హైరానా పడొద్దు... ప్రైవేటుకు వెళ్లొద్దు | CM KCR Review Meeting With Officials About Coronavirus In Pragathi Bhavan | Sakshi
Sakshi News home page

హైరానా పడొద్దు... ప్రైవేటుకు వెళ్లొద్దు

Published Sat, Jul 18 2020 2:04 AM | Last Updated on Sat, Jul 18 2020 12:17 PM

CM KCR Review Meeting With Officials About Coronavirus In Pragathi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘ప్రజలు హైరానా పడి అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం మంచి చికిత్స అందుతున్నది. ఎవరికి లక్షణాలు కనిపించినా వెంటనే సమీపంలోని ఆసు పత్రులకు వెళ్లి, వైద్యుల సలహా తీసుకోవాలి. చికిత్స పొందాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం అందించడానికి ఏర్పాట్లున్నాయి. కాబట్టి వీటిని ప్రజలు వినియోగించుకోవాలి. కరోనా వ్యాప్తి నివారణకు, వైరస్‌ సోకిన వారికి మంచి వైద్యం అందించడానికి ఎంత ఖర్చయినా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని సీఎం భరోసా ఇచ్చారు. ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.

కరోనా వ్యాప్తి నివారణ, చికిత్సలో గొప్ప సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ‘ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో గొప్పగా సేవలు అందిస్తు న్నారు. అవగాహన లేకుండా ఎవరో చేసే చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి. ప్రజలకు మెరుగైన వైద్యం సమర్థవంతంగా అందించే విషయంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి’ అని సీఎం వైద్య సిబ్బందికి పిలుపునిచ్చారు.

ప్రైవేటులో బెడ్ల వివరాలు తెలపాలి 
‘ప్రైవేటు ఆసుపత్రులు బెడ్ల అందుబాటు విష యంలో పారదర్శకంగా వ్యవహరించాలి. కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరి స్తుంది. ప్రతీ ఆసుపత్రి తమ వద్ద ఎన్ని బెడ్లు ఉన్నాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయనే విషయాలను బహిరంగపరచాలి. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వివరాలు తెలియచేయాలి. ’ అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. తొలుత కేంద్రమే గందరగోళంలో ఉండే.. ‘కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభు త్వమే మొదట గందరగోళంలో ఉండేది. కానీ రాష్ట్రంలో మాత్రం కావాల్సినవన్నీ చాలా వేగంగా సమకూర్చుకున్నాం. ఇప్పుడు వేటికీ కొరతలేదు. హైదరాబాద్‌లోని గాంధి, టిమ్స్‌లోనే దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్‌ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధం చేశాము. అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించి పెట్టాము. ఇన్ని బెడ్లు గతంలో ఎన్నడూ లేవు. 1,500 వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నాయి. లక్షల సంఖ్యలో పీపీఈ కిట్లు, ఎన్‌–95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయి. మందులు, ఇతర పరికరాల కొరత లేదు.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. 

‘కరోనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉంది. కేవలం తెలంగాణలోనే లేదు. తెలంగాణలో పుట్టలేదు. జాతీయ సగటుతో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉన్నది. రాష్ట్రంలో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉన్నది. గురువారం నాటికి ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందుతున్న వారు 3,692 మంది ఉన్నారు. వారిలో తీవ్రమైన ఇతర జబ్బులున్న 200 మంది తప్ప మిగతా వారంతా కోలుకుంటున్నారు. రాష్ట్రంలో గురువారం నాటికి 41,018 మందికి వైరస్‌ సోకింది. అందులో 27,295 మంది (67శాతం) కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఎలాంటి లక్షణాలు లేని 9,636 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మిగతా వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారంతా వేగంగా కోలుకుంటున్నారు. లక్షణాలు లేనప్పటికీ కోవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం వైరస్‌ సోకిన వారందరి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన గైడెన్స్‌తో చికిత్స అందిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో అత్యవసర పనులు నిర్వహించుకోవడానికి వీలుగా జనరల్‌ బడ్జెట్‌కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించారు. ఆరోగ్య మంత్రి, సీఎస్‌ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి వీలుగా ఈ నిధులను అందుబాటులో పెడతారు. 
వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ స్కేల్‌ అమలు.
కొత్తగా నియామకమైన ఔట్‌సోర్సింగ్‌ నర్సులకు కూడా పాతవారితో సమానంగా వేతనాలు చెల్లించాలి.
ఆయుష్‌ విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచాలి.
ఔటో సోర్సింగ్‌ ఉద్యోగులతో పాటు వైద్యఆరోగ్య శాఖలో ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అందించే పదిశాతం అదనపు వేతనం (కోవిడ్‌ ఇన్సెంటివ్‌) కొనసాగించాలి. పోలీసుశాఖ సిబ్బంది, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుద్య సిబ్బందికి కూడా ఇన్సెంటివ్‌లను కొనసాగించాలి.
రాష్ట్రంలో పీజీ పూర్తి చేసిన 1,200 మంది వైద్యులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలి
పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న 200 మంది డాక్టర్‌ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. 
కరోనా సోకిన వారికి అందించే వైద్యంలో భాగంగా వేసేరెయ్‌ డిస్ట్రిర్, టో సిలిజుమాబ్‌ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్‌ టాబ్లెట్లను పెద్ద మెత్తంలో సిద్ధంగా పెట్టుకోవాలి. కావాల్సిన వారికి ఉచితంగానే అందివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కొరత రానీయవద్దు. 

ఇళ్లలోనే ఉండండి..
‘దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ నడుస్తున్నది. ప్రజలు పనుల కోసం బయటకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలు కూడా నడపాలని నిర్ణయించింది. కరోనాతో సహజీవనం చేయక తప్పని స్థితి వచ్చింది. అయితే కరోనా విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరీ అంత భయంకరమైన పరిస్థితి లేదు. అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మాస్కులు ధరించాలి. శాని టైజర్లు వాడాలి. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలి’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement