పూపరిమళాన్ని వెదజల్లే అగ్నిశిఖలాంటివాడు దాశరథి. చైత్రరథాలను తోలుతూనే, అభ్యుధయ పంథా సాగాడు. ఋతురాగాలను వర్ణిస్తూనే, ‘నిరుపేదవాని నెత్తురు చుక్కలో’ విప్లవాలను కాంచాడు. ‘అంగారమూ శృంగారమూ’ సమపాళ్లలో మేళవించివున్న సుకుమారుడు. ఆకాశమంత ఎదిగిన వామనుడు. స్నానం చేసి మడి కట్టుకున్నాక, సంస్కృతంలో తప్ప తెలుగులో మాట్లాడని సనాతన సంప్రదాయ కుటుంబంలో జన్మించిన దాశరథి– పన్నీటివంటి తెలుగునూ, పసందైన ఉర్దూ గజళ్లనూ ప్రేమించాడు.
‘ఏది కాకతి? ఎవతి రుద్రమ?/ ఎవడు రాయలు? ఎవడు సింగన?/ అన్ని నేనే, అంత నేనే/ వెలుగు నేనే, తెలుగు నేనే’ అని సగర్వంగా ప్రకటించాడు. ఒకప్పటి వరంగల్ జిల్లాలో భాగమైన ఖమ్మంలోని చిన గూడూరులో 1925 జూలై 22న జన్మించిన దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సంవత్సరం నేటి నుంచి మొదలవుతుంది.
దొరలు, దేశ్‌ముఖులు, జమీందారులు, జాగీర్దార్ల గుప్పిట సాగుభూములన్నీ ఉన్న రోజుల్లో; ఎర్రకోటపై నిజాం పతాకం ఎగురవేస్తాననీ, బంగాళాఖాతంలో నిజాం కాళ్లు కడుగుతాననీ కాశిం రజ్వీ బీరాలు పలుకుతున్న కాలంలో; హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్ లో కలపడం కోసం తొలుత కమ్యూనిస్టుగానూ, అటుపై స్టేట్ కాంగ్రెస్‌వాడిగానూ పోరాట పిడికిలి బిగించిన యోధుడు దాశరథి. ‘మధ్యయుగాల రాచరికపు బలా’న్నే తన కవితకు ప్రేరణగా మలుచుకుని సింహగర్జన చేసిన మహాకవి దాశరథి. ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్ను బోలినరాజు మాకెన్నడేని/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటిరత్నాల వీణ’ అని నినదించిన ‘అగ్నిధార’ దాశరథి.
1947 ప్రాంతంలో నిజాం పోలీసులు బంధించి తొలుత వరంగల్ సెంట్రల్ జైలుకూ, అనంతరం నిజామాబాద్ జైలుకూ ఆయన్ని తరలించారు. ముక్కిన బియ్యం, ఉడకని అన్నం వల్ల అనారోగ్యానికి గురైనా కవితా కన్యకను విడిచిపెట్టలేదు. కలం కాగితాలు దొరక్కపోయినా జైలు గోడల మీద బొగ్గుతో కవిత్వం రాయడం మానలేదు. తోటి ఖైదీలు పదే పదే చదువుతూ వాటిని కంఠస్థం చేసేవాళ్లు. ‘దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు/ ఊళ్లకూళ్లు అగ్గిపెట్టి ఇళ్లన్నీ కొల్లగొట్టి... పెద్దరికం చేస్తావా మూడు కోట్ల చేతులు నీ/ మేడను పడదోస్తాయి...’ అంటూ ‘ఇదేమాట పదేపదే’ హెచ్చరించాడు.
తెలంగాణను కలవరించిన ‘కవిసింహం’ దాశరథి. తెలంగాణ అనే మాటతో మరింకే కవీ ముడిపడనంతగా ముడిపడిన ‘అభ్యుదయ కవిసమ్రాట్’ దాశరథి. ‘కలిపి వేయుము నా తెలంగాణ తల్లి/ మూడు కోటుల నొక్కటే ముడి బిగించి’ అని కోరాడు. ‘తెలంగాణము రైతుదే/ ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే’ అని ప్రశ్నించాడు. ‘నేనురా తెలంగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తర్చినానూ’ అని ఘోషించాడు. ‘తెలంగాణమున గడ్డిపోచయును సంధించెను కృపాణమ్ము’ అని కీర్తించాడు.
‘మూగవోయిన కోటి తమ్ముల గళాల/ పాట పలికించి కవిరాజసమ్ము కూర్చి/ నా కలానకు బలమిచ్చి నడపినట్టి/ నా తెలంగాణ కోటిరత్నాల వీణ’ అని పలికాడు. ‘నాడు నేడును తెలగాణ మోడలేదు’ అని ఎలుగెత్తాడు. 1952లో స్థాపించిన ‘తెలంగాణ రచయితల సంఘం’కు మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అయినప్పటికీ ‘మహాంధ్ర సౌభాగ్య గీతి’ని చివరిదాకా ఆలపించాడు. ‘సమగ్రాంధ్ర దీపావళి సమైక్యాంధ్ర దీపావళి’ని జరుపుకొన్నాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్థాన కవిగా వ్యవహరించాడు.
ఆంధ్ర నటుల నోట తెలంగాణ మాట ఇప్పుడు కమ్మగా వినిపిస్తున్నదంటే, ఆంధ్ర దర్శకులు తెలంగాణ పలుకుబడిని తమది కానిదని భావించడం లేదంటే– దాశరథి, ఇంకా అలాంటి ఎందరో తెలంగాణ రచయితలు, అటుపై జరిగిన తెలంగాణ ప్రత్యేక ఉద్యమాలు కారణం. దాశరథి లాంటివాళ్లు రెండు రకాల యుద్ధాలు చేశారు.
ఉర్దూమయమైన హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడటం కోసం ఒకటి, అది ‘తౌరక్యాంధ్రము’ అని ఈసడించే ఆంధ్రులతో మరొకటి! అయినా దాశరథి తాను రాసిన సినిమా పాటల్లో తెలంగాణ ‘తహజీబ్’ను ‘ఖుషీ ఖుషీగా’ చాటాడు. నిషాలనూ, హుషారులనూ మజామజాగా పాడాడు. అంతేనా? ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో’; ‘నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలవనీరా’ అంటూ సాటి తెలుగు సినీ గేయరచయితలకు దీటుగా నిలిచాడు.
భద్రాద్రి శ్రీరామచంద్రుని సేవలో తరించి దాశరథి అనే ఇంటిపేరును స్థిరం చేసుకున్నదని చెప్పే వంశం వాళ్లది. తమ్ముడు దాశరథి రంగాచార్య కూడా అంతే గట్టివాడైనప్పటికీ మనకు దాశరథి అంటే దాశరథి కృష్ణమాచార్యే. ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’, ‘కవితాపుష్పకం’, ‘అమృతాభిషేకం’, ‘రుద్రవీణ’, ‘తిమిరంతో సమరం’ వంటి కవితా సంపుటాలు; ‘మహాశిల్పి జక్కన్న’ అనే చారిత్రక నవల;‘యాత్రాస్మృతి’ పేరిట వచన సొగసును తెలిపే ఆత్మకథ వెలువరించాడు. రేడియోలో పనిచేస్తూ లలిత గీతాలు, రేడియో నాటకాలు వినిపించాడు.
భక్త రామదాసు మాదిరిగానే ‘దాశరథీ కరుణాపయోనిధీ’ మకుటంతో ‘అభినవ దాశరథీ శతకం’ రచించాడు. చక్కటి గాలిబ్ గీతాలను సరళ సుందరమైన తెలుగులోకి అనువదించాడు. ‘నాదు గుండె గాయము కుట్టు సూదికంట/ అశ్రుజలధార దారమై అవతరించె’ అంటూ గాలిబ్ ఉర్దూ ఆత్మను తెలుగు శరీరంలోకి ప్రవేశపెట్టాడు. ‘రోజూ కనబడే నక్షత్రాల్లోనే/ రోజూ కనబడని కొత్తదనం చూసి/ రోజూ పొందని ఆనందానుభూతి/ పొందడం అంటేనే కవిత్వం’ అని చెప్పిన సౌందర్యారాధకుడు దాశరథి 1987 నవంబర్ 5న అరవై రెండేళ్లకు గురుపూర్ణిమ నాడు పరమపదించాడు.
దాశరథి స్మృతి
Published Mon, Jul 22 2024 12:36 AM | Last Updated on Mon, Jul 22 2024 12:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment