ఖమ్మం అర్బన్: భూదాన్ భూముల్లో పేదలు ఇళ్ల స్థలాల కోసం రాత్రికి రాత్రే గుడిసెలు, రేకుల షెడ్లు వేయడం, ఉదయమే పోలీసులు వీటిని తొలగించడం.. వరస ఘటనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఖమ్మం నగరం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 147, 148, 149లోని భూదాన్ భూముల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు సూ ర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది ఆక్రమించి శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో గుడిసెలు వేశారు.
శనివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన రెవెన్యూ, పోలీసులు తొలగించేందుకు చేరుకోగా వేలాది మంది ఆందోళనకారులు అడ్డుకున్నారు. భూదాన్ భూముల కింద ప్రభుత్వం తమకు కేటాయించినందున ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు.
కర్రలతో అధికారులను అడ్డుకుని..
గుడిసెల తొలగింపునకు యత్నించిన యంత్రాంగాన్ని కర్రలతో అడ్డుకున్నారు. దీంతో అదనపు కలెక్టర్ మధుసూదన్ ఆందోళనకారుల ప్రతినిధులతో రెండు గంటలకుపైగా చర్చించారు. పత్రాలు ఉంటే చూపించి నివాసాలు ఏర్పరుచుకోవాలని, లేకపోతే శాంతియుతంగా ఇక్కడ నుంచి వెళ్లాలని సూచించారు. సాయంత్రంలోగా ఖాళీ చేయకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా వారు కదలకపోవడంతో సీపీ విష్ణు ఎస్.వారియర్ సహా పోలీసు బలగాలు భారీగా చేరుకుని జేసీబీలతో గుడిసెలను తొలగించారు.
గూడు ఆశ చూపారంటూ.. విలపించిన బాధితులు
భూదాన్ భూముల్లో ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇప్పిస్తా మని నమ్మించిన కొందరు డబ్బులు వసూలు చేశారని ఆందోళనకారులు కొందరు విలపించారు. గుడిసెలు వేసుకునేందుకు నాలుగేళ్ల క్రితం రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది. అధికారులు వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
ఆక్రమిస్తే కఠిన చర్యలు: కలెక్టర్
భూదాన్ భూములను ఆక్రమిస్తే సహించేది లేదని, ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు. ఆక్రమణదారులపై, వారిని ప్రోత్సహించిన వారిపై భూఆక్రమణ, క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment