విలేకరుల సమావేశంలో సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్ : సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిగ్గురాదని శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. 2013లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఒప్పించిందని అన్నారు. యాభై శాతం నిబంధనను పక్కన పెట్టి 60 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని పేర్కొన్నారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు లేకుండా సస్పెండ్ చేసి బిల్లును పాస్ చేశారని మండిపడ్డారు. సలహాలు ఇస్తామన్నా ఒప్పుకోకుండా.. ఇప్పుడు తప్పు ప్రతిపక్షంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంత పెద్ద అంశంపై కోర్టు వాదనలు జరుగుతుంటే అడ్వకేట్ జనరల్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. బీసీలపై కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ది తాను చెప్పిందే ఖానూన్ అనే వైఖరి అని.. అందుకే కోర్టు మొట్టికాయలు వేస్తోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌ది ఓట్ల రాజకీయం..
హైదరాబాద్ : కేసీఆర్‌ది ఓట్ల రాజకీయమని, చిత్తశుద్ధి ఎప్పుడూ లేదని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని.. కేసీఆర్ స్వామ్యమని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే.. ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. నాడు కోర్టును ఒప్పించి బీసీలకు 60శాతం రిజర్వేషన్లు అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ దేనన్నారు. ఒక గ్రామ కార్యదర్శికి ఐదు గ్రామాల బాధ్యత ఇస్తే ఎలా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment