భూదాన్ భూములు ఇవ్వడంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కలెక్టర్.. వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడంపై అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: భూములను కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్ నిజాం నవాబ్‌ను కూడా మించిపోయారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పేదలకు పంచడం కోసం రామచంద్రారెడ్డి దాదాపు 300 ఎకరాలు ఇచ్చారని, అందినకాడికి నొక్కిన అధికారులు వాటి స్వాహాకు సహకరించారని చెప్పింది. భూదాన్ భూములంటూ అప్పిలేట్ ట్రిబ్యునల్ అథారిటీగా ధ్రువీకరించిన వ్యక్తి.. జిల్లా కలెక్టర్‌గా వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఆరోపణలున్న అధికారులు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది.
పీవీ నరసింహారావు లాంటి ఎందరో మహానుభావులు సీలింగ్ చట్టం వచ్చినప్పుడు వందల ఎకరాలు ఇచ్చేశారంది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నం.182లో 10.29 ఎకరాలకు ఖాదర్ ఉన్నీసాకు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాలు చేస్తూ నవాబ్ ఫారూక్ అలీఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు.
గతంలో భూదాన్ భూములపై ఆర్డీవో ఆదేశాలివ్వగా స్పెషల్ ట్రిబ్యునల్ సమరి్థంచిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా ఖాదర్ ఉన్నీసా ఇచ్చిన దరఖాస్తును కలెక్టర్ ఆమోదించి పాస్‌బుక్ కూడా జారీ చేశారని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందరో మహానుభావులు ఇచ్చిన వందల ఎకరాలను అమ్ముకుని తినేశారని, భూదాన్ భూముల రక్షణలో గత బోర్డుతోపాటు అధికారులూ విఫలమయ్యారని చెప్పారు.
భూదాన్ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండగా పట్టా పాస్‌బుక్ జారీ చేశారన్నారు. వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేశారో కౌంటరు దాఖలు చేయాలని భూదాన్ యజ్ఞబోర్డు, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, నాటి కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ భూములపై యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment