నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఆయన్ని ప్రశ్నించటం అంటే ప్రాణాలకు తెగించడమే. దాశరథి కృష్ణమాచార్యులు చేసింది అదే! నిజాం పాలనలో తెలంగాణ ప్రజల ఆర్తనాదాలనూ, ఆకలి కేకలనూ చూసి చలించి ఉక్కు పిడికిలి బిగించి జంగు సైరన్ ఊదారు దాశరథి. నిజాం రాజు తనను నిజామాబాద్ జైలులో బంధిస్తే జైలు గోడలపై బొగ్గుతో నిజాంకు వ్యతిరేకంగా ‘ఓ నిజాం పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని’ అంటూ కవితలు లిఖించారు. దాశరథి శతజయంతి సంవత్సర ప్రారంభ సందర్భంగా ఆయన రచించిన ‘అగ్నిధార’ కవితా ఖండికలోని కొన్ని సాహిత్య విషయాలూ, చారిత్రక వాస్తవాలూ పరిశీలించడం నేటి తరానికి స్ఫూర్తినిస్తుంది.
‘ఇది నిదాఘము; ఇందు సహింపరాని/ వేడి యేడ్పించుచున్నది; పాడువడిన / గోడలందున జైలులో పాడినాడ/ వాడిపోనున్న పూమొగ్గపైన పాట;/ ఆయాసపడు జైలులో యెన్ని ప్రజల రా/జ్యము లున్నవో! యని యరసినాను;/ నిరుపేదవాని నెత్తురు చుక్కలో నెన్ని/ విప్లవాలో! యని వెదకినాను’ అని ఇందూరు జైలులో (నిజామాబాద్) బందీ అయినది శరీరమే కానీ మనస్సు కాదంటూ నిప్పులు చెరిగే కవిత్వాన్ని రాశారు. బొగ్గుతో గోడలపై వ్రాసి నన్ను బంధిస్తే తన గళం ఇంకా పదునెక్కుతుందని గొంతు చించుకొని అరిచారు.
జైలులోని పరిస్థితులను వివరిస్తూ– సహింపరాని వేడి ఏడ్పిస్తు ఉండగా, మొత్తుకున్నాను, ఏడ్చాను నా స్వేచ్ఛకు ఆంక్షలు విధించిన ఓ నిజాం పిశాచమా నన్నే నువ్వు ‘‘బందీని’’ చేస్తే సామాన్యులు పరిస్థితి ఏమిటి? నిరుపేద వాని నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో అని వెదికాను అంటూనే... ‘వెన్నెలలు లేవు, పున్నమ కన్నే లేదు, పైడి వెన్నెల నెలవంక జాడలేదు, చుక్కలే లేవు, ఆకాశ శోకవీధి, ధూమదామమ్ము దుఃఖ సంగ్రామ భూమి’ అంటూ తెలంగాణ ప్రాంతం మొత్తం చీకట్లో ఉన్నట్లుగా, యుద్ధ భూమిని తలపిస్తున్నట్లుగా వుందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఓసి కూలిదానా! అరుణోదయాన/ మట్టి తట్ట నెట్టిన బెట్టి మరుగులేని/యెత్తు రొమ్మును పొంగించి యెందుకొరకు/ ఉస్సురనెదవు? ఆకాశ ముడికిపోవ?’ అంటూ రాసిన కవితా పాదాలు చార్మినారు పరిసరాలలో రాతికట్టడాల నిర్మాణ సమయంలో ఓ మహిళా కూలీని చూసి చలించి వ్రాసిన ‘ఉస్సురనెదవు’ కవితలోనివి.
‘అనాదిగా సాగుతోంది/ అనంత సంగ్రామం/ అనాథుడికి, ఆగర్భ/ శ్రీనాథుడికీ మధ్య/ సేద్యం చేసే రైతుకు/ భూమి లేదు, పుట్రలేదు/ రైతుల రక్తం త్రాగే/ జమీందార్ల కేస్టేట్లు’ అంటారు ‘అనంత సంగ్రామం’ కవితలో! యుద్ధం ఇంకా మిగిలేవుంది అన్నట్లుగా ఆదిమ కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు అనేక సంఘర్షణలకు పరిష్కారం లభించట్లేదు, పెద్దచేప చిన్నచేపను మింగుతున్నట్లుగా, ఉన్నవాడు లేనివాడిని దోచుకుంటే, కర్షకుడికి భూమి లేకుండా, విలాసంగా గడిపేవారికి వందల ఎకరాలు (ఎస్టేట్లు) వుంటే తప్పకుండా ‘సంగ్రామం’ జరుగుతుంది మరి!
‘ఇదే మాట ఇదే మాట/ పదే పదే అనేస్తాను/ కదం తొక్కి పదం పాడి/ ఇదే మాట అనేస్తాను/ దగాకోరు బటాచోరు/ రజాకారు పోషకుడవు/ వూళ్ళ కూళ్ళు అగ్గిపెట్టి/ ఇళ్ళన్నీ కొల్లగొట్టి/ తల్లి పిల్ల కడుపుకొట్టి/ నిక్కిన దుర్మార్గమంత/ దిగిపోవోయ్ తెగిపోవోయ్ / తెగిపోవోయ్ దిగిపోవోయ్/ ఇదే మాట ఇదే మాట/ పదే పదే అనేస్తాను’ అంటారు ‘అగ్నిధార’ కావ్యంలోని చివరి కవితలో.
ఈ కవిత శ్రీశ్రీ ‘జగన్నాథుని రథ చక్రాలు’ కవితను గుర్తుకు తెస్తుంది. ‘ఇక చాలు నీ అసమర్థపాలన’ అంటూ కడిగిపారేశారు, ఈ కవితలో. కవి ఎప్పుడూ పాలకపక్షం కాకుండా ప్రజలపక్షం నిలబడాలి. అన్నార్థుల వైపు, అనాధల వైపు, ఆకలి కేకల వైపు నిలబడాలి. అచ్చంగా అదే చేశారు దాశరథి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఊరు ఊరునా వాడవాడలా ‘అగ్నిధార’ కావ్యంలోని వాక్యాలు తెలంగాణ సమాజంలోని ప్రతి గొంతుకను పిడికిలెత్తి అరిచేలా చేశాయి. స్వరాష్ట్రం సిద్ధించాక దాశరథి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా లబ్ధప్రతిష్ఠులకు అవార్డులు ఇచ్చి సన్మానించి దాశరథి కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తోంది అధికారికంగా!
– డా‘‘ మహ్మద్ హసన్
తెలుగు సహాయాచార్యులు, నల్గొండ
99080 59234
(రేపు దాశరథి శతజయంతి ప్రారంభం)
నిరుపేదల నెత్తురులో ఎన్ని విప్లవాలో!
Published Sun, Jul 21 2024 1:54 AM | Last Updated on Sun, Jul 21 2024 1:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment