Bhudan lands
-
భూదాన్ భూములపై డీజీపీకి ఈడీ నివేదిక.. మరిన్ని కేసులు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విషయంలో ఈడీ అధికారులు.. డీజీపీకి నివేదిక సమర్పించారు. ఈ సందర్బంగా భూదాన్ వ్యవహారంపై కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అమోయ్ కుమార్‌తో పాటుగా మిగతా అధికారులపై కూడా కేసులు నమోదు చేయాలని నివేదికలో ఈడీ సిఫారసు చేసింది.రాష్ట్రంలో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి డీజీపీకి ఈడీ నివేదికను సమర్పించింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌తో పాటు ఎంఆర్వో జ్యోతి, ఆర్డీవో వెంకటాచారిపై కేసు నమోదు చేయాలని ఈడీ రిపోర్టులో వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా భూ బదాయింపుల్లో చోటుచేసుకున్న లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో పలు అక్రమాలు జరిగినా గతంలో పోలీసులు కేసులు నమోదు చేయలేదని ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో అమోయ్ కుమార్‌తో పాటుగా మిగతా అధికారులపై కూడా కేసులో నమోదు చేసి విచారించాలని సిఫార్సు చేసింది. -
కలెక్టర్ నిజాంను మించిపోయారు!
సాక్షి, హైదరాబాద్: భూములను కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్ నిజాం నవాబ్‌ను కూడా మించిపోయారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పేదలకు పంచడం కోసం రామచంద్రారెడ్డి దాదాపు 300 ఎకరాలు ఇచ్చారని, అందినకాడికి నొక్కిన అధికారులు వాటి స్వాహాకు సహకరించారని చెప్పింది. భూదాన్ భూములంటూ అప్పిలేట్ ట్రిబ్యునల్ అథారిటీగా ధ్రువీకరించిన వ్యక్తి.. జిల్లా కలెక్టర్‌గా వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఆరోపణలున్న అధికారులు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. పీవీ నరసింహారావు లాంటి ఎందరో మహానుభావులు సీలింగ్ చట్టం వచ్చినప్పుడు వందల ఎకరాలు ఇచ్చేశారంది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నం.182లో 10.29 ఎకరాలకు ఖాదర్ ఉన్నీసాకు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాలు చేస్తూ నవాబ్ ఫారూక్ అలీఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. గతంలో భూదాన్ భూములపై ఆర్డీవో ఆదేశాలివ్వగా స్పెషల్ ట్రిబ్యునల్ సమరి్థంచిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా ఖాదర్ ఉన్నీసా ఇచ్చిన దరఖాస్తును కలెక్టర్ ఆమోదించి పాస్‌బుక్ కూడా జారీ చేశారని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందరో మహానుభావులు ఇచ్చిన వందల ఎకరాలను అమ్ముకుని తినేశారని, భూదాన్ భూముల రక్షణలో గత బోర్డుతోపాటు అధికారులూ విఫలమయ్యారని చెప్పారు. భూదాన్ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండగా పట్టా పాస్‌బుక్ జారీ చేశారన్నారు. వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేశారో కౌంటరు దాఖలు చేయాలని భూదాన్ యజ్ఞబోర్డు, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, నాటి కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ భూములపై యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
ఐఏఎస్ అమోయ్ కుమార్‌కు బిగుస్తున్న ఉచ్చు.. ఈడీ ఫుల్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. నిన్న ఎనిమిది గంటల పాటు విచారించిన ఈడీ.. నేడు కూడా మరోసారి విచారణకు రావాలని తెలిపింది. మహేశ్వరం మండలం నాగరంలో 42 ఎకరాల భూమి కేటాయింపుపై అమోయ్ కుమార్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది.గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్ 50 ఎకరాల భూదాన్ భూములను అన్యాక్రాంతం చేశాడు. విజిలెన్స్ విచారణలో అమోయ్ కుమార్ బాగోతం బయటపడింది. విజిలెన్స్ అధికారులు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగారంలోని సర్వే నెంబర్ 181, 182 లోని 102.2 ఎకరాలపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. అందులో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు చెందినదని బోర్డ్ వాదిస్తోంది.ఇక, ఈ భూమి జబ్బార్దస్త్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. తర్వాత ఆయన కొడుకు హజీఖాన్ 50 ఎకరాల ల్యాండ్‌ను భూదాన్ బోర్డుకి దానం చేశాడు. 2021లో హజీఖాన్ వారుసురాలిని అంటూ 40 ఎకరాలు తనదేనని ఖాదురున్నీసా దరఖాస్తు చేసుకుంది. క్షేత్ర స్థాయిలో ఆర్డీవో, తహశీల్దార్, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్ ఖాదురున్నీసాకు అనుకూలంగా ఉండి.. ఆఘమేఘాల మీద ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మారు. దీంతో ఎన్నికల సమయంలో భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ భూమిపై క్రయవిక్రయాలు చేయకుండా ధరణిలో నిషేధిత జాబితాలో పెట్టారు అధికారులు. దీంతో, ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. మరోవైపు ఈ కేసులో ఈడీ.. ఎమ్మార్వో జ్యోతి, ఆర్డీవోను సైతం నేడు విచారించే అవకాశం ఉంది. -
భూదాన్ భూముల్లో ఉద్రిక్తత
ఖమ్మం అర్బన్: భూదాన్ భూముల్లో పేదలు ఇళ్ల స్థలాల కోసం రాత్రికి రాత్రే గుడిసెలు, రేకుల షెడ్లు వేయడం, ఉదయమే పోలీసులు వీటిని తొలగించడం.. వరస ఘటనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఖమ్మం నగరం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 147, 148, 149లోని భూదాన్ భూముల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు సూ ర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది ఆక్రమించి శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో గుడిసెలు వేశారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన రెవెన్యూ, పోలీసులు తొలగించేందుకు చేరుకోగా వేలాది మంది ఆందోళనకారులు అడ్డుకున్నారు. భూదాన్ భూముల కింద ప్రభుత్వం తమకు కేటాయించినందున ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. కర్రలతో అధికారులను అడ్డుకుని.. గుడిసెల తొలగింపునకు యత్నించిన యంత్రాంగాన్ని కర్రలతో అడ్డుకున్నారు. దీంతో అదనపు కలెక్టర్ మధుసూదన్ ఆందోళనకారుల ప్రతినిధులతో రెండు గంటలకుపైగా చర్చించారు. పత్రాలు ఉంటే చూపించి నివాసాలు ఏర్పరుచుకోవాలని, లేకపోతే శాంతియుతంగా ఇక్కడ నుంచి వెళ్లాలని సూచించారు. సాయంత్రంలోగా ఖాళీ చేయకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా వారు కదలకపోవడంతో సీపీ విష్ణు ఎస్.వారియర్ సహా పోలీసు బలగాలు భారీగా చేరుకుని జేసీబీలతో గుడిసెలను తొలగించారు. గూడు ఆశ చూపారంటూ.. విలపించిన బాధితులు భూదాన్ భూముల్లో ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇప్పిస్తా మని నమ్మించిన కొందరు డబ్బులు వసూలు చేశారని ఆందోళనకారులు కొందరు విలపించారు. గుడిసెలు వేసుకునేందుకు నాలుగేళ్ల క్రితం రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది. అధికారులు వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఆక్రమిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ భూదాన్ భూములను ఆక్రమిస్తే సహించేది లేదని, ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు. ఆక్రమణదారులపై, వారిని ప్రోత్సహించిన వారిపై భూఆక్రమణ, క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. -
ప్రజోపయోగాలకే భూదాన్ భూములు
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: భూదాన్ భూముల విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భూదాన్ భూములను నిరుపేదలకు వ్యవసాయం, స్థానిక సంస్థలు చేపట్టే ప్రజోపయోగ అవసరాల (స్కూలు, పంచాతీయ కార్యాలయం తదితరాలు) నిమిత్తం తప్ప, ఇతర ఏ అవసరాలకు కేటాయించడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూదాన్, గ్రామ్‌దాన్ చట్టానికి చేసిన సవరణలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ న్యాయశాఖ కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, భూదాన్ బోర్డు కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూదాన్ బోర్డు చట్టానికి పలు సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది తీసుకొచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ న్యాయవాది కుంభం శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
భూముల వివరాలు ఇప్పించండి
సభా సంఘం చైర్మన్‌ను కోరిన సభ్యులు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల లెక్క తేల్చేందుకు తమకు రెండు వారాల్లో వివరాలు అందించాలని ప్రభుత్వ భూముల కబ్జాలపై ఏర్పాటైన అసెంబ్లీ సభాసంఘం (హౌస్ కమిటీ) సభ్యులు కమిటీ చైర్మన్‌ను కోరారు. సంఘం చైర్మన్ సుధీర్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ సమావేశ మందిరంలో బుధవారం కమిటీ సమావేశం జరిగింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై పలువురు సభ్యులు ప్రశ్నించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. భూదాన్ భూములు, ఎస్సీ, ఎస్టీలకు అసైన్ చేసిన భూములు, ఇనాం భూములు, సీలింగ్ భూములు, దేవాదాయ భూములతో పాటు అప్పటి ఏపీఐఐసీకి కేటాయించిన భూముల విషయంలో జరిగిన అక్రమాలు, అక్రమ విక్రయాలు, కబ్జాల పాలైన భూముల నిగ్గు తేలాల్సి ఉంది. అయితే, తమ వద్ద ప్రాథమిక సమాచారం కూడా లేకుండా సమావేశంలో ఏం మాట్లాడలేమని కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కనీసం రెండు వారాల్లోగా తమకు ఆయా భూముల వివరాలు అందించి, మరో వారం రోజులు ఆ వివరాలు చదివేందుకు గడువు ఇవ్వాలని, ఆతర్వాతే మరో సమావేశం పెట్టాలని వీరు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. అన్ని రకాల భూముల మొత్తం విస్తీర్ణం ఎంతన్న వివరాలను సర్వే నెంబర్లతో సహా జిల్లాల వారీగా తమకు అందించాలని వీరు కోరారు. ఏపీఐఐసీకి కేటాయించిన భూముల విషయంలో అనుకున్న లక్ష్యం నెరవే రిందా? అర్హులకే భూములు అందాయా, అవి వారి నుంచి ఇతరులకు బదిలీ అయ్యాయా అన్న వివరాలను సభ్యులు సేకరించనున్నారు. ప్రభుత్వం భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేయడం, ఆ తర్వాత హైకోర్టు బోర్డుకే అనుకూలంగా తీర్పు ఇచ్చినందున, అసలు భూదాన్ భూముల వ్యవహారం ప్రభుత్వం పరిధిలో ఉందా లేదా అని సభ్యులు ప్రశ్నించినట్లు సమాచారం. , ఏపీఐఐసీ భూములతో పాటు, ఎస్సీ, ఎస్టీ అసైన్డు భూములను తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య భూముల వ్యవహారం కూడా కమిటీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.