పేదల బతుకులు బుగ్గి
పేదల బతుకులు బుగ్గి
Published Mon, Feb 6 2017 10:08 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
- అగ్ని ప్రమాదంలో పది గుడిసెలు దగ్ధం
- కాలి బూడిదైన సామగ్రి
- కట్టుబట్టలతో బయటపడిన
బాధితులు
- రూ.25 లక్షల ఆస్తి నష్టం
- బాధిత కుటుంబాలను
గౌరు వెంకటరెడ్డి పరామర్శ
కల్లూరు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కర్నూలు నగరం 36వ వార్డులోని మేదర వీధిలో పది గుడిసెలు దగ్ధమయ్యాయి. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. మహిళా మేదరులు ఇంటి ముంగిట పనులు చేస్తుండగా విద్యుత్ వైర్లు అంటుకొని ఒక గుడిసెలో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. గాలి ఉద్ధృతంగా మిగతా గుడిసెలు కూడా అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి. ఇక్కడ ఉండే వారంతా కూలీలే కావడంతో వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఉన్న కొంది మంది మంటలను అదుపు చేయలేకపోయారు. విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేయడంతో వారు వచ్చి మంటలను ఆర్పేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నారాయణ ఇంట్లో 20 తులాల వెండి, 2 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేలు నగదుతో పాటు టైలరింగ్ దుస్తులు, గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. అలాగే బేకరిలో పనిచేస్తున్న టీఎం ఎల్లయ్య ఇంట్లో బీరువాలో ఉంచిన రూ. లక్ష నగదు బంగారు, వెండి ఆభరణాలు కాలిపోయాయి. తిమ్మప్ప ఇంట్లో 25 తులాల వెండి ఆభరణాలు, పొదుపు సంఘంలో చెల్లించాల్సిన రుణం రూ.30 వేలు, అలాగే పి.శోభ ఇంట్లో.. ఆరు తులాల బంగారు, రూ.లక్ష నగదు బూడిదయింది. పెద్ద కుమార్తె వివాహం చేయాలనే ఆలోచనతో కూడబెట్టుకున్న డబ్బు కాలిపోయిందని ఆమె కన్నీటి పర్యంతమైంది. పి.శాంతమ్మ,, యాదమ్మ,, వెంకటేష్ , పరుశరాముడు , వెంకటేష్ , సవారమ్మ , హేమలత ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం రూ. 25 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. వీరంతా పేదలే. అగ్ని ప్రమాదంలో దాచుకున్నదంతా కాలిపోయి వీరి బతుకులు బుగ్గయ్యాయి.
బాధితకుటుంబాలకు పరామర్శ..
అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు 5 బియ్యం ప్యాకెట్లు, 10 కిట్ల కిరాణం సరుకులు, రూ. 10 వేలు నగదుతోపాటు దుస్తులు అందజేశారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు వార్డు ఇన్‌చార్జ్ ఆంజనేయులు, నాయకులు అంజి, ఇమ్మానియేలు, శ్రీను, శ్యామ్సన్, దేవా, కుమార్, మద్ది, జంగాల సుంకన్న తదితరులు ఉన్నారు.
అలాగే బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బాధిత కుటుంబాలను పరమార్శించి ఒక్కొక్క కుటుంబానికి రూ. 2 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేశారు. మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఏరాసు ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబాలను పరమార్శించి ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున అందజేశారు. స్థానిక నాయకురాలు పార్వతమ్మ, శివకుమార్ బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి రూ. 3 వేల నగదు అందజేశారు.
Advertisement