారుల్లో నేటితరం కవులు పయనిస్తున్నారన్నారు. -
సామాజిక మార్పులో కవులే కీలకం
సాక్షి, హైదరాబాద్: సామాజిక మార్పునకు కవులు, రచయితలు కీలకపాత్ర పోషించాలని ఏపీ, తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రపంచంలో ఏ ఉద్యమం జరిగినా అందులో సాహిత్యకారుల పాత్ర ఉంటుందని, ఇందుకు రష్యా, చైనా, వియత్నాం, భారత స్వాతంత్య్ర సంగ్రామం, తెలంగాణ సాయిధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలే నిదర్శనమని అన్నారు. ఆదివారం ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజీలోని చల్లా సోమరాజు, రామ్ ఆడిటోరియంలో విజయవాడ తాపీ ధర్మారావు వేదిక ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయుడు, రచయిత, సాహితీ విమర్శకుడు సతీశ్‌చందర్‌కు తాపీ ధర్మారావు పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ తాపీ ధర్మారావు మూఢనమ్మకాలను పారద్రోలేందుకు విశేషంగా కృషి చేశారని, అణగారిన వర్గాలకు బాసటగా నిలిచారని అన్నారు. సతీశ్‌చందర్ ఆధునిక సాహిత్యంలో కవిసామ్రాట్ అని కొనియాడారు. స్పందించే హృదయంతో రాసినందునే ఆయన కవితలు, రచనలు, చీకట్లో వెలుగు కిరణాలయ్యాయని పేర్కొన్నారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ సతీశ్‌చందర్ పలు పత్రికల్లో పనిచేసిన అపార అనుభవంతో జర్నలిజం పాఠశాలను పాతికేళ్లుగా నిర్వహిస్తూ అనేకమంది జర్నలిస్టులను సమాజానికి అందించారన్నారు. 25 నుంచి 80 ఏళ్ల వయసున్న వారితో సతీశ్‌కు పరిచయాలున్నాయని, అందువల్ల ఆయన ఆలో చనా ధోరణి విస్తృతంగా ఉందని అన్నారు. ఒక్క సినిమా పాటల్లో తప్ప, మిగిలిన అన్నింట్లోనూ తాపీకి, సతీశ్‌కు సారూప్యం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ అలసిపోని రచయిత సతీశ్‌చందర్ అని పేర్కొన్నారు. దళిత దృక్పథాన్ని తన రచనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి, వారిని ప్రభావితం చేశారని అన్నారు. సతీశ్‌చందర్ మాట్లాడుతూ కొత్తపాళీ – పాతపాళీతో రాసినా తాను తాపీగానే రాస్తానని చమత్కరించారు. ఏబీకే ప్రసాద్ నుంచి అధ్యయనం, రామచంద్రమూర్తిని నుంచి వ్యంగ్యాధిక్షేపణ, పతంజలి నుంచి సూటిగా వ్యవహరించటం అలవరచుకొన్నానని చెప్పారు. ఉత్పత్తితో సంబంధంగల భాషే అసలైన తెలుగు భాష అని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడివారు తెలంగాణ సాహితీ పౌరసత్వం ఇస్తారో లేదో అనే అనుమానం కల్గుతోందని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత ఏటుకూరి ప్రసాద్, సమావేశకర్త డాక్టర్ సామల రమేశ్‌బాబు, తాపీ ధర్మారావు మనవరాలు విమలా సోహన్, కవులు, రచయితలు, పాత్రికేయులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. -
కవులు ప్రభుత్వాలకు మార్గదర్శకులు: స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్య జయంతిని అధికారికంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వం కవులకిస్తున్న గౌరవానికి ప్రతీక అని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ శనివారం ఇక్కడ రవీంద్రభారతిలో నిర్వహించిన డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య 93వ జయంతి ఉత్సవాలు, దాశరథి సాహితీ పురస్కార ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. కవులు ప్రభుత్వాలకు మార్గదర్శకులని అన్నారు. దాశరథి రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’అనే వాక్యం ఉద్యమకారుల్లో చైతన్యాన్ని రగిలించిందని అన్నారు. అంతటి గొప్ప కవి పేరిట నెలకొల్పిన సాహితీ పురస్కారాన్ని ఆచార్య గోపి వంటి మరొక గొప్ప తెలంగాణ కవికి అందజేయడం మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ 23 సంవత్సరాల వయసులో సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన రచనలు వెలువరించిన గొప్ప సాహితీ దిగ్గజం దాశరథి అని కొనియాడారు. దాశరథి, కాళోజీ తెలంగాణ ఆణిముత్యాలని అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దాశరథి అరుదైన కవి అని, నిరంతరం ప్రజల పక్షాన పోరాడిన యోధుడని అన్నారు. గిరిజన, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ తెలంగాణ విముక్తికై ఆనాడు తన కలం ద్వారా జనాలను మేలుకొల్పారని కొనియాడారు. దాశరథి తొలి రచన అగ్నిధారలతో ఎంత పేరు పొందారో, అంతటి పేరును ఆచార్య గోపి తన తొలి రచన తంగేడుపూలతో పొందారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. దాశరథి కవితా స్ఫూర్తిని సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ కొనియాడారు. అనంతరం ఆచార్య డాక్టర్ గోపీని అతిథులు శాలువాలతో సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. గోపీ మాట్లాడుతూ దాశరథి పేరిట సాహితీ పురస్కారాన్ని నెలకొల్పి మహనీయులను గౌరవించే సంస్కృతి తమదని తెలంగాణ ప్రభుత్వం రుజువు చేసుకుందని అన్నారు. దాశరథి పేరిట గడ్డిపోచ ఇచ్చినా దానిని బంగారు కడ్డీగా భావిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ శ్రీధర్, తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎస్వీ సత్యనారాయణ, సీఎం వోఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ దాశరథి కుమారుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. -
కతలు వెతల ‘రణస్థలి’
కవులేం చేస్తారు? రచయితలారా మీరెటువైపు? ప్రశ్నలు పాతవే. కానీ కాలం పురుటి నొప్పులు పడ్డ ప్రతి రక్తసిక్త సందర్భంలోనూ యీ ప్రశ్నలు మొలుస్తూనే వున్నాయి. కల్బుర్గి హత్య కావొచ్చు, పెరుమాళ్ మురుగన్ మీద అమలైన ప్రకటిత అప్రకటిత ఆంక్షలు కావొచ్చు... ఆయా సంఘటనలు జరిగిన తర్వాత పాత ప్రశ్నలే సుళ్లు తిరిగాయి. మనమేం చెయ్యాలో సంఘటనల గీటురాయి మీద పరీక్షించుకోవాల్సిన సందర్భం వచ్చింది. సాహిత్య లోకాన్నే కాదు మొత్తం సమాజాన్నే కుదిపిన రోహిత్ వేములను ఆవాహన చేసుకొని తీక్షణంగా కవిత్వం వెల్లువెత్తింది. ఆ వేడి చల్లారక ముందే కథలూ వచ్చాయి. అయితే యిటువంటి సంఘటనల్ని ఆధారం చేసుకుని వెనువెంటనే వెలువడే సాహిత్యంలోని మంచి చెడ్డల గురించీ, కళాత్మక విలువల గురించీ అదే సందర్భంలో వాదోపవాదాలూ జరిగాయి. జరిగిన సంఘటనపై కయి గట్టేసి కత అల్లేసి బాధ్యత తీరిపోయిందని రచయితలు భావిస్తున్నారని కొందరు ఎత్తిపొడిచారు. సామాజిక సమస్యల పరిష్కారాల గురించి ఆలోచించే పని రచయితలది కాదని నిర్ధారించారు. అంతిమంగా కళ కళ కోసమేనని మరోసారి తీర్మానించారు. సరిగ్గా యీ తరహా వాదనలకు సమాధానం వెతుకుతోన్న రోజుల్లోనే బమ్మిడి జగదీశ్వర రావు (బజరా) ‘కతలు వెతలు’ వొక దారిని చూపాయి. మన చుట్టూ జరుగుతోన్న సంఘటనలపై అల్లిన పీరియాడికల్ స్టోరీస్‌ని ఆల్ టైమర్ కథలుగా మలచడంలో అతను నిర్మించుకొన్న శిల్పం శుద్ధ కళావాదులకు కనువిప్పు. నిర్దిష్ట స్థలకాలాదుల్ని అధిగమించి కథని తాత్విక స్థాయికి తీసుకెళ్లి సార్వత్రికం చేసిన అతని నేర్పు కాకర్లపూడి నారసింహ యోగ పతంజలిని గుర్తుచేసింది. ‘నా వూపిరి మీద నిఘా పెట్టినంత కాలం... నేను యేమి తినాలో తాగాలో నువ్వే మెనూ యిచ్చినంత కాలం... నా అస్తిత్వం నువ్వైనంత కాలం... నీ మతం నీదై నా అభిమతం పట్టనంత కాలం... అదెంత కాలమైనా నా పాట నేను పాడుతూనే వుంటాను!’ జరుగుతోన్న సంఘటనల పట్ల బజరా స్పందనే యిది. తాను స్పందించడమే కాదు ఆ స్పందనతో అనివార్యంగా మనల్నీ ప్రతిస్పందించేలా చేస్తాడు. ∙∙l స్త్రీలపై అమలవుతున్న సామాజిక హింస రాజ్య హింస గృహ హింసలు స్వరూపంలోనే వేరు కానీ స్వభావంలో వొక్కటే అని యీ కథలు చదువుతుంటే బలంగా అనిపిస్తుంది. మూలాల్ని అన్వేషించి ఖండించే పనిలో బమ్మిడి యెక్కడా తడబడలేదు. మూడింటినీ మానవ హక్కుల వుల్లంఘనగానే గ్రహించాడు. ‘శృతి తప్పని కథ’లో ‘ఆడాళ్లని అణచివేయడమంటే అత్యాచారాలు చేయడమేనా నాన్నా..’ అని శృతి అడిగిన ప్రశ్న ద్వారా, ‘నేల నొప్పులు’లో ‘రాజధానికి పునాదిల రాళ్లూ యిసకా వున్నా వుండకపోయినా ఆడోళ్ల నెత్తురూ కన్నీళ్లూ వుండక మానవు’ అన్న గౌరి నిర్ధారణ ద్వారా, ‘నాలో నేను’లో ‘స్త్రీకి పగలూ రాత్రి రెండూ సమానం కాదా’ అని ఆకాశంలో సగం వెలిబుచ్చిన సందేహం ద్వారా, ‘పాటల పదమవుదమా?!’లో ‘రాజ్యాంగం ప్రకారం నడవడం నడవాలనుకోవడం ఈ దేశంలో ఆయుధం పట్టుకోవడంలాంటిదేనని’ గ్రహించిన బేలా సోమారి అవగాహన ద్వారా సంఘటనల్ని సాహిత్యంగా మలిచి చేతులు దులుపుకొనే రచయితగా గాక వొక సామాజిక శాస్త్రవేత్తలా బజరా హింసకున్న అనేక కోణాల్ని విశ్లేషిస్తున్నాడు. ‘మై బాడీ మై ఛాయిస్’ నినాదంలోని బోలుతనాన్ని యెత్తిచూపే ‘నో ఛాయిస్’ స్త్రీ స్వేచ్ఛను పక్కదారి పట్టించే పేజ్ త్రీ ఫెమినిస్టులకు చెంపపెట్టు. ఫెమినిజం స్త్రీల శరీరం చుట్టూ అల్లిన మిత్‌ని బద్దలుకొట్టిన మాట నిజమే కానీ ‘మల్టీ నేషనల్ కార్పోరేట్ డెవిల్’ ఆ స్త్రీ శరీరాన్ని అంగడి సరుకుగా మార్చిన వ్యాపార రాజకీయాన్ని బజరా ఆవిష్కరించాడు. ‘అందమైన అంగడి కొలతల జాకెట్టును బట్టి నా రొమ్ములనెవరో కత్తిరించి కుట్టేస్తున్నారు’ అన్న వొక్క వాక్యంలో స్త్రీలకు తమ శరీరాలపై అధికారం లేదని నిర్ధారించి చెప్పాడు. - ఎ.కె.ప్రభాకర్ (బమ్మిడి జగదీశ్వర రావు ‘రణస్థలి’ కథల సంపుటికి రాసిన ముందుమాటలోంచి కొంతభాగం... ప్రచురణ: మాతృక ప్రచురణలు. ఫోన్: 9676206230) -
జాతీయస్థాయిలో కవుల ప్రతిభ
– ముగ్గురు కవులకు పురస్కారాలు మహానంది: మైసూరులోని కేంద్ర భారతీయ భాషల సంస్థ, న్యూఢిల్లీకి చెందిన కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బెంగుళూరులో ఆదివారం నిర్వహించిన శతాధిక కవి సమ్మేళనంలో మన కవులు ప్రతిభ చాటారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని ఏపీ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న టీఎం దాస్, తిమ్మాపురం జెడ్పీపాఠశాలలో పనిచేస్తున్న ఎల్ఎన్ నీలకంఠమాచారి, ఎస్.మహబూబ్‌భాషలకు జాతీయస్థాయిలో పురస్కారాలు లభించాయి. సీఐఐఎల్ డైరెక్టర్, ఫ్రొఫెసర్ డిజీరావు, కర్ణాటక తెలుగు రచయితల సంఘం సమాఖ్య కార్యదర్శి మాల్యాద్రి, సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి ఎస్పీ మహాలింగేశ్వర్‌లు పురస్కారాలు అందించి ఘనంగా సన్మానించారు. ఫోటో– 19 ఎస్ఆర్ఐ 55...జాతీయస్థాయిలో పురస్కారాలు పొందిన ముగ్గురు కవులు -
పద్యనాటకాలు.. ఇతిహాస సుగంధాలు
కర్నూలు (కల్చరల్) : నందినాటకోత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో వివిధ నాటక సమాజాలు ప్రదర్శించిన పద్య నాటకాలు అలనాటి ఇతిహాస సుగంధాలను వెదజల్లాయి. స్వామి అయ్యప్ప, మైరావణ, భక్త మార్కండేయ నాటకం ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. నైతిక విలువలకు సంబంధించి చక్కని సందేశాలను అందించాయి. అయ్యప్ప చరితను చాటిన స్వామి అయ్యప్ప నాటకం శ్రీసర్వేశ్వర నాట్య మండలి హైదరాబాద్ నాటక సమాజం ప్రదర్శించిన స్వామి అయ్యప్ప నాటకం స్వామి జన్మవృత్తాంతం, ఆయన అడవులకు వెళ్లడం, శబరిగిరిలో ఆలయం నిర్మాణం వంటి సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహిషాసురుడిని దుర్గామాత సంహరించిన తర్వాత అతని సోదరి మహిషి తపస్సు చేసి హరిహరుల సంగమం వలన పుట్టిన వాడి చేతనే తాను మరణిస్తానని వరం పొందుతుంది. విష్ణుదేవుడు, మోహినిని శివునికి ఇచ్చి వివాహం చేయడం, మోహిని, శివంశ సంఘమం వలన ధర్మశాస్త్రుడు అవతరించి మహిషిని సంహరిస్తాడు. కలియుగంలో రాజశేఖర, రాజ దంపతులకు పసిపాపగా ధర్మశాస్త్రుడు జన్మించి అయ్యప్ప, మణికంఠుడిగా మారుతాడు. అనంతరం ఆ దంపతులకు పుట్టిన మరో పుత్రుడు అయ్యప్పకు రాజపీఠానికి పోటీగా తయారవుతాడు. అయ్యప్ప తల్లి అతనిపై ధ్వేషంతో తన ఔషధం కోసం పులిపాలను తెమ్మని అడవులకు పంపుతుంది. తుదకు అయ్యప్ప మహిమాన్వితుడై దైవంగా మారుతాడు. నాటకాన్ని పల్లేటి లక్ష్మీ కులశేఖర్ రచించగా బీఆర్ తీట్ల దర్శకత్వం వహించారు. రామాయణ విశిష్టతను చాటిన మైరావణ నాటకం శ్రీవినాయక నాటక కళా మండలి రేణిగుంట నాటక సమాజం ప్రదర్శించిన మైరావణ పద్య నాటకం రామాయణ గాథలోని విశిష్టతను చాటి చెప్పింది. రామరావణ యుద్ధంలో రావణ పరివారంలోని ముఖ్యులు గతించి పోయాక నారదుని సలహా మేరకు రావణుడు మైరావణుడిని సాయం కోరుతారు. మైరావుణుడు తన మంత్ర ప్రభావంతో రామలక్ష్మణులను భైరవీదేవికి బలి ఇవ్వాలని ఆలోచిస్తాడు. అయితే ఆంజనేయుడు రామలక్ష్మణులను కాపాడుకునే నేపథ్యంలో పాతాళలంక ముఖద్వారం దగ్గర మత్స్యవల్లభునితో యుద్ధం చేస్తాడు. మత్స్య వల్లభుడు తన కుమారుడేనని నారదుడి ద్వారా తెలుసుకుంటాడు. ఆంజనయుడు, మైరావణుడు బంధించిన చంద్రసేన ద్వారా అతని జన్మరహస్యాన్ని సంపాదిస్తాడు. మైరావణుడి ప్రాణమున్న చిలుకను తెచ్చి వధించి ఆంజనేయుడు, రామలక్ష్మణులను కాపాడుకుంటాడు. సుంకర పండరిబాబు నాటకానికి దర్శకత్వం నిర్వహించారు. మార్కండేయ చరితకు అద్దం పట్టిన భక్త మార్కండేయ.. మార్కండేయుని ఇతివృత్తాన్ని ఆసక్తికరమైనకథగా మలిచి చక్కని నాటకీయతతో ప్రదర్శించారు ఓరుగల్లు శారదానాట్య మండలి కళాకారులు. యమధర్మరాజు నారదుడితో 14 భువనములలో తనకు తిరుగులేదని ఎటువంటి జీవి అయినా తన లోకానికి వచ్చి తీరాల్సిందేనని అహంభావంతో పలికుతాడు. నారదుడు అతని గర్వాన్ని అణచడానికి ఒక వీరుడుని సృష్టించాలని సంకల్పిస్తారు. మ్రికండముని, మరుద్మతి దంపతులు చాలా కాలాంగా పిల్లలు లేక అష్టకష్టాలు పడుతుంటారు. నారదుడి ఉపదేశంతో వారు శివుని గూర్చి తపస్సు చేస్తారు. శివుడు వారికి 16 ఏళ్లు ఆయుష్షు కలిగిన, గుణవంతుడైన మార్కండేయుడు అనే కుమారున్ని ప్రసాదిస్తాడు. మార్కండేయుడు గురుదేవుల దీవెనలతో జాబాలి విద్యను అభ్యసిస్తాడు. అయితే 16 ఏళ్లు ముగియగా, అతని ఆయష్షు అంతమవుతుందని తిరిగి ఆ దంపతులు బ్రహ్మదేవున్ని వేడుకుంటారు. బ్రహ్మ మార్కండేయునికి దీర్ఘాయుష్షు ప్రసాదిస్తాడు. మార్కండేయుడు యముని గర్వాన్ని అణచివేస్తాడు. శారదానాట్య మండలి (ఓరుగల్లు) అధ్యక్షుడు జేఎన్ శర్మ దర్శకత్వం వహించారు. -
ముగిసిన జాతీయ పుస్తక ప్రదర్శన
ఆఖరి రోజు భారీగా తరలి వచ్చిన పుస్తక ప్రియులు సాక్షి, హైదరాబాద్: కన్నుల పండువ గా 12 రోజులపాటు సాగిన హైదరా బాద్ 30వ జాతీయ పుస్తక ప్రదర్శన ఆఖరి రోజు సోమవారం భారీగా తరలి వచ్చిన పుస్తకప్రియుల సమక్షం లో వేడుకగా ముగిసింది. ఈ ఏడాది నోట్ల రద్దు కారణంగా పుస్తక విక్రయా లు 40%వరకు తగ్గినట్లు ప్రదర్శన నిర్వాహకులు తెలిపారు. సందర్శ కులు సైతం తగ్గారు. గతేడాది 12 లక్షల మంది సందర్శించగా.. ఈ ఏడాది 8 లక్షల మందే వచ్చారని నిర్వాహకులు చెప్పారు. జయహో పుస్తక దాతలు మరోవైపు బుక్ ఫెయిర్ కమిటీ ఏర్పాటు చేసిన డోనర్స్ బాక్సులో అనేకమంది దాతలు వందల కొద్దీ పుస్తకాలను వేశారు. రచయిత్రి భానుమతి, రామారావు దంపతులు సోమవారం వందలాది పుస్తకాలను ఈ బాక్సులో వేశారు. పుస్తకం గొప్ప సహచరి బుక్ ఈజ్ బెస్ట్ కంపానియన్. కంప్యూటర్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం నుంచి పిల్లలను బయట పడేసేందుకు ఈ ప్రదర్శనలు దోహదం చేస్తాయి. – టి.అర్చన, జూబ్లీహిల్స్ పుస్తకం లేకుండా ఉండలేను ప్రతిరోజు చదువుతాను. ఒక్క రోజు కూడా పుస్తకం లేకుండా ఉండలేను. ప్రతి సంవత్సరం వస్తాం. నచ్చినవి కొనుగోలు చేస్తాం. – ఉమాగాయత్రి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఇది కోటి పుస్తకాల ఉత్సవం ఇది కోటి పుస్తకాల మహో త్సవం. ఇందులో పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చింది. ఒక్క పుస్తకం వందల మంది ఉపాధ్యాయులతో సమానం. పుస్తకం ఎంతో గొప్పగా ప్రబోధిస్తుంది. – సుద్దాల అశోక్ తేజ, కవి, రచయిత, గాయకుడు వంటల పుస్తకాలు కొన్నాను నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే వంటలకు సంబంధించినవి నాలుగు బుక్స్ కొన్నాను. – ఆదిత్య, 9వ తరగతి, భారతీయ విద్యాభవన్ -
పద్యాలతో జాషువాకు పట్టాభిషేకం
గుంటూరు ఈస్ట్: మహాకవి గుర్రం జాషువాకు శనివారం గుంటూరులో ఆయన రచించిన పద్యాలతోనే పట్టాభిషేకం జరిగింది. పలువురు కవి గాయకులు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా పద్యాలు రసరమ్యంగా ఆలపించి పరవశించారు. పలువురు సాహితీమూర్తులు విశ్వనరుడు జాషువాను విశ్వమానవ గోత్రీయుడంటూ కొనియాడారు. ఆయన సామాజిక స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించాలని ఆకాంక్షించారు. మహాకవి జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 121వ జయంతి వారోత్సవాలలో మూడోరోజు శనివారం పోలీస్ కల్యాణ మండపంలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌తో పాటు 50 మంది కవులు,రచయితలను సత్కరించి,జాషువాకు సాహిత్య నీరాజనం అర్పించారు. వందమంది కవులు రచించిన కవితల సంకలనం అయిన ‘‘వందగొంతులు ఒక్కటై జాషువా కోసం’’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్, నరాలశెట్టి రవికుమార్,బండారు పద్మ, దేవసహాయం, బద్వేలు శ్రీహరి, ప్రజానాట్య మండలి గాయకుడు రమణ తదితరులు జాషువా పద్యాలను ఆలపించిన తీరు ఆహూతులను అలరించింది. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌ను కళాపీఠం అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, సాహితీవేత్తలు డాక్టర్ బూసురుపల్లి వెంకటేశ్వర్లు,ధనేకుల వెంకటేశ్వర్లు,పెనుగొండ లక్ష్మీనారాయణ,పాపినేని శివశంకర్ ఘనంగా సత్కరించారు.అనంతరం పద్మశ్రీ ఇనాక్ రచించిన అమరావతి,పులుల బోను–నేను, సర్పయాగం, అమరావతి ఖ్యాతి మాదిగల స్థితి పుస్తకాలను ఆవిష్కరించారు. జిల్లాకు జాషువా పేరు పెట్టాలి.. పలువురు వక్తలు తమ ప్రసంగాలలో గుంటూరు జిల్లాకు గుర్రం జాషువా పేరుపెట్టాలని, నవ్యాంధ్రలో ఆయన పేరుమీదగా లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహణకు హాలును నిర్మించాలని కోరారు. జాషువా గొప్ప మానవతా వాది అని, సమాజ దార్శనికుడని ఎందరో ఆధునిక కవులకు మార్గదర్శకుడయ్యారని కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కన్నా మాస్టారు, వేదయ్య,న్యాయవాది వైకే, చందోలు శోభారాణి, సముద్రాల కోటేశ్వరరావు, బత్తుల వీరాస్వామి,జాషువా సంఘం అధ్యక్షుడు పెద్దింటి యోహాను తదితరులు పాల్గొన్నారు. -
దేశ సమైక్యత కోసం పునరంకితం కావాలి
* స్వరాజ్యాన్ని సురాజ్యం చేద్దాం.. రామరాజ్యం దిశగా సాగుదాం * భారతమాత అంటే భారత దేశ ప్రజలంతా... * కవులు, కళాకారుల ఇష్టాగోష్టిలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, హైదరాబాద్: దేశ అభివృద్ధికి, సమైక్యతకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. 70 ఏళ్ల స్వరాజ్యాన్ని సురాజ్యం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆకలి, అవినీతి, అంటరానితం, వివక్ష, పేదరికం వంటి అసమానతలు లేని, ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లే రామరాజ్యం దిశగా సాగాలని సూచించారు. స్వాతంత్య్ర సప్తతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ‘స్వాతంత్య్ర సప్తతి-సాయం సంధ్య’ కవులు, కళాకారుల ఇష్టాగోష్టి కార్యక్రమానికి వెంకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపీ మురళీమోహన్, బీజేపీ నేతలు కె.లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, రామచంద్రారావు, ఇంద్రసేనారెడ్డి, ప్రముఖ సినీదర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ప్రముఖ నటుడు, కవి తనికెళ్ల భరణి, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, ఆచార్య ఎన్.గోపి, గజల్ గాయకుడు శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోవడానికి పరిమితం కాకుండా.. 70 ఏళ్ల స్వరాజ్య ఫలితాలను విశ్లేషించుకోవలసిన అవ సరముందని అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్ర కార్యక్రమాల్లో భాగంగా స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని, సమర యోధుల త్యాగాలను, పోరాటాలను స్మరించుకోవలసి ఉందన్నారు. దేశభక్తి అంటే దేశ పటానికి మొక్కడం, భరతమాత చిత్రపటానికి పూలమాల వేయడం మాత్రమే కాదని, దేశంలోని ప్రజలందరి పట్లా ప్రేమను కలిగి ఉండడమని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా.. ఇంకా కులం, భాష, ప్రాంతీయ విబేధాలు, అక్కడక్కడా అంటరానితనం, దళితులు, అణగారిన వర్గాలు, మహిళలపై దాడులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలు, వరకట్న దురాచారాలు ఇంకా కొనసాగుతున్నాయని, ఇలాంటి సాంఘిక రుగ్మతలను అంతమొందించాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని చీల్చే ఉగ్రమూకలను సమర్థించే శక్తులు, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వారికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కవులు, కళాకారులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు పసికంటి వీరాస్వామీజీ, డాక్టర్ టీవీ నారాయణ, పీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, రాధాకృష్ణ, రాంచంద్రారెడ్డి, మల్లమ్మ, సుఖ్దేవ్ఆర్య తదితరులను ఘనంగా సన్మానించారు. ఉత్తేజపరిచిన దేశభక్తి గీతాలు కార్యక్రమంలో కవుల కవితలు, పాటలు దేశభక్తిని నింపాయి. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఆవిష్కరించాయి. కీరవాణి ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి’ పాట పాడారు. మేజర్ చంద్రకాంత్ సినిమా తనకు గొప్ప సంతృప్తినిచ్చిందని, గాంధీ సినిమా తీయలేకపోయాననే బాధను పోగొట్టిందని రాఘవేంద్రరావు అన్నారు. మాడుగుల నాగఫణిశర్మ, యూఖూబ్, ఆచార్య ఎన్ గోపీ, తనికెళ్ల భరణి, ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ ముదిగొండ శివప్రసాద్, గంగాధరశాస్త్రీ, డాక్టర్ ఎండ్లూరి సుధాకర్, భారవి, డాక్టర్ కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, శిలాశ్రీ తదితరులు తమ కవితలు వినిపించారు. సామల వేణు ఇంద్రజాల ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
‘తొలిపొద్దు’లో జోగు అంజయ్య కవితలు
జనగామ : పట్టణానికి చెందిన కవి, జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు జోగు అంజయ్యకు అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘తొలిపొద్దు’ శీర్షికన 442 మంది కవుల కవితలను పుస్తకరూపంగా ప్రచురించారు. కాగా, ఇందులో ‘ముఖారవిందం’ పేరిట జోగు అంజయ్య రచించిన కవిత్వానికి సైతం చోటు లభించింది. తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది.. అనే కోణంలో ఆయన ఈ కవిత్వాన్ని రాయడం గమనార్హం. -
పాలమూరు కవులకు పుట్టినిల్లు
మహబూబ్‌నగర్: పాలమూరు కవులకు, కళాకారులకు పుట్టినిల్లువంటిదని కలెక్టర్ టీకే. శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భాషాపండితులు, కవులు బంగారు తెలంగాణ అంశంపై పోటాపోటీగా కవిత్వం వినిపించి ఆకట్టుకున్నారు. తెలంగాణ ఆర్తిని, సమకాలిన పరిస్థితులను సమన్వయపర్చుకుంటూ కవితాప్రవాహాన్ని కొనసాగించారు. కవితలపై యువతీ, యువకులు పట్టు సాధించాలని సూచించారు. తెలుగు పండిత్ గిరిజా రమణ రచించిన శతక సాహిత్యాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ స్వయంగా పాలమూరు వాసి మనోహర్‌రెడ్డి రచించిన కవిత్వాన్ని చదివి వినిపించి విశేషంగా ఆకట్టుకున్నారు. పాత్రికేయులు సైతం బంగారు తెలంగాణపై తమ గళాన్ని కవితారూపంలో వినిపించారు. ఈ సందర్భంగా కవులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా సాక్షి బ్యూరో ఇన్చార్జ వేణుగోపాల్‌ను కలెక్టర్ శాలువాతో సన్మానించారు. సమ్మేళనానికి కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. జేసీ రాంకిషన్, ఏజేసీ బాలాజీ రంజిత్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, సెట్మా సీఈఓ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
అక్షరం.. ప్రజల దిక్కు!
కవులు, రచయితలు జనం పక్షం రాష్ట్ర ఏర్పాటులో ‘అక్షరా’నికీ భాగస్వామ్యం సీరియస్ రచయితలను సర్కారే గుర్తించాలి ‘సాక్షి’తో ఆచార్య జయధీర్ తిరుమలరావు హన్మకొండ కల్చరల్ : వృత్తి కళాకారుల పక్షాన ఆయన ‘జానపద’మై నిలిచారు. కనుమరుగైపోతోన్న అమూల్య గ్రంథాలు, తాళపత్రాలకు పెద్దదిక్కయ్యారు. యాభై ఏళ్లుగా అక్షరాల సేద్యం.. నిరంతరాయంగా సాహిత్యం, సాంస్కృతికోద్యమం.. ఇదే ఆచార్య జయధీర్ తిరుమలరావు జీవనపథం. తెలంగాణకు ప్రత్యేక సాహిత్య, సాంస్కృతిక అస్తిత్వం ఉందని బలంగా చెప్పే ఆచార్య తిరుమలరావు ఓరుగల్లులో జన్మించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా, ప్రచురణల శా ఖ డెరైక్టర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని ప్రాచ్యలిఖిత భాండాగారం డెరైక్టర్‌గా ఉన్న సమయంలో అమూల్య గ్రం థాలు, తాళపత్రాలను సేకరించి భద్రపరిచారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన జానపద కళాకారుల, కళల పరిరక్షణ కోసం ‘జానపద’ను స్థాపించారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన ఆయన.. రాష్ర్ట ఆవిర్భావం తరువాత కవులు, రచయితలపై బాధ్యత పెరి గిందని అంటారు. రాష్ట్రావిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు. అవేమిటో ఆయన మాటల్లోనే.. ప్రభుత్వమే గుర్తించాలి.. కళాకారులకు ఉద్యోగాలిచ్చారు. కానీ, రాసే కవికి మాత్రం న్యాయం జరగలేదు. అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనడం అన్యాయం. సీరియస్, సిన్సియర్ రచయితలను ప్రభుత్వమే గుర్తించాలి. రచయితకు లభించే గుర్తింపు, సహాయం రచయిత వ్యక్తిత్వాన్ని పెంచేదిగా ఉండాలి. అలాగే, రచయితలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచాలని చాలా కాలంగా అడుగుతున్నాం. రెండేళ్లు గడిచిన సందర్భంలో మరోసారి గుర్తు చేస్తున్నాం. ప్రజలకు జవాబుదారీ.. ‘తెరవే’ తెలంగాణ రచయితల వేదిక(తెరవే) పదహారేళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. ‘ప్రత్యేక రాష్ట్ర సాధన’ లక్ష్యంగానే ఇది ఆవిర్భవించింది. రాష్ట్ర సాధనలో రచయితల పాత్ర అమోఘం. అరసం, విరసంతో పాటు రాజకీయ ఎజెండాతో పనిచేసే సంస్థలు చాలా ఉన్నాయి. కానీ ప్రాంతీయ స్పృహతో రాష్ట్ర సాధన లక్ష్యంతో ఏర్పడిన సంస్థ తెరవే మాత్రమే. ప్రస్తుతం కొన్ని సంస్థలు రాజకీయ ప్రాపకం, ప్రాబల్యం కోసం ‘పాటుపడు’తున్నా.. మేం మాత్రం ప్రజలకు జవాబుదారీగానే ఉంటాం. రచయిత సామూహిక ఆలోచనల ప్రతినిధి.. ప్రతిపక్ష నాయకుడు తన పార్టీ అవసరాల రీత్యా మాట్లాడుతాడు. వాటిలో ఎలిగేషన్స్ ఉంటాయి. కానీ, రచయిత చేసే పనిలో, రాసే రాతల్లో అవేవీ ఉండవు. ప్రజల మనోభావాలను, ఉద్వేగాలను ఒక లాజిక్‌తో వివరించి చెబుతాడు. ఒక నినాదంగా కవి, రచయిత ప్రభుత్వాన్ని నేరగ్రస్తంగా చిత్రించాలని అనుకోరు. అది ఉద్దేశమై కూడా ఉండదు. రచయిత సామూహిక ఆలోచనలకు ప్రతినిధి. దానిని పది మంది తరఫున ప్రతిఫలిస్తాడు. అందులో నిజాయితీ ఉంటుంది. రాజకీయం మాత్రం ఉండదని గుర్తించాలి. ప్రజల మన్ననలే ముఖ్యం.. సాహిత్యం, రచయిత పాత్ర విస్తరించాలి. పాత నమూనాలు పనికిరావు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలతో మమేకమై రాయాలి. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవులు, రచయితలను గుర్తించి అవార్డులివ్వాలి. కానీ, ప్రభుత్వంతో సన్మానాలు, పురస్కారాలు పొందడం మాకంత ముఖ్యం కాదు. రచయితలు ప్రజల అవసరాలు తీర్చేలా అక్షరాలు రాసి ప్రజల మనోభావాలను వ్యక్తీకరించే పాత్ర పోసిస్తూ ప్రజల మన్నన పొందడమే ముఖ్యం. ప్రభుత్వం, ప్రభుత్వ అవార్డులు ఆశించే వారు.. ఇద్దరూ కూడా రచయితల గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తించవద్దు. వారిని కాపాడుకోవడం పౌరధర్మం పేద రచయితలు అనారోగ్యానికి గురైనప్పుడు సమాజమే వారి ని రక్షించుకోవాలి. వారిని కాపాడుకోవడం పౌరధర్మంగా భావిం చాలి. సుద్దాల హనుమంతుకు క్యాన్సర్ వచ్చిందని తెలిసి, దవాఖానాకు తీసుకువెళ్తామని మేం అంటే- ‘ఇప్పటి వరకు మా ఇంట్లో ఉన్నది తిని బతికాం. దవాఖానకు వెళ్తే ఇంట్లో ఉన్న సామాను కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. అక్కడకు రాను’ అన్నాడు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లయినా నేటికీ పేద రచయితలు, కవుల గురించి ఎలాంటి విధాన నిర్ణయమూ జరగలేదు. సాహిత్యంలోనూ డబ్బున్న వాళ్లే రాణించే పరిస్థితి ఉంది. కొత్త రాష్ట్రంలో సాహిత్యంపై గౌరవం పెంచాలి.. అవార్డుల కోసం పైరవీలు చేసేవారు ఒకవైపు.. అవార్డులు కాదు.. ప్రజల పక్షానే ఉంటామనే వారు మరోవైపు.. ఇందులో ప్రయోజనాలదే పెద్దపీట. కొత్త రాష్ట్రంలో సాహిత్యంపై గౌరవం పోయే పరిస్థితి ఏర్పడకూడదు. రచయితలకు ప్రభుత్వం సహకరించాలి. పుస్తకాలు అచ్చు వేసుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలి. పది జిల్లాల్లో గ్రంథాలయాల ద్వారా పుస్తకాలను కొనుగోలు చేయాలి. రచయితల కోసం సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రచయితలకు గౌరవం ఎక్కువ అనే మాట వినపడాలి. స్వేచ్ఛను హరించొద్దు.. సభలు, సమావేశాలకు ఇతర కారణాలను చూసి అనుమతులు ఇవ్వకపోవడం, ఆంక్షలు విధించడం సరి కాదు. వరంగల్ సభ విషయంలో న్యాయస్థానం కూడా సరైన పాత్ర నిర్వహించలేదు. ఎవరు ఏ రూపంలోనైనా సరే.. స్వేచ్ఛను హరించడాన్ని మేం నిరాకరిస్తాం. రచయితలుగా, కవులుగా మేం సంస్కారవంతమైన భాషలోనే మాట్లాడతాం. మా లక్ష్యం.. సామాజిక క్రాంత దర్శనం సీమాంధ్ర పాలనలో పెడ ధోరణులకు వ్యతిరేకంగా ఉద్యమించే వాళ్లం. ప్రస్తుతానికి ప్రభుత్వానికి హితవు చెప్పడం, వాస్తవాలు వివరించడం వంటివి మాత్రమే చేస్తున్నాం. రచయితలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుని నిలబడుతున్నారు. వారు సామాజిక వాస్తవాన్ని తమ ఆత్మవ్యక్తీకరణను అక్షరాలుగా పెట్టి సూచనలుగా అందిస్తున్నారు. సామాజిక క్రాంత దర్శనం చేస్తున్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడమే అక్షరం కర్తవ్యం. రాష్ట్ర సాధనలో ‘అక్షర’ భాగస్వామ్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విజయంలో అక్షరాలకు నిండైన భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు రకరకాల పండుగలు చేస్తున్నారు. రచయితలను సమాజానికి దూరం చేయాలని కొందరు చూస్తున్నారు. అక్షర రంగం దానిని ప్రతిఘటిస్తుంది. ఈ ప్రభుత్వం మాది. -
బంగారు పిచ్చుక మళ్లీ పాడుతుందా?
ఏప్రిల్ 22న ధరిత్రీ దినోత్సవం కవులు ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడం శతాబ్దాలుగా తెలిసినదే. ప్రత్యేకించి ఆంగ్ల సాహిత్యంలో ప్రకృతి కవిత్వం అనగానే విలియం వర్డ్స్ వర్త్ (1770-1850) రాసిన ‘సాలిటరీ రీపర్’, ‘టు ది కకూ’, జాన్ కీట్స్ (1795-1821) రాసిన ‘ఓడ్ టు ఎ ఆటమ్’, ‘ఓడ్ టు ఎ నైటింగేల్’ వంటి చక్కటి కవితలు గుర్తుకొస్తాయి. కవితా ప్రపంచంలో ఇటీవల వినవస్తున్న సరికొత్త పదం ‘పర్యావరణ కవిత్వం’. ప్రకృతి, పర్యావరణం యొక్క సౌందర్యాన్ని కాక ‘పర్యావరణ పరిరక్షణ’ వస్తువుగా రాసేవి పర్యావరణ కవిత్వం (ఇకో పొయెట్రీ) కిందికి వస్తాయి. అమెరికాలో 1970లో మొదటిసారి ‘ఎర్త్ డే’ శిఖరాగ్ర సభ జరిగింది. అప్పటినుంచీ 192 దేశాలలో ఏప్రిల్ 22ను ‘ఎర్త్ డే’గా పాటిస్తూ పర్యావరణ పరిరక్షణ చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ స్ఫూర్తితో రాబిన్సన్ జెఫర్స్, మేరీ ఆలివర్, డబ్ల్యూ.యస్.మెర్విన్, వెండెల్ బెర్రీ, లిండా హోగన్ వంటి పర్యావరణ కవులు తమ తమ ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణకు ఉద్యమించారు. పితృస్వామ్య వ్యవస్థ కారణంగా స్త్రీలకూ, ప్రకృతికీ అన్యాయం జరుగుతున్నందున ఆ విషకౌగిలి నుండి ప్రకృతినీ, స్త్రీలనూ కాపాడే లక్ష్యంతో ‘ఇకో-ఫెమినిజం’ కూడా మొదలైంది. పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల ప్రభావం మన దేశం మీద కూడా పడింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51-ఎ(జి) ప్రకారం అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో కూడిన సహజ పర్యావరణాన్ని సంరక్షించి అభివృద్ధి చేసుకోవడం, ప్రాణులన్నిటి పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుని ప్రాథమిక విధి. ఈ వెలుగులో ఖమ్మం జిల్లాకు చెందిన చేకూరి శ్రీనివాసరావు ‘ఇకో పొయెట్రీ’ రాశారు. కాలుష్యం, భూతాపం, ఓజోన్‌పొర తరిగిపోవడం, ఎడారులు పెరిగిపోవడం, జీవ జాతులు అంతరించిపోవడం గురించి ఆందోళన వెలిబుచ్చారు. ఒక కవితలో వసంత మాసాన్ని ఎక్కడా కోయిలల ప్రతిధ్వనులే వినరాని నిశ్శబ్ద ఆమనిగా వర్ణిస్తారు. జీవ వైవిధ్యానికి సంకేతంగా వనమంతా ప్రతిధ్వనించే పక్షుల సుస్వరమైన కిలకిలారావాలు, కాకుల కాకలీ స్వనములు, కోతుల కిచకిచల వంటి ధ్వనులు - మొత్తంగా మటుమాయమై ప్రకృతి నీరవమయిందంటారు. వసంత రుతువులో తమ గాన మాధుర్యంతో ఓలలాడించిన పక్షులన్నీ కీటకనాశినులు వాడిన పంటలు తిని హతమయ్యాయట. ఆ వసంత రుతువులో బంగారు పిచ్చుక శ్రావ్యమైన గానం వినబడనే లేదంటారాయన. మరో కవితలో గాంధీజీని పర్యావరణ కర్మయోగిగా అభివర్ణిస్తారు. ఇంకో కవితలో మతాలన్నీ వృక్షాలను పూజించమని చెప్పాయనీ, దాని అర్థం వృక్షాల విలువ తెలుసుకుని వాటిని సంరక్షించాలనేనంటారు. ఇంకొక కవితలో తమ గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వైరా నదిలో ఇసుక మాఫియా దుశ్చర్యలను ప్రస్తావిస్తూ, ఈ దోపిడీని అరికట్టడానికి బొలీవియా, కోస్టారికా దేశాల్లో లాగా మనదేశంలోనూ సహజ వనరులకూ హక్కులు కల్పిస్తూ చట్టాలు చేయాలంటారు. ముత్తేవి రవీంద్రనాథ్ 9849131029 -
ప్రశ్నోత్తరాలుగా... రామాయణ మహాకావ్యం
పుస్తకం శ్రీమద్రామాయణ మహా కావ్యాన్ని అనేకమంది రుషులు, కవులు, పండితులు, భాషావేత్తలు అనేక కోణాలలో పరిశీలించి, పరిశోధించి, అందులోని అమృతోపమానమైన విషయాలను వివిధ భాషల్లో వివిధ ప్రక్రియల్లో పదిమందికీ పంచుతున్నారు. అయితే ఈ ఉరకలు పరుగుల జీవితంలో అంతంత విస్తారమైన గ్రంథాలను చదివి, ఆస్వాదించే ఓపిక, తీరిక అందరికీ ఉండడం లేదు. అలాకాకుండా రామాయణ కథావస్తువును కూడా సులువుగా, సరళంగా అందరికీ ఆమోదయోగ్యంగా అందించాలనే తాపత్రయంతో విశ్రాంత ఆచార్యులు డాక్టర్ నండూరు గోవిందరావు రామాయణాన్నంతటినీ ప్రశ్నోత్తరాల రూపంలో అందిస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచన చేశారు. అందులో భాగంగానే ‘శ్రీ మద్రామాయణము ప్రశ్నోతర మాలిక’ను రచించారు. ఇందులో రామాయణంలోని బాలకాండ మొదలుకొని ఉత్తరకాండ వరకు విషయాన్నంతటినీ ప్రశ్నలు- సమాధానాలుగా అందించారు. ఆయా కాండలలోని విషయాల ఆధారంగా ఉత్తరకాండలో అత్యధికంగా 507 ప్రశ్నోత్తరాలను, సుందరకాండలో అత్యల్పంగా 181 ప్రశ్నోత్తరాలను పొందుపరిచారు. వివరణ అవసరమైన వాటికి విపులంగానూ, లేనిచోట క్లుప్తంగానూ సమాధానాలిచ్చారు. ప్రశ్నలో కూడా ఎంతో విషయాన్ని, వివరణను ఇచ్చారు. వ్యవసాయ శాస్త్రంలో పీహెచ్డీ చేసిన ఈ ఆచార్యులవారు గతంలో మహాభారతాన్ని కూడా ఇదేవిధంగా ప్రశ్నోత్తర మాలికగా అందజేశారు. ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి, అందుకు తగిన అధ్యయన శక్తి, వాటికి భక్తిశ్రద్ధలను జతచేస్తే చాలు... ఎంతటి నిగూఢ విషయాలనైనా సులువుగా తెలియచేయవచ్చునని నిరూపించారు. మొత్తం మీద రామాయణమనే కొండను అద్దంలో చూపించే ఈ ప్రయత్నం ప్రశంసనీయం. ఈ ప్సుతకం అవశ్య పఠనీయం. శ్రీమద్రామాయణము, పుటలు: 320; వెల రూ. 200, ప్రతులకు: డాక్టర్ నండూరు గోవిందరావు, 303, పార్క్‌వ్యూ రెసిడెన్సీ, బతుకమ్మకుంట, బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్- 500 013; సెల్: 9849801490; తెలుగు బుక్‌హౌస్, కాచిగూడ, హైదరాబాద్; విశాల్ బుక్‌షాప్, నల్లకుంట, హైదరాబాద్. - డి.వి.ఆర్. -
మీసంపెంగ వాసనలు!
హ్యూమర్ మీసాలకూ... కవులకూ ఒకింత దగ్గరి సంబంధం ఉంది. దీనికి చాలా దృష్టాంతాలూ, బోల్డన్ని తార్కాణాలూ ఉన్నాయి. దాదాపు మీసాల్లోని కేశాలెన్నో ఈ దృష్టాంతాలూ అన్నే ఉన్నాయని కవులనూ, మీసాలనూ నిశితంగా పరిశీలించిన వారు అంటుంటారు. ఉదాహరణకు తిరుపతి వెంకట కవులిద్దరూ కూడబలుక్కొని మీసాలు పెంచారు. ‘సినిమాలకు హాలీవుడ్ హీరోలెలాగో, కావ్యాల్లో కవులలాగ. వాళ్లకు మీసాలెందుకు’ అంటూ కొందరు పెద్దలు కోప్పడ్డారు. అప్పుడు సదరు జంటకవులు కాస్తా పద్యంతో బదులిచ్చారు. ‘మేమే కవీంద్రులమని తెల్పడానికి మీసాలు పెంచాం. రోషం కలిగిన వాళ్లెవరైనా మమ్మల్ని గెలిస్తే ఈ మీసాలు తీసి మీ పద సమీపాలలో ఉంచి, మొక్కుతాం. కాబట్టి దుందుడుకుగా ఇలా మీసాలు పెంచాం’ అంటూ మీసాలెందుకు పెంచుతున్నారంటూ అడిగిన వాళ్లను కవిత్వంలో నిరసించారు. ‘మీకు దిక్కున్న చోట చెప్పుకోఫోండి...’ అన్నట్టుగా పద్యంతో ఫెడీ ఫెడీమని కొట్టి చెప్పారు. కాస్త వయసు మీరాక ఈ బాడీ జాడీలోని జీవితప్పచ్చడికి మొదట ఉన్నంత టేస్టు ఉండదు. ఈ లోతైన ఫిలాసఫీని చాలా తేలిక మాటల్లో తెలిపాడు శ్రీశ్రీ. ‘మీసాలకు రంగేస్తే యౌవనం వస్తుందా... సీసా లేబుల్ మారిస్తే సారా బ్రాందీ అవుతుందా’ అన్నాడాయన. అంటే యుక్త వయసులోనూ.. ముదిమిలోనూ మీసం ఈక్వలే అయినా ఆ తర్వాతి సీక్వెల్లో అవి తెల్లబోతాయనీ... తద్వారా తదుపరి దశలో తెల్లబడి వెలవెలబోతాయనీ తేటతెల్లం చేశాడు. ఆ విషయం గుర్తెరిగిన జ్ఞాని కాబట్టే ఆయన మీసాలు పెంచలేదు. చౌడప్ప అనే మరో కవి... ‘మీసాలూ-అవి పెంచాల్సిన వారి లక్షణాలూ’ అనే అంశం మీద పద్యం రాశాడు. ‘ఇవ్వగల, ఇప్పించగల అయ్యలకే మీసాలుండాలనీ, మిగతావాళ్లకు ఉన్నా అవి పెద్ద లెక్కలోకి రావ’ని కరాఖండీగా చెప్పాడు. మీసాలు ఎవరికి ఉండాలి, ఎవరికి ఉండకూడదు అనే అంశాన్ని నిమ్మకాయ నిలబెట్టిన మీసమంత పవర్‌ఫుల్‌గా చెబుతూ... ‘ఆ మాటకొస్తే రొయ్యకు లేవా బారెడు’ అంటూ మిగతా మీసగాళ్లను అలా తీసిపడేశాడు. అత్యద్భుత కావ్యాలు రాసి... తన పద్యాలతో పండిత-పామరులతో ‘వన్స్‌మోర్’ అంటూ జేజేలు చెప్పించుకున్న జాషువా గారికి తన మీసాల పట్ల మోజు ఎక్కువ. ఒకసారి ప్రముఖ రచయిత, చిత్రకారుడూ, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సంజీవ్‌దేవ్‌గారు జాషువాను చూసి ‘ఇంతటి గుబురు మీసాలు లేకపోతే మీరు ఇంకెంత అందంగా ఉండేవారో కదా’ అన్నార్ట. వెంటనే జాషువా గారు తన వేళ్లతో ఒకసారి ఆ మీసాలను పైకి దువ్వుతూ, గట్టిగా నవ్వుతూ ‘నాలో కవిత్వం లేకపోయినా సహించగలను. కానీ మీసాలు లేకపోతే మాత్రం సహించ లేను’ అన్నార్ట. జాషువా గారు తన ఇష్టాన్ని అంత పవర్‌ఫుల్‌గా చెప్పారని అంటారు సంజీవ్‌దేవ్ గారు ‘కవి, మనీషి, జాషువాతో’ అనే తన వ్యాసంలో. జాషువా వంటి మహానుభావుడు మీసాలకు అంత ప్రాధాన్యం ఇచ్చాడంటే కవిత్వం కంటే బలమైనది ఏదో మీసాల్లో ఉండే ఉంటుందని ఆ మీస వ్యాస రత్నాకరాన్ని పరిశీలిస్తే మనకు తెలిసి వస్తుంది. అలాంటి జాషువాగారు వృద్ధాప్యంలో పక్షవాతం వచ్చి మాట్లాడలేకపోయేవారట. ఎవరైనా వచ్చి ‘కవిగారూ... ఎలా ఉన్నారు’ అని పలకరిస్తే... హుందాగా మీసం తిప్పి తాను మానసికంగా దృఢంగా ఉన్నానంటూ బదులిచ్చేవారట. అంటే సదరు పలుకుతో వచ్చే జవాబు కంటే మీసం దువ్వడం ద్వారా ఇచ్చే ఆన్సరే బలమైనదని తెలియడం లేదూ. ‘మెలిదిరిగిన మీసాలను సవరించుకుంటూ జాషువా కవిగారు కలియదిరుగుతుంటే చూస్తున్నవారికి శ్రీనాథ మహాకవి తలపునకు రాకమానడు’ అనుకుంటూ ఆయన మీసాలను తలచుకుంటూ ఉంటారు ఆయనతో కలిసి తిరిగినవారు. అంతెందుకు... ‘వియన్నా సులోచనాలూ, స్విట్జర్లాండు రిస్ట్ వాచి, ఫారెన్ డ్రస్, ఫ్రెంచి కటింగు మీసాలును, ఫారిన్ ఫ్యాషన్ లేనిచో...’ సొంత పెళ్లాలయినా మొగుణ్ణి పెద్దగా లెక్కచేయరని మృత్యుంజయ శతకం వంటి మహాద్భుత రచనలు చేసిన మాధవపెద్ది సుందరరామశాస్త్రి అనే కవిగారు మీసాల గొప్పదనాన్ని సెలవిచ్చారు. ‘మీసము పస మగ మూతికి’ అంటూ ఒక పక్క ఒక కవి అంటున్నా... ఇంకెవరో అజ్ఞాత కవి అధిక్షేపణ పూర్వకంగా పవర్‌ఫుల్‌గా తిడుతూ... ‘మింగ మెతుకు లేదు... మీసాలకు సంపెంగ నూనె’ అనే సామెతను పుట్టించాడు. ఇంచుమించూ ఇలాంటి అర్థమే వచ్చేలా ‘అంబలి తాగే వాడికి మీసాలెత్తే వాడు ఒకడు’ అంటూ మరొకరు కాస్త గట్టిగానే కోప్పడ్డాడు. అంటే... మన పస తెలియజేయడానికి మీసాలు పెంచవచ్చు... కావాలంటే వాటికి సంపెంగ నూనె కూడా రాసుకోవచ్చు గానీ... మొదట ఉదర పోషణ జరగాలనీ, ఆ తర్వాతే మీస పోషణకు రావాలని సామెతలు సృష్టించిన ఆయా ప్రజాకవుల భావం. ఎవరేమనుకున్నా క్యాలెండర్ అన్నాక మాసాలూ... మగాడన్నాక మీసాలూ ఉండి తీరాల్సిందేనని కొందరు పురుషపుంగవుల అభిప్రాయం. కానీ పెంపుడు జంతువుల్లాగానే వాటినీ దువ్వుడానికే తప్ప మరో ఉపయోగం లేదని క్లీన్షేవోత్తములు వాకృచ్చుతూ ఉంటారు. పోనీ మీరూ పెంచరాదా అంటే... ‘ఎందుకు పెంచం’ అంటారే తప్ప గబుక్కున పెంచలేరు. మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి అలా క్యాట్ఫిష్షుల్లా ‘మీనమీసాలు’ లెక్కబెడుతూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. - యాసీన్ -
ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే
ఖాసింపై కేసు ఎత్తివేయాలన్న కవులు, రచయితలు హైదరాబాద్: ప్రజాస్వామిక తెలంగాణ, విప్లవోద్యమం కోసం పనిచేస్తున్న ఖాసింపై ప్రభుత్వం కుట్ర కేసు పెట్టడం ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనని విరసం నేత వరవరరావు అన్నారు. రచయితగా, సంపాదకుడిగా, ప్రొఫెసర్‌గా ప్రజల్లో పనిచేస్తున్న ఖాసింపై ప్రభుత్వం ఊపా చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో వరవరరావు మాట్లాడుతూ... తెలంగాణలో భావ స్వేచ్ఛను దారుణంగా అణచివేస్తున్నారన్నారు. ఈ ప్రమాదాన్ని మొగ్గలోనే అరికట్టాలన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ... తెలంగాణ అవతరించడానికి టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే కారణం కాదన్నారు. మావోయిస్టు పార్టీతో సంబంధాలుండటమే నేరమైతే, వారితో నాడు శాంతి చర్చలు జరిపిన ఐదుగురు మంత్రులు కూడా దేశ ద్రోహులు అవుతారని అన్నారు. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత... ‘మా భావాలపై కత్తులు పెట్టకండి’ అన్నారు. అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ... ప్రజాస్వామ్య విలువల కోసం ఎవరు మాట్లాడినా వారిపై కేసులు పెట్టడం ప్రభుత్వాలకు అలవాటుగా మారిందన్నారు. కొనదలిచిన వారిని కొనుక్కుంటున్నారు... కొనటానికి వీలు లేని వారిపై కేసులు పెడుతున్నారా అంటూ ప్రశ్నించారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రజాస్వామిక వాదులపై ఆంధ్ర ప్రభుత్వం కూడా పెట్టని కేసులను తెలంగాణ ప్రభుత్వం పెడుతోందన్నారు. తెలంగాణ వ్యతిరేకులంతా మంత్రులయ్యారన్నారు. ప్రొఫెసర్ ఖాసిం మాట్లాడుతూ... తెలంగాణ కోసం పోరాడిన ప్రతి సమయంలోనూ మాపై కేసులు మోపారన్నారు. రచయిత నందిని సిధారెడ్డి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు, ప్రజా కళామండలి కోటి తదితరులు పాల్గొన్నారు. -
సాహితీలోకంలో విషాదఛాయలు..
ప్రపంచశాంతి పండుగ అవార్డు అందుకున్న రామ్మోహన్రావు సంతాపం తెలిపిన పలువురు కవులు, సాహితీవేత్తలు హన్మకొండ కల్చరల్ : వరంగల్ సాహితీ మిత్రుడు అద్దేపల్లి రామ్మోహన్రావు మృతితో జిల్లా సాహితీలోకంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాకినాడకు చెందిన అద్దేపల్లికి ఆంధ్రదేశమంతటా ఉన్న కవులు, రచయితలు మిత్రులే అయినా వరంగల్ వారితో ప్రత్యేక అనుబంధం ఉండేది. అనేక మార్లు వరంగల్ వచ్చిన ఆయన గత ఏడాది ఫిబ్రవరి 27న ప్రపంచ శాంతి పండుగ అవార్డు ఇక్కడ స్వీకరించారు. ఆ సందర్భంలో ‘వరంగల్నా రెండో పుట్టిన ఊరు.. మళ్లీ ఇక్కడకు వస్తానో, రానో’ అని పేర్కొన్నారు. గత యూభై ఏళ్లుగా కాళోజీ సోదరులు, కాళోజీ మిత్రమండలితో పాటు అంపశయ్య నవీన్, వరవరరావు, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, నమిలికొండ బాలకిషన్‌రావు తదితరులతో అద్దేపల్లికి అనుబంధం ఉం డగా.. కొత్తరతం కవులను ప్రోత్సహిస్తూ వారు సాహిత్యజీవులుగా స్థిరపడేలా చేశారు. కాగా, అద్దేపల్లి మృతి వార్త తెలుసుకున్న కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ కాకినాడలో తనను అనేక సాహిత్య సమావేశాలకు ఆహ్వానించే వారని గుర్తు చేసుకున్నారు. తన అంపశయ్య నవలను 1969లో కాకినాడలో ఆవి ష్కరించారని తెలిపారు. కవి పొట్లపల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ప్రపంచీకరణను ప్రతీ సందర్భంలోనూ వ్యతిరేకించిన కవిగా అద్దేపల్లి రామ్మోహన్రావు గుర్తుండిపోతారని తెలిపారు. అలాగే, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్.విద్యార్థి, సంయుక్త కార్యదర్శి జితేందర్‌రావు, కార్యవర్గసభ్యులు సిరాజుద్దీన్, కేయూ అధ్యాపకులు ఆచార్య బన్న అయిలయ్య, ఆచార్య పంతంగి వెంకటేశ్వర్లు, పోతన విజ్ఞాన పీఠం కార్యదర్శి నమిలికొండ బాలకిషన్‌రావు తదితరులు కూడా అద్దేపల్లి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
దాడులు తిప్పికొట్టాలి
రచయితల పిలుపు హైదరాబాద్: కవులు, రచయితలపై జరుగుతున్న దాడులు, హత్యలను ముక్తకంఠంతో ఖండించాలని, అందుకు ఐక్యంగా పోరాడాలని పలువురు రచయితలు పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో ‘వర్తమాన సామాజిక సంఘర్షణలు, రచయితల బాధ్యత’ అంశంపై సమావేశం జరిగింది. ఇందులో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ కార్యదర్శి కాత్యాయని విద్మహే, ప్రముఖ రచయితలు నందిని సిధారెడ్డి, కె.శివా రెడ్డి, తెలకపల్లి రవి, వరవరరావు, యాకుబ్, పసునూరి రవీందర్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు ప్రసంగించారు. కాత్యాయని మాట్లాడుతూ.. సమాజంలో రచయితలు వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. రెండేళ్లుగా స్త్రీలు, రచయితలపై దాడులు పెరిగాయన్నారు. మతం పేరుతో కొనసాగుతున్న దాడులను రచయితలు తిప్పికొట్టాలన్నారు. కలచివేస్తున్న ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడానికి రచయితలు సంఘటితం కావాలని నందిని సిధారెడ్డి పిలుపునిచ్చారు. లౌకికవాద అభిప్రాయాలున్న వారంతా ఒక్కటై ఇలాంటి సంఘటనలు తిప్పికొట్టాలని కె.శివారెడ్డి అన్నారు. భిన్నమైన విశ్వాసాలు, ఆచారాలు, భావప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను ముక్తకంఠంతో ఖండించాలని తెలకపల్లి రవి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే కొందరు తుపాకులు పడుతున్నారని వరవరరావు చెప్పారు. హిందుత్వ, బ్రాహ్మణీయ శక్తులు చేస్తున్న దాడులను రచయితలు ఖండించాలని రవీందర్ అభిప్రాయపడ్డారు. దాడులకు నిరసనగా రచయితలు తమ అవార్డులను వెనక్కు ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమని కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ దాడులను ఐక్యంగా ఎదుర్కోవాలని, రచయితలకు అండగా సమాజం ఉందని తెలియజేయాలని హరగోపాల్ అన్నారు. వేదిక జాతీయ కన్వీనర్ కె.మల్లీశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు శాంతిప్రభావతి, పి.రాజ్యలక్ష్మీ, బండారు విజయ, ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, విమలక్క, వాసురెడ్డి నవీన్, శిలాలోలిత, వినోదిని, కొండవీటి సత్యవతి, సామాజిక వేత్త దేవి తదితరులు పాల్గొన్నారు. -
కవుల మౌనం ప్రజాద్రోహం
మూడు దశాబ్దాల పైగా యాక్టివ్‌గా సాహిత్యరంగంలో ఉన్న జూకంటి జగన్నాథం ఇప్పటివరకు 11 కవితాసంపుటాలు, వైపని కథా సంకలనం వెలువరించారు. తాజాగా ఆయన కవిత్వసంపుటి ‘చెట్టును దాటుకుంటూ...’ విడుదలైన సందర్భంగా ఆయనతో మద్దికుంట లక్ష్మణ్ జరిపిన సంభాషణ: మీ గత సంపుటాలకూ ఈ కొత్త సంపుటానికీ తేడా ఏమిటి? తెలంగాణ ఏర్పడిన తరువాతి పరిణామాలనూ, జీవితంలోని చీకటి వెలుగులనూ మరింత లోతుగా చిత్రీకరించాను. అంతేకాక, ప్రకృతి, సహజ వనరుల విధ్వంసాన్ని కవిత్వీకరించాను. తెలంగాణ ఉద్యమకాలంలో సాహిత్యం పాత్ర, నూతన సాహిత్యకారుల ఆవిర్భావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉద్యమకాలంలో సాహిత్యం అంతా తెలంగాణ కోల్పోయిన సంస్కృతి, సంపదల గురించి వివిధ ప్రక్రియల ద్వారా ప్రజలను సిద్ధం చేసింది. హక్కులకై గొంతెత్తింది. ఇక కొత్త సాహిత్యకారులు అంటే మీ దృష్టిలో తెలంగాణ అనంతరకాలంలో సాహిత్యరంగంలో ఏర్పడిన సమీకరణల గురించి అనుకుంటాను. ఇటువంటి కవిసమయాలు కొత్తేం కాదు. 1956 తరువాత కూడా కొంతమంది అధికారపక్షం వహించారు. వీరు ప్రజాసంబంధాల అధికారుల పాత్రల్లోకి కుంచించుకుపోయారు. విభజన తర్వాత సాహిత్యకారుల పాత్ర ఎలా ఉండాల్సింది? తాను నొవ్వక ఇతరులను నొప్పించక రాసుకుపోతున్నారు. వ్యూహాత్మక మౌనం పాటించడం సుతారమూ తగదు. కవుల మౌనం ప్రజాద్రోహంతో సమానం. తొంభై దశకంలో ప్రపంచీకరణ దుష్ర్పభావాల మీద తొలికోడై కూసిన మీరు ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారా? ప్రపంచీకరణ పరిణామాలు ఇప్పుడు గ్రామాలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది రైతాంగం, నేతకార్మికుల ఆత్మహత్యలుగా దాపురించింది. ప్రపంచీకరణ అనివార్యం కాకున్నా, వివిధ దౌర్జన్యకర ఒప్పందాల ద్వారా పాలకులు తప్పనిసరి చేసారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న శరణార్థుల సమస్య, యూరపుదేశాలలో ఆర్థిక సంక్షోభాలు, అమెరికా కర్రపెత్తనం మూలంగా ఉగ్రవాదుల పుట్టుక తదితరాలన్నీ ప్రపంచీకరణకు జన్మించిన కుత్సితరూపాలే! సాహిత్యకారులు ఉద్యమాల్లో పాలుపంచుకోవడాన్ని ఎలా అవగతం చేసుకోవాలి? తమ రచనలకు పరిమితమవుతారో, లేక ఉద్యమాలలో చేరి మరింత నిర్మాణాత్మక భూమిక పోషిస్తారో అది ఆయా సృజనకారుల చేతనకు చెందిన వ్యవహారం. - జూకంటి ఫోన్: 9441078095 ‘అసలు మహాత్ముడు’ నేటి భారతీయ సమాజానికి ‘స్వామి శ్రద్ధానంద’ పేరు తెలియదంటే ఆశ్చర్యం లేదు. తెలిసిన కొద్దిమందికి ‘శుద్ధి’ ఉద్యమం నడిపి, మహమ్మదీయుల ఆగ్రహానికి గురై హత్యగావించబడిన ఆర్యసమాజ్ నాయకుడుగా తెలుసు! నిజానికి, హిందూ ముస్లిం ఐక్యత కోసం గాంధీ కంటే ముందునుంచే నిబద్ధుడై, మహమ్మదీయుల విశ్వాసాన్ని చూరగొన్న స్వామి సమకాలీన నాయకుల కుట్రలవల్ల తన ప్రాణాల్నే బలియివ్వాల్సి వచ్చింది. చరిత్రలో ఎవరూ తలపెట్టనివిధంగా విద్య ద్వారా జాగృతి, అభ్యున్నతి మంత్రాలను ఉపదేశించిన ఋషిప్రోక్తుడు శ్రద్ధానందుడు. అలాంటి మహాత్ముడి పలు జీవన పార్శ్వాలను ఆవిష్కరించిన పుస్తకం ‘అసలు మహాత్ముడు’. ప్రముఖ సంపాదకుడు, పలు గ్రంథకర్త ఎం.వి.ఆర్.శాస్త్రి ఈ పుస్తక రచయిత. చారిత్రక గతినీ, పరిణామాన్నీ అర్థం చేసుకోవడానికి నిశ్చితమైన సూత్రాలున్నాయనే నమ్మకాన్ని చరిత్ర రచన మనలో కలిగిస్తుంది. సామాజిక వర్గాల ప్రవర్తన, ఆర్థిక శక్తులే సమకాలీన అభివృద్ధికి చోదక శక్తులనేది సుస్పష్టం. మనుషుల్లో మహాత్ముడనే వాడుకూడా ఈ చోదక శక్తులు నిర్ణయించే పరిమితుల్లోనే ఒదిగిపోయి వుంటాడు. సరిగ్గా అలాంటి పోత పోసిన పాత్రలో సామాజిక, రాజకీయ, సేవానాటక రంగాన్ని రక్తికట్టించిన ‘మహాత్ముని’ అసలు బండారాన్ని బట్టబయలు చేస్తూ... చోదక శక్తులు గీత గీసిన పరిమితులకు లొంగక, అస్పృశ్యతకు ఎదురొడ్డి, పరమత సహనపు సేతువు నిర్మిస్తూ, హిందూజాతిని సంఘటితం చేయ ప్రయత్నించాడు శ్రద్ధానంద. ‘ఇన్సైడ్ కాంగ్రెస్’, ‘హిందూ సంఘటన్: సేవియర్ ఆఫ్ ఎ డైయింగ్ రేస్’ గ్రంథాలు రచించాడు. వివిధ ఉద్యమాల్లో మహాత్మాగాంధీ కప్పదాటు వ్యవహారాన్నీ, హరిజనోద్ధరణ ఉద్యమాన్ని నీరుగార్చిన విధానాన్నీ, ముస్లింలీగ్ ఆగడాల్ని అడ్డుకట్టవెయ్యలేక పోయిన అశక్తతనూ పుస్తకంలోని ఇరవై ప్రకరణాల్లో తెల్పుటయే కాక వాస్తవాల వెలికితీత కోసం పలు గ్రంథాల్ని ఉటంకించారు శాస్త్రి. పథకం ప్రకారం జరిగిన జాతీయోద్యమ చరిత్రలో ఎన్నో వెల్లవేతలు, ఎన్నో తిరగమోతలు. తత్ఫలితంగా పలు కీలక ఉద్యమాల్లోని నేతలు విస్మృతి పాలయ్యారు. అలా మరుగున పడ్డ మహనీయుడే శ్రద్ధానందుడు. ఒక మూస వ్యవస్థ మరొక కొత్త వ్యవస్థలోకి పరిణామం చెందుతున్న దశలో, భారత జాతీయోద్యమాన్ని అసిధారావ్రతంగా భావించి, భారతీయ తత్వచింతనతో పాటు ప్రజానీకపు దారిద్య్రాన్ని పోగొట్టడానికి పాలకవర్గాల పాత్రను ఆకళింపు చేసుకొని వాటి సమతౌల్యానికి అహరహం శ్రమించిన నాయకుడు స్వామి శ్రద్ధానంద అని పుస్తకం ద్వారా పాఠకులు గ్రహిస్తారు. - నాదెండ్ల మీరా సాహెబ్ 9441630392 భరించడు సుఖ పాఠకుడు కొందరికి రచనలలో ఆనందం కావాలి, అంటే సమాజం ఎలా ఉంటే ఆదర్శప్రాయంగా ఉంటుందని వారి సంస్కారం చెబుతుందో, అలాంటి జీవితం రచనలలో కనబడాలి. సాహిత్యాన్ని ఈ దృష్టితో చూసేవారికి ప్రతినిధులు పిల్లలు. వాళ్లకు ఆనందం యిచ్చే కథలలో మంచివాడు జయిస్తాడు. చెడ్డవాడు అణగారిపోతాడు. ఆదర్శ పాత్రలు ధైర్యం కలిగి, ఎలాటి కష్టాలనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. కుట్రలూ, కుహకాలూ పనికిరావు. స్వార్థం చాలా చెడ్డది. ఇలా ఉంటుంది పిల్లల అభిరుచి. సుఖంగా జీవిస్తూ, మెత్తని పరుపూ, వడ్డించిన విస్తరీ లాటి జీవితం గలవాళ్లు దారిద్య్రం గురించీ, పేదల కష్టాలను గురించీ, వాళ్లకు జరిగే అన్యాయాలను గురించీ వాస్తవ విషయాలు చదివితే బాధ పడతారు. అలాటి జీవితం నుంచి విముక్తి పొందటానికి ఆ అభాగ్యులు కత్తి పట్టిన రచనలు చదివితే ఆగ్రహా వేశులైపోతారు. - కొడవటిగంటి కుటుంబరావు ‘సాహిత్య ప్రయోజనం లేని రచన గొప్పదిగా ఉండగలదా?’(1980) వ్యాసం నుంచి... అసహాయత ‘బాగా లేదా సార్’ అడిగింది ఆమె ‘అలా కన్పడుతున్నానా’ అతని ప్రశ్న. ‘అవును సార్ ఎంతోదూరం నడిచినట్టు ఎన్నో ఎడారుల్ని మోస్తున్నట్టు ఎప్పుడూ ఏదో స్వరాలు మోగుతున్నట్టు అస్వస్థత కాదుగానీ, అలిసిపోయినట్టు’ ‘రాత్రి నిదర లేదు’ అబద్ధ మాడాడతను- తననుభవిస్తున్న దుఃఖాల్ని విపత్తుల్ని, వినూత్న విధ్వంసాల్ని మంటల జీవితాన్ని మూట విప్పి ఆమె ముందు గుమ్మరించలేక- - శివారెడ్డి 040-24064195 ఎందుకు? గుండెల్లో గూడు కట్టుకున్న వైరాగ్యం ఎందుకు? అని ప్రశ్నిస్తుంది సమాధానం తెలియని మనస్సు మౌనంగా రెక్కలు విప్పుకొని దిక్కులకు ఎగిరిపోతుంది ఇంతకూ దేవుడున్నాడా? లేకనేం? సకల చరాచర జగత్తుకు సృష్టికర్త ఆయనే కదా! మరి ఆయనను సృష్టించిన కర్త ఎవరో?! తర్కం మొగ్గ తొడిగిన చోట విశ్వాసం ముక్కలు చెక్కలై భళ్లున పగిలిపోతుంది పోనీ మహావిస్ఫోటం, తారలు, గ్రహాలు అంతా నిజమేనా? చూస్తుంటే నిజమేననిపిస్తోంది మరి ఏ ప్రమేయమూ లేకుండానే ఇదంతా ఇట్లాగే ఎందుకు సంభవించడం? మళ్లీ అంతే... తర్కం మొగ్గ తొడిగిన చోట నమ్మకం ముక్కలు చెక్కలై భళ్లున పగిలిపోతుంది మనస్సు రెక్కలు విప్పుకొని మళ్లీ మళ్లీ దిక్కులకు ఎగిరిపోతుంది - వైరాగి యెద్దుల 9052032198 రచయితలతో సంభాషణ ఒకే లక్ష్యం కోసం భిన్న మార్గాల్లో పనిచేస్తున్న రచయితలతో సంభాషణ కోసం ‘వర్తమాన సామాజిక సంక్లిష్టతలు-రచయితల బాధ్యత’ అంశంపై ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ నేడు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మధ్యాహ్నం 1:30 నుంచి 5 వరకు ఒక సమావేశాన్ని నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల సాహిత్య సంఘాలను, సాహిత్యకారులను పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తోంది. మౌళికి యువక పురస్కారం ‘బహుజన రచయతల వేదిక-ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో, కలేకూరి ప్రసాద్ (యువక) స్మారక సాహిత్య పురస్కార సభ- నేడు సాయంత్రం 6 గంటలకు ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో జరగనుంది. పురస్కార గ్రహీత: బాలసుధాకర మౌళి. ఈ సభలో చల్లపల్లి స్వరూపరాణి, ఎం.ఎం.వినోదిని, ఖాజా, కోయి కోటేశ్వరరావు, బద్దిపూడి జయరావు, ఎన్.జె.విద్యాసాగర్, ముప్పవరపు కిషోర్, ఎ.సుబ్రహ్మణ్యం, మిరియం అంజిబాబు పాల్గొంటారు. ఒక విజేత ఆవిష్కరణ అబ్దుల్ కలాంపై 190 మంది కవుల కవితా సంకలనం ‘ఒక విజేత’ ఆవిష్కరణ కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 29న మధ్యాహ్నం 3 గంటలకు మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో జరగనుంది. సంపాదకుడు: మాడభూషి సంపత్‌కుమార్. ఆవిష్కర్త: వైస్ ఛాన్సలర్ ఆర్.తాండవన్. తొలిప్రతి స్వీకర్త: కలాం మనవడు షేక్ సలీం. జి.వి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి, ఎ.ఎన్.రావు, నర్రావుల వెంకటరమణ, మేడిపల్లి రవికుమార్, విస్తాలి శంకరరావు పాల్గొంటారు. కొత్త పుస్తకాలు బులుసు సుబ్రహ్మణ్యం కథలు (‘నవ్వితే నవ్వండి’ బ్లాగులో రాసినవి) పేజీలు: 206; వెల: 150 ప్రతులకు: రచయిత, ప్లాట్ నం.139, రోడ్ నం.7, సౌత్ ఎండ్ పార్క్, మన్సూరాబాద్, ఎల్బీ నగర్, హైదరాబాద్-68. ఫోన్: 040-24124494 నిండు పున్నమి పండు వెన్నెల (బాలసరస్వతీదేవి అభినందన సంచిక) కూర్పు: మోదుగుల రవికృష్ణ పేజీలు: 152; వెల: 100 ప్రతులకు: కూర్పరి, 26-19-10, ‘0’ లేన్, మెయిన్ రోడ్, ఎ.టి.అగ్రహారం, గుంటూరు-4; ఫోన్: 9440320580 మా ఊరు చెప్పింది (చిన్న చిన్న కథలు) రచన: ప్రశాంత్ విఘ్నేశ్ పేజీలు: 150; వెల: 180; ప్రతులకు: ముఖ్య పుస్తకకేంద్రాలు; రచయిత ఫోన్: 9177177777 -
ఇకపై మన భాష.. మన సంస్కృతి
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పలువురికి సాహితీ పురస్కారాల ప్రదానం సాక్షి,సిటీబ్యూరో : ఇంతకాలం అణచివేతకు గురైన తమ భాష, సంస్కృతిని పరిరక్షించుకునే దిశగా తెలంగాణ రచయితలు, కవులు రచనలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ కళామందిరంలో 2012 సంవత్సర సాహితీ పురస్కార ప్రదాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా ప్రమాణాలు అడుగంటుతున్నాయని, ప్రపంచంలోని 200 ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో మనది ఒకటీ లేకపోవడం బాధాకరమన్నారు. తెలుగు వర్సిటీ నుంచి రచయితలు తమ గ్రంథాలు ముద్రించుకోవడానికి ఆర్థిక సహాయం అందించే నిమిత్తం రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి ప్రసంగిస్తూ.. తెలంగాణ రచయితలకు మునుపటికంటే ఎక్కువ సహాయం అందించాలన్నారు. ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 11 నుంచి విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రభుత్వం పరిధిలోకి వచ్చిందన్నారు. పురస్కార గ్రహీతలు వీరే.. వచన కవితా ప్రక్రియలో ‘దండెడ’ గ్రంథానికి పొన్నాల బాలయ్య, బాలసాహిత్యం ప్రక్రియలో ‘శృతిలయలు’ గ్రంథానికి ఆలపర్తి వెంకట సుబ్బారావు, కథా ప్రక్రియలో ‘గదిలోపలి గోడ’ రచయిత పలమనేరు బాలాజి, సాహిత్య విమర్శలో ‘సాహిత్యాకాశంలో సగం’ గ్రంథకర్త ఆచార్య కాత్యాయని విద్మహే, అనువాద ప్రక్రియలో ‘అనంతాకాశం’ గ్రంథానికి గోవిందరాజు రామకృష్ణారావు, నవలా ప్రక్రియలో ‘జిగిరి’ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్, నాటక ప్రక్రియలో ‘లవంగి’ నాటకానికి కేవీఎల్ఎన్ శర్మ, వచన రచనలో ‘ముంగిలి- తెలంగాణ ప్రాచీన సాహిత్యం’ గ్రంథానికి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, రచయిత్రి ఉత్తమ గ్రంథంలో ‘తెలుగు నృత్యకళా సంస్కృతి’ రచయిత ఆచార్య కె. కుసుమారెడ్డి పురస్కారాలు అందుకున్నారు. పద్య కవితా ప్రక్రియలో ‘సప్తగిరిథామ కలియుగ సార్వభౌమ’ గ్రంథానికి దివంగత రాళ్లబండి కవితాప్రసాద్ తరపున ఆయన సతీమణి నాగినీదేవి పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ తోమాసయ్య, డాక్టర్ జె.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
కవిభల్లూక
ఉద్దండపిండాలైన కవులను పుంగవులుగానే పోల్చారు మనవాళ్లు. బహుశ నాటి కవులలో వృషభ గతి కనిపించి ఉంటుందని అప్పటి విమర్శకులకు. భగవంతుడి దయవల్ల మనకు కవిభల్లూకాలు, కవిజంబూకాలు ఎవరూ లేరు. ఆ బిరుదులకు బహుశ తగిన అర్హులెవరూ మనకు లేరు. అయితే, ప్రాచీన ఇంగ్లిష్ కవులలో అగ్రగణ్యుడిగా, విలియమ్ షేక్స్పియర్ తర్వాత అంతటి వాడుగా ఖ్యాతి పొందిన లార్డ్ బైరన్ మాత్రం ‘కవిభల్లూక’ బిరుదుకు ప్రపంచంలోనే ఏకైక అర్హుడు. ఎందుకంటారా..? లార్డ్ బైరన్ అంటే ప్రాచీనాంగ్ల మహాకవులలో ఒకరిగా సాహితీ ప్రియులలో చాలామందికి ఆయనపై ఎనలేని భక్తిప్రపత్తులు నేటికీ ఉన్నాయి. పద్నాలుగో ఏటనే కవన రచన మొదలు పెట్టిన బైరన్ కవిగారు యవ్వనారంభ కాలంలో సుప్రసిద్ధ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరారు. తరగతికి హాజరయ్యేటప్పుడు తన వెంట తన పెంపుడు జాగిలాన్నీ తీసుకొచ్చారు. జాగిలాలను తరగతి గదుల్లోకి తీసుకు రావడం నిషిద్ధమని, విశ్వవిద్యాలయ నిబంధనలకు అది విరుద్ధమని అధికారులు అభ్యంతర పెట్టారు. అధికారుల అభ్యంతరంతో జాగిలాన్ని తరగతి గది నుంచి వెలుపలకు తీసుకుపోయినా, ఈ తతంగమంతా బైరన్ కవిగారికి అవమానకరంగా తోచింది. అధికారులకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు. ముందుగా విశ్వవిద్యాలయ నియమ నిబంధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. తరగతి గదులకు జాగిలాలను తేకూడదన్న నిబంధనను రూఢి చేసుకున్నాడు. అయితే, నిబంధనల్లో భల్లూకాల ప్రస్తావన లేకపోవడాన్ని కూడా గమనించాడు. అంతే, ఈసారి తరగతి గదికి ఏకంగా ఒక భల్లూకాన్నే వెంటేసుకు రావడం మొదలుపెట్టాడు. అధికారులకు ఇది ఇబ్బందిగానే ఉన్నా, భల్లూకాలపై నిషేధం లేకపోవడంతో నోరు మెదపలేకపోయారు. కూర్పు: పన్యాల జగన్నాథదాసు -
పాఠక స్పందన
ఉగాది పంచాంగంతో వచ్చిన ‘ఫన్ డే’ ముఖచిత్రం అద్భుతంగా ఉంది. కవుల మదిలో మెదిలే అద్భుత భావనలా చిత్రకారుడు అలవోకగా ప్రకృతి కన్యను చిత్రీకరించారు. చిత్రకారుడికి అభినందనలు. - పుష్పలత, సోమందేపల్లి, అనంతపురం ఒక గృిహ ణి అయిన నేను సొంతంగా ఒక పరిశ్రమను ప్రారంభిద్దాం అనుకొంటున్నాను. దీనికి స్ఫూర్తి మీరు ప్రచురిస్తున్న ‘మీరే పారిశ్రామికవేత్త’. ఈ శీర్షిక కింద వస్తున్న కథనాలు ప్రోత్సాహవంతంగా ఉంటున్నాయి. - రూత్ సునైనా, ఇ మెయిల్ తళుకులీను తారలతో మిలమిల మెరిసే ఆకాశంలా ఉంటుంది ‘ఫన్డే’. ఉగాది వంటి ప్రత్యేక సందర్భాల్లో విశేష సమాచారాలకే పరిమితం కావడం మాలాంటి పాఠకులను నిరుత్సాహపరుస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో విడుదలయ్యే ఫన్డేలో కూడా మిగతా శీర్షికలకు స్థానం కల్పించ ప్రార్థన. - నేరెళ్ల వెంకటరావు, విజయనగరం మీ రీడర్‌గా చేరి అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయా! సాక్షిని రూపొందించే చేతులు, అవి పడిన శ్రమ చదువుతుంటే చాలా బాగుంది. అన్నం ముద్దను తినే ముందు కోత కోసిన వాడి నుంచి కంచంలో వడ్డించిన వారి వరకూ అందరినీ ‘సుఖీభవ’ అని తలుచుకున్నట్టుగా ఉంది. ఒక టీచర్‌గా మాకు కావాల్సిన సమాచారం, పిల్లలకు గెడైన్స్ సూపర్. ఇక ఫ్యామిలీ ఎడిటోరియల్స్, వైద్యం, సాహిత్యం, సాగుబడి, ఫన్డే ఏదైనా మాకు అర్థమయ్యే శైలిలో ఉంటాయి. పేపర్ కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ ఒక్కమాట మీద ఉండటం, చైర్పర్సన్ వైఎస్ భారతి రెడ్డిగారి కృషి... అవసరమైనప్పుడు తన కష్టాలని దిగమింగి ధైర్యంగా ఆమె ప్రజల ముందుకు వచ్చి నిజాలు చెప్పడం నాకు చాలా నచ్చింది. ఇంకా మీరు వినూత్నంగా ఎప్పటికప్పుడు మా అభిమానాన్ని చూరగొంటారని ఆశిస్తూ.. మీ టీమ్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు. - వి.శశికళ, నాయుడుపేట, నెల్లూరు మీ అభిప్రాయాలనూ, రచనలనూ స్వాగతిస్తున్నాం. మా చిరునామా: ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. ఫోన్: 040-23256000 funday.sakshi@gmail.com -
మే ఐ కమిన్ సార్!
పొలిమేరలో నిలిచిన పండుగని ‘టుబి ఆర్ నాట్ టుబి’ అనే విచికిత్స వేధిస్తూ ఉంటుంది. ఎటూ పాలుపోక చివరకు ‘‘అయామ్ మన్మథ, మే ఐ కమిన్ సార్!’’ అంటూ వినయంగా జనావళిని అడుగుతుంది. ప్రతిసారీ ఉగాదికి కవులు అగ్నిపరీక్ష పెడుతుంటారు. ఒకరేమో ‘‘రా! రా! ఉగాదీ! నీ కోసం ఇళ్లలికాం! ముగ్గులు పెట్టాం! మా మామిడి తోర ణాలు కట్టింది. మా వేప నీకై విరగబూసింది!’’ అంటూ గొంతెత్తి రెండేసి మూడేసి సార్లు పిలుస్తారు. మరొకరు ‘‘రావద్దు ఉగాదీ! రావద్దు! ఏముందని వస్తావ్? వేప చెట్లు నరికేశాం! మామిడి మారాకు తొడగనే లేదు! నీకై పాటలు పాడే కోయిలలు ప్రెస్మీట్లో బిజీగా ఉన్నా యి! తుమ్మెదలు దారి తప్పి బ్రాందీ షాపుకి వెళ్లాయి! రావద్దు ఉగాదీ!’’ అంటూ ఇక్కడి సంగతులని కవిత్వీ కరిస్తూ హెచ్చరిస్తారు. పొలిమేరలో నిలిచిన పండుగని ‘టుబి ఆర్ నాట్ టుబి’ అనే విచికిత్స వేధిస్తూ ఉం టుంది. ఎటూ పాలుపోక చివరకు ‘‘అయామ్ మన్మథ, మే ఐ కమిన్ సార్!’’ అంటూ వినయంగా జనావళిని అడుగుతుంది. అట్టి అతిథి మన్మథ యావత్ తెలుగు జాతికి సర్వ సుఖ శాంతి సౌభాగ్యాలనిచ్చి కాపాడుగాక! ఈ నవ తొలి ఉగాది గోల్కొండ ఖిల్లాలో జరగను న్నదా? ఉర్దూ, తెలుగు భాషా కోయిలలు కోటలో అక్షర దీపాలు వెలిగించనున్నవా? మనదీ చాంద్రమానమే, వారిదీ చంద్రహారమే. అయినప్పుడిక కుడిఎడమల తేడాలేల? పండుగపూట హృదయాన్ని విప్పి, పొరల్ని వేదిక మీద ఆరేశారా లేదా అన్నది ముఖ్యం. తెలం గాణకి కావలసినన్ని కవితా గోష్టి సెంటర్లున్నాయి. ఖిల్లా నించి జిల్లా జిల్లాలో జరపవచ్చు. రవీంద్రభారతిలో అడుగు పెట్టొద్దనుకుంటే పేరు మార్చిన రంగా వ్యవ సాయ విశ్వవిద్యాలయంలో పచ్చందనాల నేపథ్యంలో సమ్మేళనం సాగించవచ్చు. కావాలనుకుంటే దైవసన్నిధి యాదాద్రి ఉండనే ఉంది. క్షేత్ర మహత్తు వల్ల ప్రతి కవీ ఒక న రసింహమై విజృంభిస్తే కొంచెం ఇబ్బంది. శాం తింప చేయడానికి కనీసం ఒక్క ప్రహ్లాదుడైనా దొరకడం కష్టం. ఇక అవశేష ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దయనీయంగా ఉంది. ఉగాది వద్దామంటే చిరునామా కూడా లేదు. ఈ-మెయిల్ లేదు. సెల్ నంబరు ఉందిగాని, సిగ్నల్స్ సరిగ్గా లేవు. ఎక్కడికని వస్తుంది పాపం! తెచ్చిన కాను కలు ఎక్కడ దింపి వెళుతుంది? ఇటీవల వసంత కోయి ళ్లకి చెట్లు దొరక్క కరెంటు స్తంభాల మీద కూచుని కూస్తు న్నాయి. లైటు వెలిగితే వసంతకాలం కాబోలని భ్రమ పడుతున్నాయి. ఎందుకంత ఆలోచన? అసలీసారికి నూజివీడు మామిడితోటలోకి కవులను రప్పిస్తే ప్రతి కవీ వంద కోయిళ్ల పెట్టున ధ్వనిస్తారు. ఆ తర్వాత ఆ తోట లకి గొప్ప ధర పలుకుతుంది. నాగార్జున విశ్వవిద్యాల యం పేరు చెబితేనే ముఖ్యమంత్రికి దడుపు జ్వరం వస్తోంది. పోనీ పంచాంగ శ్రవణం రాయలసీమలో పెట్టుకుని, ప్రసాదం పంపిణీ విశాఖలో పెడితే అన్ని ప్రాంతాలకూ న్యాయం చేసినట్టు అవుతుంది. చూసు కోండి బాబూ, ఆదాయ వ్యయాలూ, అవమానాలూ రాజ్యపూజ్యాలు. ‘‘ఈసారి చంద్రన్న కానుకలు లేవా?’’ అన్నారెవరో. ‘‘లేవు... ఓల్డ్ స్టాక్స్ అన్నీ సంక్రాంతికి చెల్లి పోయాయి. పోగుపడితే వినాయక చవితికి...’’ అన్నా రింకొకరెవరో. మాకుగాదులు లేవు, మాకుషస్సులు లేవంటూ కొందరి ఆందోళన. పిక మహాసభ అంటే పిలవని కవుల మహాసభ అని కూడా అర్థం. జానెడు మైకు కోసం వాళ్లు తహతహలాడతారు. ప్రతి సమకాలీన సమస్య మీదా నిజాయితీగా స్పందించే ఒకే ఒక్క కులం కవికులం. చెరువుల పూడికలు ఒక ఉద్యమంగా నడుస్తుంటే- ‘‘అవి చెరువులు కావు, కొందరి మెదళ్లు. దశాబ్దాలుగా పేరుకుపోయిన మట్టిని మశానాన్ని తోడేస్తోంది మిషన్ కాకతీయ’’ అంటూ దిగి, తిరిగి తిరిగి ఎక్కడో తేలాడు ప్రాంతీయ కవి. ‘‘... వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో కోటి డెబ్బయ్ ఆరు లక్షల నాలుగు వేల నలభై రెండు వేపచెట్లని అదనంగా పెంచుతాం. ప్రపంచంలోనే అతి పెద్ద వేప హబ్ వేస్తాం. గిరాకీ లేని కవులకు పింఛన్ పథకం కూడా ఆలోచనలో ఉంది. నే చెప్పిన మాట మర్చిపోవద్దు. ఇది మన్మథ నామ సంవత్సరం. మన కోసమే వచ్చింది. తమ్ముళ్లూ, ఆల్ ది బెస్ట్! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
తెలుగోత్సవం
ప్రపంచ తెలుగు రచయితల మూడో మహాసభలు ప్రారంభం ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన పలు సదస్సులు సభల్లో పాల్గొన్న పలువురు {పముఖులు, రచయితలు, కళాకారులు, కవులు వాడీవేడిగా చర్చలు, ఛలోక్తులు విజయవాడ : నగరంలో సాహితీ శోభ ఉట్టిపడుతోంది. అచ్చమైన పంచెకట్టులో ప్రముఖులు అటూ.. ఇటూ తిరుగుతూ తెలుగుదనాన్ని చాటారు. పలువురు ప్రముఖులు తెలుగు గొప్పదనాన్ని వివరించారు. మాతృభాష సేవలో తరలించాలని, కమ్మనైన అమ్మ భాషను విశ్వవ్యాపితం చేయాలని పిలుపునిచ్చారు. పటమట శ్రీ కృష్ణవేణి స్కూలులో శనివారం ప్రారంభమైన ప్రపంచ తెలుగు రచయితల మూడో మహాసభలు ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు పలు దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఎంతోకాలం తర్వాత కలిసిన కవులు, రచయితలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా చేసిన భోజన ఏర్పాట్లు బాగున్నాయని అతిథులు అభినందనలు తెలిపారు. సభలను జ్యోతి వెలిగించి కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి, మహాసభల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, ప్రముఖ పత్రికా సంపాదకులు ఎంవీఆర్ శాస్త్రి, కె.శ్రీనివాస్, శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ, ఆకాశవాణి కేంద్ర సంచాలకులు మంజులూరి కృష్ణకుమారి పాల్గొన్నారు. ప్రారంభ సభలో రచయితలు, సాహిత్యాభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తల్లి భాషలోని తియ్యదనం అనుభవిస్తేనే తెలుస్తుందని చెప్పారు. తాను చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తల్లి ద్వారా భాష నేర్చుకునే అవకాశం కోల్పోయానని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, ఎంతోమంది తల్లులు తనకు అన్నం పెట్టి దీవించారని, వారు చెప్పిన మాటలు, వారు వండి వడ్డించిన భోజనం ఎప్పుడూ తనకు గుర్తుకు వస్తూ ఉంటాయని చెప్పారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తన తల్లి ఎంతగానో అభిమానించి, ఆదరించిందని చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు. తెలుగును విశ్వవ్యాప్తం చేయాలంటే భాష ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాల్సి ఉందన్నారు. ఆలోచింపజేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాటలు.. ఈ సభలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ చెప్పిన మాటలు పలువురిని ఆలోచింపజేశాయి. ఎన్నిసార్లు సభలు నిర్వహించినా ప్రయోజనం పెద్దగా ఉండదని, బతుకు దారి చూపించే భాషగా తెలుగు మారితే తప్పకుండా ప్రపంచ భాషగా గుర్తింపు లభిస్తుందని ఆయన ఉద్ఘాటించారు. తెలుగులోని రచనలు అన్ని భాషల్లోకీ అనువాదం చేసి భాష గొప్పదనాన్ని చాటి చెప్పాలని కోరారు. తెలుగు భాషలో అన్ని వృత్తి విద్యలకు సంబంధించిన కోర్సులను బోధించే విధంగా మారాలని, అప్పుడు మాతృభాష ద్వారానే ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. అందరూ తెలుగు భాష గురించి గొప్పగా చెప్పాలంటే కవులు, కళాకారులు, రచయితలు కలిసి ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఆకట్టుకున్న ప్యారిస్ పరిశోధకుడు ప్యారిస్ దేశానికి చెందిన డేనియల్ నిగర్స్ మాట్లాడుతున్న సమయంలో అందరూ ఆసక్తిగా విన్నారు. విదేశీయుడైనప్పటికీ తెలుగు భాషపై పరిశోధన చేస్తున్నందున భాషకు ప్రాచీన కాలం నుంచి ఉన్న ఔన్నత్యాన్ని ఆయన వివరిస్తుండగా.. అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. ఆయన తెలుగు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ, మాతృభాష కాకపోవడంతో అది సహజమేనని పలువురు పేర్కొన్నారు. గొల్లపూడి మారుతీరావు, సుద్దాల అశోక్‌తేజ, తనికెళ్ల భరణి మహాసభలకు ఆకర్షణగా నిలిచారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, తనికెళ్ల భరణిల పంచెకట్టు ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు 600 మంది ప్రతినిధులు, ఏడుగురు విదేశీ ప్రతి నిధులు సదస్సుకు హాజరయ్యారు. ఆదివారం మరో ప్రతినిధి హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రచయితల సంఘం ప్రముఖులు సదస్సుల్లో పాల్గొన్నారు. -
తెలంగాణ భూమిలో కవిత్వం పండుతుంది
‘కవితల జాతర’ కార్యక్రమంలో కవి కె.శివారెడ్డి హైదరాబాద్: కవులు ప్రజల పక్షం వహించాలని ప్రముఖ కవి, విమర్శకులు కె.శివారెడ్డి అన్నారు. తెలంగాణ భూమిలోనే కవిత్వానికి కావల్సిన పదును ఉందని, ఈ నేలలో ఎక్కడ దున్నినా కవిత్వం పండుతుందని ఆయన చె ప్పారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ప్రజా సాహిత్యాన్ని ప్రొత్సహించేందుకు ‘కవితల జాతర’ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన శివారెడ్డి మాట్లాడుతూ కవులు గోడలకు చెవులను ఇస్తారు.. చెట్లకు కళ్లను ఇస్తారు.. భూమికి మాట నిస్తారని అన్నారు. ప్రముఖ కవి నిఖిలేశ్వర్ మాట్లాడుతూ గతం, వర్తమానాల్ని అవగతం చేసుకోగలిగిన వారే భవిష్యత్తులో దిశా, నిర్దేశం చేయగలుగుతారని అన్నారు. జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ కవికి అధ్యయనంతో పాటు సామాజిక ఆచరణాత్మకమైన బాధ్యత ఉండాలని అన్నారు. జీవితంలో విభిన్న కోణాలను ఆవిష్కరించే విధంగా కవిత్వం ఉండాలన్నారు. సాహిత్యంలో ఉన్న గొప్పతనం అనేది తెలంగాణ ఉద్యమం ద్వారా ప్రపంచానికి తెలి సిందన్నారు. ప్రముఖ కవి యాకూబ్ మాట్లాడుతూ కొత్తతరం సాహితీ వేత్తలకు పాత కవుల ప్రోత్సాహం ఉండాలన్నారు. పాలకులు అమ్మవలే అందరినీ సమానంగా చూడాలని చెప్పారు. భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రాం త కవులు, కళాకారులు.. ప్రజల వైపా? ప్రభుత్వం వైపా తేల్చుకోవాలని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆనందాచారి మాట్లాడుతూ శివరాత్రి రోజు జరుగుతున్న సాహిత్య ఉత్సవంలో ముగ్గురు శివ కవులున్నారని, వారే.. శివారెడ్డి, జూలూ రి గౌరీశంకర్, నిఖిలేశ్వర్ అని చమత్కరించారు. ప్రముఖ కవులు, సాహితీ వేత్తలు తంగిరాల చక్రవర్తి, వల్లభాపురం జనార్దన, సునంద, రత్నకుమార్, రౌతు రవి, ఆనంద్ కుమార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కవులు, సాహితీ వేత్తలు అమ్మంగి వేణుగోపాల్, బండారు సుజాత శేఖర్, విమల, గుడిపాటి, మోత్కుపల్లి నరహరి, శిలాలోలిత తదితరులు తమ కవితలను చదివి వినిపించారు. -
రైట్ టైమ్
చేయి తిరిగిన రచయితలు, కవులు.. ఇప్పుడిప్పుడే కలానికి పదును పెడుతున్న యువతరం.. ఒకచోట చేరి తమ భావాలను పంచుకున్నారు. అభిప్రాయాలను కలబోసుకున్నారు. సీనియర్స్ తమ అనుభవాల నుంచి పాఠాలు చెబితే.. జూనియర్స్ తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రచనలో రాణించడమెలా? కథల ఎంపిక ఎలా? శిల్పం ఎలా ఉండాలి? రాసేస్తాం సరే... పబ్లిషింగ్, మార్కెటింగ్‌ల మాటేమిటి? ఇలా అనేక అంశాలపై ఎడతెగని చర్చకు వేదికైంది సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్. రెండు రోజులపాటు జరిగిన రైటర్స్ కార్నివాల్ సలహాలు, సూచనలతో యువ రచయితలకు దిశానిర్దేశం చేసింది. పదహారేళ్ల అనూష నుంచి 65 ఏళ్ల రాజ్‌కుమార్ చోబ్రా వరకు రచనల్లో వచ్చే ఇబ్బందులు, మంచి రచనకు కావాల్సిన మెలకువలు నేర్చుకున్నారు. ..:: దార్ల వెంకటేశ్వరరావు రచనలు చేయడాన్ని హాబీ చేసుకోవాలని చాలామం దికి ఉంటుంది. మనసులో అందమైన ఊహలు రెక్క లు తొడుక్కుంటాయి. వాటిని కాగితంపై పెట్టాలను కునే సరికి చేయి కదలదు. ఏవేవో కలలు.. కలం పట్టి కళ్లకు కడదామంటే అక్షరం పడదు. ఇలాంటి వారితో పాటు సీనియర్స్ నుంచి సలహా సూచనలు పొందాల నుకుని.. ఆ చాన్స్ దక్కని రచయితలూ ఎందరో.. అటువంటి వారంతా తమ సందేహాలను తీర్చుకుని కొత్త ఉత్సాహం నింపుకొన్నారు. కలం బాటలో.. సాధారణంగా రచనా వ్యాసంగంలోకి రావాలనుకునేవాళ్లు క్లాసిక్స్ చదవడానికే ప్రాధాన్యమిస్తారు. కానీ.. సమకాలీన రచనలూ చదవాలి. ఇది సీనియర్ రచయితలు ముక్తకంఠంతో చెప్పేమాట. అప్పుడే ప్రస్తుత కవిత్వంలో వస్తున్న మార్పులు, స్టాండర్డ్స్ తెలుస్తాయి. కొత్త రచయితలు సొంతంగా పబ్లిష్ చేసుకుని పుస్తకాలు బయటకు తెస్తే అవి కేవలం తెలిసిన వారి వద్దకే వెళతాయి. దీంతో విమర్శలు తక్కువగా ఉండి రచయిత చేసిన పొరపాట్లు తెలియవు. సంప్రదాయ పబ్లిషర్స్ ద్వారా వెళ్తేనే ఎక్కువ మంది దగ్గరకు రచనలు వెళ్తాయి. తప్పొప్పులు తెలుస్తాయి. కేవలం పుస్తకాల పబ్లిషింగ్పైనే ఆధారపడటం వల్ల ప్రయోజనం లేదు. అందరూ ఉపయోగిస్తున్న సోషల్ మీడియాలో పబ్లిషింగ్ ఎలా చేసుకోవచ్చో కూడా ఆలోచించాలి. ఇవన్నీ వివరించి చెప్పిందీ రైటర్స్ కార్నివాల్. సొంత బ్లాగులు నిర్వహించడం, పేరొందిన వెబ్‌సైట్స్‌లో ‘ఈ పబ్లిషింగ్’ గురించీ సీనియర్స్ వివరించారు. ‘పెన్’టాస్టిక్ థీమ్.. యువ, ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించడానికి, వారికి ‘కొత్త కథ’ల్లోకి దారి చూపడానికి కార్నివాల్ ప్లాట్‌ఫామ్‌లా ఉపయోగపడింది. మూడేళ్లుగా రైటర్స్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. 2012లో డాక్యుమెంట్రీ, జర్నల్స్‌పై, 2013లో చిల్డ్రన్ రైటర్స్, 2014లో పబ్లిషింగ్ ఎలా.. అనే అంశాలపై నిర్వహిం చారు. నాలుగోసారి సెన్సిటివ్ అంశాలను థీమ్‌గా ఎంచుకున్నారు. యువ రచయితలు తమ రచనలెలా పబ్లిష్ చేసుకోవాలో ఇందులో వివరించారు. తెలుగు రైటర్స్‌కూ వేదిక కావాలి... అనితా దేశాయ్ షార్ట్ స్టోరీ రైటర్. వివిధ సామాజికాంశాలపై తన బ్లాగ్‌తో పాటు వివిధ వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో ఆర్టికల్స్ ప్రచురించారు. ఈ కార్నివాల్లో విడుదల చేసిన ‘సెలబ్రేటింగ్ ఇండియా’ పుస్తకంలో ఆమె రాసిన ‘ఎపిలిప్టిక్’ షార్ట్ స్టోరీ పబ్లిష్ అయింది. ఫిట్స్ వచ్చే ఓ మహిళ పుట్టుక నుంచి ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంతో ప్రస్తుతం ఆమె రాస్తున్న కథ ‘డొమెస్టిక్ మేడ్’. ‘పబ్లిషింగ్‌లో ఇబ్బందులు, కాపీరైట్ చట్టాల గురించి కార్నివాల్ వల్లే తెలుసుకోగలిగాను’ అని అనితా దేశాయ్ చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ ముక్తేశ్వరరావుకి చిన్ననాటి నుంచి రచనలు చేయడం హాబీ. ‘..కానీ విధి నిర్వహణలో ఒత్తిళ్లతో రచనా వ్యాసంగంపై దృష్టి పెట్టలేదు. పదవీ విరమణతో సమయం దొరికింది. సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రపై ఆర్టికల్స్ రాసినా.. అవి ఆంగ్లంలోనే. తెలుగు రైటర్స్ కు ఇలాంటి వే దిక అవసరం. నేను సైతం కార్నివాల్లో ఉత్సాహంగా పాల్గొన్నా’నంటారాయన. మతం కన్నా.. మానవ సంబంధాలు మిన్న... 65 ఏళ్ల రాజ్‌కుమార్ ఛాబ్రా స్టేట్మెంట్ ఇది. అందుకే ఆ సంబంధాల్లోని బాంధవ్యాల గురించి ఎక్కువగా రాస్తుంటారాయన. నిత్యం తన కళ్లముందు జరిగే అంశాలే ఆయన కథా వస్తువు. పెళ్లికోసం మతం మారతాడు ఓ కశ్మీరీ పండిట్. మతం మారాక అతని కుటుంబంతో కొనసాగే అనుబంధాలు, బంధాలకు కథా రూపమిచ్చారు. అంతేకాదు... ఓసారి హాంగ్‌కాంగ్‌కు వెళ్లిన రాజ్‌కుమార్ మొబైల్ బ్యాటరీ పాడైంది. కొత్త బ్యాటరీ కొనేందుకు వెళ్తే... అప్పటికే టైమ్ అయిపోయింది. అయినా షాపు యజమాని ఓ మొబైల్ ఇచ్చి అది ఉదయం వరకూ వాడుకోమని, పొద్దున్నే కొత్త బ్యాటరీ తీసుకోమని ఇచ్చాడు. ‘దేశంకాని దేశంలో... ఎవరో ఏమిటో తెలియకుండా ఫోన్ ఇవ్వడం నమ్మకం. అదే మనుషుల మధ్య ఉండే గొప్ప బంధం. వీటి నేపథ్యంతో ఎన్ని కథలై నా రాయొచ్చు’ అంటారు రాజ్‌కుమార్. ఆయన నుంచి యువ, ఔత్సాహిక రచయితలు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. మనసులో మెదిలో ఊహలకు ఎలా అక్షర రూపమివ్వాలో ఆయన చెప్పిన తీరు ఆకట్టుకుంది. ‘నేను చూసిన ప్రదేశాలు, ప్రకృతి గురించి సొంత బ్లాగ్‌లో పెడుతుంటాను. ఈ కార్నివాల్ నాకు కొత్త దారి చూపింది’ అని ఆనందంగా చెప్పింది ఇందిర. ఆమెలాంటి ఔత్సాహికులు మరెందరో ఇక్కడ రచనా మెలకువల్ని ‘కలం’ నిండా నింపుకొన్నారు. చాలా నేర్చుకున్నా... చిన్నప్పటి నుంచి చిన్నచిన్న కథలు, కవితలు రాయడం అలవాటు. నేను రాసిన కథలు నా బ్లాగ్‌లోనే పబ్లిష్ చేస్తుంటాను. ఎమోషనల్ అంశాలపై రాయడమంటే ఇష్టం. ఈ కార్నివాల్లో ట్రాన్స్‌జెండర్స్ సమస్యల గురించి తెలుసుకోగలిగాను. ఇలాంటి సెన్సిటివ్ అంశాలపై రచనలు చేయాలని అనుకుంటున్నా. ఇక్కడ చాలా నేర్చుకున్నా. - అనూష, ఇంటర్ ఫస్టియర్ సెల్ఫ్ డిస్కవరీతో... పుట్టుకతోనే అంధురాలిని. 14 ఏళ్లనుంచే తెలుగు, ఇంగ్లిష్‌లో కథలు, కవితలు రాస్తున్నాను. ఇఫ్లూలో ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసి ఇప్పుడు ఇంగ్లిష్ సాహిత్యంలో పీహెచ్డీ చేస్తున్నాను. నేను రాసిన ఎన్నో కథలు, కవితలు, వ్యాసాలు పత్రికల్లో అచ్చయ్యాయి. విజన్ వాయిస్ సాఫ్ట్వేర్తోకంప్యూటర్లో రాస్తుంటాను. నాలాంటి అంధులు, డిజేబుల్డ్ పర్సన్స్‌లో ఉండేసెల్ఫ్ డిస్కవరీతో ఎక్కువ రచనలు చేయొచ్చు. ఈ మధ్యే ఓ నవల రాయడం ప్రారంభించా. ఒక గ్రామీణ మహిళ కొత్త ప్రపంచంలోకి వెళితే ఎలా ఉంటుంది అనే అంశంపై. సగం పూర్తయింది. దీన్ని పుస్తక రూపంలో తీసుకురావాలని ఉంది. - జోత్స్న ఫణిజా, రచయిత్రి యువ రచయితలను ప్రోత్సహించాలని... యువ రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మూడేళ్లుగా రైటర్స్ కార్నివాల్ నిర్వహిస్తున్నాం. ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్. ఈసారి అంధులు, ట్రాన్స్ జెండర్స్తోపాటు కామెడీ అంశాలను చేర్చాం. గతంలోలాగే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఉత్సాహంతో వచ్చే సంవత్సరం కూడా కండక్ట్ చేస్తాం. అయితే తెలుగు రచయితల కోసం ప్రత్యేక కార్నివాల్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. - నివే దిత, నివాసిని పబ్లిషర్స్, కార్నివాల్ నిర్వాహకురాలు -
మనసు చేసిన మోసం
యాకూబ్, శిలాలోలిత - నువ్వు-నేను The goal of marriage is not to think alike, but to think together.. అంటాడు రాబర్ట్ డాడ్స్! కవి యాకూబ్, కవయిత్రి శిలాలోలిత అలాంటి జంటే! ఇద్దరి కుటుంబ నేపథ్యాల నుంచి వాళ్ల ఆలోచనా విధానం దాకా అన్నిట్లో వ్యత్యాసమే! అయినా అన్యోన్యత అనే లక్షణాన్ని వీడలేదు వాళ్ల కాపురం! ..:: సరస్వతి రమ కాంచ్ కభీ ఝూట్ నహీ బోల్తా.. ఔర్ పర్ఛాయా కభీ సాథ్ నహీ ఛోడ్తీ అన్నట్టుగా అంతరాలను సరిదిద్దుకునేటప్పుడు ఈ ఇద్దరు ఒకరికొకరు ప్రతిబింబంలా ఉంటారు. క్లిష్ట సమయాల్లో ఒకరికొకరు నీడలా తోడవుతారు! వాళ్ల పాతికేళ్ల పెళ్లి ప్రయాణంలో ఆ ఆలుమొగల మధ్య ఏర్పడిన అవగాహన అది. మూడుముళ్లు, ఏడు అడుగుల ఈ కథ ఎలా మొదలైందంటే.. మసాబ్‌ట్యాంక్ తెలుగు పండిత్ ట్రైనింగ్ క్లాసెస్‌లో.. ‘మా క్లాస్‌లో అరవై మంది అమ్మాయిల్లో.. లక్ష్మే.. అంటే ఎవరో కాదు ఈమే. హుందాగా, గంభీరంగా ఉండేది. లెక్చరర్స్ కూడా తనని లక్ష్మిగారూ.. అని పిలిచేవారు. నేనూ గౌరవంగా చూసేవాడిని’ అని తన ప్రేమ పరిచయాన్ని యాకూబ్ ప్రస్తావించారు. ‘నాకూ యాకూబ్ అంటే ప్రత్యేక అభిమానం ఉండేది. చక్కగా పాటలు పాడేవాడు. ఎంత బాధ ఉన్నా మనసులోనే పెట్టుకొని అందరితో సరదాగా ఉండేవాడు’ శిలాలోలిత అంటుంటే ‘తను బాధ అంది కదా.. అది ఆకలి బాధ.. తన కోసం తెచ్చుకున్న లంచ్ బాక్స్‌ని నాకు ఇచ్చేది’ పూర్తి చేశారు ఆయన. చిరునవ్వుతో సరిపెట్టారు ఆమె. ‘తనతో పాటు అప్పుడప్పుడు సాందీప్ అనే నాలుగేళ్ల పిల్లాడిని కాలేజ్‌కి తెస్తుండేది. వాడితో కూడా మంచి స్నేహం ఏర్పడింది. ఎంతలా అంటే వాడి కోసమే ఈమెతో మాటలు కలిపేంతగా’ చెప్పారు యాకూబ్. ప్రేమను బయటపెట్టుకున్నదెప్పుడు? ‘కొన్నాళ్లు పాటలు ఇచ్చి లంచ్‌బాక్స్‌లు పుచ్చుకునే వ్యవహారం నడుస్తుండగా.. ఒకరోజు ‘మీతో ఒక విషయం మాట్లాడాలి రేపు చాచానెహ్రూ పార్క్‌కి రండి’ అని చెప్పి వెళ్లిపోయింది. మనసులో నాకు ఒకటే గుబులు. నాకు తెలిసీ నేనేం అనలేదు. మర్యాదగా ప్రవర్తించాను. ఏం మాట్లాడుతుందో ఏమో సరే వెళ్లనయితే వెళ్దాం’ అని డిసైడ్ అయిపోయా’ చెప్పారు యాకూబ్. మనసు చేసిన మోసం ‘తెల్లవారి పార్క్‌లో కలుసుకున్నాం’ యాకూబ్. ఏం చెప్పారు అన్న ప్రశ్నకు ‘నా మనసులో ఉన్నదంతా చెప్పాను’ ముక్తసరిగానే అన్నారు శిలాలోలిత. మనసులో ఏం ఉండింది అని రెట్టిస్తే ‘నన్ను మీరు ఇష్టపడుతున్నారల్లే ఉంది. కానీ అది కుదరదు. నాకు పదకొండో ఏటే పెళ్లయింది. ఓ బాబు పుట్టాక విడాకులు కూడా అయ్యాయి. అప్పుడప్పుడూ నా వెంట వచ్చే సాందీప్ నా కొడుకే. కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కుదరదు. అలాంటి ఆలోచన ఉంటే మరచిపోండి’ అని చెప్పాను. ‘ఆ మాటలు విని ముందు ఆశ్చర్యపోయా. తన గతం విని కాదు. తనకు నాపై అలాంటి అపోహ ఏర్పడ్డందుకు. లక్ష్మిగారు.. మీపై నాకలాంటి ఉద్దేశం లేదు. మీకలా అనిపిస్తే సారీ’ అన్నాను’’ యాకూబ్ చెప్తుంటే ‘అందుకే దాన్ని మనసు చేసిన మోసం అంటాను’ అన్నారు శిలాలోలిత. ‘కానీ ఆ రోజు నుంచి లక్ష్మి మీద మరింత గౌరవం పెరిగింది. తను నాకన్నా ఆరేళ్లు పెద్ద. ఆమె వ్యక్తిత్వం ముందు ఆ బేధాలన్నీ బలాదూరయ్యాయి. సాందీప్‌కి నాకూ మధ్య అనుబంధమూ బలపడటం మొదలైంది. బహుశా అది ప్రేమ కావచ్చు’ యాకూబ్. ‘కానీ, టీపీటీ ట్రైనింగ్ అయిపోయే వరకూ బయటపడలేదు. ఎంఫిల్కి ఇద్దరం రాజమండ్రి వెళ్లాం. అక్కడ గోదావరి తీరం, సాహిత్య పరిచయాలు, కవి సమ్మేళనాలు.. మమ్మల్ని మరింత దగ్గర చేశాయి. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి తెచ్చాయ్’ శిలాలోలిత. పెళ్లికి పెద్దల అంగీకారం? ‘నేను కేఎల్, దుర్గమ్మ దంపతులకు ఒకరకంగా దత్తపుత్రుడిని. నా మంచిచెడ్డలన్నీ వాళ్లే చూశారు. ఈమెతో పెళ్లికూడా దుర్గమ్మ గారి అంగీకారంతోనే జరిగింది’ అని యాకూబ్ చెప్తుంటే ‘తను ముస్లిం అని మా నాన్న అభ్యంతరపెట్టారు. ‘మొదటి పెళ్లి మీ ఇష్టప్రకారం చేశారు. ఏమైంది? అందుకే ఇప్పుడు నాకు నచ్చిన వ్యక్తిని చేసుకోనివ్వండి’ అని కాస్త కఠినంగానే చెప్పాను. ఒప్పుకున్నారు’ అని గతం గుర్తుచేసుకున్నారు ఆమె. ‘పెళ్లయ్యాక కాపురానికి వస్తుంటే వీళ్ల నాన్న సాందీప్ మాతోనే ఉంటాడు’ అన్నాడు. వీల్లేదు. మాతో ఉండాల్సిందే’ అన్నాను. నిజానికి నేను ఈవిడను పెళ్లాడింది వాడికోసమే’ చెప్పారు యాకూబ్. మరి పెళ్లితర్వాత గొడవలు, అలకలు..? ‘మాదంతా బాధ్యతల పంపకమే. గొడవలు, అలకలు అంతగా లేవు’యాకూబ్. సాందీప్ విషయంలో ఆయన కర్తవ్యాన్ని ఎలా మరిచిపోలేదో.. యాకూబ్ వాళ్లింటి విషయంలో నా బాధ్యతనూ నేను మరచిపోలేదు. చాన్నాళ్లు ఇద్దరికీ ప్రైవేట్ ఉద్యోగాలే. నాలుగు నాలుగు కాలేజీల్లో పాఠాలు చెప్పేవాళ్లం. ఇంట్లో మాతోపాటు ఆరుగురు పిల్లలు (వాళ్లన్నయ్య పిల్లల్నీ ఇక్కడకు తెచ్చేసుకున్నాం చదువుల కోసం).. మా శక్తికి మించి బాధ్యతలను మోసినా నేనెప్పుడూ మానసిక వ్యథను అనుభవించలేదు. యాకూబ్ నా పక్కనున్నాడన్న ధైర్యం నాది’ అని ఆమె, ‘లక్ష్మి నాకు తోడుందన్న గర్వం నాకుండేది’ ముగించారు యాకూబ్. కల్చరల్ డిఫరెన్సెస్.. ‘మా ఇద్దరి మధ్య ఎప్పుడూ రాలేదు’ అంటారిద్దరూ. ‘యాకూబ్‌కి ఇల్లు నీట్‌గా ఉండడం ఇష్టం’ అని ఆమె అంటుంటే ‘హౌస్ కీపింగ్‌లో ఆమె వీక్. నేను స్ట్రాంగ్’ అని ఆయన. ‘యాకూబ్ అందరినీ ఇట్టే నమ్మేస్తాడు’ అని అతని బలహీనత చెప్పారామె. ‘అర్హులకే సహాయం చేయాలంటుంది ఆమె’ అంటూ తన బలహీనతను సర్దిచెప్పుకున్నారు ఆయన. కవిత్వంలో విమర్శలు.. ‘పెద్ద వ్యాక్యాలు రాస్తుంది’ అని ఆయన, ‘అది నా శైలి’ అని ఆమె.. ‘సరిదిద్దితే.. నా రాతనే మార్చేశాక ఇది నాది ఎందుకవుతుంది నీదే’ అంటూ పడేసి వెళ్లిపోతుంది. వ్యాసాలు బాగా రాస్తుంది’ అని ఆయన ప్రశంస, ‘పాటలు అద్భుతంగా పాడ్తాడు’ అని ఆమె ప్రశంస. ‘నా తీరని కోరిక తనతో సారీ చెప్పించుకోవాలని’ అని ఆయన.. ‘నా తప్పులేంది సారీ అస్సలు చెప్పను ’ అని ఆమె.. మొత్తానికి ఇద్దరి మధ్యకు వచ్చే ఏ వాదనైనా చివరకు వాళ్ల అన్యోన్యతను చూసి తప్పుకొనైనా వెళ్తుంది లేదంటే ఇద్దరూ ఒకే మాటమీదకు వచ్చే అద్భుతమైన కన్క్లూజనైనా ఇస్తుంది! ఇదీ కుల మత వయసులకతీతమైన యాకూబ్, శిలాలోలితల ప్రేమబంధం! -
పోతన పోతబోసిన పద్యచిత్రమిదిగో!
అహములు సన్నములయ్యె దహనము హితమయ్యే దీర్ఘదశలయ్యె నిశల్, బహు శీతోపేతంబై ‘యుహు హుహు’ అని వడకె లోకముర్వీనాథా! పద్యానవనం మల్టీ మీడియా లేని రోజుల్లోనూ భావ వ్యక్తీకరణకు భాషను అద్భుత సాధనంగా వాడుకున్నారు ఒకప్పటి కవులు. అది కూడా, చంధోబద్దమైన పద్య రూపంలో అరమరికలు లేకుండా అటువంటి వ్యక్తీకరణ జరపడం విశేషం. తెలుగు భాషపై వారి సాధికారతకదొక చిహ్నం. భాషను ఉపకరణంగా వాడిని కవులంతా అంతటి ప్రతిభావంతులని చెప్పలేమేమో కాని, కొందరు మాత్రం భాషతో ఆడుకున్నారంటే అతిశయోక్తి కాదు. చంధస్సు, వ్యాకరణ నియమాలేవీ వారి వ్యక్తీకరణకు ప్రతిబంధకాలు కాలేదు. ఒక సన్నివేశాన్ని, ఓ సందర్భాన్ని, ఓ పరిస్థితిని యథాతథంగా కళ్లకు కట్టినట్టు వివరించడంలో దిట్ట బమ్మెర పోతన. అది కూడా అలతి అలతి పదాలతో, అతి తక్కువ మాటల్లో ఎంతో భావాన్ని నింపి పద్య విన్యాసం చేయించగలిగారాయన. శబ్ద పరంగా, అర్థపరంగా భాషపై సాధికారతే కాకుండా భావంపైన పూర్తి నియంత్రణ సాధించిన మహాకవి పోతన. ‘పలికెడిది భాగవతమట, పలికించెడు విభుడు రామభద్రుండట, పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా?’ అన్న పద్యం నుంచి మొదలెడితే, శ్రీమద్భాగవతంలో ఆయన చెక్కిన అద్భుత పద్యశిల్పాలెన్నో! అయిదు వందల సంవత్సరాల తర్వాత నేటికి కూడా చెవుల్లో రింగుమనే, కంగుమనిపించే, గిలిగింతలు పెట్టే అత్యద్భుత పద్యరత్నాలకు లెక్కేలేదు. భక్తి, ఆధ్యాత్మిక భావనల్ని ప్రేరేపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా! ఆబాలగోపాలాన్నీ రంజింపజేసిన యశోదకృష్ణం, రుక్మిణీకళ్యాణం, గజేంద్రమోక్షం, భక్తప్రహ్లాదం... ఇలా చెప్పుకుంటూ పోతే భాగవతమంతా చెప్పాల్సిందే! అతిశయోక్తులు కూడా అతికినట్టు నిజమని భ్రమ కల్పించేంతటి సహజకవి పోతన. పోతన కావ్య సౌందర్య గొప్పదనాన్ని వర్ణిస్తూ డా.సి.నారాయణరెడ్డి ఒక అతిశయోక్తి చెప్పినా ‘నిజమా!’ అన్న భ్రాంతి కలుగుతుందే తప్ప శంకించబుద్ధికాదు. సినారె రాసిన ‘మందారమకరందాలు’ విమర్శ వ్యాసంలో, పోతనకు ఇంగ్లిష్ వచ్చేమో? అని అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. గజేంద్ర మోక్ష ఘట్టంలో, ఎన్నో జన్మలనుంచి పూజిస్తున్న తాను, కష్టకాలమొచ్చి ఎంత మొరపెట్టుకున్నా విష్ణువు రాకపోతే, ‘లా(ఔఅగి)ఒక్కింతయు లేదు...’ అని గజేంద్రుడు విష్ణుమూర్తిని నిలదీశాడని పోతన రాశాడేమో? అన్న చమత్కార అన్వయం చెప్పారు. ఇప్పుడంటే మల్టీమీడియా వచ్చింది. శబ్దం, దృశ్యం కలగలిసి ఏకకాలంలో వినగలిగి, చూడగలిగే అంటే చూపగలిగే మాద్యమాలొచ్చాయి. అప్పుడు లేవు. ఏం చెప్పినా, ఏం చూపించినా, ఏం వినిపించినా.... అన్నీ అక్షరాల్లోనే, ఆ తాటాకులపైనే! చెప్పదలచుకున్న వాడెవడూ వినదలచుకున్న, చదువదలచుకున్న వాడి దగ్గర అన్ని వేళలా ఉండడు, అదొక అసౌకర్యం. ఒకోసారి అది తరాల అంతరాల వ్యవహారం. దాన్ని అధిగమించడానికి పద్యంలోనే వర్ణచిత్రాల్ని శబ్దాలతో సహా ఆవిష్కరించాలి. పోతన అదే చేశాడు. చలి కాలాన్ని ముచ్చటగా చెప్పాడు. పగటి సమయాలు నిడివి తగ్గి పొట్టిగా అయ్యాయట. రాత్రి సమయాలు సుదీర్ఘంగా సాగాయట. మంట కాచుకోవడం జనాలకి చాలా ప్రీతిపాత్రమయిందట. చలి చాలా తీవ్రమైపోయి లోకమంతా వణుకుతోందట. ఎలా వణుకుతోంది? గజగజమని చెప్పటం సహజం. కానీ ఇక్కడ పోతన, ఓ రాజా, లోకమంతా ‘యుహు హుహు’ అని వణుకుతోందని చెబుతాడు. చలికాలం రాగానే, వయసులతో నిమిత్తం లేకుండా దవడలు కదిలిస్తూ, యుహు హుహు అని శబ్దం చేస్తూ వణకని వారుండరేమో? మనం కొంచెం విశ్లేషిస్తే నాటి కవుల గొప్పదనం తేటతెల్లమవుతుంది. లోతుగా పరిశీలిస్తే మన తెలుగు గొప్పతనమది. తెలుగు భాషామతల్లీ! పది కాలాలు వర్ధిల్లు! - దిలీప్‌రెడ్డి -
తెలంగాణ జీవద్భాషను చూపిన ‘ఇత్తు’ కథలు...
మహోజ్వలంగా సాగిన తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాహిత్యానికి కొత్త చూపుని, వెలుగుని ఇచ్చింది. కొత్త కలాలు కదం తొక్కాయి. కేవలం కవులు, కళాకారులు మాత్రమే కాదు కథకులు కూడా తెలంగాణ జీవన చిత్రపు కాంతిపుంజాల్ని, చీకటి దారుల్ని వెతికి పట్టుకునే ప్రయత్నం చేశారు. అలాంటి కథకులలో ఒకరయిన కోట్ల వనజాత రాసిన కథలు ఇవి. ‘ఇత్తు’ సంకలనం కథలలో వలస బతుకులోని విషాదమోహనం విన్పిస్తుంది. నగర జీవితపు కాఠిన్యం కన్పిస్తుంది. మార్కెట్లోని అన్ని సరుకుల్లాగా స్త్రీ శరీరం కూడా ఈరోజు మార్కెట్ సరుకయిపోయిందన్న దుఃఖపు సెగ మనల్ని తాకుతుంది. తెలంగాణా కోసం బలిదానమిచ్చిన పిల్లల తల్లుల గర్భశోకం మనల్ని కలతపెడుతుంది. సహజ సిద్ధమయిన తెలంగాణ నుడికారం, తెలంగాణ జీవద్భాష ఈ కథల్ని మౌఖిక సంప్రదాయంలో చెప్పినట్టుగా అన్పిస్తాయి. కథలలో వాతావరణ చిత్రణ కనిపించని ప్రాణవాయువులా ఆవరించి ఉంటుంది. కొన్ని కథలలోని పాత్రలు పాఠకుణ్ని వెంటాడతాయి. ‘ఇత్తు’ కథలో హైబ్రిడ్ విత్తనాలు రైతుని నిలువునా ఎలా ముంచేస్తున్నాయో చెబుతూ ప్రధాన పాత్రధారి అరుణ ‘ఇత్తు చేసిన మాయను ఈశ్వరుడన్నా పట్టలేకపోయనే’ అని దుఃఖిస్తుంది. శపించిన జీవితాన్ని ఎదిరించి మగాడై వ్యవసాయాన్ని చేసిన అరుణక్క ఒక హాస్టల్లో గిన్నెలు కడిగే పనికి కుదురుకోవడం నేటి విషాదం. వాచ్మెన్లుగా, సెక్యూరిటీ గార్డులుగా మారిపోయిన రైతన్నలు కళ్లముందాడతారు. బొంబాయి వలస వెళ్లిన భార్యాభర్తల్లో భార్య మరణిస్తే దహన సంస్కారాలకు ఖర్చులేక శవాన్ని సముద్రం పాలు చేయటం పెను విషాదంలా మనల్ని తాకుతుంది ‘సముద్రం’ కథలో. మగాళ్ళే కాదు ఆడవారిలో కూడా కఠినాత్ములుంటారని చూపుతూ అభం శుభం తెలియని గిరిజన పిల్లల్ని తమ అవసరాలకు ఉపయోగించుకునే ఓ స్త్రీ బండారం బయటపెడుతుంది ‘తార్నామ్ కాయిచోరి’ కథ. మనసుని పిండేసే కథ. అవినీతి భరతం పట్టాలి అని అందరూ అంటారు కానీ, అవినీతి బహుముఖానికి బలయ్యే అమాయకులు వున్నారని చెబుతారు రచయిత్రి ‘బహుముఖం’ కథలో. అవినీతిని అరికడదామనే వారు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలా వుంటుందో చెప్పే మంచికథ ‘రాజన్న’ కథ. ముఖ్యంగా బలిదానం చేసుకున్న పిల్లల తల్లుల గర్భశోకానికి చలించిపోయిన రచయిత్రి చిందించిన దుఃఖాశ్రువుల అక్షర రూపమీ కథ. ఈ సంకనంలోని ఎక్కువ భాగం కథలు కుటుంబ పోషణ చేస్తూనే వేలెత్తి చూపే సమాజానికి తలొగ్గుతూ సాగే స్త్రీల పక్షాన నిలుస్తాయి. వారి గురించి ఆలోచించమన్న తపన కథల్లో విస్తరించి వుంటుంది. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డిని కన్న నేల మీద (వారిది మహబూబ్‌నగర్ జిల్లా) మెట్టినందుకు గర్వంగా వుంది అని వినయంగా చెబుతారు రచయిత్రి వనజాత. ఈ కథల్ని చదివిన తర్వాత దుఃఖపు పొరేదో మనల్ని ఆవరిస్తుంది. మనకుండే ఒకే ఒక్క జన్మలో మనుషులు ఇంత నిర్దయగా ఎలా వుంటారన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఒక మేలయిన, మెరుగయిన సమాజం జీవం పోసుకోవాలన్న ఆశ చిగురిస్తుంది. - సి.ఎస్.రాంబాబు -
సాంస్కృతిక తెలంగాణే లక్ష్యం
తెలంగాణ రచయితల సంఘం సభలో వక్తల పిలుపు హైదరాబాద్: సంపూర్ణ సాంస్కృతిక తెలంగాణ ఏర్పాటు లక్ష్యంతో తెలంగాణ రచయితల సంఘం ఏర్పడిందని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తెలిపారు. తెలంగాణ రచయితల సంఘం ప్రారంభ సభ ఆదివారం (జీవగడ్డ విజయ్‌కుమార్ హాల్) ఎస్.సి.ఈ.ఆర్.టీ.లో జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినంత మాత్రాన సరిపోదని, నేడు సంపూర్ణ సాంసృ్కతిక తెలంగాణ నిర్మాణం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అందుకు కవులు, రచయితలు, కళాకారులను ఏకతాటి మీద నడిపించేందుకే తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు అవసరమొచ్చిందని తెలిపారు. పల్లె నాలుకల మీద మూలకు పడివున్న జాతీయాలను, సామెతలను సేకరించి కొత్త సోయగాలను అద్ది, తెలంగాణ భాషను సుసంపన్నం చేసుకోవడం నేటి కవుల కర్తవ్యమని అన్నారు. సభను ప్రముఖ ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య తన పాట ద్వారా ప్రారంభించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఏ ప్రాంతంలో లేని కవులు, కళాకారులు, రచయితలు మన ప్రాంతంలో ఉన్నారని, దీనికి కారణం ఇక్కడ జరిగిన అనేక ప్రజా ఉద్యమాలే అని అన్నారు. ఇక్కడ ఉన్న సాహితీ సంపద మరెక్కడా లేదన్నారు. తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ వలసవాద దోపిడీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది వచన కవిత్వం, పాటేనని తెలిపారు. ఈ సభలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్‌రెడ్డి, టీయూ డబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, వి.శంకర్ ప్రసంగించారు. సంఘం అధ్యక్షుడిగా నందిని సిధారెడ్డి తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా నందిని సిధారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వి. శంకర్, కోశాధికారిగా దాస్యం సేనాధిపతితో పాటు ఐదుగురిని సహాయ కార్యదర్శులుగా, ఐదుగురిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా నలుగురితో పాటు ముఖ్య సలహాదారులు దేశపతి శ్రీనివాస్, వేణుగోపాలస్వామి, ఏ.శ్రీధర్‌లు ఎన్నికైనట్లు సిధారెడ్డి ప్రకటించారు. -
వేగం, తేజం కొప్పరపు కవుల సొంతం
ఎనిమిది సెకన్లలో ఒక పద్యాన్ని ఆశువుగా సృష్టించడం... అది కూడా ‘నీలాంబుజారామ కేళీమరాళమై’... వంటి ప్రబంధతుల్యమైన పద్యాలను అప్పటికప్పుడు గుప్పించడం కొప్పరపు కవుల గొప్పతనం. ప్రకాశం జిల్లా మార్టూరులో ఒకసారి అరగంట వ్యవధిలో మూడు వందల అరవై పద్యాలతో మనుచరిత్ర ప్రబంధాన్ని కొప్పరపు కవులు ఆశువుగా చెప్పారు. అది అల్లసాని వారు రచించిన మనుచరిత్ర కాదు. కొప్పరపు వారు అప్పటికప్పుడు అల్లిన కావ్యరాజం. గుంటూరులో పాటిబండ్ల వారింట్లో భోజనం చేసే సమయంలోనే మూడు శతకాలు ఆంజనేయస్వామిపై చెప్పారు. వీరవాసరంలో చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు అధ్యక్షత వహించిన ఒక సాహిత్య సభలో మూడు గంటల్లో నాలుగు వందలకు పైగా పద్యాలతో ‘శకుంతల కథ’ను అద్భుతమైన ప్రబంధవర్ణనలతో పూర్తి చేశారు. కొమరరాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి సమక్షాన నిర్వహించిన సభలో గంటలో నాలుగు వందల ఎనభై పద్యాలు చెప్పారు. గన్నవరంలో జార్జ్ ద ఫిఫ్త్ కారోనేషన్ హాల్ అనే పేరుతో నిర్మించిన టౌన్‌హాల్ వార్షికోత్సవం జరిగింది. ఆ సభలో షేక్స్పియర్ రచించిన సింబలిస్ నాటకాన్ని గంటన్నర కాలంలో నాలుగు వందల పద్యాలతో ఆశువుగా సృష్టించారు. ఇటువంటి సంఘటనలు కొప్పరపు వారి ఆశుకవితా ప్రస్థానంలో ఎన్నోసార్లు జరిగాయి. సభాస్థలిలో ఎప్పుడు ఎవరు ఏ కథను ఇచ్చి దానిని కావ్యంగా మలచమన్నా ఉన్న తడవున వందల పద్యాలతో ఆశువుగా చెప్పడం ఆ కొప్పరపు కవులకే చెల్లింది. ఒక్కరోజు వ్యవధిలోనే రెండేసి శతావధానాలు చేయడం, గంటకొక ప్రబంధాన్ని ఆశువుగా సృష్టించడం ప్రపంచ సాహిత్యంలో అత్యాశ్చర్యకరమైన ప్రతిభ. గద్వాల్ నుండి మద్రాసు వరకు వీరి అవధాన, అశుకవిత్వ సభలు కొన్ని వందలు జరిగాయి. గజారోహణ. గండపెండేర సత్కారాలు, బిరుదభూషణ వరప్రసాదాలు కొల్లలుగా జరిగాయి. అయితే అనేక సందర్భాల్లో వీరు ఆశువుగా చెప్పిన వేలాది పద్యాలు రికార్డు కాకపోవడం, వీరు చిన్నవయసులోనే మరణించడం వల్ల గ్రంథస్థం కాకపోవడంతో ఆ సారస్వత సంపదని మనం సంపూర్ణంగా పొందలేకపోతున్నాం. కొప్పరపు కవులు దైవసంకల్పమ్, సాధ్వీమాహాత్మ్యమ్, శ్రీకృష్ణ కరుణా ప్రభావం, దీక్షిత స్తోత్రమ్, నారాయణాస్త్రం, సుబ్బరాయ శతకం.. మొదలైన రచనలు చేశారు. నేడు కొన్ని అవధాన పద్యాలు, దైవ సంకల్పమ్, సుబ్బరాయ శతకం అందుబాటులో ఉన్నాయి. ఆ కాసిన్ని పద్యాలను కవితా తీర్థంలా భారతీప్రసాదంలా భావించాల్సి వస్తోంది. కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని, విమలానంద భారతీస్వామి, వేదం వెంకటరాయశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, జయంతి రామయ్య పంతులు, కాశీ కృష్ణాచార్యులు, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, తుమ్మల సీతారామ్మూర్తి చౌదరి... వీరంతా కొప్పరపు కవుల సభల్లో ప్రత్యక్షంగా పాల్గొని వారి ప్రతిభను చూసి పరవశించి ప్రశంసించినవారే. ఇక తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవుల మధ్య జరిగిన వివాదాలు ఆనాడు పెను సంచలనాలు. నాటి పత్రికల్లో ఈ వార్తలు ప్రధాన శీర్షికలుగా అల్లరి చేశాయి. ఈ రెండు జంటల మధ్య సాగిన పోరులో మహాద్భుతమైన పద్యాల సృష్టి జరిగింది. వారి వివాదం సాహిత్యలోకానికి షడ్రశోపేతమైన సారస్వత విందులను అందించింది. అయితే ఆ తర్వాతి కాలంలో ఆ తగాదాలు సమసిపోయాయి. ఆ రెండు జంటలూ అభేద్య కవితా స్వరూపాలుగా ముందుకు సాగాయి. కొప్పరపు కవులుగా ప్రఖ్యాతులైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి (1885 - 1932), కొప్పరపు వేంకట రమణ కవి (1887-1942) గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ఉన్న కొప్పరం వాస్తవ్యులు. వీరిది కవి వంశం. ఆంధ్ర సాహితీ చరిత్రలోనే ఆశుకవిత్వంలో వీరిదే అగ్రస్థానం. తెలుగువారికే సొంతమైన అవధానప్రక్రియలో అసమాన కవివీరులుగా నిలిచిన కొప్పరపు కవులు తరతరాలకు స్ఫూర్తిప్రదాతలు. వీరి చరిత్ర రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు పాఠ్యాంశాలలో చేర్పించి, తెలుగు తేజాన్ని తరతరాలకు అందించే ప్రక్రియ ప్రభుత్వాలు చేపట్టాలని ఆకాంక్షిద్దాం. - మా శర్మ (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, కొప్పరపు కవుల కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29న గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా కొప్పరపు కవుల జయంతి మహోత్సవము జరుగుతున్న సందర్భంగా) -
నేనూ ఖమ్మం కుర్రాణ్నే
‘మన కుర్రాళ్లు’ మ్యూజిక్ డెరైక్టర్ భీమ్స్ ఖమ్మం : ‘విప్లవాల పురటి గడ్డ, కవులు, గాయకులు, కళాకారులకు జన్మనిచ్చిన ఖమ్మంలో పుట్టినందుకు గర్వపడుతున్నా’ అంటున్నారు ‘మన కుర్రాళ్లు’ చిత్రం సంగీత దర్శకుడు, సినీ పాటల రచయిత భీమ్స్. తానూ ఖమ్మం కుర్రాణ్నేనని తెలిపారు. నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరుగుతున్న ఇంప్యాక్ట్ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బయ్యారం మండల కేంద్రానికి చెందిన తానకు చిన్నతనం నుంచే పాటలు పాడటం, రాయడం ఇష్టమన్నారు. ఇదే తనను కళాకారులు, సాహితీవేత్తలకు దగ్గర చేసిందని తెలిపారు. హాస్టల్ వార్డెన్ సీతారాములు ప్రోత్సాహంతో పాటలు రాయడం మొదలెట్టానన్నారు. ‘శ్రావణ మాసం’ చిత్రంలో ‘నీ కంచెర జుంపాలు చూసి సైదులు....’ ‘ఆయుధం’లో ‘ఓయ్ రాజూ..’ ‘సీమ టపాకాయలు’లో ‘దీరే ధీరే.. దిల్లే..’ పాటలు మంచి గుర్తింపునిచ్చాయని అన్నారు. త్వరలో విడుదల కానున్న సినిమాలు ‘మన కుర్రాళ్లు’, ‘అలా..ఎలా..?’ సినిమాలకు పాటలు రాసి మ్యూజిక్ డెరైక్టర్‌గా పనిచేశానని అన్నారు. ఇప్పటి వరకు సినిమాల్లో అవకాశం ఇచ్చిన ఆయుధం సినిమా డెరైక్టర్ శంకర్, కరెంట్ తీగల డెరైక్టర్ నాగేశ్వరరెడ్డి, మన కుర్రాళ్ళు డెరైక్టర్ వీరశంకర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. -
గీతాలే ఉద్యమాన్ని గెలిపించాయి
సాక్షి, సిటీబ్యూరో: ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని సుభిక్షమైన నవతెలంగాణ నిర్మాణ ంలో కవులు, కళాకారులు భాగస్వాములు కావాలని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యవుంలో కళాకారులు, కవులు నిర్వహించిన పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సంపాదకీయంలో వెలువడిన ‘ఒక్కొక్క పాటేసి...’- తెలంగాణ నూటొక్క పోరు పాటలు.. పుస్తకాన్ని నగరంలోని ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో ఆదివారం సాయుంత్రం కవులు, కళాకారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయుణ వూట్లాడుతూ పాట వులి దశ తెలంగాణ ఉద్యవుంలో కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. సీనియుర్ సంపాదకులు కె. రావుచంద్రవుర్తి వూట్లాడుతూ తెలంగాణ కని పెంచిన కవులు ప్రపంచంలో ఎక్కడా కనిపించరని ... ఇక్కడి కవులు, కళాకారుల గొప్ప తనం, త్యాగనిరతిని కొనియూడారు. ఎమ్మెల్యే రసవురుు బాలకిషన్ వూట్లాడుతూ పాట ద్వారానే తాను అసెంబ్లీకి వెళ్లానని... ఆ పాటను ఎప్పటికీ వుర్చిపోలేనన్నారు. సభలో వూజీ ఎంపీ వుధుయూష్కి, ప్రొఫెసర్ జయుధీర్ తిరువులరావు, సంపాదకులు టంకశాల అశోక్, ప్రజా కవులు, కళాకారులు గద్దర్, గోరటి వెంకన్న, వివులక్క, అంద్శై సుద్దాల అశోక్ తేజ, అల్లం రాజయ్యు, జూలూరి గౌరీశంకర్, డాక్టర్ చెరుకు సుధాకర్, జగన్, దరువు ఎల్లన్న, వేణు సంకోజులు వూట్లాడారు. తెలంగాణ రిసోర్స్ సెంటర్ అధ్యక్షుడు వేదకువూర్ అధ్యక్షత జరిగిన ఈ సభలో గద్దర్, గోరటి వెంకన్న, వివులక్క, అంద్శైపలువురు కళాకారుల ఆట- పాటలు ఆకట్టుకున్నాయి. -
ఒక మంచి అనువాద నవల- అసురుడు
విజేతల గొంతు బలంగా, గర్వంగా, అతిశయంగా ఉంటుంది. వాళ్ల కథలు రాయడానికి, వినిపించడానికి కవులు, కథకులు బారులు తీరి ఉంటారు. గాయకులు, భజంత్రీలు, వందిమాగదులు సర్వదా విజేతల వెంట సిద్ధం. పరాజితుల గొంతు బలహీనంగా, దుఃఖంతో పెరపెరలాడుతూ ఉంటుంది. వాళ్ల కథలు ఎవరూ రాయరు. వాళ్లే రాసుకోవాలి. ‘అసురుడు’ నవల పరాజితుల గాథ. యుద్ధభూమిలో నిస్సహాయుడై ఎలుకలు తన కండరాలను నములుతుండగా మృత్యువు దేహంపై పురుగులా పారాడుతుండగా రావణుడు ఈ కథ చెబుతాడు. ఇది రావణుడి కథే కాదు. భద్రుడి కథ కూడా. భద్రుడు ఒక సామాన్యుడు. అనామకుడు. సాదాసీదా రైతు. భార్యాబిడ్డలతో పొలంలో పని చేసేవాడు. వర్షమొస్తే ఆనందంతో తడిసి, పంట పండితే ధాన్యపు బస్తాను బిడ్డను మోసుకొచ్చినట్టు మోసుకొచ్చే అమాయక రైతు. తాతలు తండ్రులలాగే కడుపు నింపుకోవడమే ఆశయంగా బతికే మామూలు మనిషి. అతనికి రాజ్యం తెలియదు. రాజులు తెలియరు. కానీ రాజ్యం ఎవరినీ అంత సులభంగా బతకనీయదు. ఎక్కడో మొదలైందనుకున్న యుద్ధం భద్రుడి నట్టింటికి వచ్చింది. రక్తపు మడుగులో భార్యాబిడ్డలు... అగ్నిజ్వాలల్లో ఇల్లు. పారిపోయాడు. కానీ ఎక్కడో ఒకచోట బతకాలి గదా. రావణుడి దగ్గర చేరాడు. రామాయణం మనకు కొత్తకాదు. రావణుడి వైపు నించి కథ వినడమే కొత్త. కూతురు సీత కొత్త. కూతురు సీత కోసం అతను పడిన క్షోభ కొత్త. అన్ని కాలాల్లోనూ మనుషుల అకారణ ప్రేమ అపవాదులకు దారి తీస్తుంది. అందుకే అతను నిందలు మోశాడు. ఈ కథలో మాయలు, అద్భుతాలు లేవు. అందరూ సాధారణ మనుషులే. పేదరికం నుంచి, అవమానాల నుంచి ఒక రాజుగా రావణుడు ఎదిగిన తీరు, కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని పొందిన తీరు అబ్బురపరుస్తాయి. రావణుడి గురించైనా మనకు ఎంతో కొంత తెలుసు. భద్రుడి గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే అతను పేదవాడు. తక్కువ కులం వాడు. అణగారిన వర్గాల సాహసం, శౌర్యం ఎవరికి గుర్తుంటాయి. యుద్ధంలో సామాన్యల ప్రాణదానాన్ని లిఖించేదెవరు. ఎంతో సాహసంతో రావణున్ని కాపాడితే కాసింత కృతజ్ఞత కూడా చూపడు. ఎందుకంటే భద్రుడు ఒక సేవకుడు. సైనికుడు. చరిత్ర పొరల్లో పూడికలో కలిసి పోవాల్సినవాడు. అతనికో పేరు, ఊరు ఉండాల్సిన అవసరం లేదు. రావణుడు రాజ్యం కోసం పోరాడితే భద్రుడు ఆత్మగౌరవ ప్రకటన కోసం పోరాడాడు. శతాబ్దాలుగా భద్రుడు రకరకాల మనుషులగా రూపాంతరం చెంది పోరాడుతూనే ఉన్నాడు. భద్రుడికి కృతజ్ఞత చూపే సంస్కారాన్ని ఇంకా రావణుడు అలవరచుకోలేదు. 464 పేజీల ఈ పుస్తకాన్ని మొదలుపెడితే ఆపలేం. ఇంగ్లిష్‌లో ఆనంద్ నీలకంఠన్ రాశారు. తెలుగులో ఆర్.శాంతసుందరి అనువాదం చేశారు. మూలంలోనే ఇంత బలముందా లేక అనువాదంలోనే బలముందా అనేంత గొప్పగా ఉంది. తెలుగులో ఇలాంటివి కనిపించవు. తెలుగు నవల ఆత్మహత్య చేసుకోవడానికి రచయితలే కారణం. నానా చెత్త రాయడంలో అది జబ్బు పడి మందులు మింగలేక ఉరిపోసుకుంది. ఈ పుస్తకం చదివితే నవల ఎలా రాయాలో తెలుస్తుంది. - జి.ఆర్.మహర్షి అసురుడు- ఆనంద్ నీలకంఠన్, అనువాదం: ఆర్.శాంత సుందరి ధర: 250, అన్ని పుస్తక కేంద్రాల్లో లభ్యం -
ఊహల ఉయ్యాల ఊసుల జంపాల
వివరం: బ్లాగ్ : రాధికకు తన చిన్ననాటి అనుభవాలు, ఆటలు గుర్తుచేసుకుని ఆ పాత జ్ఞాపకాలను తవ్వుకోవడం అంటే చాలా ఇష్టం. ఆ భావాలను అక్షర రూపంగా మార్చుకోవాలనుకుంటుంది. కవితలు రాసే అలవాటున్నా వాటిని పత్రికలవాళ్లు తిరిగి పంపిస్తున్నారు. తనలోని భావావేశాన్ని ప్రకటించుకోవడం ఎలా అని మధనపడుతూ ఉంటుంది. రమణ మంచి రచయిత. ఎన్నో రాయాలని ఉంటుంది కాని తను రాసినవన్నీ పత్రికలవాళ్లు అచ్చేయరు. దానితో అతనికి నిరాశే మిగులుతుంది. అశోక్ కొత్తగా విడుదలైన సినిమా చూసి చాలా ప్రభావితుడయ్యాడు. ఆ సినిమా గురించి చాలా మాటలు చెప్పాలని, స్నేహితులతో పంచుకోవాలని అనుకున్నాడు. కాని ఎలా? ఇలా రాయాలనే కోరిక ఉన్నవాళ్లకి, సాహిత్యం, భాష మీద అభిమానం ఉన్నవాళ్లకి తమ మనసులోని భావాలను, అభిరుచులను, ఆలోచనలను మరికొంతమందికి తెలియజేయాలనుకునేవారికి సరియైన వేదిక ‘బ్లాగు’. నేడు కంప్యూటర్, అంతర్జాలం (ఇంటర్నెట్) దాదాపు ఒక నిత్యావసర వస్తువుగా మారాయి. వారూ వీరూ అని కాకుండా ఉద్యోగస్తులు, విద్యార్థులు, విశ్రాంత ఉపాధ్యాయులు, మహిళలు చాలా విరివిగా వాడుతున్న అంతర్జాలంలో తమ తమ మాతృభాషలోనే చదువుకుంటూ, రాసుకునే అవకాశం ఉంది. అది కూడా ఎటువంటి ఖర్చు లేకుండానే. అచ్చ తెలుగులో చెప్పాలంటే బ్లాగు ఒక అచ్చుపత్రిక, ఆవకాయ నుండి అంతరిక్షం దాకా అన్ని విషయాలు ఇంట్లో నుండే ముచ్చటించుకునే అద్భుతమైన సాధనం అని కూడా చెప్పవచ్చు. అసలు ఈ బ్లాగు అంటే ఏమిటి? ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది? ప్రారంభం ఇంటర్నెట్ ప్రారంభం కాకముందే ఎలక్ట్రానిక్ సొసైటీలు ఉన్నాయి. అందులో ఒకటి హ్యామ్ రేడియో. బ్లాగులు ప్రారంభం కంటే ముందే యూజ్ నెట్, ఈమెయిల్ లిస్టులు, బులిటెన్ బోర్డులు మొదలైనవి వాడకంలో ఉండేవి. 1990లలో వెబ్ఎక్స్ లాంటి ఇంటర్నెట్ సాఫ్ట్వేర్లు నిరంతరంగా సాగుతూ ఉండే సంభాషణలకు అనువైన సాఫ్ట్‌వేర్‌ను సృష్టించాయి. 1994 లో కాలేజీ విద్యార్థి జస్టిస్ హాల్ని బ్లాగటం మొదలుపెట్టినవారిలో ఒకరిగా భావిస్తారు. తర్వాత 1997 సంవత్సరంలో జాన్ బార్జర్ మొదటిసారి వెబ్ లాగ్ (Weblog)అనే పదాన్ని ఉపయోగించాడు. కాలక్రమేణా ఆ పదం We blog అంటూ తర్వాత Blog గా క్రియాపదంగా స్థిరపడిపోయింది. అదే సమయంలో ప్రారంభమైన బ్లాగర్.కామ్ (2004 లో గూగుల్ సంస్థ దీనిని కొనుగోలు చేసింది) బ్లాగుల విస్తరణ, వినియోగాన్ని మరింత వేగవంతం చేసింది. 2003లో ఈ బ్లాగు అనే పదం నిఘంటువులలో చేరింది. బ్లాగు అనేది పర్సనల్ వెబ్సైట్ లాంటిదే. ఈ బ్లాగులకు కొత్త హంగులు చేర్చిన వ్యక్తి డేవ్ వైనర్. దీనికోసం ఆయన ఒక సర్వర్ సృష్టించాడు. ఎవరైనా బ్లాగరు తన బ్లాగులో మార్పులు, చేర్పులు చేయగానే ఈ సర్వరుకు తెలిసేది. బ్లాగులో బ్లాగ్ రోల్/ లిస్ట్, వ్యాఖ్యలు, విభాగాలు మొదలైన ముఖ్యమైన లింకులను తేలిగ్గా అమర్చుకునే వీలు కలిగింది. ఒకరి ఆధిపత్యంలో రాసే అవసరం లేకుండా బ్లాగు సొంతదారు నియంత్రణలోనే ఎవరి బ్లాగు వారు స్వేచ్ఛగా నిర్వహించుకునే అవకాశం కలిగింది. దానితో ఆయా బ్లాగులు వారి వ్యక్తిత్వాలను ప్రతిబింబించేవిగా ఉండేవి. Ritual Entertainmentసంస్థవారు 1997లో స్టీవ్ గిబ్సన్‌ను తమకోసం బ్లాగటానికి నియమించుకున్నారు. బహుశా అతనే మొదటి బ్లాగుద్యోగి అనవచ్చు. బ్లాగులను రాయడం వరకు బానే ఉంది కాని వాటిని వేరే వాళ్లతో పంచుకోవటానికి, చదవటానికి వాటిని ఇంటర్నెట్లో హోస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. 1997లో ash Dot, Live Journal, Pitas.comపేర్లతో పలు హోస్టింగ్ సైట్లు ప్రారంభమయ్యాయి. 1998లో ైఞ్ఛ ఈజ్చీటడ ప్రారంభమై వేలాది కొత్త బ్లాగులు లేదా ఓపన్ డైరీల సృష్టికి పునాది వేయడమే కాదు, బ్లాగులలో రాసిన రాతలు చదివినవారు తమ అభిప్రాయాలను కూడా చెప్పగలిగే వీలు కల్పించింది. ఇప్పుడు అధిక శాతం బ్లాగర్లు ఉపయోగిస్తున్న బ్లాగర్.కామ్‌ను Evan Williams, Meg Hourihanలు ఆగస్టు 1999లో ప్రారంభించారు. తర్వాత గూగుల్ సంస్థ దీనిని కొనుగోలు చేసింది. అలా బ్లాగులు మెల్లిగా విస్తరిస్తూ 1999 నుండి వేగం పుంజుకున్నాయి. అభిప్రాయాలు మాత్రమేనా?! బ్లాగులంటే కేవలం తమ అభిప్రాయాలను వెల్లడించడమే కాదు, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి దోషులను శిక్షపడేలా చేయడం కూడా అని మొదటి బ్లాగు వివాదం ‘ట్రెంట్ లాట్ పతనం’ నిరూపించింది. 1948లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీచేసిన సెనెటర్ Strom Thurmondగౌరవార్థం ఇచ్చిన ఓ విందులో మరో నాయకుడు Trent Lott థర్మండ్లోని నాయకత్వ లక్షణాల కారణంగా ఆయన అమెరికాకు ఒక ఉత్తమ అధ్యక్షుడు కాగలడని వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని పత్రికలవాళ్లు ప్రస్తావించకున్నా, ప్రజలు సహించలేకపోయారు. ఎందుకంటే థర్మండ్ తన రాజకీయ జీవితపు తొలినాళ్లలో తెల్ల జాత్యహంకారుల సానుభూతిపరుడుగా ఉండేవాడు. అందుకే అతనిని తీవ్రంగా ఖండించారు. తమ వాదనలకు సాక్ష్యాలను కూడా బ్లాగుల ద్వారా బయటపెట్టారు. ఆయన వ్యాఖ్యలు ఏదో పొరపాటున నోరుజారి చేసినవి కావని, లాట్ స్వతహాగానే జాతి దురహంకారి అని వాదిస్తూ ఆయన చేసిన మరికొన్ని ప్రసంగాలను, డాక్యుమెంట్లను వెలికితీసి వాటి గురించి తమ బ్లాగుల్లో రాశారు. ఈ వివాదం ముదిరి తీవ్రంగా మారడంతో ఒత్తిడి పెరిగి చివరికి సెనేట్ మెజారిటీ నాయకుడిగా లాట్ రాజీనామా చెయ్యవలసి వచ్చింది. ఇది ఏ పత్రికా విలేఖరి, సంస్థలకు తక్కువకాని విధంగా సామాన్య ప్రజలు తమ రాతలను, వ్యతిరేకతను బ్లాగుల ద్వారా సాధించిన విజయం. బ్లాగుల ద్వారా సాధించిన మరో విజయం Rather Gateకుంభకోణం. సీబీఎస్ వార్తాసంస్థలో 60 మినిట్స్ అనే టీవీ కార్యక్రమంలో Don Ratherఅనే జర్నలిస్టు అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ మిలిటరీ రికార్డులకు సంబంధించిన పత్రాలను చూపించాడు. కాని అవి నకిలీవని వాదిస్తూ, కొందరు బ్లాగర్లు తమ బ్లాగులలో రాశారు. దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా చూపించారు. దానితో వార్త ప్రసారమైన మూడు రోజుల్లోనే సీబీఎస్ సంస్థ బహిరంగంగా తమ తప్పును ఒప్పుకుని, క్షమాపణ చెప్పక తప్పలేదు. దీనితో బ్లాగు ఒక వ్యక్తిగత రచనలకు ఉపయోగించే పుస్తకంలా కాకుండా వార్తామాధ్యమంగా ఒక శక్తివంతమైన సాధనం అని కూడా అందరూ గుర్తించారు. వినియోగదారుల ఫిర్యాదులను వెలుగులోకి తీసుకువచ్చే పని కూడా బ్లాగుల ద్వారా చేయడం మొదలుపెట్టారు. ఇలా బ్లాగులు నడక మాని పరుగులు మొదలుపెట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం మొదలైంది. ఈ బ్లాగులను హోస్టింగ్ చేయడానికి ఉచితంగా ఎన్నో సైట్లు ఉన్నాయి. మనం తరచూ వాడే ్ఛఝ్చజీతో ఈ బ్లాగులను ప్రారంభించవచ్చు. అలాగే వెబ్‌లో బ్లాగులను నిక్షిప్తం చేసి ఆవిష్కరించడానికి ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. వాటిలో Blogger, Wordpress. Live journal Tumblr, Posterious... పేర్లతో నడుపబడుతున్న ఈ సైట్ల ద్వారా ఎవరైనా ఎక్కడున్నా తమ మాతృభాషలోనే బ్లాగులు మొదలుపెట్టి ఇష్టమున్నవన్నీ రాసుకోవచ్చు. వీటికి పైసా కూడా చెల్లించనక్కరలేదు. నిరాటంకంగా నడపాలి బ్లాగును నిరాటంకంగా నడపడం ఒక సరదా మాత్రమే కాదు, ఒక బాధ్యత. ఈ బ్లాగు వల్ల బోల్డు డబ్బు సంపాదించలేం, చాలామంది మందీమార్బలాన్ని సంపాదించలేం, మన రాతల వల్ల అందరినీ మార్చలేం. కానీ మన బ్లాగు వల్ల మనలో కలిగిన చిన్న మార్పు చాలు, ఇది విజయవంతమైనదని చెప్పుకోవడానికి. ఎందుకంటే మనం రాసేది ముందు మనకు ఉపయోగపడాలి. బ్లాగులు ప్రారంభమైనప్పటినుండి సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చినా; ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వచ్చినా బ్లాగులు తమ శోభను కోల్పోలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రముఖ భాషల్లో బ్లాగులు ప్రజ్వరిల్లుతున్నాయి. వెబ్సైట్లు ఏర్పాటు చేసుకోవడం సులువైనా కూడా బ్లాగులకున్న ప్రాధాన్యత, ప్రాముఖ్యత అస్సలు తరగలేదు. ఆసక్తి ఉన్నవాళ్లు తమ ఇంటి అడ్రెస్సు, ఫోన్ నంబర్లా బ్లాగు కూడా ఒక చిరునామాగా పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. మన దేశంలో 2004 నుండి బ్లాగులు విస్తరించడం ప్రారంభమైంది. అదే సమయంలో యూనీకోడ్ ఆవిష్కరణతో భారతీయ భాషలలో కంప్యూటర్లో టైప్ చేయడం చాలా సులువుగా మారింది. అప్పటినుండి బ్లాగులు ఒక ప్రభంజనంలా విస్తరించాయి. 2004లో మొదలైన తెలుగు యూనీకోడ్ అంతర్జాల విప్లవం బ్లాగుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది తెలుగువారిని మరింత దగ్గరగా చేసింది. బ్లాగులు రాసేవాళ్లే బ్లాగులు, వికీపీడియా, తెలుగు టైపింగ్ మొదలైన అంశాల మీద ప్రింట్ పత్రికలలో వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. టీవీలలో చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. దీనితో తెలుగు బ్లాగులు మరింత వేగంగా వ్యాపించాయి. వివిధ సాఫ్ట్వేర్ల ద్వారా తెలుగు చదవడం, రాయడం సులభతరమైన తర్వాత, ఈ పరుగుకు అడ్డుకట్ట వేయడం అసాధ్యమైపోయింది. ఉద్యోగాలు చేసేవారే కాక విశ్రాంత ఉపాధ్యాయులు, తెలుగు పండితులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, గృహిణులు... ఇలా అందరూ బ్లాగుల ద్వారా తమలోని తృష్ణను తీర్చుకున్నారు. బ్లాగు రచనలు పత్రికా రచనలకు దీటుగా ఉన్నాయి. పాటలు, పద్యాలు, కవితలు, కథలు, వంటలు, పుస్తకాలు, సినిమాలు, సరదా రాతలు, సాంకేతిక పాఠాలు, విద్యకు సంబంధించిన అంశాలు... ఇలా ఎన్నో బ్లాగులు తెలుగులో ప్రారంభమయ్యాయి. ఈ బ్లాగుల రచనలను గురించిన సమాచారం కోసం అగ్రిగేటర్/ సంకలనం తయారుచేసుకున్నారు. కూడలి, మాలిక, జల్లెడ వంటివి ప్రింట్లో ఉన్న పత్రికలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉన్న బ్లాగు రచనలు వాటికి గట్టి పోటీనిస్తున్నాయని అందరూ ఒప్పుకునే మాటే. తమ రచనలను పత్రికలవాళ్లు అంగీకరించరేమో, ప్రచురించరేమో అన్న దిగులు లేకుండా ఎంచక్కా ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో తమ సొంత పత్రిక లాంటి బ్లాగులో రాసుకుంటున్నారు. వీటిని సందర్శించి, చదివి స్పందించే చదువరులు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. తప్పులు, దిద్దుబాట్లు ఉన్నా నిర్మొహమాటంగా వ్యాఖ్యల రూపంలో తెలియజేస్తున్నారు. వీటివల్ల సదరు బ్లాగరుకు తమ రాతలను మరింత సానబెట్టే అవకాశం లభిస్తుంది. ఈ మాటలు నిజమని హిందీ, తమిళ బ్లాగర్లు కూడా ఒప్పుకుంటారు. బ్లాగులు రాసేవారిలో ప్రముఖులెందరో ఉన్నారు. రచయితలు, సినిమా తారలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు ఎందరో తమ మాటలను బ్లాగుల ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రత్యక్షంగా కలిసే అవకాశం లేకున్నా, బ్లాగు రాతలు, వ్యాఖ్యల ద్వారా ఒకరికొకరు పరిచయమవుతున్నారు. తెలుగు బ్లాగు పదకోశం అంతర్జాలం, బ్లాగరి, బ్లాగోతం, బ్లాగావరణం, బ్లహసనం, బ్లాస్యం, బ్లాక్కవిత, బ్లాక్కధ, బ్లాగుడు, బ్లాగుడుకాయ, బ్లాగుసందడి, బ్లాగ్శోధన, బ్లాగ్పటిమ, బ్లాగ్శూరుడు, బ్లాగ్ధానం, బ్లాగ్ధోరణి, బ్లాగ్మాయ, బ్లాజకీయాలు, బ్లాశ, బ్లూతు, బ్లోటో, బ్లాగ్మయం... ఇలా తెలుగులో బ్లాగు పదకోశం వృద్ధి చెందుతూ వచ్చింది. ఇంత ప్రాచుర్యం పొందిన బ్లాగుల ద్వారా ఆదాయం అనేది కష్టమే కాని అసాధ్యమేమీ కాదు. వాస్తవ ప్రపంచమైనా, మిధ్యా ప్రపంచమైనా బ్లాగు లోకమైనా మంచి, చెడు రెండూ ఉంటాయి. కాని చెడుకు త్వరగా వ్యాపించే గుణముంది. ఉచితం, నియంత్రణ లేకపోవడంతో తమ బ్లాగును దుర్వినియోగపరిచే అవకాశం లేకపోలేదు. బ్లాగుల్లో కూడా కాలుష్యం పెరుగుతుంది. జూన్ 14 ఇంటర్నేషనల్ బ్లాగర్స్ డే. ఇంటర్నెట్ ద్వారా వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించేవారిని వెబ్ బ్లాగర్స్ అంటారు కదా. దాన్నుంచి పుట్టిందే బ్లాగింగ్ ప్రక్రియ. 1993 జూన్‌లో ఇది మొదలైంది. 2003లో మొదటిసారిగా జూన్ 9ని బ్లాగర్స్ దినోత్సవంగా జరుపుకున్నారు. తర్వాత ఏడాదికి ఆ రోజును జూన్ 14కు మార్చారు. ప్రస్తుతం ఇదే రోజును అంతర్జాతీయ బ్లాగర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుండి వందలు, వేల మంది బ్లాగర్లందరూ శక్తివంతమైన అక్షర, పదప్రయోగాలతో రచనలు చేస్తూ, తమలోని శక్తికి బ్లాగు ద్వారా గుర్తింపు లభించినందుకు పండగ జరుపుకునే రోజు ఇది. ఈ సంబరాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్లాగర్లు పోటీలు, సమావేశాలు మొదలైన సామూహిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఇవి బ్లాగుల ద్వారానే కాక ప్రత్యక్షంగా కూడా జరుగుతుండడం విశేషం. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రెంట్ లాట్‌పై విరుచుకుపడుతూ సాక్షాధారాలతో సహా అతడి వ్యాఖ్యలు నిజం కాదని నిరూపించిన బ్లాగర్లు కాని దాన్ని అడ్డుకట్ట వేయడం మిగతా బ్లాగర్ల బాధ్యత. కుల, మత, వర్ణాహంకార రాతలు, వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, అశ్లీల రాతలు, ఫొటోలు, ద్వేషాలు... కనిపిస్తున్నాయి. ఇతర వ్యక్తులను, మతాలను, దేశాలను దూషిస్తూ రాసిన బ్లాగర్లను అరెస్టు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తమ సంస్థలోని గుప్తంగా ఉన్న విషయాలను బ్లాగులో రాసినందుకు ఒక కంపెనీవారు ఆ బ్లాగరుపై పోలీస్ కంప్లయింట్ చేసి ఉద్యోగం నుండి తీసేశారు. అంతర్జాలం అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడవచ్చు. కూరగాయలు తరిగి భోజనం పెట్టవచ్చు. కుత్తుక కోసి ప్రాణాలు తీయవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉపయోగించుకుని లాభపడాలి. పదిమందికి స్ఫూర్తిగా నిలవాలి. - జ్యోతి వలబోజు -
శాల్యూట్ టు మండేలా
నెల్సన్ మండేలా చనిపోయిన తరువాత... ఆయన పోరాటాన్ని, తెగువను గుర్తుతెచ్చుకుంటూ కవులు కవితలు రాశారు. గాయకులు గొంతెత్తి పాడారు. తమదైన కోణంలో నుంచి కళాకారులు ఆ పోరాటయోధునికి నివాళులు అర్పించారు. చైనీస్ ఆర్టిస్ట్ ల్యు జియాంగ్మింగ్ కూడా తన స్పందనకు చిత్రరూపం ఇచ్చాడు. ఆయిల్ పెయింటింగ్‌లతో తన ఆరాధన భావాన్ని చాటుకున్నాడు. తాను గీసిన మూడు చిత్రాలకు ‘శాల్యూట్ టు మండేలా’ ‘చైనా అండ్ మండేలా’ ‘వరల్డ్ అండ్ మండేలా’ అని పేరు పెట్టుకున్నాడు. ‘శాల్యూట్ టు మండేలా’ ఆయిల్ పెయింటింగ్‌లో మండేలా పెదవులపై వినిపించే నవ్వు, చేతి వేళ్లు.. ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రియాశీలతను సూచిస్తాయి. అందులో ఉపయోగించిన ప్రతి వర్ణం స్వాతంత్య్రం, సమానత్వం, శాంతి భావాలను ప్రతిఫలిస్తాయి. మండేలా చుట్టూ ఉన్న ఐదు చేతివేళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిమానానికి ప్రతీకగా నిలుస్తాయి. ‘వరల్డ్ అండ్ మండేలా’లో చైల్డ్ హ్యాండ్ప్రింట్స్ కనిపిస్తాయి. చేతిలో వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. నిష్కల్మషమైన, పవిత్రమైన, అందమైన ప్రపంచాన్ని అది సూచిస్తుంది. ఫైన్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో పని చేసే జియాంగ్మింగ్కు మండేలా అన్నా, అతని భావజాలమన్నా చాలా ఇష్టం. ‘లాంగ్ మార్చ్’లో పాల్గొన్న సైనికుల పోర్ట్రెయిట్లను చిత్రించడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాడు. హార్లోడ్ రిలే గురించి కొంత... ఆర్టిస్ట్ హార్లోడ్ రిలే తాను గీసిన డజను మండేలా చిత్రాలతో న్యూయార్క్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. ఇంతకుముందు ఎవరూ చూడని ఆ చిత్రాలను ‘వెరీ పర్సనల్’ అంటున్నాడు. ఒక పెయింటింగ్ అమ్మగా వచ్చిన మొత్తాన్ని ‘సౌత్ ఆఫ్రికన్ చిల్డ్రన్స్ చారిటీ’కి విరాళంగా ఇచ్చాడు. జియాంగ్మింగ్లాగే హార్లోడ్ పెయింటింగ్లలోను అనేక ప్రతీకలు కనిపిస్తాయి. మండేలా అమితంగా అభిమానించే పుస్తకాలు, వార్తపత్రికలను ప్రతీకాత్మకంగా చూపాడు. కేవలం ప్రతీకలు మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికా భౌగోళిక అందాలు కూడా ఆ పెయింటింగ్‌లతో కనువిందుచేస్తాయి. చిత్రాలలో రంగులు మాత్రమే కాదు... మండేలా వ్యక్తిత్వం కనిపిస్తుంది. శాంతి పట్ల ఆయన ప్రేమ, ఈతరం పట్ల అభిమానం, ఆటల మీద ప్రేమ కనిపిస్తాయి. కొన్ని డ్రాయింగ్లలో మండేలా సంతకం కనిపిస్తుంది.