Dasharathi Krishnamacharya
-
దాశరథి స్మృతి
పూపరిమళాన్ని వెదజల్లే అగ్నిశిఖలాంటివాడు దాశరథి. చైత్రరథాలను తోలుతూనే, అభ్యుధయ పంథా సాగాడు. ఋతురాగాలను వర్ణిస్తూనే, ‘నిరుపేదవాని నెత్తురు చుక్కలో’ విప్లవాలను కాంచాడు. ‘అంగారమూ శృంగారమూ’ సమపాళ్లలో మేళవించివున్న సుకుమారుడు. ఆకాశమంత ఎదిగిన వామనుడు. స్నానం చేసి మడి కట్టుకున్నాక, సంస్కృతంలో తప్ప తెలుగులో మాట్లాడని సనాతన సంప్రదాయ కుటుంబంలో జన్మించిన దాశరథి– పన్నీటివంటి తెలుగునూ, పసందైన ఉర్దూ గజళ్లనూ ప్రేమించాడు. ‘ఏది కాకతి? ఎవతి రుద్రమ?/ ఎవడు రాయలు? ఎవడు సింగన?/ అన్ని నేనే, అంత నేనే/ వెలుగు నేనే, తెలుగు నేనే’ అని సగర్వంగా ప్రకటించాడు. ఒకప్పటి వరంగల్ జిల్లాలో భాగమైన ఖమ్మంలోని చిన గూడూరులో 1925 జూలై 22న జన్మించిన దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సంవత్సరం నేటి నుంచి మొదలవుతుంది.దొరలు, దేశ్ముఖులు, జమీందారులు, జాగీర్దార్ల గుప్పిట సాగుభూములన్నీ ఉన్న రోజుల్లో; ఎర్రకోటపై నిజాం పతాకం ఎగురవేస్తాననీ, బంగాళాఖాతంలో నిజాం కాళ్లు కడుగుతాననీ కాశిం రజ్వీ బీరాలు పలుకుతున్న కాలంలో; హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్ లో కలపడం కోసం తొలుత కమ్యూనిస్టుగానూ, అటుపై స్టేట్ కాంగ్రెస్వాడిగానూ పోరాట పిడికిలి బిగించిన యోధుడు దాశరథి. ‘మధ్యయుగాల రాచరికపు బలా’న్నే తన కవితకు ప్రేరణగా మలుచుకుని సింహగర్జన చేసిన మహాకవి దాశరథి. ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్ను బోలినరాజు మాకెన్నడేని/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటిరత్నాల వీణ’ అని నినదించిన ‘అగ్నిధార’ దాశరథి. 1947 ప్రాంతంలో నిజాం పోలీసులు బంధించి తొలుత వరంగల్ సెంట్రల్ జైలుకూ, అనంతరం నిజామాబాద్ జైలుకూ ఆయన్ని తరలించారు. ముక్కిన బియ్యం, ఉడకని అన్నం వల్ల అనారోగ్యానికి గురైనా కవితా కన్యకను విడిచిపెట్టలేదు. కలం కాగితాలు దొరక్కపోయినా జైలు గోడల మీద బొగ్గుతో కవిత్వం రాయడం మానలేదు. తోటి ఖైదీలు పదే పదే చదువుతూ వాటిని కంఠస్థం చేసేవాళ్లు. ‘దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు/ ఊళ్లకూళ్లు అగ్గిపెట్టి ఇళ్లన్నీ కొల్లగొట్టి... పెద్దరికం చేస్తావా మూడు కోట్ల చేతులు నీ/ మేడను పడదోస్తాయి...’ అంటూ ‘ఇదేమాట పదేపదే’ హెచ్చరించాడు.తెలంగాణను కలవరించిన ‘కవిసింహం’ దాశరథి. తెలంగాణ అనే మాటతో మరింకే కవీ ముడిపడనంతగా ముడిపడిన ‘అభ్యుదయ కవిసమ్రాట్’ దాశరథి. ‘కలిపి వేయుము నా తెలంగాణ తల్లి/ మూడు కోటుల నొక్కటే ముడి బిగించి’ అని కోరాడు. ‘తెలంగాణము రైతుదే/ ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే’ అని ప్రశ్నించాడు. ‘నేనురా తెలంగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తర్చినానూ’ అని ఘోషించాడు. ‘తెలంగాణమున గడ్డిపోచయును సంధించెను కృపాణమ్ము’ అని కీర్తించాడు. ‘మూగవోయిన కోటి తమ్ముల గళాల/ పాట పలికించి కవిరాజసమ్ము కూర్చి/ నా కలానకు బలమిచ్చి నడపినట్టి/ నా తెలంగాణ కోటిరత్నాల వీణ’ అని పలికాడు. ‘నాడు నేడును తెలగాణ మోడలేదు’ అని ఎలుగెత్తాడు. 1952లో స్థాపించిన ‘తెలంగాణ రచయితల సంఘం’కు మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అయినప్పటికీ ‘మహాంధ్ర సౌభాగ్య గీతి’ని చివరిదాకా ఆలపించాడు. ‘సమగ్రాంధ్ర దీపావళి సమైక్యాంధ్ర దీపావళి’ని జరుపుకొన్నాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్థాన కవిగా వ్యవహరించాడు.ఆంధ్ర నటుల నోట తెలంగాణ మాట ఇప్పుడు కమ్మగా వినిపిస్తున్నదంటే, ఆంధ్ర దర్శకులు తెలంగాణ పలుకుబడిని తమది కానిదని భావించడం లేదంటే– దాశరథి, ఇంకా అలాంటి ఎందరో తెలంగాణ రచయితలు, అటుపై జరిగిన తెలంగాణ ప్రత్యేక ఉద్యమాలు కారణం. దాశరథి లాంటివాళ్లు రెండు రకాల యుద్ధాలు చేశారు. ఉర్దూమయమైన హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడటం కోసం ఒకటి, అది ‘తౌరక్యాంధ్రము’ అని ఈసడించే ఆంధ్రులతో మరొకటి! అయినా దాశరథి తాను రాసిన సినిమా పాటల్లో తెలంగాణ ‘తహజీబ్’ను ‘ఖుషీ ఖుషీగా’ చాటాడు. నిషాలనూ, హుషారులనూ మజామజాగా పాడాడు. అంతేనా? ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో’; ‘నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలవనీరా’ అంటూ సాటి తెలుగు సినీ గేయరచయితలకు దీటుగా నిలిచాడు.భద్రాద్రి శ్రీరామచంద్రుని సేవలో తరించి దాశరథి అనే ఇంటిపేరును స్థిరం చేసుకున్నదని చెప్పే వంశం వాళ్లది. తమ్ముడు దాశరథి రంగాచార్య కూడా అంతే గట్టివాడైనప్పటికీ మనకు దాశరథి అంటే దాశరథి కృష్ణమాచార్యే. ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’, ‘కవితాపుష్పకం’, ‘అమృతాభిషేకం’, ‘రుద్రవీణ’, ‘తిమిరంతో సమరం’ వంటి కవితా సంపుటాలు; ‘మహాశిల్పి జక్కన్న’ అనే చారిత్రక నవల;‘యాత్రాస్మృతి’ పేరిట వచన సొగసును తెలిపే ఆత్మకథ వెలువరించాడు. రేడియోలో పనిచేస్తూ లలిత గీతాలు, రేడియో నాటకాలు వినిపించాడు. భక్త రామదాసు మాదిరిగానే ‘దాశరథీ కరుణాపయోనిధీ’ మకుటంతో ‘అభినవ దాశరథీ శతకం’ రచించాడు. చక్కటి గాలిబ్ గీతాలను సరళ సుందరమైన తెలుగులోకి అనువదించాడు. ‘నాదు గుండె గాయము కుట్టు సూదికంట/ అశ్రుజలధార దారమై అవతరించె’ అంటూ గాలిబ్ ఉర్దూ ఆత్మను తెలుగు శరీరంలోకి ప్రవేశపెట్టాడు. ‘రోజూ కనబడే నక్షత్రాల్లోనే/ రోజూ కనబడని కొత్తదనం చూసి/ రోజూ పొందని ఆనందానుభూతి/ పొందడం అంటేనే కవిత్వం’ అని చెప్పిన సౌందర్యారాధకుడు దాశరథి 1987 నవంబర్ 5న అరవై రెండేళ్లకు గురుపూర్ణిమ నాడు పరమపదించాడు. -
నిరుపేదల నెత్తురులో ఎన్ని విప్లవాలో!
నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఆయన్ని ప్రశ్నించటం అంటే ప్రాణాలకు తెగించడమే. దాశరథి కృష్ణమాచార్యులు చేసింది అదే! నిజాం పాలనలో తెలంగాణ ప్రజల ఆర్తనాదాలనూ, ఆకలి కేకలనూ చూసి చలించి ఉక్కు పిడికిలి బిగించి జంగు సైరన్ ఊదారు దాశరథి. నిజాం రాజు తనను నిజామాబాద్ జైలులో బంధిస్తే జైలు గోడలపై బొగ్గుతో నిజాంకు వ్యతిరేకంగా ‘ఓ నిజాం పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని’ అంటూ కవితలు లిఖించారు. దాశరథి శతజయంతి సంవత్సర ప్రారంభ సందర్భంగా ఆయన రచించిన ‘అగ్నిధార’ కవితా ఖండికలోని కొన్ని సాహిత్య విషయాలూ, చారిత్రక వాస్తవాలూ పరిశీలించడం నేటి తరానికి స్ఫూర్తినిస్తుంది.‘ఇది నిదాఘము; ఇందు సహింపరాని/ వేడి యేడ్పించుచున్నది; పాడువడిన / గోడలందున జైలులో పాడినాడ/ వాడిపోనున్న పూమొగ్గపైన పాట;/ ఆయాసపడు జైలులో యెన్ని ప్రజల రా/జ్యము లున్నవో! యని యరసినాను;/ నిరుపేదవాని నెత్తురు చుక్కలో నెన్ని/ విప్లవాలో! యని వెదకినాను’ అని ఇందూరు జైలులో (నిజామాబాద్) బందీ అయినది శరీరమే కానీ మనస్సు కాదంటూ నిప్పులు చెరిగే కవిత్వాన్ని రాశారు. బొగ్గుతో గోడలపై వ్రాసి నన్ను బంధిస్తే తన గళం ఇంకా పదునెక్కుతుందని గొంతు చించుకొని అరిచారు. జైలులోని పరిస్థితులను వివరిస్తూ– సహింపరాని వేడి ఏడ్పిస్తు ఉండగా, మొత్తుకున్నాను, ఏడ్చాను నా స్వేచ్ఛకు ఆంక్షలు విధించిన ఓ నిజాం పిశాచమా నన్నే నువ్వు ‘‘బందీని’’ చేస్తే సామాన్యులు పరిస్థితి ఏమిటి? నిరుపేద వాని నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో అని వెదికాను అంటూనే... ‘వెన్నెలలు లేవు, పున్నమ కన్నే లేదు, పైడి వెన్నెల నెలవంక జాడలేదు, చుక్కలే లేవు, ఆకాశ శోకవీధి, ధూమదామమ్ము దుఃఖ సంగ్రామ భూమి’ అంటూ తెలంగాణ ప్రాంతం మొత్తం చీకట్లో ఉన్నట్లుగా, యుద్ధ భూమిని తలపిస్తున్నట్లుగా వుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓసి కూలిదానా! అరుణోదయాన/ మట్టి తట్ట నెట్టిన బెట్టి మరుగులేని/యెత్తు రొమ్మును పొంగించి యెందుకొరకు/ ఉస్సురనెదవు? ఆకాశ ముడికిపోవ?’ అంటూ రాసిన కవితా పాదాలు చార్మినారు పరిసరాలలో రాతికట్టడాల నిర్మాణ సమయంలో ఓ మహిళా కూలీని చూసి చలించి వ్రాసిన ‘ఉస్సురనెదవు’ కవితలోనివి. ‘అనాదిగా సాగుతోంది/ అనంత సంగ్రామం/ అనాథుడికి, ఆగర్భ/ శ్రీనాథుడికీ మధ్య/ సేద్యం చేసే రైతుకు/ భూమి లేదు, పుట్రలేదు/ రైతుల రక్తం త్రాగే/ జమీందార్ల కేస్టేట్లు’ అంటారు ‘అనంత సంగ్రామం’ కవితలో! యుద్ధం ఇంకా మిగిలేవుంది అన్నట్లుగా ఆదిమ కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు అనేక సంఘర్షణలకు పరిష్కారం లభించట్లేదు, పెద్దచేప చిన్నచేపను మింగుతున్నట్లుగా, ఉన్నవాడు లేనివాడిని దోచుకుంటే, కర్షకుడికి భూమి లేకుండా, విలాసంగా గడిపేవారికి వందల ఎకరాలు (ఎస్టేట్లు) వుంటే తప్పకుండా ‘సంగ్రామం’ జరుగుతుంది మరి! ‘ఇదే మాట ఇదే మాట/ పదే పదే అనేస్తాను/ కదం తొక్కి పదం పాడి/ ఇదే మాట అనేస్తాను/ దగాకోరు బటాచోరు/ రజాకారు పోషకుడవు/ వూళ్ళ కూళ్ళు అగ్గిపెట్టి/ ఇళ్ళన్నీ కొల్లగొట్టి/ తల్లి పిల్ల కడుపుకొట్టి/ నిక్కిన దుర్మార్గమంత/ దిగిపోవోయ్ తెగిపోవోయ్ / తెగిపోవోయ్ దిగిపోవోయ్/ ఇదే మాట ఇదే మాట/ పదే పదే అనేస్తాను’ అంటారు ‘అగ్నిధార’ కావ్యంలోని చివరి కవితలో. ఈ కవిత శ్రీశ్రీ ‘జగన్నాథుని రథ చక్రాలు’ కవితను గుర్తుకు తెస్తుంది. ‘ఇక చాలు నీ అసమర్థపాలన’ అంటూ కడిగిపారేశారు, ఈ కవితలో. కవి ఎప్పుడూ పాలకపక్షం కాకుండా ప్రజలపక్షం నిలబడాలి. అన్నార్థుల వైపు, అనాధల వైపు, ఆకలి కేకల వైపు నిలబడాలి. అచ్చంగా అదే చేశారు దాశరథి.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఊరు ఊరునా వాడవాడలా ‘అగ్నిధార’ కావ్యంలోని వాక్యాలు తెలంగాణ సమాజంలోని ప్రతి గొంతుకను పిడికిలెత్తి అరిచేలా చేశాయి. స్వరాష్ట్రం సిద్ధించాక దాశరథి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా లబ్ధప్రతిష్ఠులకు అవార్డులు ఇచ్చి సన్మానించి దాశరథి కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తోంది అధికారికంగా!– డా‘‘ మహ్మద్ హసన్తెలుగు సహాయాచార్యులు, నల్గొండ99080 59234(రేపు దాశరథి శతజయంతి ప్రారంభం) -
‘దాశరథి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం’
సాక్షి, హైదరాబాద్: దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సాహితీ యోధుడని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. దాశరథి కృష్ణమాచార్యుల 96వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. దాశరథి రగిలించిన చైతన్య స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించేందుకు కావాల్సిన సంకల్ప బలాన్ని ఇచ్చిందని కొనియాడారు. సాహిత్యరంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా అధికారికంగా ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ, అవార్డులను ప్రదానం చేస్తోందని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దాశరథి అందించిన ఉద్యమ చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తుందని చెప్పారు. -
టప్పాబహీ సత్తార్ మియా
ఒకసారి డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు హైదరాబాదు వచ్చారు. ప్రజల్లో ఆయన విప్లవం యెక్కడ తెస్తారో అని జడిసి ఆయన్ని గిరఫ్తార్(అరెస్టు) చేయవలసిందిగా వారెంటు జారీచేశారు. అది ఉర్దూలో వుంది. ఉర్దూకు ఫారసీ లిపిని ఉపయోగిస్తారు. ఉర్దూ భాషకు స్వంతలిపి అంటూ లేదు. ఫారసీ లిపిలో భారతీయ శబ్దాలు వ్రాయడం కష్టం. ‘‘పట్టాభి సీతారామయ్య’’ అని రాయాలంటే ‘‘టప్పాబహీ సత్తార్ మియా’’లా వుంటుంది. డాక్టర్ పట్టాభిగారు బసచేసిన చోటికి పోలీసువారు వారంటు పట్టుకు వచ్చారు. ‘‘టప్పాబహీ సత్తార్ మియా హై క్యా’’ అని అడిగారు. అది పసిగట్టిన యన్.కె.రావుగారు ‘‘యహా సత్తార్ మియా కోయీ నహీ. ఇన్కానాంతో సీతారామయ్యా హై’’ (ఇక్కడ సత్తార్ మియా యెవరూ లేరు. వీరి పేరు సీతారామయ్య) అన్నారు. పొరపాటు చేశామనుకుని పోలీసువారు వెళ్ళిపోయారు. వెంటనే సీతారామయ్య గారిని సురక్షిత ప్రదేశానికి పంపించివేశారు రావుగారు. లిపిమార్పు వల్ల పేరు మారింది. (దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ లోంచి...) -
కవులు ప్రభుత్వాలకు మార్గదర్శకులు: స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్య జయంతిని అధికారికంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వం కవులకిస్తున్న గౌరవానికి ప్రతీక అని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ శనివారం ఇక్కడ రవీంద్రభారతిలో నిర్వహించిన డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య 93వ జయంతి ఉత్సవాలు, దాశరథి సాహితీ పురస్కార ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. కవులు ప్రభుత్వాలకు మార్గదర్శకులని అన్నారు. దాశరథి రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’అనే వాక్యం ఉద్యమకారుల్లో చైతన్యాన్ని రగిలించిందని అన్నారు. అంతటి గొప్ప కవి పేరిట నెలకొల్పిన సాహితీ పురస్కారాన్ని ఆచార్య గోపి వంటి మరొక గొప్ప తెలంగాణ కవికి అందజేయడం మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ 23 సంవత్సరాల వయసులో సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన రచనలు వెలువరించిన గొప్ప సాహితీ దిగ్గజం దాశరథి అని కొనియాడారు. దాశరథి, కాళోజీ తెలంగాణ ఆణిముత్యాలని అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దాశరథి అరుదైన కవి అని, నిరంతరం ప్రజల పక్షాన పోరాడిన యోధుడని అన్నారు. గిరిజన, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ తెలంగాణ విముక్తికై ఆనాడు తన కలం ద్వారా జనాలను మేలుకొల్పారని కొనియాడారు. దాశరథి తొలి రచన అగ్నిధారలతో ఎంత పేరు పొందారో, అంతటి పేరును ఆచార్య గోపి తన తొలి రచన తంగేడుపూలతో పొందారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. దాశరథి కవితా స్ఫూర్తిని సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ కొనియాడారు. అనంతరం ఆచార్య డాక్టర్ గోపీని అతిథులు శాలువాలతో సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. గోపీ మాట్లాడుతూ దాశరథి పేరిట సాహితీ పురస్కారాన్ని నెలకొల్పి మహనీయులను గౌరవించే సంస్కృతి తమదని తెలంగాణ ప్రభుత్వం రుజువు చేసుకుందని అన్నారు. దాశరథి పేరిట గడ్డిపోచ ఇచ్చినా దానిని బంగారు కడ్డీగా భావిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ శ్రీధర్, తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎస్వీ సత్యనారాయణ, సీఎం వోఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ దాశరథి కుమారుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. -
దాశరథి సైన్స్ గీతం
సరిగ్గా ఒక పక్షం రోజుల క్రితం ఒక మిత్రుడు తణుకులో కలసినప్పుడు ఒక క్యాలెండర్ బహూకరించాడు. అది సైన్స్ సభ; క్యాలెండర్లో సైన్సూ, చరిత్ర కలగలసిన కవిత. నాకు మహదానందం కలిగింది. నిజానికి ఆ కవిత లేదా ఆ పాట కొత్తది కాదు, పాతి కేళ్లుగా అలాంటి వేదికలమీద వింటూనే ఉన్నా. అయినా క్యాలెండర్‌గా చూసినప్పుడు, కలకాలం గోడమీద మరెందరికో అవగాహనా, స్ఫూర్తీ కలిగిస్తుందని ఆశ. ఆ ఆనందం ఇంకా తాజాగా ఉండగానే, ఆ పాట రచయిత జన్మదినం నవంబరు 22 అని కూడా అదే క్యాలెండర్ చెబుతోంది. ఇంతకీ ఆ పాట ఏమిటి? ఆ కవి ఎవరు? ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంత? ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో– అని మొద లయ్యే ఈ గీతానికి రచయిత దాశరథి కృష్ణమాచా ర్యులు. అద్భుతమైన ఎత్తుగడ, లోతైన భావం, తీక్షణ మైన చూపుతో రూపొందిన ఈ గీతం... తర్వాతి చరణం ఇలా ఉంటుంది. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో జరిగిన నర కంఠాలెన్నో కుల మతాల సుడిగుండాలకు బలిౖయెన పవిత్రులెందరో విశ్వాంతరాళంలో మహా విస్ఫోటనం జరిగిన తర్వాతే భూమి రూపొందిందనేదీ, మనిషి ప్రస్తుత ఆకారం ధరించడానికి చాలా పరిణామక్రమం ఉందనేదీ శాస్త్ర విజ్ఞానం. వీటిని గొప్పగా స్ఫురింపజేస్తూ మన చరిత్ర తీరును వివరిస్తారు కవి. గతాన్ని హేతుబద్ధంగా అక్షరీకరించి, వర్తమాన పోకడల గురించి మరింతగా కవితా చిత్రిక పడతారు. మానవ కల్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపుకోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఈ గీత ప్రస్తావన ఇదివరకు చెప్పిన విషయమే అయినా, నడుస్తున్న చరిత్ర తీరు అదే కాబట్టి.. మరో పోలికతో మరింత స్పష్టంగా అంటాడు. ఎందుకంటే ఆ దోపిడీ, దౌష్ట్యం, దుర్మార్గం అలా సాగుతోంది మరి. ఇక పరిష్కారం ఎలా ఉండాలి? అదే ఈ కవితగా ముగిసిన భవిత కల. అన్నార్తులు అనాథలు అని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంత గాయపడిన కవిగుండెలలో రాయబడని కావ్యాలెన్నో? అని ముగిస్తాడు ఆ పాటను దాశరథి కృష్ణమా చార్యులు. పాతికేళ్లుగా ఈ గీతాన్ని పాడించి, ప్రచారంలోకి తెచ్చిన జన విజ్ఞాన వేదిక ఇటీవల క్యాలెండర్‌గా ముద్రించడం మరింత కొత్తగా దాశరథిని మనల్ని చూడమంటోంది. తండ్రి దగ్గర సంస్కృతం, తల్లి దగ్గర తెలుగు, గురువు దగ్గర ఉర్దూ నేర్చుకున్న తర్వాత– జీవితం పేదరికాన్నీ, నిజాంపాలన కష్టాన్నీ నేర్పాయి. ఇంటా, బయటా దాశరథి కృష్ణమాచార్యులు ఎదుర్కొన్న ఇడు ములు ఇన్నీ అన్నీ కావు. తిరగబడి ఉద్యమంలా సాగాడు, తెగబడి సాహిత్యం సృజించాడు. పద్యంతో, పాటతో చిరంజీవిగా మిగిలిపోయాడు. ‘‘లోకం నిండా విరివిగా శాంతి పంచే రీతిని కొత్త రకం విత్తనాల్ని కనిపెట్టే వీలు’’ గురించి శోధించి, సాధించిన సాహితీ శాస్త్రవేత్త దాశరథి కృష్ణమాచార్యులు (22.7.1925 – 5.11.1987) (నేడు దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా) వ్యాసకర్త సంచాలకులు, ఆకాశవాణి, తిరుపతి మొబైల్ : 94929 60868