కవులు ప్రభుత్వాలకు మార్గదర్శకులు: స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్య జయంతిని అధికారికంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వం కవులకిస్తున్న గౌరవానికి ప్రతీక అని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ శనివారం ఇక్కడ రవీంద్రభారతిలో నిర్వహించిన డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య 93వ జయంతి ఉత్సవాలు, దాశరథి సాహితీ పురస్కార ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. కవులు ప్రభుత్వాలకు మార్గదర్శకులని అన్నారు. దాశరథి రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’అనే వాక్యం ఉద్యమకారుల్లో చైతన్యాన్ని రగిలించిందని అన్నారు. అంతటి గొప్ప కవి పేరిట నెలకొల్పిన సాహితీ పురస్కారాన్ని ఆచార్య గోపి వంటి మరొక గొప్ప తెలంగాణ కవికి అందజేయడం మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ 23 సంవత్సరాల వయసులో సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన రచనలు వెలువరించిన గొప్ప సాహితీ దిగ్గజం దాశరథి అని కొనియాడారు. దాశరథి, కాళోజీ తెలంగాణ ఆణిముత్యాలని అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దాశరథి అరుదైన కవి అని, నిరంతరం ప్రజల పక్షాన పోరాడిన యోధుడని అన్నారు. గిరిజన, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ తెలంగాణ విముక్తికై ఆనాడు తన కలం ద్వారా జనాలను మేలుకొల్పారని కొనియాడారు.
దాశరథి తొలి రచన అగ్నిధారలతో ఎంత పేరు పొందారో, అంతటి పేరును ఆచార్య గోపి తన తొలి రచన తంగేడుపూలతో పొందారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. దాశరథి కవితా స్ఫూర్తిని సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ కొనియాడారు. అనంతరం ఆచార్య డాక్టర్ గోపీని అతిథులు శాలువాలతో సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. గోపీ మాట్లాడుతూ దాశరథి పేరిట సాహితీ పురస్కారాన్ని నెలకొల్పి మహనీయులను గౌరవించే సంస్కృతి తమదని తెలంగాణ ప్రభుత్వం రుజువు చేసుకుందని అన్నారు. దాశరథి పేరిట గడ్డిపోచ ఇచ్చినా దానిని బంగారు కడ్డీగా భావిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ శ్రీధర్, తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎస్వీ సత్యనారాయణ, సీఎం వోఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ దాశరథి కుమారుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.