దాశరథి సైన్స్ గీతం
సరిగ్గా ఒక పక్షం రోజుల క్రితం ఒక మిత్రుడు తణుకులో కలసినప్పుడు ఒక క్యాలెండర్ బహూకరించాడు. అది సైన్స్ సభ; క్యాలెండర్లో సైన్సూ, చరిత్ర కలగలసిన కవిత. నాకు మహదానందం కలిగింది. నిజానికి ఆ కవిత లేదా ఆ పాట కొత్తది కాదు, పాతి కేళ్లుగా అలాంటి వేదికలమీద వింటూనే ఉన్నా. అయినా క్యాలెండర్‌గా చూసినప్పుడు, కలకాలం గోడమీద మరెందరికో అవగాహనా, స్ఫూర్తీ కలిగిస్తుందని ఆశ. ఆ ఆనందం ఇంకా తాజాగా ఉండగానే, ఆ పాట రచయిత జన్మదినం నవంబరు 22 అని కూడా అదే క్యాలెండర్ చెబుతోంది.
ఇంతకీ ఆ పాట ఏమిటి? ఆ కవి ఎవరు? ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంత? ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో– అని మొద లయ్యే ఈ గీతానికి రచయిత దాశరథి కృష్ణమాచా ర్యులు. అద్భుతమైన ఎత్తుగడ, లోతైన భావం, తీక్షణ మైన చూపుతో రూపొందిన ఈ గీతం... తర్వాతి చరణం ఇలా ఉంటుంది.
భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజును గెలిపించుటలో జరిగిన నర కంఠాలెన్నో
కుల మతాల సుడిగుండాలకు బలిౖయెన పవిత్రులెందరో
విశ్వాంతరాళంలో మహా విస్ఫోటనం జరిగిన తర్వాతే భూమి రూపొందిందనేదీ, మనిషి ప్రస్తుత ఆకారం ధరించడానికి చాలా పరిణామక్రమం ఉందనేదీ శాస్త్ర విజ్ఞానం. వీటిని గొప్పగా స్ఫురింపజేస్తూ మన చరిత్ర తీరును వివరిస్తారు కవి. గతాన్ని హేతుబద్ధంగా అక్షరీకరించి, వర్తమాన పోకడల గురించి మరింతగా కవితా చిత్రిక పడతారు.
మానవ కల్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో
రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో
కడుపుకోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో
ఈ గీత ప్రస్తావన ఇదివరకు చెప్పిన విషయమే అయినా, నడుస్తున్న చరిత్ర తీరు అదే కాబట్టి.. మరో పోలికతో మరింత స్పష్టంగా అంటాడు. ఎందుకంటే ఆ దోపిడీ, దౌష్ట్యం, దుర్మార్గం అలా సాగుతోంది మరి. ఇక పరిష్కారం ఎలా ఉండాలి? అదే ఈ కవితగా ముగిసిన భవిత కల.
అన్నార్తులు అనాథలు అని ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంత
గాయపడిన కవిగుండెలలో రాయబడని కావ్యాలెన్నో?
అని ముగిస్తాడు ఆ పాటను దాశరథి కృష్ణమా చార్యులు.
పాతికేళ్లుగా ఈ గీతాన్ని పాడించి, ప్రచారంలోకి తెచ్చిన జన విజ్ఞాన వేదిక ఇటీవల క్యాలెండర్‌గా ముద్రించడం మరింత కొత్తగా దాశరథిని మనల్ని చూడమంటోంది. తండ్రి దగ్గర సంస్కృతం, తల్లి దగ్గర తెలుగు, గురువు దగ్గర ఉర్దూ నేర్చుకున్న తర్వాత– జీవితం పేదరికాన్నీ, నిజాంపాలన కష్టాన్నీ నేర్పాయి. ఇంటా, బయటా దాశరథి కృష్ణమాచార్యులు ఎదుర్కొన్న ఇడు ములు ఇన్నీ అన్నీ కావు. తిరగబడి ఉద్యమంలా సాగాడు, తెగబడి సాహిత్యం సృజించాడు. పద్యంతో, పాటతో చిరంజీవిగా మిగిలిపోయాడు.
‘‘లోకం నిండా విరివిగా శాంతి పంచే రీతిని కొత్త రకం విత్తనాల్ని కనిపెట్టే వీలు’’ గురించి శోధించి, సాధించిన సాహితీ శాస్త్రవేత్త దాశరథి కృష్ణమాచార్యులు (22.7.1925 – 5.11.1987)
(నేడు దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా)
వ్యాసకర్త సంచాలకులు, ఆకాశవాణి, తిరుపతి మొబైల్ : 94929 60868