
శనివారం ప్రగతిభవన్‌లో అధికారులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరాన్ని అసలు సిసలు విశ్వనగరం (గ్లోబల్ సిటీ)గా మార్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని, అలాంటి సమస్య లను ముందుగానే అంచనావేసి పరిష్కారాలు చూపే ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో భవిష్యత్తు అవసరాలకు తగినట్టు హైదరాబాద్ నగర ‘మాస్టర్ ప్లాన్’రూపొందిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా సన్నద్ధం చేసే అంశంపై శనివారం ప్రగతి భవన్‌లో అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
అన్నిఅంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించే మాస్టర్ ప్లాన్‌లో రాష్ట్ర కేబినెట్ మినహా మరెవరూ మార్పులు చేయకుండా చట్టం రూపొందిస్తామన్నారు. హైదరాబాద్ నగర సమగ్రాభివద్ధి ప్రణాళికను అమలు చేసే బాధ్యతను హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) తోపాటుగా వివిధ రంగాలకు చెందిన నిపుణులతో వివిధ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నగరాభివృద్ధికి హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) నిధులతోపాటు ఇతరత్రా నిధులను కూడా సమకూరుస్తామని సీఎం చెప్పారు. హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందించడానికి కేశవాపూర్‌లో నిర్మించతలపెట్టిన మంచినీటి రిజర్వాయర్‌కు ఈ నెలలోనే శంకుస్థాపన చేసి శరవేగంగా పనిపూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు. మెట్రోరైలును ఎయిర్‌పోర్టు వరకు విస్తరిస్తామని ఆయన అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న నగరం, ఓఆర్‌ఆర్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్య ఉన్న నగరం, ట్రిపుల్ ఆర్ అవతల విస్తరించే నగరం ఇలా మూడు యూనిట్లుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారు.
పెరుగుతున్న వలసలకు తగ్గట్లుగా..
‘హైదరాబాద్ శరవేగంగా అభివద్ధి చెందుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు వలస వస్తున్నారు. నగరంలోని వాతావరణం, సామరస్యపూర్వక జీవనం, పారిశ్రామిక విధానం ఫలితంగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తరలిరావడంతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. దీంతో ఏటా ఐదారు లక్షల జనాభా హైదరాబాద్‌కు తరలుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడుతున్నారు. ఉద్యోగ, వ్యాపారాలరీత్యా నిత్యం హైదరాబాద్ నగరానికి వచ్చి పోయే వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి ఏటా రెండు కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇవన్నీ ఆర్థికాభివృద్దికి దోహదపడే అంశాలు. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు తగ్గట్లుగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దకుంటే.. నగర జీవితం నరకప్రాయం కాక తప్పదు’అని సీఎం పేర్కొన్నారు.
నాడు స్వర్గమే.. కానీ నేడు!
‘నేను నగరాన్ని కాదు, జన్నత్ (స్వర్గం) నిర్మిస్తున్నా అని హైదరాబాద్ నగరం నిర్మించేటప్పుడు కులీ కుతుబ్‌షా అన్నారు. నిజంగా హైదరాబాద్ ఒకప్పుడు స్వర్గంగానే ఉండేది. ముత్యాలు, సరస్సులు, ఉద్యానవనాలతో నిండి ఉండేది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. రాన్రానూ పరిస్థితి మారిపోయింది. మూసీ మురికితో నిండిపోయింది. నగరంలో కాలుష్యం పెరిగిపోతోంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. పచ్చదనం తగ్గిపోయింది. రానున్న కాలంలో జనాభా మరింత పెరిగి పరిస్థితి చేయిదాటిపోతుంది. జీవనం మరింత దుర్భరంగా మారడం ఖాయం. అందుకే మనమంతా ఇప్పుడే మేల్కోవాలి. భవిష్యత్ అవసరాలను అంచనా వేసి దానికి తగ్గట్లుగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలి. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి.. అమలు చేయాలి’అని కేసీఆర్ స్పష్టం చేశారు.
మాస్టర్ ప్లాన్
‘హైదరాబాద్ ఇప్పుడెలా ఉంది? జనాభా ఎంతుంది? రోడ్లెలా ఉన్నాయి? ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సీవరేజి పరిస్థితి ఏమిటి? గ్రీన్ కవర్ పరిస్థితి ఏమిటి? వాహనాలు ఎన్ని ఉన్నాయి? రవాణా వ్యవస్థ ఎలా ఉంది? విద్యుత్ సరఫరా పరిస్థితి ఏమిటి? అనే దానిపై ఓ స్పష్టమైన నిర్ధారణకు రావాలి. పదేళ్ల తర్వాత హైదరాబాద్ ఎలా ఉండబోతుందో శాస్త్రీయంగా అంచనా వేయాలి. దానికి తగినట్లుగా ఏం చేయాలనే దానిపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఢిల్లీ, బెంగళూరులతోపాటు చైనా రాజధాని బీజింగ్ కూడా ప్రస్తుతం జనజీవనానికి అనుకూలంగా లేదు. ఢిల్లీ కాలుష్య వలయంలో చిక్కుకుంది. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. మన కళ్ల ముందే నగరాలు ఆగమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితి బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు మేల్కొని సరైన విధంగా సన్నద్ధం కాకుంటే మనకు కూడా విషమ పరిస్థితులు తప్పవు. నగర ప్రజల జీవితాన్ని సౌకర్యంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాల్సిన తక్షణ అవసరం ఉంది’అని సీఎం చెప్పారు.
పచ్చదనం పెరగాలి
‘హైదరాబాద్ నగరం లోపలా, బయటా పచ్చదనం పెంచడంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని భూభాగం చాలా పెద్దగా ఉండడంతో మొత్తం భూభాగాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. వ్యవసాయ క్షేత్రాలను ఓపెన్ ప్లేసులుగా పరిగణించి, మిగతా చోట్ల ఇష్టారీతిన భవనాలకు, నిర్మాణాలకు అనుమతులిస్తున్నారు. దీంతో నగరంలో పచ్చదనం కరువవుతోంది. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే.. నగరమంతా కాలుష్యమయం అవుతుంది. అందుకే అనుమతుల విషయంలో నియంత్రణ ఉండాలి. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలన్నింటినీ ప్రధాన నగరం అవతలికి తరలించాలి. మూతపడిన పరిశ్రమల భూముల్లో పార్కులు ఏర్పాటు చేయాలి. నగరంలో ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ పచ్చదనం పెంచాలి. 1.50 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ బ్లాకుల్లో అడవిని పునరుద్ధరించాలి. హైదరాబాద్ నగరాన్ని ఓఆర్‌ఆర్ లోపలున్న నగరం, ఓఆర్‌ఆర్ అవతలి నుంచి ప్రతిపాదిత ట్రిపుల్ ఆర్ వరకుండే నగరం, ట్రిపుల్ ఆర్ అవతల మరో 5 కిలోమీటర్ల వరకు విస్తరించే నగరం.. ఇలా మూడు భాగాలుగా విభజించుకుని మంచినీరు, డ్రైనేజి, సీవరేజి, ట్రాఫిక్, రవాణా, విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అంచనా వేయాలి. భవిష్యత్తులో ఎక్కడెక్కడ ఏమేం చేయాలో నిర్ణయించాలి. ఎడ్యుకేషన్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, సినిమా సిటీ, హెల్త్ సిటీలను ప్లాన్ చేసి వీటికి అనుకూలంగా ఉండే ప్రాంతాలను గుర్తించాలి. దాని ప్రకారమే అనుమతులు ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించడానికి వీల్లేదు. మాస్టర్ ప్లాన్‌లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే దానికి కేబినెట్ అనుమతి తప్పనిసరి చేస్తూ చట్టం తెస్తాం’అని ముఖ్యమంత్రి అన్నారు.
సిటీ జనాభా పెరుగుతోంది!
‘నగరాలకు వలసలను ఆపలేం. అనేక అనుకూలతలున్న హైదరాబాద్‌కు వలసలు మరింత ఎక్కువ కాకతప్పదు. పెరిగే జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ అవసరాల కోసం సన్నద్ధం చేయడం ఒక్కటే మనముందున్న మార్గం. మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఆస్కీకి ఆ పని అప్పగిస్తాం. వారు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ సంస్థలను కన్సల్టెన్సీలుగా నియమించుకోవాలి. వారికి అవసరమైన మౌలిక సమాచారాన్ని ఇవ్వాలి. మూడు నెలల్లో నగరానికి మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయడం ఒక్క హెచ్‌ఎండీఏకి సాధ్యం కాదు. మరికొన్ని ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేయాలి. ఈ బృహత్ కార్యక్రమాన్ని నిర్వర్తించేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది’అని సీఎం కేసీఆర్ వివరించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాసరెడ్డి, ఆస్కి అర్బన్ గవర్నెన్స్ విభాగాధిపతి వి.శ్రీనివాసాచారి, ఫ్యాకల్టీ మాలినీ రెడ్డి, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, మాణిక్ రాజ్, సందీప్ సుల్తానియా, మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనచారి పాల్గొన్నారు.