huts
-
ఖమ్మం లింగయ్యనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, ఖమ్మం జిల్లా: ఖమ్మంలోని లింగయ్య నగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జేసీబీలతో గుడిసెలను తొలగించేందుకు ప్రైవేట్ వ్యక్తులు యత్నించారు. ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నామంటూ భూదాన్ భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. తమ ప్రాణాలైనా అర్పిస్తామంటున్న భూదాన్ భూ నిర్వాసితులు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది.అడ్డుకున్న భూదాన్ నిర్వాసితులపై దాడి జరిగింది. ఈ క్రమంలో మహిళలకు తీవ్ర గాయాలు కాగా, ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ వ్యక్తులను భూదాన్ భూ నిర్వాసితులు తరిమికొట్టారు.ప్రైవేట్ రౌడీలు వచ్చి పోలీసుల సమక్షంలో తమపై దాడికి పాల్పడుతున్న కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తమకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలనంటే పోలీసుల సమక్షంలో రౌడీలు వచ్చి తమపై దాడి చేయడమా అంటూ నిర్వాసితులు మండిపడ్డారు. -
భూదాన్ భూముల్లో ఉద్రిక్తత
ఖమ్మం అర్బన్: భూదాన్ భూముల్లో పేదలు ఇళ్ల స్థలాల కోసం రాత్రికి రాత్రే గుడిసెలు, రేకుల షెడ్లు వేయడం, ఉదయమే పోలీసులు వీటిని తొలగించడం.. వరస ఘటనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఖమ్మం నగరం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 147, 148, 149లోని భూదాన్ భూముల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు సూ ర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది ఆక్రమించి శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో గుడిసెలు వేశారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన రెవెన్యూ, పోలీసులు తొలగించేందుకు చేరుకోగా వేలాది మంది ఆందోళనకారులు అడ్డుకున్నారు. భూదాన్ భూముల కింద ప్రభుత్వం తమకు కేటాయించినందున ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. కర్రలతో అధికారులను అడ్డుకుని.. గుడిసెల తొలగింపునకు యత్నించిన యంత్రాంగాన్ని కర్రలతో అడ్డుకున్నారు. దీంతో అదనపు కలెక్టర్ మధుసూదన్ ఆందోళనకారుల ప్రతినిధులతో రెండు గంటలకుపైగా చర్చించారు. పత్రాలు ఉంటే చూపించి నివాసాలు ఏర్పరుచుకోవాలని, లేకపోతే శాంతియుతంగా ఇక్కడ నుంచి వెళ్లాలని సూచించారు. సాయంత్రంలోగా ఖాళీ చేయకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా వారు కదలకపోవడంతో సీపీ విష్ణు ఎస్.వారియర్ సహా పోలీసు బలగాలు భారీగా చేరుకుని జేసీబీలతో గుడిసెలను తొలగించారు. గూడు ఆశ చూపారంటూ.. విలపించిన బాధితులు భూదాన్ భూముల్లో ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇప్పిస్తా మని నమ్మించిన కొందరు డబ్బులు వసూలు చేశారని ఆందోళనకారులు కొందరు విలపించారు. గుడిసెలు వేసుకునేందుకు నాలుగేళ్ల క్రితం రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది. అధికారులు వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఆక్రమిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ భూదాన్ భూములను ఆక్రమిస్తే సహించేది లేదని, ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు. ఆక్రమణదారులపై, వారిని ప్రోత్సహించిన వారిపై భూఆక్రమణ, క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. -
తీవ్ర ఉద్రిక్తత.. పేదల గుడిసెలు కూల్చివేత
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలో ప్రభుత్వ భూమిలో వెలసిన గుడిసెలను అధికారులు తొలగించారు. 255/1 సర్వే నెంబర్ లోని పదెకరాల భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తొలగింపును అడ్డుకునేందుకు పేదలు యత్నించడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో అధికారులతో గుడిసెవాసుల వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వెళ్ళిపోవాలంటూ గుడిసె వాసుల ఆందోళన చేపట్టారు. గుడిసె వాసులను బలవంతంగా పోలీసులు నెట్టివేసి గుడిసెలు తొలగించారు. కాగా అధికారులు పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు ప్రక్రియ చేపట్టడం ఇది నాలుగోసారి. -
అయిదంతస్తుల గుడిసెలివి
-
భగత్‌సింగ్‌నగర్‌లో అగ్ని ప్రమాదం
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లిలోని భగత్‌సింగ్‌నగర్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భగత్‌సింగ్‌నగర్‌లో 75కు పైగా గుడిసెలు ఉండగా అందులో చిన్నమద్దిలేటి, రాజులకు చెందిన గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదంపై స్థానికులు ఫైర్ సిబ్బందికి, చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. తప్పిన పెను ప్రమాదం.. భగత్‌సింగ్‌నగర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం వల్ల రెండు గుడిసెలు కాలిబూడిదయ్యాయి. అయితే మంటలు మిగిలిన గుడిసెలకు అంటుకుని ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు చెబుతున్నారు. సకాలంలో ఫైర్ సింబ్బంది అక్కడకు చెరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని పేర్కొన్నారు. భగత్‌సింగ్‌నగర్‌లో పనిచేసే వారంతా అడ్డమీది కూలీలు కావడంతో ఉదయం 9గంటల లోపే వారు పనిలోకి వెళ్లిపోతారు. ఈ క్రమంలోనే చిన్నమద్దిలేటి భార్య వంటచేసిన అనంతరం నిప్పులను ఆర్పకుండా పనికి వెళ్లింది. దీంతో ఆ నిప్పురవ్వలతోనే గుడిసెకు మంట అంటుకొని ప్రమాదం సంభవించినట్లు పలువురు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ గ్యాస్ సిలిండర్లు పేలలేదని, ఇదే ఘటన రాత్రి సమయంలో జరిగితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని భగత్‌సింగ్‌నగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకుంటాం.. అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ అసెంబ్లీ నుంచి నేరుగా ఘటన స్థాలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయిన గుడిసెవాసులకు న్యాయం చేస్తామని, నష్టపరిహారం అందేలా చూస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ భరోసా కల్పించారు. బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, కార్పొరేటర్ కె.రవిచారి, టీఆర్ఎస్ నాయకులు ముఠా జైసింహా, ముచ్చకుర్తి ప్రభాకర్, దామోదర్‌రెడ్డి, బబ్లూ, ఆర్.వివేక్ తదితరులు బాధితులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
జాగా కోసం జాతరలా..
ఖమ్మం అర్బన్: ఇంకా గురువారం తెల్లవారలేదు. ఓ పక్క మంచుతెరలు.. మరోపక్క వర్షం కురిసేలా ఉన్న మబ్బులు.. ఆ సమయానికే వేల సంఖ్యలో పేద ముస్లింలు ఖమ్మం 14వ డివిజన్లోని గొల్లగూడెంలోని వక్ఫ్‌బోర్డు భూముల్లో గుడిసెలు వేసుకునేందుకు చేరుకున్నారు. పోలీసులు కూడా పసిగట్టలేనంత రహస్యంగా పెద్దసంఖ్యలో సామగ్రితో సహా చేరుకున్నారు. ఇంటి జాగా కోసం జాతరలా వచ్చిన వారు హద్దులు ఏర్పాటుచేసుకుని గుడిసెలు వేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న ఏసీపీ ఆంజనేయులు సిబ్బందితో చేరుకుని నచ్చచెప్పినా వారు వెనక్కి వెళ్లలేదు. మతపెద్దలైన ముజావర్లను పిలిపించి మాట్లాడించినా వినలేదు. తామంతా నిరుపేదలమని, ఇళ్ల అద్దె కట్టలేక గుడిసెలు వేసుకుంటున్నామని చెప్పారు. మధ్యాహ్నం భారీ వర్షం పడినా వెళ్లకుండా అక్కడే ఉండిపోయిన వారు రాత్రి 9 గంటల కు వెనుదిరిగారు. గొల్లగూడెం రెవెన్యూ పరిధి లో ఈద్గాను ఆనుకుని సుమారు 80 ఎకరాల మేర వక్ఫ్ బోర్డు భూములున్నాయి. ఇందు లో ఇప్పటికే ఐదెకరాలకుపైగా ఆక్రమణకు గురైంది. వక్ఫ్‌బోర్డు అంటే ముస్లింలకు చెందిన భూములని, వాటిపై సర్వ హక్కులు ముస్లింలకే ఉంటాయని నమ్మబలికిన దళారులు డబ్బు వసూలు చేసి గుడిసెలు వేసేందుకు పురిగొల్పినట్లు తెలుస్తోంది. -
గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8మంది దుర్మరణం
గాంధీనగర్: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమ్మేలీ జిల్లాలోని బధాడా గ్రామంలో సోమవారం తెల్లవారు జామున రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యవాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 నుంచి 13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. క్రేన్‌ను తరలిస్తున్న సమయంలో ట్రక్కు అదుపుతప్సి గుడిసెలోకి దూసుకెళ్లిట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో గుడిసెలో పది మంది నిద్రిస్తున్నారని, వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఘటనాస్థలిలోనే ఎనిమిది మంది చనిపోయారని, మరో ఇద్దరు తీవ్ర గాయపడ్డారని అమ్రేలి ఎస్పీ నిర్లిప్త్‌రాయ్ తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పెర్కోన్నారు. -
ఐదు పూరిళ్లు దగ్ధం
-
ఐదు పూరిళ్లు దగ్ధం
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని కవిటి మండలం మాణిక్యపురంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. దీంతో పది లక్షలు ఆస్తి నష్టం సంభవించింది. ఫైరింజన్లు ప్రమాద ఘటనాస్థలికి సకాలంలో చేరుకోకపోవడంతో ఇళ్లన్నీ కాలి బూడిదయ్యాయి. గ్రామస్థులు అందరూ కలసి మంటలను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. -
కోడుమూరులో అగ్ని ప్రమాదం
- 3గుడిసెలు, గడ్డివామి దగ్ధం.. - రూ.6లక్షల ఆస్తి నష్టం.. కోడుమూరు రూరల్: పట్టణంలోని గొల్లవీధిలో ప్రమాదవశాత్తూ గడ్డివాముకు నిప్పంటుకొని పక్కనే ఉన్న మూడు నివాస గుడిసెలు దగ్ధమైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన రైతు నక్క గోరంట్లకు చెందిన గడ్డివాముకు నిప్పంటుకొని గాలికి పక్కనే ఉన్న సుశీలమ్మ, సరోజమ్మ, గిడమ్మ, జైపాల్ గుడిసెలకు మంటలు వ్యాపించాయి. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు. సుశీలమ్మ, సరోజమ్మ కొట్టాలు పూర్తిగా కాలిపోవడంతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. జైపాల్ టీ దకాణం కాలిపోగా, గిడ్డమ్మ రేకుల షెడ్డు మంటల వేడికి సగానికి పైగా దెబ్బతింది. అగ్ని ప్రమాదంలో సుమారు రూ.6లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. యువకుల సాహసం ఒక వైపు గాలికి ఎగిసిపడుతున్న మంటలను సైతం లెక్కచేయకుండా కాలనీ యువకులు బకెట్లు, బిందెలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. 2గంటలకు పైగా యువకులు, అగ్నిమాపక సిబ్బంది పోరాడి మంటలు మిగతా గుడిసెలకు వ్యాపించకుండా నివారించగలిగారు. -
అగ్నిప్రమాదం.. 70 ఇళ్లు దగ్ధం
వేలేరుపాడు: పశ్చిమగోదావరిజిల్లా వేలేరుపాడు మండలం కట్కూరులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 70 పూరిళ్లు దగ్ధమయ్యాయి. పలువురు గాయపడ్డారు. ఓ ఇంట్లో సిలిండర్ పేలిన కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. బాధితులు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. -
పేదల బతుకులు బుగ్గి
- అగ్ని ప్రమాదంలో పది గుడిసెలు దగ్ధం - కాలి బూడిదైన సామగ్రి - కట్టుబట్టలతో బయటపడిన బాధితులు - రూ.25 లక్షల ఆస్తి నష్టం - బాధిత కుటుంబాలను గౌరు వెంకటరెడ్డి పరామర్శ కల్లూరు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కర్నూలు నగరం 36వ వార్డులోని మేదర వీధిలో పది గుడిసెలు దగ్ధమయ్యాయి. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. మహిళా మేదరులు ఇంటి ముంగిట పనులు చేస్తుండగా విద్యుత్ వైర్లు అంటుకొని ఒక గుడిసెలో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. గాలి ఉద్ధృతంగా మిగతా గుడిసెలు కూడా అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి. ఇక్కడ ఉండే వారంతా కూలీలే కావడంతో వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఉన్న కొంది మంది మంటలను అదుపు చేయలేకపోయారు. విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేయడంతో వారు వచ్చి మంటలను ఆర్పేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నారాయణ ఇంట్లో 20 తులాల వెండి, 2 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేలు నగదుతో పాటు టైలరింగ్ దుస్తులు, గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. అలాగే బేకరిలో పనిచేస్తున్న టీఎం ఎల్లయ్య ఇంట్లో బీరువాలో ఉంచిన రూ. లక్ష నగదు బంగారు, వెండి ఆభరణాలు కాలిపోయాయి. తిమ్మప్ప ఇంట్లో 25 తులాల వెండి ఆభరణాలు, పొదుపు సంఘంలో చెల్లించాల్సిన రుణం రూ.30 వేలు, అలాగే పి.శోభ ఇంట్లో.. ఆరు తులాల బంగారు, రూ.లక్ష నగదు బూడిదయింది. పెద్ద కుమార్తె వివాహం చేయాలనే ఆలోచనతో కూడబెట్టుకున్న డబ్బు కాలిపోయిందని ఆమె కన్నీటి పర్యంతమైంది. పి.శాంతమ్మ,, యాదమ్మ,, వెంకటేష్ , పరుశరాముడు , వెంకటేష్ , సవారమ్మ , హేమలత ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం రూ. 25 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. వీరంతా పేదలే. అగ్ని ప్రమాదంలో దాచుకున్నదంతా కాలిపోయి వీరి బతుకులు బుగ్గయ్యాయి. బాధితకుటుంబాలకు పరామర్శ.. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు 5 బియ్యం ప్యాకెట్లు, 10 కిట్ల కిరాణం సరుకులు, రూ. 10 వేలు నగదుతోపాటు దుస్తులు అందజేశారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు వార్డు ఇన్చార్జ్ ఆంజనేయులు, నాయకులు అంజి, ఇమ్మానియేలు, శ్రీను, శ్యామ్సన్, దేవా, కుమార్, మద్ది, జంగాల సుంకన్న తదితరులు ఉన్నారు. అలాగే బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బాధిత కుటుంబాలను పరమార్శించి ఒక్కొక్క కుటుంబానికి రూ. 2 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేశారు. మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏరాసు ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబాలను పరమార్శించి ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున అందజేశారు. స్థానిక నాయకురాలు పార్వతమ్మ, శివకుమార్ బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి రూ. 3 వేల నగదు అందజేశారు. -
అల్లుడి కిరాతకం
- భార్యను కాపురానికి పంపలేదని అత్తారింటికి నిప్పుపెట్టిన అల్లుడు - తృటిలో ప్రాణాలతో బయటపడిన పది మంది - మూడు గుడిసెలు దగ్ధం - రూ.2 లక్షల ఆస్తినష్టం - ఆలస్యంగా వెలుగులోకి కుటుంబ కలహాలతో ఓ అల్లుడి కిరాతకంగా మారాడు. భార్య తరపు కుటుంబీకులందరినీ అంతమొందించాలని కుట్ర పన్నాడు. ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి గ్రామానికి చేరుకుని గుడిసెలకు నిప్పుపెట్టాడు. అయితే అంతకు ముందు జరిగినఽ ఓ ఘటనతో పది మంది తృటిలో ప్రాణాలను దక్కించుకున్నారు. వరుసగా ఉన్న మూడు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అందులో సామగ్రి మొత్తం కాలి బూడిదైంది. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. - కొత్తసిద్దేశ్వరం (జూపాడుబంగ్లా) కొత్త సిద్ధేశ్వరం గ్రామానికి చెందిన చెంచురామయ్యకు కుమారుడు శీనుతోపాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె నాగమణికి 15 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా జిల్లా చీమకుర్తి సమీపంలోని భ్రైసీకి చెందిన బ్రహ్మయ్యతో వివాహమైంది. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ కలహాలతో ఏడాది క్రితం నాగమణి పుట్టింటికి చేరుకుంది. ఇటీవల భార్యను కాపురానికి పంపాలని బ్రహ్మయ్య అత్తామామలను కోరగా పెద్దమనుషులను తీసుకొస్తే పంపుతామని వెనక్కు పంపారు. దీంతో అతను వారిపై కక్ష పెంచుకుని భార్య తరపు వారందరిని తుదిముట్టించాలని కుట్ర పన్నాడు. మేకల పెంపకం, నాటువైద్యం చేస్తూ చెంచురాయమ్య, అతని కుమారుడు శీను, పెద్ద అల్లుడు పోలయ్య ఊరికి శివారులో ఒకరి తర్వాత ఒకరు గుడిసెలు వేసుకొని అందులో జీవనం కొనసాగిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం చెంచురామయ్యకు పక్షవాతం రావటంతో అతనికి దొర్నిపాడు మండలం గుండుపాపలలో పసరు తాపించేందుకు అందరూ వెళ్లారు. ఈ విషయం తెలియని బ్రహ్మయ్య అర్ధరాత్రి కొత్తసిద్దేశ్వరం చేరుకుని భార్య తరుపు కుటుంబీకులను అంతమొందించాలని మూడు గుడిసెలకు నిప్పుపెట్టాడు. ఊరికి శివారులో ఉండటంతో మొదట మంటలను ఎవరూ గుర్తించలేదు. ఆలస్యంగా తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈలోగా గుడిసెలు పూర్తిగా దగ్ధమై అందులోని సామగ్రి కాలి బూడిదైంది. అక్కడికి సమీపంలో పొదల్లో ఉన్న బ్రహ్మయ్యను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు పట్టించే లోపే తప్పించుకొని పారిపోయాడు. ప్రమాదంలో నాలుగు టీవీలు, రూ.30వేల నగదు, బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనం, సైకిల్ తదితర సామగ్రి అంతా కాలిపోయాయి. దాదాపు రూ.2లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. పొరపాటున బాధితులు ఇంట్లో నిద్రించి ఉంటే పది మంది సజీవ దహనమయ్యేవారు. శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన చెంచురామయ్య కుటుంబసభ్యులు జరిగిన సంఘటనను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రస్తుతం గ్రామ పాఠశాలలో తలదాచుకున్నారు. శనివారం ఉదయం వారు జరిగిన విషయమై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రెండు పూరిళ్లు దగ్ధం
మామిడిపల్లి (సంతకవిటి) : మామిడిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రదాన విద్యుత్ సరఫరాకు సంబంధించిన విద్యుత్ స్తంభం ఆకస్మికంగా శనివారం నేలకొరిగింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభం దిగువ భాగం పాడవ్వడంతో స్తంభం నేలకొరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యు™Œ lస్తంభం పక్కనే ఉన్న వంపూరు రమేష్, రమణకు చెందిన పూరిళ్లకు మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో రమేష్, రమణ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాజాం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో త్రుటిలో ప్రాణహాని తప్పిందని, బాధితులు కట్టుబట్టలతో మిగిలిపోయారని స్థానికులు తెలిపారు. ఇంట్లో దాచుకున్న నగదు, బంగారు ఆభరణాలు ప్రమాదంలో కాలిపోయాయి. విద్యుత్ శాఖ ఏఈ టంకాల వెంకటశ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. -
న్యాయ వ్యవస్థను గుడిసెలు, అద్దెభవనాల్లోకి తరలించలేం
- ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు సిటీ: ఉన్నపాటుగా మిగిలిన శాఖలతో పాటు న్యాయవ్యవస్థను గుడిసెలు, అద్దె భవనాల్లోకి తరలించలేమని టీడీపీ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వానికి, న్యాయాధికారులకు తెలుసన్నారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ..ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏపీకి 10 సంవత్సరాల పాటు పాలించే హక్కుందన్నారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డు పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులో ముఖ్యమైనవి ఉంటాయని, వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. వారికి సరైన సౌకర్యాలు కల్పించాకే నూతన రాజధానికి మారుస్తామని చెప్పారు. న్యాయవాదులను 60:40 నిష్పత్తిలో విభజిస్తామంటే అడ్డుపడుతున్నారని, రాష్ట్రం విడిపోయిన తరువాత బార్ కౌన్సిల్ విడిపోవాల్సి ఉందని దీన్ని తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఆస్తులు, నీటి పంపకాల విషయంలో కూర్చునేందుకు సమయం కేటాయించదని ఎద్దేవా చేశారు. ఎక్కడ శాంతి భద్రతల విషయంలో కోర్టులు అంతిమతీర్పులు ఇస్తాయో, అక్కడే శాంతికి విఘాతం కలిగే పరిస్థితి చరిత్రలో ఇంతకుముందు జరగలేదన్నారు. ఉమ్మడి రాజధానిలో ఇష్టప్రకారం వ్యవహరిస్తే కుదరదని సోమిరెడ్డి అన్నారు. -
గుడిసెలను కూల్చేసిన అధికారులు
మంగపేట: అటవీ ప్రాంతంలో అక్రమంగా నిర్మించుకున్న గుడిసెలను అటవీ అధికారులు తొలగించారు. వరంగల్ జిల్లా మంగపేట మండలం మల్లూరు వాగు ప్రాజెక్టు సమీపంలో జాజిగిరిగుట్ట వద్ద సుమారు 10 గొత్తికోయ కుటుంబాలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వీరు గతంలో నర్సాయిగూడెం సమీపంలో ఉండేవారు. అయితే, తమ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, అక్కడి నుంచి ఖాళీ చేయాలని గ్రామస్తులు హెచ్చరించారు. దీంతో వారు గతిలేని పరిస్థితుల్లో జాజిగిరిగుట్ట వద్ద గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. గుడిసెలు వేసుకుంటే వాటిని కూల్చేస్తామని అటవీ అధికారులు ముందుగానే హెచ్చరించినా వినిపించుకోలేదు. అడవికి ముప్పుగా భావించిన అధికారులు బుధవారం సాయంత్రం వాటిని కూల్చివేసి కలపను వాహనాల్లో తరలించారు. -
గుడిసెలులేని హైదరాబాద్ నా కల
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్: ఎన్ని వందల కోట్లు ఖర్చైనా సరే రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు కట్టించి తీరుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. గోల్ఫ్ కోర్సులు, రేస్ కోర్సులు, పేకాట క్లబ్బులకు వందల ఎకరాల భూములు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి, ఖైరతాబాద్‌లలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో సీఎం ముఖ్యఅతిథిగా హాజరై పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గుడిసెలు లేని హైదరాబాద్ నా కల. ప్రతి పేద కుటుంబానికి రెండు పడకల ఇల్లు కట్టించి తీరుతాం. ఖాళీగా ఉన్న రెండు వేల ఎకరాల భూమి గుర్తించాం. 2.5 లక్షల మంది పేదలకు దశల వారీగా ఇళ్లు కట్టించి ఇస్తాం. జీవో 58 కింద అతి తక్కువ సమయంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టడం సంతోషంగా ఉంది.’ అని పేర్కొన్నారు. తాను జగమొండినని, ఎవ్వరికీ భయపడ నని స్పష్టం చేశారు. తెలంగాణలోని 10 జిల్లాల్లో లక్షా 25 వేల మందికి ప్రస్తుతం పట్టాలు పంపిణీ చేస్తుండగా, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే లక్ష మందికి ఇళ్ల పట్టాలు అందుతున్నాయన్నారు. ఈ మొత్తం భూముల విలువ రూ.10 వేల కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా పట్టాలు అందజేయడం గొప్ప అనుభూతిని ఇస్తుందని చెప్పారు. గత ప్రభుత్వాలు పేదల గుడిసెలను బుల్డోజర్లతో కూల్చివేశాయని ఆవే దన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన పార్టీ కార్యాలయం కోసం భీంరావు బాడా బస్తీని బలవంతంగా ఖాళీ చేయించిందని విమర్శించారు. వరంగల్ జిల్లా మడికొండలో పీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, అలాంటి భూములపైనా కేసులు పెట్టి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. జీవో 58 కింద ఇప్పటివరకు మొత్తం 3.36 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. లక్షా 25 వేల మందికి పట్టాలు అందజేస్తున్నామన్నారు. మిగతా 2 లక్షల ఇళ్లలో కొన్ని చెరువు శిఖం భూముల్లో, దేవాదాయ భూముల్లో ఉన్నాయని, కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయని తెలిపారు. అన్నింటిని పరిష్కరించి మరో నాలుగైదు నెలల్లో వారికి కూడా పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం అందరం కలసి కట్టుగా పని చేయాలని సూచించారు. ఈ నెల 9న స్వచ్ఛ హైదరాబాద్ కమిటీ సమావేశమవుతుందని తెలిపారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ కేకే, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అక్క లెటర్ నా జేబులోనే ఉంది.. తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రజాగాయకుడు గద్దర్ భార్య విమలక్క తనకు రాసిన లెటర్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అల్వాల్ ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అక్క ( విమలక్క) కోరింది. ఆ లెటర్ నా జేబులోనే ఉందంటూ ప్రజలకు చూపారు. సభ అనంతరం సీఎం స్వయంగా విమలక్క వద్దకు వెళ్లి మీకు ఇచ్చిన హామీ నెరవేరుస్తానని చెప్పారు. లైటింగ్ ఏర్పాట్లను తిలకించిన సీఎం రాష్ట్రావతరణ ఉత్సవాల్లో భాగంగా రాజధానిలో పలుచోట్ల ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణను సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి తిలకించారు. కాచిగూడ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ క్లాక్ టవర్, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహంపై ఏర్పాటు చేసిన త్రీడీ లైటింగ్‌ను ఆయన ఆసక్తిగా గమనించారు. అలాగే ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, నెక్లెస్‌రోడ్, రాజ్‌భవన్ తదితర ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను కూడా చూశారు. త్రీడీ లైటింగ్ నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని, నగరమంతా పండుగ వాతావరణం నెలకొందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ట్యాంక్ బండ్‌పై ముగింపు వేడుకలు నిర్వహించనున్న దృష్ట్యా అక్కడ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలను చేశారు. సీఎం వెంట హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
3వ ప్రభాగ్ సమితిలోగుడిసెల క్రమబద్ధీకరణకు పచ్చజెండా
భివండీ, న్యూస్‌లైన్ : భివండీ నిజాంపూర్ షహర్ మహానగర్ పాలిక మూడో ప్రభాగ్ సమితి పరిధిలోని గుడిసెలను క్రమబద్దీకరించేందుకు కమిషనర్ అంగీకరించారు. సోమవారం ఈ మేరకు కమిషనర్ నిర్ణయం తీసుకున్నారని కార్పొరేటర్ సంతోష్ ఎం.శెట్టి మంగళవారం తెలిపారు. కొన్నేళ్ల కిందట వెలసిన ఈ గుడిసెవాసులు కార్పొరేషన్‌కు క్రమం తప్పకుండా పన్ను కడుతున్నారు. అయితే వారి పన్ను పత్రాలపై ‘అక్రమంగా వెలసిన గుడిసెలు’ అని కార్పొరేషన్ అధికారులు ముద్ర వేశారు. ఆ ముద్రను తొలగించాలని 2008 నుంచి స్థానిక కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఒక్క గుడిసెకు రూ.60 ఉన్న పన్నును రూ.500 నుంచి రూ.600 వరకు పెంచారు. అయినప్పటికీ గుడిసెవాసులు ఆ మొత్తాన్ని పన్నుగా చెల్లిస్తున్నారని, కానీ అక్రమ గుడిసెలు అన్న ముద్రను మాత్రం తొలగించలేదని సంతోష్ శెట్టి చెప్పారు. సోమవారం జరిగిన కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని కార్పొరేటర్లు సంతోష్ శెట్టితో పాటు మేయర్ తుషార్ చౌదరి, కార్పోరేటర్లు నిలేష్ చౌదరి, ప్రభాగ్ సమితి మూడు సభాపతి లలిత నితిన్ భజాగే, హనుమాన్ చౌదరి, కమ్లాకర్ పాటిల్, అల్కా నారాయణ్ చౌదరి, పూనం పాటిల్‌లు లేవనెత్తారు. వెంటనే అక్రమ అనే ముద్రను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కమిషనర్ జీవన్ సోనావునే ఆ ముద్రను తొలగించేందుకు అంగీకరించారని సంతోష్ శెట్టి చెప్పారు. కమిషనర్ ప్రకటన పట్ల ప్రభాగ్ సమితి మూడు పరిధిలోని వేలాది మంది తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. గుడిసెలపై అక్రమ ముద్రను తొలగించి, క్రమబద్ధీకరించేందుకు అంగీకరించిన కమిషనర్ జీవన్ సోనావునేను పలువురు తెలుగు ప్రముఖులు సన్మానించారు. మంగళవారం ఉదయం కార్పొరేషన్ ముఖ్య కార్యాలయంలో కామత్‌ఘర్ సేవ సమితి అధ్యక్షులు సుదామ్ సావంత్, సచ్చిన వేలేకర్, మామిడాల మల్లేశం, డాక్టర్ సదానందం, డాక్టర్ చెన్న రాజమల్లయ్య, తదితర్లు కమిషనర్ జీవన్ సోనావునేకు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తుషార్ చౌదరికి, సంతోష్ ఎమ్. శెట్టితో పాటు ఇతర కార్పొరేటర్లకు అభినందనలు తెల్పినారు. -
గుడిసెలు లేని రాష్ట్రమే లక్ష్యం
ఆదిలాబాద్ టౌన్/ఆదిలాబాద్ అర్బన్ : ఏ ఒక్కరూ గుడిసెల్లో నివసించకుండా అందరికీ పక్కా గృహాలు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేయాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఇప్పటికీ జిల్లాలో 92వేల మంది గుడిసెల్లో జీవిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని తెలిపారు. సోమవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సరసభ్య సమావేశం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ‘మన జిల్లా-మన ప్రణాళిక’పై చర్చించారు. ముఖ్య అతిథులుగా శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తోపాటు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అమలు కోసం ప్రభుత్వం మన ఊరు-మన ప్రణాళిక, మన జిల్లా-మన ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లల ఆరోగ్య పరిస్థితులు బాగా లేకుంటే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చైల్డ్ మొబైల్ కేర్ వ్యాన్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. జిల్లాను పర్యాటక ప్రాంతంగా మార్చుకుంటే రెండో కాశ్మీర్‌గా రూపొందుతుందని తెలిపారు. ఉచిత నిర్బంధ విద్యను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కొమురంభీం పోరాట స్మృతిని గుర్తు చేసుకునేందుకు భవనం ఏర్పాటు కోసం ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకోవాలని, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులతో స్నేహభావంతో మెలగాలని తెలిపారు. ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీలు గొడం నగేష్, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరయ్యారు. జిల్లాతో పాటు ఆయా నియోజకవర్గాల సమస్యలను సమావేశంలో గళమెత్తారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి అందించాలని మంత్రికి, జెడ్పీ చైర్ పర్సన్‌కు విన్నవించారు. -
బతుకు బుగ్గి
నగరంలో శుక్రవారం తెల్లవారుజామున స్వల్పవ్యవధిలో చోటుచేసుకున్న రెండు అగ్నిప్రమాదాలు ప్రజలను భయకంపితులను చేశాయి. ఒక ప్రమాదంలో సుమారు 150 గుడిసెలు కాలిబూడిదయ్యూరుు. దీంతో పేద ప్రజలు సర్వం కోల్పోరుు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. మరో సంఘటన ప్రజల కంటిపై కునుకులేకుండా చేసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: నుంగంబాకం పుష్పానగర్ కరుమారియమ్మన్ కోవిల్ సమీపంలో సుమారు 500కు పైగా గుడిసెలు ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఒక గుడిసెలో మంటలు చెలరేగారుు. ఆ ఇంటి లో కాపురం ఉంటున్న వారు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. వీరి కేకలకు మేల్కొన్న ఇరుగుపొరుగు వారు కూడా మంటలను చూసి భయంతో బయటకు వచ్చారు. అదే సమయంలో బలమైన గాలులు వీయడంతో అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. మంచి నిద్రలో ప్రమాదం సంభవించడంతో ప్రజలు షాక్ నుంచి తేరుకునేలోగా గుడిసెలన్నీ కాలిబూడిదయ్యూరుు. ఇళ్లలోని టీవీలు, ఫర్నిచర్, బీరువాలు తదితర సామగ్రి కాలిబూడిదయ్యూరుు. గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. అక్కడికి సమీపంలో పార్కు చేసి ఉన్న 10 మోటార్ సైకిళ్లు కూడా కాలిబూడిదయ్యూరుు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో సుమారు 150 గుడిసెలు కాలిపోయూరుు. ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు. సుమారు రూ.10 లక్షల నష్టం సంభవించినట్టు అధికారులు అంచనావేశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న రాష్ట్ర మంత్రి వలర్మతి, నగర మేయర్ సైదై దురైస్వామి ఉదయాన్నే వచ్చి బాధితులను పరామర్శించారు. ఇంట్లో దాచుకున్న డబ్బు, రేషన్ కార్డులు, గుడ్డలు సహా కాలిపోగా కట్టుబట్టలతో మిగిలామని బాధితులు కన్నీరుమున్నీరయ్యూరు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని బాధితులకు మంత్రి భరోసా ఇచ్చారు. రెవెన్యూ అధికారులు వచ్చి బాధితుల వివరాలను సేకరించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్ పేలుడు చేట్‌పట్ సమీపంలో ఒక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో పెద్ద టాన్స్‌ఫార్మర్ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. పేలుడు ధాటికి శకలాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో చేట్‌పట్, కీల్పాక్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా పేలుడు శబ్దాలు వినపడం, పూర్తిగా చీకట్లు కమ్ముకోవడంతో ఏమి జరిగిందోనని ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఐదు అగ్నిమాపక యంత్రాలతో అక్కడికి చేరుకున్న సిబ్బంది రెండుగంటపాటు హోరాహోరీగా పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ సరఫరా లేనికారణంగా ఆ పరిసరాల ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. శుక్రవారం సాయంత్రానికి దశలవారీగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
మురికివాడల్లో మనమే ఫస్ట్
సాక్షి, ముంబై: దేశంలోనే అత్యధిక మురికివాడలు, గుడిసెలు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ విషయం నేషనల్ శాంపిల్ సర్వే(ఎన్ఎస్ఎస్) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అత్యధిక గుడిసెలు వెలసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచిందని వెల్లడించింది. ఎన్ఎస్ఎస్ సర్వే గణాంకాల ప్రకారం...2012 డిసెంబర్‌నాటికి దేశంలో ఉన్న గుడిసెల్లో 23 శాతం రాష్ట్రంలోనే ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 13.5 శాతం, పశ్చిమ బెంగాల్లో 12 శాతం గుడిసెలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.దేశంలో సుమారు 33,510 గుడిసెలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో 41 శాతం గుడిసెలు నోటిఫై అయినవి కాగా, 59 శాతం నోటిఫైడ్ లేనివి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 23 శాతం నోటిఫైడ్ గుడిసెలు ఉండగా, మహారాష్ట్రలో 14 శాతం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో తొమ్మిది శాతం ఉన్నాయి. ఇక నాన్ నోటిఫైడ్ గుడిసెల సంఖ్య దేశవ్యాప్తంగా 19,749 ఉండగా, అందులో మహారాష్ట్రలో 29 శాతం, పశ్చిమ బెంగాల్లో 14 శాతం, గుజరాత్లో 10 శాతం ఉన్నాయి. రాష్ట్రంలో 7,723 గుడిసెలు... రాష్ట్రంలో మొత్తం 7,723 గుడిసెలు వెలిశాయి. దేశవ్యాప్తంగా 38 శాతం గుడిసెల్లో నివసించే కుటుంబాలు రాష్ట్రంలో ఉండడం గమనార్హం. 18 శాతం ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నాయి. దేశంలో సుమారు 88 లక్షల మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్న గుడిసెల్లో నివసిస్తున్నారు. వారిలో 56 లక్షల మంది నోటిఫైడ్, 32 లక్షల మంది నాన్ నోటిఫైడ్ గుడిసెలకు చెందిన వారున్నారు. దేశంలో నోటిఫైడ్ గుడిసెల్లో 63 శాతం కుటుంబాలు నివసిస్తున్నాయి. నాన్ నోటిఫైడ్ విషయానికొస్తే ఈ గుడిసెల్లో 40 శాతం కుటుంబాలు రాష్ట్రంలో ఉండడం గమనార్హం. రాష్ట్రం తర్వాత గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లు ఉన్నాయి. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో గుడిసెల సమస్య కొత్తదేమీ కాదు. అయితే ఇతర రాష్ట్రాల కన్నా అత్యధిక మురికివాడలు, గుడిసెలు రాష్ట్రంలో ఉండడం గమనార్హం.