గుడిసెలులేని హైదరాబాద్ నా కల
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్: ఎన్ని వందల కోట్లు ఖర్చైనా సరే రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు కట్టించి తీరుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. గోల్ఫ్ కోర్సులు, రేస్ కోర్సులు, పేకాట క్లబ్బులకు వందల ఎకరాల భూములు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి, ఖైరతాబాద్‌లలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో సీఎం ముఖ్యఅతిథిగా హాజరై పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గుడిసెలు లేని హైదరాబాద్ నా కల. ప్రతి పేద కుటుంబానికి రెండు పడకల ఇల్లు కట్టించి తీరుతాం.
ఖాళీగా ఉన్న రెండు వేల ఎకరాల భూమి గుర్తించాం. 2.5 లక్షల మంది పేదలకు దశల వారీగా ఇళ్లు కట్టించి ఇస్తాం. జీవో 58 కింద అతి తక్కువ సమయంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టడం సంతోషంగా ఉంది.’ అని పేర్కొన్నారు. తాను జగమొండినని, ఎవ్వరికీ భయపడ నని స్పష్టం చేశారు. తెలంగాణలోని 10 జిల్లాల్లో లక్షా 25 వేల మందికి ప్రస్తుతం పట్టాలు పంపిణీ చేస్తుండగా, ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే లక్ష మందికి ఇళ్ల పట్టాలు అందుతున్నాయన్నారు. ఈ మొత్తం భూముల విలువ రూ.10 వేల కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా పట్టాలు అందజేయడం గొప్ప అనుభూతిని ఇస్తుందని చెప్పారు. గత ప్రభుత్వాలు పేదల గుడిసెలను బుల్డోజర్లతో కూల్చివేశాయని ఆవే దన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన పార్టీ కార్యాలయం కోసం భీంరావు బాడా బస్తీని బలవంతంగా ఖాళీ చేయించిందని విమర్శించారు. వరంగల్ జిల్లా మడికొండలో పీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, అలాంటి భూములపైనా కేసులు పెట్టి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
జీవో 58 కింద ఇప్పటివరకు మొత్తం 3.36 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. లక్షా 25 వేల మందికి పట్టాలు అందజేస్తున్నామన్నారు. మిగతా 2 లక్షల ఇళ్లలో కొన్ని చెరువు శిఖం భూముల్లో, దేవాదాయ భూముల్లో ఉన్నాయని, కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయని తెలిపారు. అన్నింటిని పరిష్కరించి మరో నాలుగైదు నెలల్లో వారికి కూడా పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం అందరం కలసి కట్టుగా పని చేయాలని సూచించారు. ఈ నెల 9న స్వచ్ఛ హైదరాబాద్ కమిటీ సమావేశమవుతుందని తెలిపారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ కేకే, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
అక్క లెటర్ నా జేబులోనే ఉంది..
తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రజాగాయకుడు గద్దర్ భార్య విమలక్క తనకు రాసిన లెటర్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అల్వాల్ ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అక్క ( విమలక్క) కోరింది. ఆ లెటర్ నా జేబులోనే ఉందంటూ ప్రజలకు చూపారు. సభ అనంతరం సీఎం స్వయంగా విమలక్క వద్దకు వెళ్లి మీకు ఇచ్చిన హామీ నెరవేరుస్తానని చెప్పారు.
లైటింగ్ ఏర్పాట్లను తిలకించిన సీఎం
రాష్ట్రావతరణ ఉత్సవాల్లో భాగంగా రాజధానిలో పలుచోట్ల ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణను సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి తిలకించారు. కాచిగూడ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ క్లాక్ టవర్, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహంపై ఏర్పాటు చేసిన త్రీడీ లైటింగ్‌ను ఆయన ఆసక్తిగా గమనించారు. అలాగే ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, నెక్లెస్‌రోడ్, రాజ్‌భవన్ తదితర ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను కూడా చూశారు. త్రీడీ లైటింగ్ నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని, నగరమంతా పండుగ వాతావరణం నెలకొందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ట్యాంక్ బండ్‌పై ముగింపు వేడుకలు నిర్వహించనున్న దృష్ట్యా అక్కడ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలను చేశారు. సీఎం వెంట హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు ఉన్నారు.